Sunday, April 5, 2009

పాబ్లో నెరుడా "ONLY DEATH" తెలుగులో......


పాబ్లో నెరుడా (1904-1973) చిలీ దేశానికి చెందిన కవి. ఇరవయ్యవ శతాబ్ధపు సాహిత్యాన్ని ప్రకాశింపచేసిన ప్రముఖ కవిగా నెరుడా సుప్రసిద్దుడు. ఈతని సాహిత్యకృషికి, 1971 లో నోబుల్ ప్రైజు ఇవ్వటం జరిగింది.
నెరుడా కవిత్వం అద్బుతమైన మిస్టిక్ నెస్ తో గొప్ప ప్రతీకలతో నిండిఉంటుంది. కొన్ని కవితలు అధివాస్తవిక ధోరణులతో ఉంటాయి. ఇతడు సమకాలీనులచే ఇరవయ్యవశతాబ్ధపు ఉత్తమ కవిగా" కీర్తింపబడ్డాడు. నెరుడా వ్యక్తిగతంగా చిలియన్ కమ్యూనిష్టు పార్టీ తరపున పని చేసాడు. రాజకీయకారణాల వల్ల కొంతకాలం అజ్ఞాతంగా కూడా జీవించవలసివస్తుంది. ఈతని కవిత్వంలో కమ్యూనిష్టు పోకడలు పెద్దగా ఉండవు. నెరుడా కవిత్వంలో కరుణ, మానవత్వం తొంగిచూస్తుంటాయి. తన మెటఫర్ల్ లతో నెరుడా చదువరిని మరోలోకంలోకి తీసుకుపోతాడు. అతని పద్యం ఒక కలలా పాఠకుని వెంటాడేలా చేస్తాడు.

నెరుడా కవిత్వం అనేక ప్రపంచభాషలలోకి అనువదింపబడింది.
నెరుడా వ్రాసిన Only Death అనే పద్యానికి నేచేసిన అనువాదం ఇది.


మృత్యువు మాత్రమే


మూగ ఎముకలు నిండిన గోరీలతో
ఏకాకి స్మశానాలవిగో.

సొరంగం గుండా హృదయ యానం
నీడలు.... నీడలు.... నీడలు.
మనలోకే కూలిపోయే ఓడలా
మనం చనిపోతూంటాం.
హృదయంలోకే మునిగిపోయినట్లుగా
చర్మంనుండి ఆత్మదాకా
అనంతంగా జారిపోయినట్లుగా
మనం చనిపోతూంటాం.

గవ్వలు పేరుకొన్న శిలలపాదాలవిగో
అక్కడంతా మృతదేహాలు.

స్వచ్చమైన శబ్ధంలా ఎముకలలో మృత్యువుంది.
ఏ కుక్కా లేకుండా వినిపించే మొరుగులా
గంటలనుంచో, గోరీలనుంచో జనిస్తో, తేమలో ఉబ్బుతో
ఒక ఏడ్పులానో లేక వానలానో మృత్యువు శబ్దిస్తోంది.

ఒంటరిగా ఒక్కోసారి నేను చూస్తుంటాను
తెరచాప నీడలో శవపేటికల్ని.
మృతుల, మృత జడల జవ్వనుల
తెల్లని దేవదూతల్లాంటి వంటవాళ్ల,
గుమస్తాలను పెండ్లాడిన శోక యవ్వనిల
లంగరు బరువును మోస్తోన్న
శవపేటికలను చూస్తూంటాను.

నిలువెత్తు మృత్యునదిలో
ఎర్రగా ఒరిసిపోయిన ఆ నదిలో
ప్రవాహానికి ఎదురొడ్డుతూ
మృత్యు సంగీతపు అలలతో శ్రుతి కలుపుతూ
మృత్యు మౌన కెరటాల సవ్వడితో జతకలుపుతూ
శవపేటికలు ఎగప్రాకటం
ఒక్కోసారి నేను గమనిస్తూంటాను.

