కొండ యద్దమందు...
(ప్రాచీన గాథలు పుస్తకానికి శ్రీ ఉరుపుటూరి శ్రీనివాస్ గారు రాసిన ముందుమాట. వారికి నా ధన్యవాదములు)
ఇంటర్నెట్ విప్లవం ఇంటింటికీ చేరుకున్నాక, సోషల్ మీడియా మన నిత్యజీవితంలో విడదీయరాని భాగం అయిపోయిన తరువాత - ఒకోసారి ప్రాణానికి విసుగ్గా ఉంటుంది. మాటలు, పాటలు, కదలని బొమ్మలు, కదిలే బొమ్మలూ వఱదలై ముంచెత్తుతుంటాయి మన ఏకాంతాన్ని. ఈ రణగొణధ్వనికాలుష్యానికి దూరంగా ఎందుకు పారిపోవని లోపలివాడు ప్రతిరోజూ నిలదీస్తున్నప్పుడు సమాధానంగా అమూల్యమైన కొందరి రచనలను స్మరించుకుంటాను నేను. ఈ నెట్టూ, ఈ సోషల్ మీడియా చెట్టు మీద వాలిన కవికోకిలలు, ఛప్పన్నారుగురు బ్లాగరులు, ఈ ఆర్కైవ్ డాట్ ఆర్గ్, ఈ వికీ సోర్సు - ఈ అందరూ, ఇవన్నీ కలిసి కదా నా హృదయాకాశాన్ని నిరంతరంగా విస్తరింపజేస్తున్నది!
నాకు బొల్లోజుబాబా గారితో ముఖపుస్తకపరిచయమే గానీ ముఖపరిచయం లేదు. ఆయనకు ఒక స్పష్టమైన సైద్ధాంతికనేపథ్యం ఉన్నది. దాంతో నాకు పెద్దగా అంగీకారమేమీ లేదు. తన సిద్ధాంతానికి అనుగుణంగా వాదనలను సమకూర్చుకునేందుకు ఆయన చేసే అధ్యయనం పట్ల మాత్రం షరతులతో కూడిన గౌరవం మాత్రం ఉన్నది. చిన్నా చితకా తప్పులను సూచించినప్పుడు నిస్సంకోచంగా అంగీకరించే ఆయన వినమ్రతా నాకు ఇష్టము. స్నేహానికి అభిప్రాయభేదాలు అడ్డం కావన్న సత్యవాక్కుకు నాకు లభించిన సాక్ష్యాలలో ఒకటి - బాబాగారితో నాకు కుదిరిన స్నేహం. ఈ పరిచయవాక్యాలు వ్రాయడానికి అదొక్కటే అర్హత కాజాలదని తెలుసును. ఒక సాధారణపాఠకుడిగా నాకు తోచింది వ్రాస్తానని - పుస్తకంలో వేసుకున్నా వేసుకోకపోయినా ఏమీ పర్వాలేదని చెప్పాక ఈ పుస్తకాన్ని చదివే పని తలకెత్తుకున్నాను.
ఏ రెండు వేల ఏళ్ళకో పైబడిన ప్రాచీనభారతీయసాహిత్యవైభవం ఈ పుస్తకపు పుటలలో మీకోసం ఎదురుచూస్తున్నది. "గాగర్ మే సాగర్ భర్నా" (గంగాళంలో సముద్రాన్ని నింపడం) వంటి ప్రయత్నం ఇది. అపురూపమైన దృశ్యచిత్రాల సంపుటం ఈ పుస్తకం. దృశ్యాలేనా? శబ్దాలు, వాసనలు, చిన్న చిన్న కదలికలు, సుదీర్ఘప్రవాసాలు, ఋతుచక్రభ్రమణాలు - ఇంద్రియగ్రాహ్యమైన ప్రపంచపు సూక్ష్మరూపం ఒదిగివున్నది ఈ పుస్తకంలో. మానధనులూ, దానశీలురూ అయిన రాజులు, వీరులు, వేటగాళ్ళు, రైతులు, సముద్రపతులుగా సంబోధించబడే నావికులూ, జాలరులూ, పర్వతరాజులూ, వనదేవతలూ, చెడుతోవలు తొక్కే మొగుళ్ళూ, వాళ్ళను చెవి మెలేసి అదుపులోకి తెచ్చుకోగల ధీరభార్యలు, జొన్నచేలలో మంచె మీదికెక్కి చిలుకలను తోలే జానపదకాంతలు, జాణలు, ముగ్ధలు, సురతానందాభివ్యక్తులు, విరహపు నిట్టూర్పులూ కన్నీళ్ళూ, ఏనుగులు, ఎద్దులు, లేళ్ళు, పావురాళ్ళు, సెలయేళ్ళూ, కలువలూ, ఆవపొలాల పక్కన చలికాచుకునేందుకు వేసిన నెగళ్ళూ - ఉన్నాయున్నాయెన్నెన్నో ఉన్నాయి. మరెన్నెన్నో ఉన్నాయి ఈ కలైడోస్కోపిక్ కవితాసంపుటంలో. నైలూ నది నాగరికతలో సామాన్యుడి జీవితమెట్టిదో చరిత్రకెక్కలేదని వాపోయిన శ్రీశ్రీ దక్షిణదేశపు సాగరతీరం నుంచి ఉత్తరదేశపు సస్యకేదారాల దాకా వ్యాపించిన జనజీవితాన్ని అక్కున చేర్చుకున్న ఈ కవిత్వాన్ని చూస్తే ఎంత మురిసిపోయేవాడో.
