Friday, April 24, 2009

ముళ్ల గాయాలు

ఆకుల వలనుంచి
తప్పించుకొన్న కాంతి
చేతికిచిక్కని నీడల పొడల్ని
నేలపై చిత్రిస్తూంది.
అనంత జీవనానుభూతుల మధ్య
దొరక్కుండా ఆడించే
ఒకటో రెండో స్వప్నాల్లా.

నువ్వైనా నేనైనా
గుప్పెడు స్వప్నాలమే!
లేకుంటే పిడికెడు జ్ఞాపకాలము.
తుమ్మచెట్టు గుండా వీచే గాలికి
చర్మం నిండా ముళ్ల గాయాలే! పాపం


ఒంటరితనాన్ని గుర్తుచేసే
రాత్రి మళ్లా వచ్చేసింది.


పగటి కన్నీటి చారికల్ని
నిదుర వాన కడిగేసింది.

కనులు తెరచి సూర్యోదయాన్ని
నూత్న శిశువులా ఆహ్వానిద్దాం.

బొల్లోజు బాబా

19 comments:

 1. తుమ్మచెట్టు గుండా వీచే గాలికి
  చర్మం నిండా ముళ్ల గాయాలే! పాపం

  ఈ భావన భలే ఉంది..........

  అన్నమయ్య రాసిన పరబ్రహ్మం కీర్తన లో...

  ’ పరగ దుర్గంధములపై వాయువొకటే..
  వరుస పరిమళముపై వాయువొకటే...’

  మీ పదాలు ఈ పదాలను గుర్తు తెసున్నాయి. చక్కగా ఉంది మీ కవిత.

  ReplyDelete
 2. తుమ్మచెట్టు గుండా వీచే గాలికి
  చర్మం నిండా ముళ్ల గాయాలే! పాపం
  wah!

  ReplyDelete
 3. Nice kavita after long time....

  ReplyDelete
 4. "పగటి కన్నీటి చారికల్ని
  నిదుర వాన కడిగేసింది."

  ఆహా!!

  బాబా గారు, అసలు మీరెలా రాయగలరండీ ఇంత మంచి కవితలు ఇంత ఫ్రీక్వెంట్ గా... అదీ ఎంతో విభిన్నమైన కధా వస్తువులతో!!! your talent really amazes me!

  btw, "రాత్రి మళ్లా వచ్చేసింది." లో 'మళ్ళీ' అని ఉంటే బావుంటుందేమో కదా!?
  టైపో అయితే నెవర్ మైండ్ :-)

  ReplyDelete
 5. హమ్మ్. కొన్ని వాక్యాలు బాగున్నాయి.
  పద్యం మొత్తమ్మీద చూస్తే ఇంకొంచెం పుష్టిఉండాలేమో ననిపించింది. "ముళ్ళగాయాలే పాపం" తరవాత వచ్చిన మూడు వాక్యాలూ, ఏదో అడావుడిగా పద్యాన్ని ముగించెయ్యాలి అని రాసినట్టుగా ఉన్నాయి. మొదటి వాక్యాల్లో ప్రతిపాదించిన అబ్జర్వేషన్ను త్రచై చూసే ప్రయత్నం ఏదీ జరగలేదు.
  స్వప్నాలు, జ్ఞాపకాలు, ముళ్ళు, వెలుగు నీడలు .. వీటి పరస్పర సంబంధంలోకి ఇంకొంచెం లోతుగా వెళ్ళుంటే పద్యానికి ఇంకాస్త కండపట్టి ఉండేది.

  ReplyDelete
 6. పై వ్యాఖ్యలో "అబ్జర్వేషన్ను తరచి చూసే ప్రయత్నం ఏదీ జరగలేదు." అని చదువుకోగలరు.

  ReplyDelete
 7. బావుందండీ!మీ కవిత.

  ReplyDelete
 8. jeevitanni yvidyam gaa cheppaaru.baavundi

  ReplyDelete
 9. "నువ్వైనా నేనైనా
  గుప్పెడు స్వప్నాలమే!
  లేకుంటే పిడికెడు జ్ఞాపకాలము
  తుమ్మచెట్టు గుండా వీచే గాలికి
  చర్మం నిండా ముళ్ల గాయాలే! పాపం"
  ఈ లైన్లు ఎన్ని సార్లు చదివానో.అద్భుతం మాష్టారూ.

  ReplyDelete
 10. స్పందించిన అందరకూ ధన్యవాదములు
  తెలుగు కళ గారికి,
  అన్నమయ్య పదాల్ని గుర్తుచేసారు. :-)

  నరసింహగారికి
  థాంక్సండీ

  పద్మార్పితగారు
  థాంక్యూ

  నిషిగంధగారు
  you always encourage me. it gives "a kick" for me to go ahead. thankyou mam. మళ్లా అనే పదం, టైపాటు కాదని చెప్పటానికి భయమేస్తుంది. వాడుకలో ఉండే పదమే కదా అని వాడేసాను. మరో సారి సరిచూసుకొంటానండీ.


