Showing posts with label కవిత్వం సాహిత్యం. Show all posts
Showing posts with label కవిత్వం సాహిత్యం. Show all posts

Monday, January 16, 2012

నువ్వు కాదు నేనే



స్వప్నానికి నాకూ మధ్య
మంచులా పరచుకొంటున్నది
నా శ్వాసా లేక నీదా?

ఎన్నెన్ని అస్ఫష్ట దృశ్యాలు!

నేలకొరిగిన తూనీగపై పూల వాన
అద్భుత సమాధి
చుంబించుకొన్న పెదాలు అదృశ్యమైనా
ఇప్పటికీ  పరిమళించే ప్రేమలా

కొలను అలలపై
ఏటవాలు కాంతిపుంజం
సన్నగా ఒణుకుతోంది
నీ జ్ఞాపకాలపై నా హృదయంలా

నీవు పంపించే వసంతాలకు
ఎడారి దూరంలో నేను
నీకై  నా ఆత్మ కోయిల పాడే పాట
నాకే చేదు చేదుగా అనిపిస్తోంది

తనమార్గాన్ని తానే అల్లుకొంటూ
సాగిపోతోంది కాలం సాలీడల్లే

ఒంటరితనం శూన్యమేమీ కాదు కానీ
తీవ్రమైన అలసట మాత్రం  
చీకటిలా మెరుగుతూంటుంది

జ్ఞాపకాలు నాని ఉబ్బి
వికృతంగా తయారయ్యాయి
గాలినిండా మృత్యువాసన

నా కవితల్లో నువ్వంటే నువ్వు కాదు  నేనే


బొల్లోజు బాబా

Monday, January 24, 2011

ఎందుకో తెలియటం లేదు.........


ఎందుకో తెలియటం లేదు కానీ
ఆ వీధిలోంచి వెళ్ళాలనిపించటం లేదు.

ఆ గుడిసె ముందు ఆ ఆటోని చూసినప్పుడల్లా
యాక్సిడంటులో నుజ్జు నుజ్జయిన 
ఆ ఆటోని చూసినప్పుడల్లా
పగిలిన దాని హెడ్ లైట్ నిస్తేజాన్ని చూసినప్పుడల్లా....

"అటెండెన్స్ సరిపోలేదని 
స్కాలర్ షిప్ నిలుపు చేసేసారు సార్
డబ్బు చాలా అవసరం హెల్ప్ చేసి పెట్టండి సార్" అని
అభ్యర్దించిన ఆ కుర్రవాని కనులే 
జ్ఞాపకం వస్తున్నాయి.

కాగితాలు, కంప్యూటర్లూ జీవితాల్లోకి
చూడలేవన్న విషయాన్ని ఎలా చెప్పగలిగానూ?

ఆ వీధిలో, ఆ గుడిసె ముందు నిలిచిపోయిన
ఆ ఆటోని చూసినప్పుడల్లా....
రంగువెలసీ, తుప్పు పట్టీ, గడ్డి మొలచీ శిధిలమౌతున్న 
ఆ ఆటోని  చూసినప్పుడల్లా.....
చాన్నాళ్ళ తరువాత ఆటో నడుపుతూ కనిపించిన వాడు

"దేవుని కృప వల్ల అంతో ఇంతో సంపాదిస్తున్నాను కదా,
నువ్వింక రిక్షా తొక్కడం మానేయమంటే వినటం లేదు సార్ మా నాన్న"
అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి.

క్లాస్ రూమ్స్ లో ఎప్పటికీ నేర్వలేని పాఠాలవి.
ఆ రోజు  వాడెంత ముద్దొచ్చాడనీ!

యాక్సిడెంటులో నుజ్జు నుజ్జయిన వాడి ఆటో పక్కనే
కొత్తగా గ్రీజు పెట్టిన డొక్కు రిక్షాను చూసినప్పటి నుంచీ .......

 ఎందుకో తెలియటం లేదు కానీ .... ....