ఈ పుస్తకంలోని పదకొండు అధ్యాయాలలో కవిత్వానువాదం ఉన్నది. కొన్ని కవితల దిగువన చెప్పితే తప్ప తెలియనివి, అర్థబోధకు సహాయపడేవీ అయిన లఘుటిప్పణులున్నాయి. అంత కన్నా ముఖ్యంగా - ఈ పదకొండు అధ్యాయాలకూ కవి వ్రాసుకున్న వివరణలను పన్నెండవ అధ్యాయంలో పొందు పరిచారు. ఒకో అధ్యాయం చదివాక దాని తాలూకు వివరణ(ల)ను చదివితే మీ పఠనానుభవానికి కొంత ఉపయుక్తమవుతుంది. సద్యఃకవిత్వానందానికి పెద్ద పీట వేసి వివరణలను ఆ తరువాత ఇవ్వడం మంచి నిర్ణయం.
ఋతువర్ణనల అధ్యాయంలో కనబడే వాల్మీకి కాళిదాసుల పేర్లను వదిలేస్తే , ఇందులోని కవుల పేర్లేవీ తరచుగా వినబడేవి కావు. కొన్ని కవితల కర్తలెవరో తెలుసుకోగలిగే అవకాశమైనా లేదు. సంగం కవిత్వానికి, గాథాసప్తశతికి సంబంధించిన ఇంకో గమ్మత్తేంటంటే - వందలాది ఏళ్లకు పైగా ఆ యా కవుల పేర్లు భద్రంగా గుర్తుకుపెట్టుకుంటూ వస్తున్నప్పటికీ, అవన్నీ ఆ కవిత్వపు దీపం క్రింది నీడలో దృశ్యాదృశ్యంగా మిగిలిపోతాయి. కర్పూరం వెలిగి మాయమయ్యాక పరిమళం మాత్రం మిగిలినట్లు కవిత్వానుభూతి మాత్రం మిగులుతుంది. సార్వత్రికమైన భావోద్వేగాలు, వాటి ప్రగాఢత, సరళమైన అభివ్యక్తి,, ముక్తకస్వభావము ఉండడం వల్ల ఈ కవితలు పఠితలను చప్పున ఆకట్టుకుంటాయి. మన మాటల్లో మళ్ళీ చెప్పమని మనలను పురిగొల్పుతాయి కూడా.
వీటిల్లో నాకు బాగానచ్చినవి - సంగం కవిత్వంలోనుంచి ఒక 20-30 కవితలు, గాథాసప్తశతి అనువాదాలు, అమరుశతకం పద్యాలు. ఆనందంతోబాటు చాలా కుతూహలాన్ని ఆదరభావాన్ని కలిగించినవి ర్యాలు కలిగించినవి యోగేశ్వరుడి పద్యాలు.
అనువాదం బాగా పండాయని నాకనిపించిన కవితలకు రెండు ఉదాహరణలను సంగకాలకవిత్వం నుంచి చూపుతాను -
నా ఇంటి స్తంభాన్ని ఆనుకొని నిలిచి
“నీ కొడుకు ఎక్కడ” అని అడుగుతున్నావు
వాడెక్కడ ఉన్నాడో నాకు తెలియదు.