  గురువుగారు కొత్తపాళీగారికి
  మీ పరిశీలనలు ఎప్పటిలానే నాకెంతో ఉపయోగపడుతున్నాయి. :-)

  ఈ కవితను మీ కామెంటు తరవాత, ఇప్పుడు నాకు నేను డిసెక్ట్ చేస్తూంటే చాలా అన్వయలోపాలు కనపడుతున్నాయి.

  1. మొదటి చరణంలోని స్వప్నాలు, రెండవ చరణంలోని స్వప్నాలకు మధ్య అన్వయం కుదరలేదు.
  2. ముళ్ళ గాయాలే అన్న తరువాత మీరు చెప్పినట్లుగా హడావుడిగా కవిత పరిగెట్టటం వలన లింక్ తెగింది.
  3. ముళ్లగాయాలు అన్న పదచిత్రాన్ని కూడా నే నాశించిన అర్ధం కోసం మరికొంత విస్తరించి ఉండాల్సింది.
  4. మీరు సూచించిన విధంగా దీనినే కొంచెం కండ పట్టించి వ్రాస్తాను సార్. :-)

  ఇకపోతే ఈ కవితలో నేచెప్పదలచుకొన్న అంశం

  జీవితంలోకొన్ని ఆశయాలు లేదా ఆశలు మన చేతికి చిక్కకుండా మనల్ని ఆడిస్తూంటాయి. నీడపొడల్లా నిలకడగా ఉండకుండా, ఏడిపిస్తూంటాయి.

  అలాంటి వేదన మధ్య సాగే జీవితానికి దాని నిండా ముళ్ల గాయాలే ఉంటాయి.

  ఎన్ని కష్టాలున్నా, ప్రతీరోజు జీవితాన్ని ఫ్రెష్ గా మొదలుపెట్టాల్సిందే!.
  ప్రతీ ఉదయాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా ఆహ్వానించాల్సిందే!

  ఈ కవితలో రంద్రాలున్నా చాలామందికి నచ్చటానికి కారణం.
  1. రెండు లోతైన పదచిత్రాలు,
  2. నాపై ఉన్న అభిమానం :-))

  అనుకొంటున్నాను.

  పరిమళంగారికి
  థాంక్సండీ

  రిషి గారు
  మీ కామెంటుద్వారా ఈ కవితలో అంతర్లీనంగా నేచెప్పదలచుకొన్న విషయం గ్రహించారని అనిపిస్తోంది.
  థాంక్సండీ

  రాధికగారు
  మీలా క్లుప్తంగా వ్రాయటం ఇక నావల్లకాదేమో మాడం. :-)
  థాంక్యూ వెరీ మచ్ అండీ.

  ReplyDelete
 11. నిషి కామెంటే నాదీను! అసలు మీ బ్లాగుకు రావడమే ఈర్ష్య పడుతూ వస్తాను నేను. అసలు అది కాదు కానీ ఇన్నిన్న్ని భావాలు ఊటబావిలో ఊరినట్లు ఎలా ఊరతాయా అని...!

  నువ్వైనా నేనైనా
  గుప్పెడు స్వప్నాలమే!
  లేకుంటే పిడికెడు జ్ఞాపకాలము.
  తుమ్మచెట్టు గుండా వీచే గాలికి
  చర్మం నిండా ముళ్ల గాయాలే! పాపం
  "పగటి కన్నీటి చారికల్ని
  నిదుర వాన కడిగేసింది."

  ఇంత చక్కని భావాలు మీ అంత అందంగా ఎవరూ ఆవిష్కరించలేరేమో!

  ReplyDelete
 12. నాకు మీ కవితలంటే చాలా ఇష్టం బాబాగారు.. చక్కగా అమ్మ గోరుముద్దలు తినిపించినంత కమ్మగా అనిపిస్తాయి.. ఒక్కోసారి కామెంటడానికి కూడా నాకు చక్కని పదాలు దొరకవు ...అంత అద్బుతం గా ఉంటాయి :)

  ReplyDelete
 13. బాబా గారు చాలా బాగుంది. మీరు కవిత నచ్చడానికి చెప్పిన ౨ కారణాల్లో నా ఓటు మొదటిదానికే...

  ReplyDelete
 14. ఆత్రేయగారు
  థాంక్సండీ
  i would like to share a few lines today.

  సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున సాహితీయానం లో ఈ క్రింది కవిత పోస్ట్ చేసాను.

  Sunday, April 27, 2008

  కాలం

  భవిష్యత్తంటూ ఏమీ ఉండదు
  అనంతమైన అవకాశాలన్నీ
  వర్తమానంలోకి కుప్పకూలుతాయి.

