Showing posts with label జామీ కవిత్వం. Show all posts
Showing posts with label జామీ కవిత్వం. Show all posts

Saturday, August 22, 2009

సూఫీ కవిత్వం -- చివరి పార్టు

ఇతర సూఫీ కవులు

సాదాలుద్దిన్ మహ్మద్ షాబిస్తరి (1250-1320) ప్రముఖ సూఫీ కవి.

నీ హృదయమందిరాన్ని శుబ్రం చేయి.
నీ ప్రియవిభుని నివాసానికై దానిని సిద్దంచేయి.
నీవు దానినుండి బయటకు వస్తే ఆయన లోపలకొస్తారు.
నిన్ను నీవు ఖాళీ చేసుకో. ఆయన తన సౌందర్యాన్ని చూపిస్తారు.



రబియా అల్ అదావియ్యా 717-801) ప్రముఖ సూఫీ కవయిత్రి. తలితండ్రులు చిన్నతనంలోనే చనిపోవటంతో, రబియా బానిసత్వంలోకి నెట్టబడింది.

చాలాకాలంపాటు తన యజమానికి ఊడిగం చేసిన తరువాత రబియా, తన ఆలోచనలను, చర్యలను ఈశ్వరునివైపుకు మళ్లించుకొని గొప్ప సూఫీ కవయిత్రిగా నిలిచి, అనేక రచనలు చేసారు

తన నిబద్దత, విశ్వాసాలకు చలించి, రబియాను బానిసత్వం నుంచి విముక్తురాలిని చేసాట్ట యజమాని.


1.
నేను నిన్ను రెండు విధాలలో ప్రేమిస్తూంటాను.
ఒకటి స్వార్ధ ప్రేమ. మరొకటి ఎంతో విలువైనది.
స్వార్ధ ప్రేమలో నేను నిన్నే స్మరిస్తూంటాను.
రెండవదానిలో
నీవు తెర తొలగిస్తావు. నీ సుందర మోమును
కన్నుల పండుగగా నేనలా చూస్తూ ఉండిపోతాను.
---- రబియా

2.
ప్రభూ!
నిను నా హృదయ వల్లభునిగా చేసికొన్నాను.
కానీ నా దేహం మాత్రం తనను కోరుకొనే వారికి అందుబాటులో ఉండి
తన అతిధితో స్నేహిస్తూంటుంది.
నా హృదయవల్లభుడే నా ఆత్మకు అతిధి.
--- రబియా

నూరుద్దీన్ దిన్ అబ్దర్ రహ్మాన్ జామీ (జామీ) 1414-1492)

ఓ సాకి
ఒక మధుపాత్రిక నిచ్చి నాపై దయచూపు.
నాలోకే నేను పూర్తిగా కూరుకుపోయాను
ఒక్కసారి నానుంచి నన్ను విడుదల చేయవూ!
నేనెవరి కంటా పడకూడదనుకొంటాను
ప్రేమ తాలూకు పొగమంచు కమ్ముకొన్న ఆ అద్బుత క్షణం లో నాకు నేనే కనిపించకూడదనుకొంటాను.
ప్రభూ
నీకూ నాకూ మధ్య నేను తప్ప మరే తెరా లేదు
దయతో ఈ తెర తీయగ రావా.
జీవి జీవాన్ని ఎక్కడైతే పొందుతుందో
అట్టి శూన్యత్వాన్ని దర్శింపచేసే మహిమను
తెలియచేయవా, మిత్రమా
జామీ,
ప్రేమ నీ అన్ని అనవాళ్లనూ చెరిపేసేవరకూ
నీలో ఉండే నిన్నుని పూర్తిగా కడిగివేసేవరకూ
ఆద్యంతరహితమైన జీవితం నీకు సుదూరమే.
ప్రేమ విస్తరించుకొని ఉండేది స్థల, ప్రాంతాలలో కాదు.
ఈ ప్రదేశాలు, దేశాల నుండి బయటకు
పడే దారిని అన్వేషించు.

