Sunday, July 26, 2026

బహుజన వాదం నుంచి మనువాదం వైపు


(ప్రముఖ రచయిత శ్రీ బండి నారాయణ స్వామి రాసిన "దళితబహుజన వాదానికి కొత్త పిలుపు" అనే వ్యాసం పై నా విమర్శ ఇది. వ్యాసం లింకు మొదటి కామెంటులో కలదు.)

1. "హిందూ దళిత బహుజనులు" అనే విభజన కృత్రిమం. దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, వివిధ ప్రాంతాల ప్రజల అనుభవాలు, మత విశ్వాసాలు, సంస్కృతులు ఒకేలా ఉండవు. అదే ఈ దేశ వైవిధ్యం. బలం.

2. దళిత సమస్యకు మూల కారణం కులవ్యవస్థ. కులవ్యవస్థకు మతపరమైన సమర్థన ఉన్నంతకాలం "హిందూ దళిత బహుజన" అనే భావన చెల్లదు. కులవ్యవస్థను "వృత్తిధర్మం" గా మాత్రమే చూపి, పుట్టుక ఆధారిత వ్యవస్థను తేలికగా తీసిపారేయడం చారిత్రిక వాస్తవాలను తిరస్కరించటమే.

3. ఆరె.స్సెస్‌/హిందు.త్వ దృక్పథం సామాజిక న్యాయాన్ని నిర్లక్ష్యం చేస్తుందని వ్యాసం అంగీకరిస్తూనే మళ్ళీ అదే, హిందూ చట్రంలోకి దళితబహుజనులను తీసుకురావటం వైరుధ్యం. అవగాహన లేమి. కులవ్యవస్థను అలాగే అంగీకరించడం సమస్యను మూలంలో పరిష్కరించదు. కుల నిర్మూలనకు అవసరమైన నిర్మాణాత్మక మార్పులపై వ్యాసం స్పష్టత ఇవ్వలేదు.
4. "నాస్తికులు, మార్క్సిష్టులు మతాన్ని అధ్యయనం చేయరు, సంస్కృతిని ధ్వంసం చేస్తారు" అనే వ్యాఖ్య ఉపరితలమైనది. అతిగా ఉంది. అనేకమంది మార్క్సిస్టులు, హేతువాదులు, సామాజిక శాస్త్రవేత్తలు మతాన్ని లోతుగా అధ్యయనం చేశారు. మంచి చెడ్డలను చర్చించారు. కోశాంబి, రామస్వామి, దేవీప్రసాద్, గ్రాంసి, డా. అంబేడ్కర్ మొదలైనవారు. మనువాదుల లక్ష్యమైన నాస్తికులను, మార్క్సిస్టులను, లౌకిక వాదులను విమర్శించటాన్ని ఈ రచయిత నిస్సిగ్గుగా తలకెత్తుకొన్నారు.

5. మతాన్ని విమర్శించడం అంటే సంస్కృతిని తిరస్కరించడం కాదు. సాంస్కృతిక అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేయడమూ కాదు. అది సంస్కరణలకు మార్గం. విశ్వాసాలు అనేవి కాలానుగుణంగా సంస్కరింపబడాలి. విమర్శించకుండానే సహగమనాలు, బాల్యవివాహాలు నిర్మూలించబడ్డాయా? మతాచారాలపై విమర్శ కూడా ప్రజాస్వామ్య హక్కే.