  వర్తమానమూ ఒక భ్రమే ఎందుకంటే
  దాన్ని చేరగానే గతంగా మారిపోతుంది కనుక.
  గతం మాత్రమే నిజంగా నిజం
  జ్ఞాపకాల మచ్చలు, జీవితాన్ని నిర్ధేశించే అనుభవాలు
  కళ్ల వెనుక కదలాడే నులివెచ్చని దృశ్యాలు
  కళ్లు మూసేదాక వెంటాడుతూంటాయి.

  బొల్లోజు బాబా  ఇప్పటికి సుమారు 82 పోస్టులయ్యాయి.
  ఈ బ్లాగు పుట్టిన రోజున మీ కామెంటు నన్నెంతో ఆనందింపచేసింది.

  బ్లాగులోకంలో నాకు వచ్చిన మొదటి కామెంటు జ్యోతి గారినుంచి.

  జ్యోతి said...

  బ్లాగ్లోకానికి స్వాగతం

  మీ బ్లాగు టైటిల్ కూడా తెలుగులోకి మార్చండి మరి...మరిన్ని రచనల కోసం ఎదురుచూస్తున్నాము.
  April 30, 2008 6:10 PM

  లింకు: http://sahitheeyanam.blogspot.com/2008/04/introduction.html  బ్లాగుల్లో నేను చేసిన మొదటి కామెంటు కొత్తపాళీగారికి ( అప్పటికి ఆయనంటే ఏమిటో నాకు తెలియదు. కానీ ఎలా కామెంటేసానో చూడండి.

  bolloju ahmad ali baba said...

  hai
  prakruti varnana chaalabaagundi

  excellent. unread recently

  bolloju baba
  April 27, 2008 11:16 PM

  పై వాఖ్యకు లింకు: http://kottapali.blogspot.com/2007/11/blog-post.html?showComment=1209318360001#c8731716313856100698


  భవదీయుడు
  బొల్లోజు బాబా

  ReplyDelete
 15. బాబాగారూ... మీ కవితావర్షంలో నిండా తడిసిన తరువాత, కామెంటాలంటే నాకు భయం. ఆ మత్తులో ఉన్నప్పుడు భావమూ,భాష... రెండూ నాకు సహకరించవు, సరిగ్గా వ్యక్తీకరించలేనేమోనన్న భయంతో! ఇంతకముందు ఎప్పుడో కామెంటినట్లు గుర్తు - "మీ ప్రతీ కవితా నాకు పాఠ్యాంశమే!"

  ReplyDelete
 16. baavunnaayi! mallii vachchi migataavannii kuudaa chaduvutaanu. abhinandanalu.

  ReplyDelete
 17. నాకు మీ కవితలు చాలా abstract గా ఉంటాయి. నాకు కొన్ని పంక్తులు అర్థం కావు చాలా సార్లు చదివితే కానీ.మీ రేంజ్ డెప్త్ నాకర్థమయ్యే రేంజ్ కాదనిపిస్తుంది. ఈ కవిత మాత్రం సులువుగా, అద్భుతంగా ఉంది.

  తుమ్మచెట్టు గుండా వీచే గాలికి
  చర్మం నిండా ముళ్ల గాయాలే! పాపం

  ఇది మటుక్కు ఆదర గొట్టేసారు. అద్భుతంగా ఉంది. చాలా కొత్తగా ఉంది.

  ReplyDelete
 18. బాబా గారూ
  మీ కవితలనన్నీ చదువుతూ వస్తున్నాను
  చాలా బాగున్నాయి.
  మీగురించి ప్రధాన స్రవంతి కవులకు తెలియదని అనుకొంటున్నాను. దయచేసి మీ కవితల పుస్తకాన్ని తీసుకురండి.

  మరొక్క సూచన

  మీ కవితలకు వివరణలివ్వద్దని ఎవరో చెప్పారు.
  అది నిజం
  ఉదాహరణకు నేనీ కవితను చదవగానే ఇలా ఊహించుకొన్నాను

  మొదటి పాదాల్లో ఒక వ్యక్తి జీవితం గానూ, చివరకు రాత్రి అంటే అతని మరణం గానూ, చివరి పాదంలో అతను మరలా తిరిగి జన్మించినట్లు గానూ ఊహించుకొన్నాను. పునరపి జననం పునరపి మరణం అన్న భావనను అద్బుతంగా వ్యక్తీకరించారని భావించాను

  కానీ మీ వివరణ చూసాకా నేను తప్పు అన్న భావన నాకు కలిగింది. అంతవరకూ మీ కవితపై ఏర్పడ్డ గొప్ప అభిప్రాయం పలచబడింది.

  ఆలోచించుకోండి

  ReplyDelete