---- జామీ (ఈ కవితను అనువదించటంలో సూచనలు ఇచ్చి, సందేహాలు తీర్చిన శ్రీ భైరవభట్ల గారికి కృతజ్ఞతలు తెలియ చేసుకొంటున్నాను)

షిరాజ్ 1215-1292) పర్షియాకు చెందిన గొప్ప సూఫీ కవి. రోజ్ గార్డెన్, ఆర్చార్డ్ వంటి ప్రముఖ రచనలు చేసారు.

ఉదయవిహంగమా!
చిమ్మెటను చూసి ప్రేమించటం నేర్చుకో.
అది దహించుకుపోయింది. జీవితాన్ని కోల్పోయింది.
నిశ్శబ్దమైపోయింది.
ఈ వేషగాళ్లు ఆయనను అన్వేషిస్తున్నారు, అజ్ఞానులు.
జ్ఞానాన్ని పొందినవారెవరూ తిరిగి రాలేదు మరి.
---- షిరాజ్

*******************

సూఫీ కవిత్వం పేరుతో నే చేసిన ఆయా కవుల అనువాదాలను చదివి, తమ అమూల్య అభిప్రాయాలు తెలియచేసి, ప్రోత్సహించిన వారందరకూ ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.

భవదీయుడు

బొల్లోజు బాబా

Friday, July 17, 2009

సూఫీ కవిత్వం - - జామీ

నూరుద్దీన్ దిన్ అబ్దర్ రహ్మాన్ జామీ (జామీ) 1414-1492)

జామీ పదిహేనవ శతాబ్దానికి చెందిన పెర్షియన్ సూఫీకవి. సూఫీ కవులలో చివరి తరానికి చెందిన తాత్వికుడు.
“నా స్వస్థానం జామ్ (ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది). నా జ్ఞాన దాహాన్ని తీర్చిన గురువు పేరు అహ్మద్ జామీ. రెండూ కలిపితే నా కలంపేరు జామీ” అని తనను తాను పరిచయం చేసుకొంటాడు.

ఒకనాడు తనవద్ద శిష్యరికం చేయటానికి వచ్చిన విద్యార్ధితో నీవు ఎవరినైనా ప్రేమించావా అని అడిగగా, “నేనెవరినీ ఇంతవరకూ ప్రేమించలేదు” అని అంటే, “ వెళ్లు, ఈ ప్రపంచాన్ని ప్రేమించి రా, అపుడు నీకు మార్గాన్ని నే చూపిస్తాను” అని అన్నాట్ట జామీ.

జ్ఞానయానానికి ప్రేమే ప్రధమ సోపానం అని, విశ్వజనీన ప్రేమే ఈశ్వరునికి దగ్గరదారి అని జామీ భోదించేవాడు.

జామీ మొత్తం 87 పుస్తకాలు రచించాడు. వాటిలో బహారిస్తాన్ (Adobe of spring), హాప్త్ అవ్రాంగ్ (Seven Thrones) వంటివి ప్రముఖమైనవి. జామీ కవిగానే కాక, ఖగోళ శాస్త్రం, సంగీతం, చిత్రలేఖనం, తర్కశాస్త్రము వంటి వివిధరంగాలలో ప్రావీణ్యతను కలిగిఉండి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకొన్నాడు.

జామీ గురించి మరింత సమాచారం కోసం ఈ క్రింది లింకులో చూడండి


1.
నీవు పొందినవాటినన్నింటినీ
ఏదో ఒకనాడు మృత్యువో లేక జీవితమో
దొంగిలించుకుపోతుంది. ఆ లోపు
నిత్యం నీతోనే ఉండే ఆ సర్వాంతర్యామి వద్ద
నీ హృదయాన్ని దాచుకో.

--- జామీ


2.

ప్రభూ
నీవు నా హృదయాన్ని వేయిసార్లు
విరిచినా నాకేం భయంలేదు.
కానీ ఇక్కడ నేనిలా తయారయినందుకు
నన్ను ఏవగించుకొని విడిచిపెట్టకు
ఈ తోటలోని ప్రతీపూవు తమ వేర్లను
రొచ్చులోనే కలిగిఉన్నాయి.