మృత్యువు కనిపించదు, దాని శబ్ధమే నడిపిస్తూంటుంది.
పాదం కనిపించని బూటులా, దేహం అగుపించని సూటులా.
రాతితో కానీ, చేతితో కానీ చేయబడని
గణగణ మనే ఘంటారావం లా మృత్యువు వినిపిస్తుంది.

మృత్యువుకు నోరు లేదు, నాలుక లేదు, గొంతుకా లేదూ,
కానీ, మృత్యు పిలుపు వినిపిస్తూంటుంది.
సందేహం లేదు, నీవు మృత్యు పదఘట్టనలని
దాని దుస్తుల రెపరెపల్నీ, ఒక వృక్షంలా మౌనంగా వినగలవు.

మృత్యువు మాయా తివాచీపై కూర్చొని
నేలను నాకుతూ, మృతులకై వెతుకుతూ
భూమిని చుడుతూ ఉంటుంది.
మాయా తివాచీయే మృత్యువు.
దాని మృత్యు నాలిక మృతులను వెతుకుతూంటుంది.
తివాచీ నేసుకోవటానికి దారాలను వెతుక్కొంటూంది.

నాకు తెలియదు
నాకు కొంచెమే అర్ధమయింది
దృశ్యం అస్పష్టంగానే ఉంది, కానీ
మృత్యు గీతం అనేది తడిచిన నల్లకలువల వర్ణమని
నేను నమ్ముతున్నాను.
అవును
మట్టికి అలవాటు పడిన నల్లకలువ వర్ణమే!
ఎందుకంటే
మృత్యువు యొక్క ముఖం ఆకుపచ్చన.
ఎందుకంటే
నల్లకలువ దళపు పదునైన తడితోనూ
దాని గంభీరవర్ణపు శీతాకాల అసహనంతోనూ సారించే మృత్యువు యొక్క తీక్షణ చూపులు ఆకుపచ్చనే మరి.

మంచాలపై మృత్యువుంది
మెత్తని పరుపులపై, నల్లని దుప్పట్లలోనూ ఉంది.
దుస్తుల మడతలలో మృత్యువు విస్తరించి
అకస్మాత్తుగా పేలుతుంది.
దుప్పట్ల మధ్య నల్లటి శబ్ధం వ్యాపిస్తుంది.
మంచాలు ఓడరేవుకై ప్రయాణం సాగిస్తూంటాయి.

అక్కడ
యుద్దఓడల అధిపతి దుస్తులు ధరించిన
మృత్యువు ఎదురుచూస్తుంటుంది.

బొల్లోజు బాబాఆశక్తి ఉన్నట్లయితే అంతర్జాలంలో ఈ క్రింది లింకులలోని నెరుడా కవితల అనువాదాల్ని కూడా చదవండి బాగున్నాయి.

http://prajakala.org/mag/2008/02/pablo_neruda1

http://www.eemaata.com/em/issues/200209/595.html

http://www.pranahita.org/2007/08/nee_navvu/


9 comments:

 1. ఈ కవిత ఎందుకో అతుకుల బొంతగా ఉంది. రవీంద్రున్నే తెనుగీకరించిన మీ నుంచీ మరింతగా ఆశిస్తున్నానా!

  ReplyDelete
 2. మహేష్ గారికి
  నెరుడా కవిత్వం కొన్ని చోట్ల చాలాసరళంగా (ode to lemon వంటివి) చాలా సందర్భాలలో ఒక రకమైన అధివాస్తవిక ధోరణిలో సాగుతాయి. ఈయన తీసుకొనే ప్రతీకలు వినూత్నంగా ఒకరకమైన మిష్టిక్ నెస్ తో ఉంటూంటాయి. అటువంటి కవితలలోని కొన్ని అభివ్యక్తిలను మరచిపోలేము. ఈ రకపు సర్రియల్ స్టైల్ మనకు శ్రీరంగం నారాయణబాబులో కనిపిస్తుంది. రవీంద్రుని కవితలతో వీటిని పోల్చలేము.

