అపర చాణుక్యుడు, మౌన ముని, ఆధునిక భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు— ఇవన్నీ మీడియా ఇచ్చిన బిరుదులు.
ఆయన పాలనను తిరిగి చూస్తే, నేడు దేశాన్ని వేధిస్తున్న అనేక రాజకీయ, సామాజిక, ఆర్థిక సంక్షోభాల విత్తనాలు అప్పుడే నాటబడ్డాయనే అభిప్రాయం కలగకమానదు.
బాబ్రీ మసీదు కూల్చివేత దేశ లౌకిక ప్రజాస్వామ్యానికి తీరని గాయం. దేశ అత్యున్నత కార్యనిర్వాహక బాధ్యతలో ఉండి కూడా ఆ ఘటనను అడ్డుకోలేకపోవడం కేవలం పరిపాలనా వైఫల్యమా? లేక మతాధారిత రాజకీయాలకు చారిత్రక అవకాశాన్ని కల్పించిన నిశ్శబ్ద సమ్మతమా? ఆ ఘటన తర్వాత భారత రాజకీయాలకు "మతం" కేంద్రబిందువుగా మారింది.
ఆర్థిక రంగంలోనూ అదే కథ. "సంస్కరణలు" అనే ఆకర్షణీయమైన పదం వెనుక ప్రభుత్వ రంగాన్ని బలహీనపరిచే, స్వయం సమృద్ధి భావనను పక్కన పెట్టే, మార్కెట్ శక్తులకు దేశ ఆర్థిక వ్యవస్థను అప్పగించే ప్రక్రియ ప్రారంభమైంది. అభివృద్ధి పేరిట అసమానత పెరిగింది. సంపద కొద్దిమంది కార్పొరేట్ వర్గాల వద్ద కేంద్రీకృతమైంది. శాశ్వత ఉద్యోగాల స్థానంలో అస్థిర ఉపాధి వచ్చింది. ఉత్పత్తి రంగం క్షీణించింది. మేకులనుండి 800 అడుగుల ఇత్తడి విగ్రహాల్ని దిగుమతి చేసుకొంటున్నాం. పబ్లిక్ రంగం అమ్మకానికి పెట్టబడింది. సామాన్య ప్రజల జీవితం మాత్రం మరింత దయనీయంగా మారింది.
ఇవన్నీ జరిగినా ఇప్పటికీ ఆయనను "మహా సంస్కరణవాది" గా కీర్తించడం చరిత్రను ఏకపక్షంగా చదవడమే. సంస్కరణలు ఎవరికి ఉపయోగపడ్డాయి? కార్మికులకా, రైతుకా, చిన్న పరిశ్రమలకా? లేక కార్పొరేట్ వర్గాలకా? ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పకుండా సంస్కరణలు గొప్పవని పొగడటం మేధో నిజాయితీ కాదు.
OBC రిజర్వేషన్లలో ఆయన ప్రవేశపెట్టిన క్రీమీ లేయర్ వల్ల సామాజిక వెనుకబాటు స్థానంలో ఆదాయప్రమాణం చేరి, రిజర్వేషన్ల ప్రాతిపదిక అయిన సామాజిక వివక్ష అనే తాత్విక పునాది బలహీనపడింది. ఇది బలహీనవర్గాలపై జరిపిన కుట్ర.
ఆ మౌన ముని పండిత వర్గానికి చెందినవాడు ఆయన విధానాల వల్ల నేడు దేశం మనువాదుల చేతుల్లోకి పోయింది. నేటి భారతదేశ మత, ఆర్ధిక, రాజకీయ సంక్షోభానికి కారణం ఈ మనువాద మాఫియానే.
ఈ దేశంలో మనువాదులను ఎదిరించి, ఎందుకు ఆ మార్గం దేశ ప్రజలకు ఎలా మేలు చేయదో వివరిస్తూ వేలపేజీల సారస్వతాన్ని రాసిపెట్టారు డా. అంబేడ్కర్. ఏనాటికైనా మనువాదానికి విరుగుడు అంబేద్కరిజమే.
ఈ సత్యాన్ని నేటి Gen Z ఇప్పుడిప్పుడే గుర్తించినట్లు అనిపిస్తోంది. మొన్న జంతర్ మంతర్ ఉద్యమంలో ఈ దేశ యువత నోట డా. అంబేడ్కర్ ఒక నినాదంగా మారటం శుభపరిణామం.
బొల్లోజు బాబా


No comments:
Post a Comment