అతనికి జన్మనిచ్చిన ఈ గర్భం ఒక కొండ గుహ
పులి కొంతకాలం ఇక్కడ నివసించి వెళిపోయింది
ఎక్కడో ఏదో యుద్ధభూమిలో అతను నీకు దొరుకుతాడు
(పురనానూరు-86)
ఆరు పంక్తుల మూలకవితకు ఆరు పంక్తులలో అనువాదం కుదిరింది. ఆ తల్లి ధీరత్వం అనువాదంలో అంతే చక్కగా పలికింది.
ఒక బల్లి బండి చక్రాన్ని అంటిపెట్టుకొని
ప్రయాణించినట్లుగా
నేను అతనితో కలసి ఎన్నెన్నో దూరాలు నడిచాను.
అతన్ని అతని నేలలో నిద్రపుచ్చటానికి
ఒక కుండను
తయారు చెయ్యి కుంభకారుడా!
దయచేసి ఇద్దరు పట్టేదిగా
దాన్ని పెద్దగా తయారు చెయ్యి.
(పురనానూరు-256)
ఒక్క వ్యర్థపదమూ లేదు ఇందులో. దేశం కాని దేశానికి వచ్చిందా అమ్మాయి. ఇంకెవరూ తోడున్నట్లు లేరు. బిగబట్టిన దుఃఖాన్ని సూచించేందుకు ఈ కొన్ని మాటలు చాలు.
బాబాగారు ప్రధానంగా ఆంగ్లానువాదాల మీద ఆధారపడ్డారు కాబట్టి ఈ అనువాదాలను అనువాదాలకు అనువాదాలని చెప్పాలి. అందువల్ల కొన్ని సందర్భాలలో మూలంలో ఉండే సూక్ష్మతలు జారిపోయాయేమో అని అనిపించింది.
అమరుశతకం అధ్యాయంలోని 12వ కవిత (మూలంలో 92వ శ్లోకం) ఇలాగ ఉన్నది -
మైదానాలు నదులు అడవులు కొండలకు అవతల
తన భార్య ఎక్కడో సుదూరంగా ఉన్నదన్న సంగతి తెలిసినా ఆ బాటసారి
కాలి మునివేళ్ళపై నించుని
ఆమె నివసిస్తున్న ఊరి దిక్కుగా
కన్నీరు నిండిన కనులతో
తదేకంగా చూస్తున్నాడు.
మూలంలో "ఉద్గ్రీవః” (మెడనెత్తినవాడు) “చరణాగ్రరుద్ధవసుధః" (కాలి మునివేళ్ళతో నేలను అదిమినవాడు) అనే విశేషణాలను వాడాడు కవి. "మెడ ఎత్తి" "మునివేళ్ళతో నేలను అదిమి" అని అర్థాలు ఆ మాటలకు. ఆ "మెడ ఎత్తడం" అనువాదంలో చేరివుంటే ఆ ఉద్విగ్నత మరింత బాగా పలికేదేమో. అంతే కాదు, తెలుగులో బాటసారి తదేకంగా చూసాడు. సంస్కృతంలో పథికుడేమో “సాశ్రే దృశౌ ప్రోన్మృజ్య… ముహుర్వీక్షతే (కన్నీరు కారుతుండగా కళ్ళు తుడుచుకుంటూ మళ్ళీ – మళ్ళీ, మళ్ళీ - చూసాడు). అనువాదంలో ఆ సంగతి పడి ఉంటే బావుండేది.
అమరుశతకంలోని ఈ శ్లోకం బొమ్మ అయితే దానికి బొరుసులాంటి పదచిత్రం ఉన్న శ్లోకం ఇంకొకటి ఉన్నది - ఇంటి దగ్గర భర్త కోసం భార్య ఎదురుచూపులను కవిత్వీకరించినది (అమరుశతకం అధ్యాయంలో 8వ పద్యం). రాడు లెమ్మని నిరాశతో ఇంటివైపుగా ఒక అడుగు వేసిన ఆమె "ఏమో ఈ క్షణమే రావచ్చును కదా" అని తలతిప్పి చూస్తుంది. "అస్మిన్ క్షణే మా భూదాగతః అన్న సంస్కృతం మాటలను చాలా కరెక్టుగా పట్టుకున్నారు బాబాగారు. అయితే మూలంలో ఆ తలతిప్పి చూసిన చూపుకు "అమందవలితగ్రీవం" అనే విశేషణాన్నివాడారు కవి. చటుక్కున తల త్రిప్పి చూసిందట. ఆ ఝటితిస్ఫురణ తెలుగులో రాలేదు.