  ఇక ఈ కవిత విషయానికి వస్తే, మృత్యువుని సముద్రంయానం బాక్ గ్రవుండ్లో చెపుతున్నాడు. కవితమొత్తం అంతా మృత్యువు గురించే.

  నాకు నచ్చిన వర్ణనలు:
  మనలోకే కూలిపోయే ఓడలా మనం చనిపోతాం
  అన్న పేరాలో కవి చావుని ఒక అంతర్యానంలా వర్ణిస్తున్నాడు.

  రకరకాల ఈతి బాధలతో సతమతమయ్యే జనుల ఆ బాధల లంగరు బరువుని మోస్తున్న శవపేటికలు (దేహాలు) ఈ కవికి కనిపిస్తున్నాయట.

  ఈ మృత్యునదిలో (జీవనయానంలో), ప్రయాసపడుతో ఎదురొడ్డుతో శవపేటికలు ఎగబాకుతున్నాయట.

  మృత్యువుకు రూపంకనిపించదని, దాని క్రియలు మాత్రమే కనిపిస్తూంటాయని పాదంకనిపించని బూటుతో, దేహంకనిపించని సూటుతో పోలుస్తున్నాడు.

  మృత్యువుకు నోరులేకపోయిన అది పలకగలదనీ, దాన్ని మనం మౌనంగా వినకతప్పదనీ చెపుతున్నాడు.

  ఇక చివరి పారాగ్రాఫుని నేనిలా అర్ధం చేసుకొన్నాను
  మృత్యు గీతం నల్లకలువ (violets = నల్లకలువవంటి పుష్పాలు) అంటే మృత్యువు చేసే పనులు మట్టి అని. చచ్చినతరువాత మట్టిలో కలవాలి కనుక.
  మృత్యు ముఖం ఆకుపచ్చన అంటే మృత్యువునుండే పునసృష్టి జరుగుతుందనీ. పునరపి మరణం పునరపి జననం

  ఇక చివరి లైనులలో మృత్యువుని దేముని తోనే పోల్చేసాడు.

  పైవి నాకు అనిపించిన భావాలు.
  అలాకాక ఈ కవిత మరిన్ని కొత్త కోణాలలో ఆవిష్కరింపబడినా నేనాశ్చర్యపోను. సిగ్గుపడను కూడా, ఎందుకంటే ఈ కవితలో అంతటిలోతూ, పరిధీ ఉన్నాయి. నేను కొన్ని చోట్ల స్వతంత్రించాను.

  ఈ కవితను చదివినతరువాత ఎందుకో చాలాకాలం వెంటాడింది.
  ఇలా ఆ బరువు దించుకొన్నాను. :-)

  ఇక్కడ మాతృకను ఇస్తున్నాను. గమనించండి.

  ONLY DEATH

  There are lone cemeteries
  tombs filled with mute bones,
  the heart going through a tunnel
  shadowy.. shadowy..shadowy..
  we die as fi a ship were going down inside us
  like a drowining in the heart,
  like falling endlessly from the skin to the sea.

  There are corpses
  thre are feet of clammy stone,
  there is death in the bones,
  like pure sound,
  like a bark without a dog,
  growing out of certain bells, certain tombs,
  swelling in the humidity like lament or like rain.

  Alone sometimes I see
  coffins under sail
  weighing anchor with the pale dead, with women in
  their dead braids,
  with bakers white as angels,
  pensive girls married to accountants,
  coffins climbing the vertical river of the dead,
  the bruise-coloured river,
  labouring upstream, sails billowing with the sound of death,
  billowing with the sound of the silence of death.