భవదీయుడు
 
బొల్లోజు బాబా

Wednesday, July 21, 2010

వారిలో ఒకరు (ONE OF THEM)-- P.P. Ramachandran



వారిలో ఒకరు 

స్కూలు బస్ స్టాప్ వద్ద అమ్మాయిలు
బస్సుకోసం ఎదురుచూస్తున్నారు

ఎంత ప్రయత్నించినా
వలికే దేహ సౌందర్యాన్ని
గొడుగులు, బ్యాగులు, జోళ్లు, యూనిఫార్మ్ లు 

నిలువరించలేక పోతున్నాయి.

బయటకురికే వారి హృదయాలను
వారి మాటలు, చూపులు, భంగిమలూ
ఏ మాత్రం దాచలేక పోతున్నాయి.

కళ్ళముందే బస్సులు దాటిపోతూంటే
ఆందోళన పె
రుగుతూంటుంది.
*****


వారిలో ఒకామె  ప్రభుత్వాధికారి
మరొకామె  ఓ గృహణి అవుతారు
ఇంకొకామె  దారి తప్పుతుంది.....


ఆ స్కూలు పక్కనుంచి సాగే బస్సులో
ఒళ్లో పిల్లాడ్ని పెట్టుకొని కూర్చున్న ఆమె  తన భర్తతో
"ఈ స్కూల్లోనే నేను చదువుకొన్నది" అంటోంది.


అక్కడ ఇంకా ఒకరు బస్సుకోసం
ఎదురుచూస్తూనే ఉంటారు
ఇప్పటికీ!


Source:  ONE OF THEM  --   P.P. Ramachandran

Wednesday, July 14, 2010

ప్రార్ధన


ఇప్పుడిక ఓ ఎడారిని ప్రసాదించు 

వర్షించే ఇసుకా, ప్రవహించే ఎండా
దిగంతాలవరకూ
పరచుకొన్న ఏకాంతం
నిర్జల సరోవరాల తో కూడిన
ఓ ఎడారి కావాలిపుడు.
దానికేమాత్రం తగ్గినా
ఈ ఘడియ రక్తికట్టదు.


లేదా
ఓ సముద్రాన్నిప్పించు
దేహాన్ని తేల్చుతూ ఉండేంత ఉప్పని నీరు
చుట్టూ విశాలంగా విస్తరించిన ఏకాంతం
కింద వెచ్చని బడబాగ్ని
పైన చల్లని సుడిగాలులతో కూడిన
ఓ ఉప్పని సముద్రమైనా చాలు
సరిగా సరిపోతుంది.

లేక పోతే 

ఓ రాత్రిని అనుగ్రహించు
అన్ని వైపుల్నుంచీ వీచే నల్లని గాలి
మువ్వలచేతికర్రతో సాగే నేత్రధ్వయం
స్పటికం లా వణికే  చిక్కని నీలిమా
పొదలమాటున మెరిసే కనుల ఏకాంతంతో కూడిన
ఓ
రాత్రయినా చాలు సందర్భోచితంగా ఉంటుంది.

లేదా.........






బొల్లోజు బాబా

Monday, May 17, 2010

పిడిబాకు

ప్రశాంతతను
గాయపరచే పిడిబాకు
మళ్లా ప్రత్యక్షమైంది

దెబ్బకు స్వప్నం కాస్తా వాస్తవంగా
వాస్తవం కాస్తా మహా ఎడారిగా
మహా ఎడారి కాస్తా మృగతృష్ణగా
రంగులు మార్చేసాయి

ఆ నిర్జలోష్ణ కాసారపుటొడ్డున
రాళ్లు విసురుతో నా ఆత్మ

పిడి బాకు అంచున తృష్ణా బిందువు
పిడి బాకు అంచున మృగకాంక్షా శ్వాస
అచ్చోటనే రుధిర జాతర.
నరక సౌఖ్యం, స్వర్గ బాధ పెనవేసుకొన్న
సృష్టి సౌందర్య విస్ఫొటనం కూడా అక్కడే


తలుపు భళ్లున తెరచా
ఈ సమయం లో వచ్చావేమిటీ!
అందామె ఆశ్చర్యపడుతో
నెత్తురు నింపుకొన్న నా క్షణాల్ని
చూపించా!


