Monday, April 13, 2009

ఏమంటావూ?

సోక్రటిస్ తాతా!
చావు, బతుకు లలో ఏది ఉత్తమ మార్గమో?
అంటూ గొప్ప సందేహాన్ని
మా మొహాలపై చల్లి పోయావు.
ఆ ప్రశ్నకు జవాబింకా దొరక లేదు.

కాల మౌన గిలిటిన్ అతిసున్నితంగా
తనపని చేసుకుపోతోంది తప్ప
ఇప్పటిదాకా నోరు విప్పనే లేదు.
ఏ ఒక్క ఆత్మా తిరిగొచ్చి
"ఇదీ సంగతి" అని చెప్పిన పాపానా పోలేదు.

మృత్యు పాత్రిక ఒంపులలో జీవితం
సుబ్బరంగా ఇమిడిపోతూనే ఉంది.

కొత్త అనుభవాలను, ఆలోచనలనూ
యాచించే బిక్ష పాత్ర
రోజూ ఉదయిస్తూనే ఉంది.

స్వప్నాల హంసలు ఖాళీ గాలిలోకి
అలా అదృశ్యమౌతూనే ఉన్నాయి.

తాతా
కొంపతీసి అంతా మిథ్యే నంటావా?
అన్నీ ఇక్కడే నంటావా?

బొల్లోజు బాబా
6 comments:

 1. వేదాంతాన్ని తర్కాన్నీ పదబంధాలలో చక్కగా ఇరికించి రక్తిగట్టించారు. ఎప్పటిలాగే....అభినందనలు. ఇంతకీ, అన్నీ ఇక్కడేనంటారా!

  ReplyDelete
 2. చూసారా నిదానంగా ప్రశ్నిస్తూ, మీక్కావల్సిన సమాధానం ఇమిడున్న ఆ రెండు చివరి ప్రశ్నలతో ఆపారు. నా వరకు ముందుగా "అంతా మిథ్యే", "అన్నీ ఇక్కడే " అని, ఆపై, ఈ గొంగళి బతుకు రూపాంతరం చెంది, మరణం తర్వాత సితాకోకచిలుకగా మారే మరో దశ వుందని ఆశ.

  ReplyDelete
 3. బాబా గారు చాలా బాగుంది. సూర్యుడిన బిక్షపాత్రచేసేశారు.. బాగుంది ప్రయోగం. అభినందనలు.

  ReplyDelete
 4. చావు, బతుకు లలో ఏది ఉత్తమ మార్గమో?...
  బతికి చూపింది ఒక ఆత్మ... పరమాత్మగా మారింది
  సైనైడ్ రుచి చూద్దామని 'S' (Sweet or Salt?) తో ముగించిదో ఆత్మ...
  ఆసతో బ్రతకటం లొ ఆనదం దాగిలేదా?

  చాలా బాగుంది... మాస్టారు మీకు మీరే సాటి

  ReplyDelete
 5. "స్వప్నాల హంసలు ఖాళీ గాలిలోకి
  అలా అదృశ్యమౌతూనే ఉన్నాయి." beautiful sir!

  ReplyDelete
 6. మహేష్ గారికి
  మీరేమంటారు?
  నే తీసుకొన్న ప్రతీకలతో అంతా ఎక్కడో చెప్పేసాననే అనుకొంటున్నాను. :-)

  ఉషగారూ,
  అంతే నంటారా?
  నాకూ ఆ ఆశ లేకపోలేదు. థాంక్సండీ

  ఆత్రేయగారు
  :-)))))

  రమేష్ గారు
  అవునండీ నేనూ ఆ ఉదంతాన్ని ఎక్కడో చదివాను.
  థాంక్సండీ

  పరిమళంగారు
  అవునా. థాంక్సండీ.

  ఈ కవితపై ఆవకాయ.కాంలో నేనిచ్చిన వివరణ ను ఇక్కడ ఇస్తున్నాను.

  ఈ కవిత నేపధ్యం
  సోక్రటిస్ కి హెమ్ లాక్ (విషం) ఇచ్చినపుడు ఇలా అంటాడు " the time has come for you to live and for me to leave, which is the better way only god knows" అని. చావు బతుకుల్లో ఏది ఉత్తమ మార్గము అనే ప్రశ్న రెండువేల ఏళ్ళ క్రితం ఎంత స్పష్టత లేకుండా ఉందో ఇప్పటికీ అలానే ఉందన్న చిన్న ఊహ పై వ్రాసిన కవిత ఇది.
  తరువాత సోక్రటిస్ శిష్యుడు ప్లాటోకి, అతని శిష్యుడు అరిష్టాటిల్ కు మధ్య జరిగిన సంవాదంలో, అరిస్టాటిల్ "అంతా ఇక్కడే" "పైనేమీ లేదు" అని వాదిస్తాడు.
  http://library.thinkquest.org/6407/images/sch1.gif
  పై లింకులోని పెయింటింగ్లో ఒకరు చెయ్యి పైకి చూపుతూంటారు, మరొకరు క్రిందకు చూపుతూంటారు.

  స్వర్గం, నరకం, రంభతో సమాగమాలు, అమృతసేవనాలు, నూనెలో వేపడాలు, సూదులపై పడుకోపెట్టాటాలు, వంటివి ఏమీ ఉండవు, స్వర్గమైనా నరకమైనా ఇక్కడే అనే ఒక భావపరంపర అనాదిగా నడుస్తున్నదే.

  పై వేదాంత శిగపట్లను వస్తువుగా తీసుకొని చివరకు ఏమంటావు? అని ప్రశ్నించి కవితను ముగించాను.

  ఇందులో నిరాశ , పెసిమిజాన్ని ఎక్కడ చెప్పానో అర్ధం కావటంలేదు.
  నేను తీసుకొన్న నెగటివ్ ప్రతీకలన్నీ నే చెప్పదలచుకొన్న పాయింటుకు బలాన్ని చేకూర్చుకోవటానికి వాడుకొన్నవే (అంటే అక్కడా, ఇక్కడా అని నేను కవితద్వారా చెప్పదలచుకొన్న విషయం)

  ఇకపోతే ఈ కవితలో ఏమంటావు అని ప్రశ్నించినా ప్రతీకలద్వారా నేనేమనుకొంటున్నానో చెప్పేసాను.

  డిస్క్లైమర్ : నేను నాస్తికుడను కాదు.

  బొల్లోజు బాబా

  ReplyDelete