  It's sound that death is drawn to
  like a shoe without a foot, like a suit with no man in it,
  it's drawn to knock with a ring, stoneless and fingerless
  it's drawn to call out without a mounth, a tongue, a throat
  No questin, you can hear death's footsteps,
  and its clothes rustle, quiet as a tree.

  I don't know, I understand so little, I can hardly see
  but I belive that death's song is the color of we violets,
  violets accustomed to the earth,
  because the face of death is green,
  and the gaze of death is green
  with the sharp wetness of the leave of a violet
  and its serious color of wintry impatience.

  But death also goes around the earth riding a broom,
  licking the ground looking for the dead ones,
  death is in the broom,
  it's death's tongue looking for the dead,
  it's death's needle that needs threading.
  Death is in the bedsteads
  in the slow mattresses, in the black blankets
  death stretches out like a clothesline, and then suddenly
  blows:
  blows a dark sound that swells the sheets
  and beds are sailing into harbor
  where death is waiting dressed as an admiral.

  Pablo Neruda

  ReplyDelete
 3. నా సందేహం కొంచెం నిమ్మళించిందిగానీ, ఎక్కడో చిన్న అసంతృప్తి. కాసేపటి తరువాత మళ్ళీ చదివి చూస్తాను. అప్పుడు ఏమైనా ఆలోచనలొస్తాయోమో!

  ReplyDelete
 4. కత్తి Only thing I can say is ..

  It is not easy to translate his poems!

  For that matter it is not even easy to understand his poems fully :)

  ReplyDelete
 5. అను సృజన పద్దతిలో ఇదే కవిత మరికొంత సరళంగా చేయవచ్చనిపిస్తోంది.

  మృత్యువు గురించి కొన్ని వాక్యాలు.......


  మృత్యు సొరంగం గుండా హృదయ యానం.
  ఆ చీకట్లలో స్మశానాలు మిలమిలా మెరుస్తూన్నాయి.
  స్మశానాలనిండా ఏకాకి గోరీలు
  గోరీల నిండా అస్థులు స్రవించిన మౌనం.

  మనలోకే కూలిపోయే ఓడలా
  మనం చనిపోతూంటాం.
  హృదయంలోకే మునిగిపోయినట్లుగా
  చర్మంనుండి ఆత్మదాకా
  అనంతంగా జారిపోయినట్లుగా
  మనం చనిపోతూంటాం.

  మరుభూమి దేహంపై
  మొలచిన మొటిమల్లా గోరీలు
  గోరీల నిండా మౌనాస్థుల శబ్ధాలు.
  స్ఫష్టంగా, స్వచ్చంగా.
  అవి మృత్యుశబ్ధాలే!

  ఒక్కోసారి మృత్యువు చేసే శబ్ధం
  ఏకుక్కా లేకుండా వినిపించే మొరుగులా ఉంటుంది.
  గంటలనుంచో, గోరీలనుంచో జనిస్తో, తేమలో ఉబ్బుతో
  ఒక ఏడ్పులానో లేక వానలానో మృత్యువు శబ్దిస్తూంటుంది.

  అపుడపుడు నేను చూస్తుంటాను
  మృత్యువృక్ష నీడలో నడిచే శవపేటికల్ని.
  మృతుల, ఒకనాటి సౌందర్యవతుల,
  గుమస్తాలను పెండ్లాడిన శోక యవ్వనిల
  విధివంచితుల, జీవన పరాజితుల
  సమస్త బాధల భారాన్ని మోసుకు తిరిగే
  శవపేటికల్ని చూస్తుంటాను.

  నిలువెత్తు మృత్యునదిలో
  ఎర్రగా ఒరిసిపోయిన ఆ నదిలో
  ప్రవాహానికి ఎదురొడ్డుతూ
  మృత్యు సంగీతపు అలలతో శ్రుతి కలుపుతూ
  మృత్యు మౌన కెరటాల సవ్వడితో జతకలుపుతూ
  శవపేటికలు రొప్పుకుంటూ ఎగప్రాకటం
  ఒక్కోసారి నేను గమనిస్తూంటాను.