గాయపడ్డ నా గీతాన్ని
తన దేహంలోకి తీసుకొని
స్వస్థ పరచిందామె ....ప్రేమతో....




బొల్లోజు బాబా

Tuesday, February 16, 2010

రెండు నిముషాల మౌనం -Two minutes silence by కేదార్ నాథ్ సింగ్

సోదర సోదరీ మణులారా 

ఈ రోజు మరణిస్తున్నది మరణిస్తున్న ఈ దినం కోసం రెండు నిముషాల మౌనం

ఎగిరిపోతూన్న పక్షికోసం నిశ్చల జలాల కోసం మీద పడుతున్న రాత్రికోసం రెండు నిముషాల మౌనం

దాని కోసం కాని దాని కోసం అయిఉండాల్సిన దానికోసం రెండు నిముషాల మౌనం

విసిరేసిన తొక్కకోసం నలిగిపోయిన గరిక కోసం ప్రతీ యత్నం కోసం ప్రతీ పధకం కోసం రెండు నిముషాల మౌనం

ఈ గొప్ప శతాబ్దం కోసం ఈ శతాబ్దపు ప్రతీ గొప్ప ఆలోచన కోసం దాని గొప్ప పదాలకోసం ఇంకా గొప్ప ఉద్దేశాలకోసం రెండు నిముషాల మౌనం

సోదర సోదరీమణులారా ఈ గొప్ప విజయాలకోసం

రెండు నిముషాల మౌనం రెండు నిముషాల మౌనం

మూలం: శ్రీ కేదార్ నాథ్ సింగ్,  Kedarnath Singh -- A Two-Minute Silence

అనువాదం:  బొల్లోజు బాబా

Wednesday, February 10, 2010

పదాలు చలికి చచ్చిపోవు - శ్రీ కేదార్ నాధ్ సింగ్

పదాలు చలికి చచ్చిపోవు
ధైర్యం లోపించటం వల్ల చస్తాయంతే
పదాలు తడి కాలంలో
చెడిపోతాయి ఎక్కువగా

మా ఊరి ఏటిగట్టుపై
ఒకసారి నేనో పదాన్ని కలిసాను
మెరిసే ఎర్రపిట్టలా ఉందది
ఇంటికి తీసుకొచ్చాను
గుమ్మం వద్దకు చేరగానే
వింతైన బెదురు చూపులతో
నన్ను చూస్తూ చచ్చిపోయింది అది

అప్పటి నుంచీ పదాలంటే భయం నాకు
వాటి మధ్యకు వెళ్లినా వెంటనే వెనక్కు వచ్చేస్తాను
రంగు రంగుల దుస్తులు వేసుకొని
జుట్టు విరబోసుకున్న పదం నా వైపు రావటం చూస్తే
వెంటనే నా కనులు మూసేసు కొంటాను

నెమ్మది నెమ్మదిగా
ఈ ఆటను ఆనందించటం మొదలెట్టాను
నేనో రోజు గడ్డి మేటు కింద
పాములా నక్కిన ఓ అందమైన పదాన్ని
రాయితో గాయపర్చాను అకారణంగా

దాని చక్కని మెరిసే కళ్ళను
ఈ నాటికీ నేను మరచిపోలేదు

కాలం గడిచే కొద్దీ
నా భయం తగ్గసాగింది
ఈ రోజు పదాలు ఎదురైతే
కుశల ప్రశ్నలు వేసుకుంటాం

ఇపుడు నాకు
అవి దాక్కునే చోట్లెన్నో తెలిసాయి
వాటి వివిధ వర్ణాలు చాలామట్టుకు
నాకు పరిచితమయ్యాయి
సాదా పదాలు, గోధుమ చామనిచాయ రంగుల్లోను
విధ్వంశక పదాలు, లేత పసుపు పింక్ రంగుల్లోను
ఉంటాయని నేనిప్పుడు చెప్పగలను