అకనానూరులోని 134వ కవిత అనువాదంలో (సంగం కవిత్వం అధ్యాయంలోని ఐదవది) చాలా ప్రూనింగుకు గురయ్యింది. గృహోన్ముఖుడైన ఒకాయన రథంపై అడవి గుండా ప్రయాణిస్తూ దారి ప్రక్కన సంగమించుకుంటున్న లేళ్ళను ఆటంకపరచకుండా నెమ్మదిగా రథాన్ని తోలమని చెప్పే కవిత - మూలంలో కవి "సకాలంలోవానలు కురిసాయి/అడవి అందగించింది/నిండుగా ఉన్న నల్లమబ్బును వెంటబెట్టుకొని వచ్చిన వర్షర్తువు నిలువనున్నది కొంతకాలం/ నీలిరంగు కాయా పువ్వులపైన ఎర్రటి మూపుగల పట్టుపురుగులు పారాడుతున్నాయి/రాలిన మల్లెలు నేలను కమ్మాయి/నేర్పరి చిత్రకారుడు రచించిన వర్ణచిత్రంలా ఉన్నది ఈ "మూలై" ప్రాంతం.." అంటూ ఎత్తుకుంటాడు కవి మూలంలో. ఈ కవితారంభంలో ఒక నెమ్మదితనం ఉన్నది. మట్టి వాసన, మల్లె వాసన, చల్లని గాలి, అడవి మసకబారుతున్న దృశ్యం... ఒక మంచిపాటకు ఆలాపన వణ్టి ఈ ఎత్తుగడ అనువాదంలో జారిపోయింది. పాఠకుడే ఆ దృశ్యాన్ని తన మనసులో నిర్మించుకోవాలని బాబా గారు అనుకున్నారేమో కానీ ఆ ధ్యానస్థితి నాబోటివాడికి అంత సులువుగా అందదు.
కురుంతోగై ఎనిమిదవ కవితను (సంగం కవిత్వం అధ్యాయంలో 39వ పద్యం) నందిని గార్గి గారి గొంతులో విన్నప్పుడు - https://nandinikarky.com/2021/01/20/kurunthogai-8-his-sons-mother/ - ఛందోబద్ధంగా అనువదిస్తే తప్ప ఆ లయా ఆ బిగువూ రావేమోనని అనిపించింది.
పంక్తిభోజనాలప్పుడు, రుచిచూడడంకోసం మొదట అన్ని పదార్థాలను కొద్దికొద్దిగా వడ్డిస్తూపోయిన విధాన బాబాగారు ఈ సంకలనంలో తనకు నచ్చిన ప్రాచీనకవిత్వాన్ని కొద్దికొద్దిగా రుచిచూపిస్తూపోయారు. చదివేస్తూ చదివేస్తూ ఎవరికి వారమే నిర్ణయించుకుంటాము - ఈ ఫలానా కవిత్వం ఇంకెక్కడ దొరుకుతుందో వెదికిపట్టుకొని మరింత చదవాలని. ఆ చవి, ఆ ఆకలి మీకు కలిగితే ఈ పుస్తకం ప్రయోజనం నెరవేరినట్లే.
భోజనం ఉపమానం ఎలాగూ వచ్చింది కాబట్టి పళ్ళెంలో వచ్చిపడ్డ "చేదు" గురించి కూడా కొద్దిగా చెప్పుకుందాము.
ఈ కవితా సంకలనపు చివరనున్న వివరణల గురించి చెబుతూ, ఒకో అధ్యాయాన్ని చదివి ఆ అధ్యాయానికి సంబంధించిన వివరణలను చదువుకొని ముందుకెళ్ళడం పఠనానుభవానికి కొంత సహాయకారి అవుతుందని అన్నాను ఇంతకు ముందు. "కొంత" అని ఎందుకు క్వాలిఫై చేసానంటే -
ఈ వెనకమాటల్లో బాబాగారిలోని కవిని కార్యకర్త డామినేట్ చేసాడు. తమిళంలోనో, ప్రాకృతంలోనో ఉన్న గొప్ప కవిత్వాన్ని చదువుకొని తన మాటల్లో చెప్పుకొని రసానుభూతిని పొందడంతో ఆగక ఒక కథనాన్ని (narrative) రూపొందించడం ఈ వివరణలలో ప్రధానంగా కనబడుతుంది. ఆ కథనం ప్రకారం -
1. ఈ కవిత్వమంతా నిమ్నవర్గాలవారి జీవితాలకు సంబంధించింది.