  మృత్యువు ఏనాడూ కనిపించలేదు, దాని శబ్ధమే నడిపిస్తూంటుంది.
  పాదం కనిపించని బూటులా, దేహం అగుపించని సూటులా.
  రాతితో కానీ, చేతితో కానీ చేయబడని
  గణగణ మనే ఘంటారావం లా మృత్యువు వినిపిస్తుంది.

  మృత్యువుకు నోరు లేదు, నాలుక లేదు, గొంతుకా లేదూ,
  కానీ, మృత్యు పిలుపు వినిపిస్తూంటుంది.
  సందేహం లేదు, నీవు మృత్యు పదఘట్టనలని
  దాని దుస్తుల రెపరెపల్నీ, ఒక వృక్షంలా మౌనంగా వినకతప్పదు.

  మృత్యువు మాయా తివాచీపై కూర్చొని
  నేలను నాకుతూ, మృతులకై వెతుకుతూ
  భూమిని చుడుతూ ఉంటుంది.
  బహుసా మాయా తివాచీయే మృత్యువు.
  దాని మృత్యు నాలిక మృతులను వెతుకుతూంటుంది.
  తివాచీ నేసుకోవటానికి దారాలను వెతుక్కొంటూంది.

  నాకు తెలియదు
  నాకు కొంచెమే అర్ధమయింది
  దృశ్యం అస్పష్టంగానే ఉంది, కానీ
  మృత్యు గీతం అనేది తడిచిన నల్లకలువల వర్ణమని
  నేను నమ్ముతున్నాను.
  అవును
  మట్టికి అలవాటు పడిన నల్లకలువ వర్ణమే!
  మట్టినుండే పచ్చని మొలకలు వచ్చినట్లుగా
  మృత్యువునుండే పున:సృష్టి జరుగుతుంది.
  అందుకేనేమో
  మృత్యువు యొక్క ముఖం ఆకుపచ్చన.
  ఎందుకంటే
  నల్లకలువ దళపు పదునైన తడితోనూ
  దాని గంభీరవర్ణపు శీతాకాల అసహనంతోనూ సారించే
  మృత్యువు యొక్క తీక్షణ చూపులు ఆకుపచ్చనే మరి.

  మంచాలపై మృత్యువుంది
  మెత్తని పరుపులపై, నల్లని దుప్పట్లలోనూ ఉంది.
  దుస్తుల మడతలలో మృత్యువు విస్తరించి
  అకస్మాత్తుగా పేలుతుంది.
  దుప్పట్ల మధ్య నల్లటి శబ్ధం వ్యాపిస్తుంది.
  మంచాలు ఓడరేవుకై ప్రయాణం సాగిస్తూంటాయి.

  అక్కడ
  యుద్దఓడల అధిపతి దుస్తులు ధరించిన
  మృత్యువు ఎదురుచూస్తుంటుంది.

  బొల్లోజు బాబా

  ReplyDelete
 6. బాబాగారు,

  చాలా మంచి ప్రయత్నం. నెరుడా కవిత్వాన్ని అనువదించడమంటే పసిపాప ఏడుపుని అనుకరించడమంత కష్టం!