---- జామీ

3.
మానవ మూలాల అన్వేషణ లేని వాడు
రూపాన్ని మాత్రమే పొంది,
మిగిలినదంతా పోగొట్టుకొన్నట్లు.
అన్నిబాధలను జీవితం స్వస్థపరుస్తుంది
కానీ బాధలేనితనానికి మందు లభించదు.
----జామి

4.

అనామకునిగా మారే రహస్యాన్ని
ఛేదించినవాడు అదృష్టవంతుడు.
ఎవరో ఒకనిగా ఉండటం ద్వారా సాధించేదేముంది!

నిష్కామము, అనాశక్తత తప్ప మిగిలినదంతా
భ్రమ లేదా భ్రమ ను చేరే దారి.
నీ మోముపై ప్రసరించే కాంతి
దైవ జ్వాల గురించి గుసగుసలాడుతుంది.
ఎవ్వరి నుంచి నువ్వూ నేను వచ్చామో
ఆ ఈశ్వరుడే దీనికి సాక్షి.

పంజరపక్షి పరిమళ పూదోటను చేరాలంటే
ఊహాలోకాలను దాటుకొంటూ వేళ్లాల్సిందే.
మానవ లలాట లిపి ఇంకా ఉన్నతమైనది
ఎందుకంటే నీ ఒప్పందం
సాటి మానవునితో కాదు ఈశ్వరునితో

ప్రియవిభుని రధాన్నధిరోహించే
అనుమతి నీకింకా లేకపోతే దాని
ఘలంఘలలు వింటూ తృప్తిపడు.

హృదయరాజ్యాన్ని పగటివేళ పాలించే రాజు
రాత్రి పూట దానికి జీవాన్నిచ్చే రజనీచరుడు
మరెవ్వరో కాదు మన ప్రభువే.

--- జామి


5.

నీ గమ్యం ఉన్నతమో లేక అవమానకరమో
ఏమైనా కానీ,
రాగ, విరాగాల నుంచి
నిన్ను నీవు శుద్దిచేసుకో
నీ అద్దాన్ని స్వచ్చంగా ఉంచుకో.
యోగులకు, ప్రవక్తలకూ జరిగినట్లుగా
రహస్య లోకాల అద్భుత సౌందర్యం
నీ హృదయంలో ప్రకాశించనీ

ఆ సౌందర్యజ్వాలలో దహించబడే
నీ హృదయంలో నీ విభుని చిరునామా
ఇంక ఏమాత్రమూ దాగి ఉండలేదు.
---- జామీ

6.

మాయ అనే తెరవెనుక దాగిఉన్న సౌందర్యం అఖిలమైనది. ఈ లోకపు మట్టితో ఈశ్వరుడు అసంఖ్యాక దర్పణాలను సృష్టించాడు. ప్రతీ దర్పణంలో తన ప్రతిబింబాన్ని ఉంచాడు. నీ కంటికి కనిపించిన సౌందర్యం అంతా ఆయన ప్రతిబింబమే. ఇపుడు నీవు ప్రతిబింబాన్ని మాత్రమే చూస్తున్నావు. దాని మూలమెక్కడుందో అన్వేషించు. మూలానికి దూరంగా సంచరించవద్దు, చీకటిలోకి జారిపోగలవు. ఈ ప్రతిబింబం రోజా దరహాసంలా క్షణ భంగురం. నీకు శాశ్వతత్వం కావాలా మూలాన్ని చేరుకోవాల్సిందే. యధార్ధం తెలుసుకోవాలనిఉందా, అయితే విశ్వాసమనెడి గనిని తవ్వు. ఇలాగ వచ్చి అలాగ పోయే వాటికై ఎందుకు నీ ఆత్మను మలినం చేసుకొంటావు?

--- జామీ

బొల్లోజు బాబా