2. ఇదంతా జైనులూ, బౌద్ధులూ సృజించిన సాహిత్యం
3. బ్రాహ్మణులు ఈ సాహిత్యాన్ని ఉపేక్షించారు. ఇంకా చెప్పాలంటే - "తగలబెట్టి ఉంటారు"
4. ఈ సాహిత్యంలో తిరుగుబాటు ధోరణి ఉన్నది. ధిక్కారస్వరాలు వినిపిస్తాయి.
5. ఇందులో వర్ణితమైన కాలంలో, సమాజంలో పురుషాధిక్యత, వర్ణవివక్ష వంటి "సంస్కృత"వికారాలు ఉండవు.
ఇలాంటి కథనాలను నిర్మించేప్పుడు తార్కికమైన అభిప్రాయాలను, ఊహాపోహలను, పూర్వధారణలను కలగలిపి కుప్పకూర్చే ప్రమాదం ఉంటుందని, పాలూ-నీళ్ళను విడదీసి చదువుకోగల వీలు పాఠకులకందరికీ ఉండదని, ఇప్పటికే మనుషులకూ మనుషులకూ నడుమన దాటడానికి వీలు లేకుండా కట్టేసిన రాజకీయభావజాలాల అడ్డుగోడలను ఈ కథనాలు దృఢపరుస్తాయని నా నమ్మకం. ఒక బహుజనోద్యమమేధావిగా ఒక స్పష్టమైన దృక్కోణం ఉంటుంది. తదనుగుణమైన అభిప్రాయాలను వ్యక్తపరచడం ఒక అనివార్యత కూడా అయి ఉండవచ్చు.
కానీ కవిగా, అనువాదకుడిగా తాను పాఠకులకు అందించదలచుకున్న రసానుభూతికి ఈ సిద్ధాంతరాద్ధాంతాలు అడ్డుపడతాయని నేననుకుంటాను. ఒకోసారి కవి చూపునూ అడ్డుకుంటుంది ఇలాంటి ధోరణి. వజ్జాలగ్గం అధ్యాయంలోని ఈ తొమ్మిదవ కవితను చూడండి,
"ఓ హంసరాజమా!
స్వర్ణపద్మాలు, మంచిముత్యాలతో నిండిన
పవిత్ర మానససరోవరాన్ని విడిచిపెట్టి
ఊరికాలువలో వసిస్తూన్నందుకు
సిగ్గుతో నీవింకా చచ్చిపోలేదేమి?
(వజ్జాలగ్గం-261)
ఈ పద్యం చదవగానే ప్రసిద్ధమైన "ఎవ్వడవీవు కాళ్ళుమొగమెఱ్ఱన" చాటువు గుర్తుకువస్తుంది. ఆ చాటువుకు "కస్త్వం లోహితలోచనాస్యచరణో…" అనే సంస్కృతచాటువు ఆధారం. దానికి ఎదురుజవాబు ఈ వజ్జాలగ్గపు పద్యం అని బాబా గారు అభిప్రాయపడ్డారు - "పై చాటువులో పారలౌకిక విషయాలు గొప్పవనీ ప్రాపంచిక విషయాలు అల్పమైనవనే వెటకారపు భావన ఉంది...మానససరోవరం, దేవతలు స్నానం చేయటం లాంటి అలౌకిక కాల్పనిక విషయాలను వదిలి ఇక్కడ ఉంటున్నందుకు "నీవింకా చచ్చిపోలేదేమి" అంటూ కత్తివాదర లాంటి వ్యంగ్యంతో ఖండించాడా ప్రాకృత జైన గాథాకారుడు." అని చెప్పేసారు.