6. "హిందూ" అనే పదాన్ని దళితబహుజన రాజకీయాల కేంద్రంగా చేయడం అంబేడ్కర్ ఆలోచనలకు విరుద్డం. అంబేడ్కర్ చివరికి హిందూ మతాన్ని విడిచి బౌద్ధమతాన్ని స్వీకరించారు.
7. ముస్లింల విమర్శలకు కేవలం ఇస్లాం గ్రంథాలనే కారణంగా చూపడం ఏకపక్ష విశ్లేషణ. భారతదేశపు వెయ్యేళ్ళ సామాజిక, రాజకీయ, చారిత్రక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. భారతదేశానికి సంబంధించి ముస్లిం యుద్ధాలు జిహాద్ యుద్ధాలు కావని చరిత్రకారులు చెబుతుంటే ఈ రచయిత మాత్రం పదే పదే జిహాద్ పదాన్ని వాడుతూ మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమేరకు ఒక అసత్యాన్ని ప్రజల ఉమ్మడి భావనలలో స్థాపించటానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఎవరి మెప్పుకోరకో ఈజీ గానే అర్థమౌతుంది.

8. ఇస్లాం, క్రైస్తవ మతాల సంస్కరణలపై దృష్టి పెట్టినంతగా, హిందూ మతంలోని కులాధిపత్య నిర్మూలనకు స్పష్టమైన కార్యాచరణను వ్యాసం ప్రతిపాదించలేదు. ఆ అవసరాన్ని గుర్తించినట్లు కూడా లేదు రచయిత గందరగోళ దృక్పథం.

9."దేశం ముందు, మతం తర్వాత" అనే సిద్ధాంతం భారత రాజ్యాంగంలోని లౌకిక విలువలతోనే సాధ్యమవుతుంది; దీనికి కొత్త గా "హిందూ దళిత బహుజనవాదం" అనే టాగ్ తో దళిత బహుజనుల వైవిధ్యాన్ని గంపగుత్తగా హిందూ మతానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ రచయిత. ఇది వారిని హిందు.త్వావైపు రాజకీయంగా లాగటమే. ఇది ఎవరి లక్ష్యమో అందరికీ తెలుసు. మనువాదులతో కుమ్మక్కవటం ఒక బహుజన రచయితకు భావ్యమా?

10. బ్రాహ్మణులు వారి సామాజిక ఆధిపత్యాన్ని నిలబెట్టే మతగ్రంథాలను తరతరాలుగా కాపాడుకుంటూ రావడం వల్ల ఈ సమాజం హైరార్కికల్ నిర్మాణంగా రూపుదిద్దుకుందని, పుట్టుక ఆధారంగా మనుషులను ఎక్కువ–తక్కువలుగా విభజించే వ్యవస్థ బలపడిందని గుర్తించలేకపోవడం ఈ రాజ్యాంగ యుగంలో అజ్ఞానంతో సమానం. ఈ వ్యాసకర్త దళితబహుజనులందరి తరపునా ఆ ప్రక్రియను గొప్పదిగా గుర్తించటం మరింత అవమానకరం.
వ్యాసం ప్రతిపాదించిన భావజాలాన్ని సిద్ధాంతపరంగా అమలు చేసే రాజకీయ లేదా సామాజిక యంత్రాంగం ఏమిటో వివరించలేదు. బహుశా దళితబహుజనులందరూ మనువాదులుగా మారాలని రచయిత పిలుపునిస్తున్నారా?

11. దళిత బహుజనుల విముక్తికి ప్రధాన ఆధారం రాజ్యాంగం, సమాన హక్కులు, చట్టబద్ధ రక్షణలు అనే ఎరుక లేకుండా కొత్తగా మతాన్ని రంగంలోకి దింపటం దేని కొరకో అనే ప్రశ్న ఏర్పడుతుంది.
12. వ్యాసం అన్ని వర్గాలను సమన్వయం చేయాలని పైపైన ప్రతిపాదిస్తున్నప్పటికీ, "హిందూ" గుర్తింపును కేంద్రంగా ఉంచడం వల్ల ఇతర దళిత, బౌద్ధ, క్రైస్తవ, ముస్లిం బహుజన వర్గాల అస్తిత్వాన్ని కబళించడం అనే కుట్ర కనిపిస్తుంది. ఇది స్పష్టంగా మనువాద దృక్పథం.


No comments:

Post a Comment