Wednesday, August 26, 2009

చేజార్చుకొన్నాం...... పాబ్లో నెరుడా

ఈ సంధ్యను కూడా మనం చేజార్చుకొన్నాం.
లోకంలోంచి నీలి రాత్రి ఊడిపడే సాయింత్రపువేళ
మనం చేతిలో చేయివేసుకొని సాగటాన్ని ఎవరూ గమనించలేదు.

ఆ దూరపు కొండల అంచులపై సూర్యాస్తమయ ఉత్సవాన్ని
నా కిటికీ లోంచి చూసాను.

ఒక్కోసారి ఒక సూర్యుని ముక్క నా చేతిలో నాణెమై మండేది.
నీకూ తెలిసిన నా విషాద హృదయంతో
నిన్ను నేను గుర్తుచేసుకొంటాను.

అప్పుడెక్కడున్నావు నీవు?
అక్కడ ఇక వేరే ఎవరున్నారూ?
ఏం చెపుతున్నారూ?
నీ వియోగంతో నే దుఖి:స్తున్నపుడు అకస్మాత్తుగా
మొత్తం ప్రేమంతా నన్ను ఎందుకు ముంచెత్తుతుందీ?

చేజార్చుకొన్న పుస్తకం ఎప్పుడూ సంధ్య పుటనే చూపిస్తూంటుంది.
నా పాదాలవద్ద తీరం, గాయపడ్డ కుక్కలా దొర్లుతుంది.

పాలరాతి శిల్పాలను అదృశ్యం చేసే వెన్నెలలోకి
నీవు సాయింత్రాల గుండా ప్రతీసారీ జారిపోతూంటావు...... ప్రతీ సారి.


బొల్లోజు బాబా

పాబ్లో నెరుడా - We Have Lost Even కు స్వేచ్చానువాదం

6 comments:

 1. అనువాదం బాగుందండి.

  ReplyDelete
 2. చాలా బాగుంది బాబా గారూ!

  ReplyDelete
 3. "నీ వియోగంతో నే దుఖి:స్తున్నపుడు అకస్మాత్తుగా
  మొత్తం ప్రేమంతా నన్ను ఎందుకు ముంచెత్తుతుందీ?"

  నిజానికి ఏది నచ్చింది అని చెప్పాలంటే ఈ పదం, ఆ పాదం అన్నంత బేధభావం చూపలేనట్లుగావుంది. కొన్ని మనసుకి హత్తుకుపోతుంటే, కొన్ని అనుభవాల్లోంచి తెలియని అనుభూతిని వెలికి తెస్తున్నాయి. గాలికి వూగే సన్నజాజి తీగమాదిరి ప్రేమ అన్న ప్రతి ప్రస్తావన నా హృదిని తీగె వలె మారుస్తుంది. ఈ ఉదయం ఈ చిక్కని కవిత అలాగేవుంది. చేజార్చుకున్న ప్రతీది వెనక్కి తేలేకపోయినా కొన్ని ప్రేమే సాధ్యం చేయగలదని నా విశ్వాసం. మీ ధారాళ అనువాదా పటిమకి అభివందనాలు. మీ కృషికి అభినందనలు.

  ReplyDelete
 4. కొత్తపాళీ గురువుగారూ
  మీ స్పందనకు థాంక్సండి

  సృజన గారు, వెంకట్ గారు ధన్యవాదాలండీ

  ఉస గారికి థాంక్యూ వెరీ మచ్ అండీ

  బొల్లోజు బాబా

  ReplyDelete
 5. బాబా గారు, అలా అలా అనువాదాల కవితలు చదువుతూ మళ్ళీ చూశానిది. నా ప్రియ నెచ్చెలికి చూపాను. ఇద్దరి భావనలు కలిపి ఇక్కడ పెడుతున్నాను. ఇది అంతా మంచి కవితకి, దానికి సరైన మీ అనువాదానికి కలిగిన స్పందన మాత్రమే...

  "అప్పుడెక్కడ ఉన్నావు నీవు? నీకోసం నే కన్న కల తెల్ల గా తెల్లవారి పోతుంటే ఎక్కడో వెన్నెల మొదలవుతున్న రాత్రి వెంట, గుర్తు తెలియని పిట్టల రాగాల వెంబడి పరుగులు తీస్తుండి ఉంటావు. నీ వియోగం తో ఎర్ర బడ్డ నా కన్నుల మంట నెగడు కాచుకున్న హృదయం లేని రాయి వై ఉంటావు, ఎక్కడో అక్కడ నాకు గుర్తు తెలియకుండా. ఇంత గా నిన్ను ప్రేమించానే, ఒక్క సారి కనీసం ఒక్కసారి నా తలపు నీ గుండె నుంచి గొంతుక లోకి వచ్చి పొలమార లేదు. ఒక్క సారి గుర్తు తెలియని పువ్వేదో మంచు కన్నీరు కారుస్తుంటే నే గుర్తు రాలేదు."

  *** మూర్తిగారిస్తున్న నూతనోత్సాహంతో, మీ మిగిలిన అనువాదాలు వెలికి తేకూడదు? నాకు అప్పటి పరిణామాలు తెలుసు, అయినా కూడా.

  ReplyDelete