బాబాగారి అన్వయం సరైనది కాదేమోనని నా అభిప్రాయం. ఆ సంస్కృతశ్లోకం "పారలౌకికత" సందర్భంలో చెప్పినది అయి ఉండకపోవచ్చు. ఉదాత్తతకు ఔన్నత్యానికీ హంసను, సామాన్యతకు/అల్పత్వానికి కొంగనూ ప్రతీకగా తీసుకొని కొన్ని విషయాల విలువ సామాన్యులకు తెలియనంత మాత్రాన వాటి విలువ తగ్గదు అని చెబుతున్నాడు సంస్కృతకవి. వజ్జాలగ్గపు కవి (జినవల్లభుడు) సైతం అదే మాటను ఇంకోలా చెబుతున్నాడు. "ఏది గొప్ప" అనే విషయంలో ఇద్దరు కవులదీ ఏకాభిప్రాయమే. వజ్జాలగ్గంలో ఈ పద్యం పొందుపరచబడ్డ హంసవజ్జా విభాగంలోని ఏడు పద్యాలను చూస్తే స్పష్టమయ్యేది అదే. ఇంతా చేసి, వజ్జాలగ్గము హైందవేతరమైన శుద్ధ జైన/సెక్యులర్ కావ్యమేమీ కాదు. హిందూదేవతల ప్రస్తావన ఉన్న పద్యాలూ ఉన్నాయి.
సంస్కృతానికి దీటుగా లేదా ఒక మెట్టుకు ఎగువన ప్రాకృతాన్ని తమిళాన్ని నిలపడం ఒక తీరు. సంస్కృతంతో బాటు ప్రాకృతమూ, తమిళమూ నా ఆస్తి అని మురిసిపోగలగడము - అది వేరు. ఈ సంకలనపు పఠితలు బాబాగారు లేవనెత్తిన ప్రశ్నల గురించి నిజాయితీగా ఆలోచిస్తూనే మన ఉమ్మడి వారసత్వం పట్ల మమకారాన్ని, కవిత్వసంస్కారాన్ని నిలుపుకుంటారని ఆశిస్తాను.
తీపితో భోజనాన్ని ముగించడమే కదా మనకు పరిపాటి కదా...
రకరకాల ఒత్తిడుల మధ్య ఈ పుస్తకం చదవడానికి రెండు నెలల కన్నా ఎక్కువ సమయం పట్టీంది నాకు. మొదటగా ఒప్పుకున్నది - తప్పొప్పులు కనిపెట్టి, ఏమైనా సలహాలుంటే ఇచ్చేందుకు. ఇలాంటి సమీక్ష ఒకటి వ్రాస్తానని అనుకోలేదు. వారాల పాటు Whatsapp ద్వారా సాగిన మా చర్చలో బాబాగారు చాలా ఓపికగా ఉన్నారు. విమర్శను సహృదయంతో స్వీకరించారు. నా ఆలస్యాన్ని భరించారు. తన వాదాలను అనువాదాలను ఛాలెంజ్ చేసినప్పుడల్లా తనకు ఆధారాలను నాకు పంపించారు. ఒక అర్ధరాత్రివేళ నిద్రనాపుకుంటూ "ఎవ్వడవీవి కాళ్ళుమొగమెఱ్ఱన" పద్యానికి మూలమైన శ్లోకం కోసం వెదికాము ఇద్దరమూ. మహాసుభాషితసంగ్రహంలో తాను దాన్ని పట్టుకొని పంపినప్పుడు ఎంత సంబరపడ్డానో చెప్పలేను. ఆ ముచ్చట గురించి ఈ వ్యాసంలో వ్రాస్తానని చెబితే "కణతకి గురిపెట్టి [ఆ శ్లోకాన్ని] చూపిస్తే తప్ప [తనను] వదలలేదని రాయండి"అని సూచించారు. వారి హాస్యస్ఫూర్తికి స్నేహశీలతకు వందనం!
ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే - ఈ కవిత్వాన్ని మనకు పరిచయం చేసేందుకు బాబాగారు పడ్డ శ్రమకు అనేక ఆంగ్లసంకలనకర్తలు ప్రేరణ, వారికి ఆధారం - శతాబ్దాల క్రితం తమిళప్రాకృతసంస్కృతసంకలనకర్తల పరిశ్రమ. మరెందరో అజ్ఞాతవ్యక్తుల పరిరక్షణప్రయత్నం. ఇందరు వ్యక్తులూ, ఇంత సాంకేతికతా వంతెనగా అమరగా ఇంత చక్కని కవిత్వం మనదాకా ప్రయాణించి వచ్చింది. ధన్యులము మనము.
స్వస్తి.
ఉరుపుటూరి శ్రీనివాస్
బెంగుళూరు
schary.vuruputuri@gmail.com

ప్రాచీన గాథలు లభించు చోటు
ReplyDeletehttps://amzn.in/d/0csOOkjM