  నాకు తోచిన కొన్ని విషయాలు. సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తూ (ఆ ధైర్యంతోనే):
  1. విశేషణాలు/పోలికలు ఎక్కువుగా ఉన్న వాక్యాలులో క్రియలు, విభక్తి ప్రత్యయాలు ఇబ్బంది పెడతాయి. అలాటి వాక్యాలని క్రియలతో పూర్తిచెయ్యడం కన్నా వాటిని వదిలేసి వాటిని అసంపూర్తిగా ఉంచెయ్యడమే బావుంటుందనిపిస్తుంది.
  2. pure sound అంటే "స్వఛ్చమైన శబ్దం" కన్నా అక్కడ "కేవల శబ్దం/నాదం" అనే అర్థం ఇంకా సరైనదేమో?
  3. "ఏ కుక్కా లేకుండా వినిపించే మొరుగులా" వంటి వాక్యాలని "కుక్కలేని మొరుగులా" అంటే క్లుప్తంగా ఉంటుంది.
  4. broom అంటే చీపురు కాదా?
  5. "sails billowing with the sound of death,
  billowing with the sound of the silence of death" అన్న ఇంగ్లీషు వాక్యాలలో ఒకే రకాలైన పదాల ఆవృత్తి, silence అనే పదానికి ఇస్తున్న శక్తి తెలుగులో కనిపించ లేదు.
  6. ఇంగ్లీషు కవితలో వాక్య విభజనకున్న శక్తి మీ అనువాదంలోని వాక్యాల విరుపులలో కొన్ని చోట్ల కనిపించలేదనిపించింది.

  మీరేమీ అనుకోనంటే, వీలుచూసుకొని నేను కూడా అనువాద ప్రయత్నం చేస్తాను. అయినా అది నాకు సంతృప్తినిస్తుందన్న నమ్మకం లేదనుకోండి, నెరుడా కవిత్వం అలాంటిది!

  ReplyDelete
 7. భైరవభట్లగారికి
  థాంక్సండీ.
  అంతర్జాలంలో ఉన్న సౌలభ్యానికి వేయి వందనములు.

  ఇందులో సహృదయత అనే పెద్దమాటలు మీరు వాడకూడదు. ఇదంతా ఒక సంతోషాన్ని కలిగించే ఆటగానే నేను భావిస్తున్నాను. ఆవిషయాన్ని పై కామెంటులో------ అలాకాక ఈ కవిత మరిన్ని కొత్త కోణాలలో ఆవిష్కరింపబడినా నేనాశ్చర్యపోను. సిగ్గుపడను కూడా, అని చెప్పాను కూడా.

  ఇక మీ కామెంటు గురించి

  ఎ. . నిజమే కానీ అలారాసి చూసుకొన్నప్పుడు మరింత గజిబిజిగా/అస్పష్టంగా తోచింది.
  బి. కేవలనాదం అన్నమాట బాగుంది.
  సి. నేను ముందు రాసుకొన్నది అలానే. కానీ కుక్కలేని అనే మాటలో ద్వందార్ధం (నోట్లో కుక్కుకోవటం) ద్వనించటంతో క్లుప్తతను త్యాగం చేయవలసివచ్చింది.
  డి. బ్రూం అంటే హారీ పోటర్ ఎగిరే మాంత్రిక చీపురుకట్టగా అన్వయం చేసుకొన్నాను. దానికి సమానంగా మాయా తివాచీఅని అనువదించాను.
  ఇ. మీ పరిశీలన కరక్టుగానే అనిపిస్తుంది.
  ఎఫ్: :-) యధాశక్తీ.

  తరువాత కొంచెం క్లారిటీ వచ్చేవిధంగా అనుసృజన పద్దతిలో కవితను తిరగవ్రాసాను గమనించారా?

  ఇక ఈ కవిత గురించి
  దీన్ని సుమారు ౩ నెలల క్రితం చదివాను. అప్పటినుంచీ. ఇలా "భుజం మార్చుకొనేదాకా" సలుపుతూనే ఉంది.

  ఇక ఆ "బరువు" మొయ్యటం మీవంతు. :-)

  అనంతానంత ధన్యవాదములతో

  భవదీయుడు
  బొల్లోజు బాబా

  ReplyDelete
 8. మీ సాహసాన్ని మెచ్చుకోకుండా ఉండలేకున్నాను.
  బాగుంది

  ReplyDelete
 9. బాబాగారు,

  మీరందించిన స్ఫూర్తితో నేను చేసిన అనువాదం ఇక్కడ:
  http://www.eemaata.com/em/issues/20090/1430.html

  ReplyDelete