విషాదకర, గంభీర సందర్భాలకోసం
మనం దాచుకొన్న పదాలు
వాటికుద్దేశింపబడిన సందర్భాలలో
చాలా జుగుప్స కలిగించే పదాలే కావటం
తరచూ జరిగేదే


బొత్తిగా పనికి రానివనీ
హీన వర్ణాలను తొడుక్కొన్నాయనీ
చెత్తలో పారేసిన పదాలే

నా ఆపత్కాలలో సహాయపడ్డాయన్న 
నిజాన్ని కనుగొన్నాను
ఇపుడేం చేయగలను నేను

నిన్నేం జరిగిందంటే
ఓ అరడజను సొగసైన పదాలు
చీకటి వీధిలో అకస్మాత్తుగా
నన్ను చుట్టు ముట్టాయి
భయమేసింది నాకు

మాటల్లేకుండా కొద్దిసేపు వాటిముందు
అలా నిలచుండి పోయాను, చమటతో తడుస్తో
తేరుకొని పరుగు ప్రారంభించాను
నా పాదాలు గాల్లోకి లేస్తుండగా
రక్తంలో తడిచిన ఓ చిన్నారి పదం
ఎక్కడినుంచో ఆయాసపడుతూ నన్ను చేరి
" రా, నేను నిన్ను ఇంటికి చేరుస్తాను" అంది.

మూలం: WORDS DON’T DIE OF COLD - KEDARNATH SINGH


భవదీయుడు
బొల్లోజు బాబా

Saturday, February 6, 2010

స్త్రీ దేహం....... పాబ్లో నెరుడా

స్త్రీ దేహమా!
తెల్లని గిరులు, ఊరువులతో
నీవు వశమయిన ప్రపంచంలా కనిపిస్తున్నావు.
ధృఢమైన నా రైతు దేహం నిన్ను దున్నుతోంది
అవని లోతుల్లోని శిశువును పైకి తీసుకు రావటానికై.

నేనో సొరంగంలా ఒంటరినై ఉండేవాడిని.
పక్షులు నాలోంచి ఎగిరేవి.
రాత్రి ముట్టడి చేసి నన్ను ముంచెత్తేది.
నే బతకటం కోసమే నిన్నో ఆయుధంగా చేసుకొన్నాను
నా ధనస్సులో బాణంలా నా ఒడిసెలలో రాయిలా.

కానీ ప్రతీకార క్షణాలు కరిగిపోయాకా
నిన్ను ప్రేమిస్తున్నట్లు గ్రహించాను.
చర్మం, మట్టి, వాంఛ, చిక్కని పాలు నిండిన దేహానివి నీవు.
ఓహ్! చనుల ధ్వయం విరహ నేత్రాలు
కటిప్రాంత ఎర్రగులాబీలు సన్నని విషాద స్వరంతో నీవు.

ఓ నా స్త్రీ దేహమా!
నీ సౌందర్యంలోనే నా మనుగడ.
నీవే నా దాహానివి, అంతే లేని నా కోర్కెవు, మారిపోయె నా మార్గానివి.

చీకటి నదీ గర్భాన
ఆధ్యంతరహితమైన దాహం ప్రవహిస్తూంటుంది.
అనంతమైన బాధ అలుపు అనుసరిస్తూంటాయి.

బొల్లోజు బాబా

పాబ్లో నెరుడా Body of woman కు స్వేచ్ఛానువాదం

Sunday, January 24, 2010

ఫ్రాగ్మెంట్స్ 5

1.
నేల సంకెళ్లను
నిత్యం తడుముకుంటూనే
వెలుగును తరుముకుంటూ
నీలాకాశం లోకి చొచ్చుకొని
పోతూంటాయి తరువులు.

చెట్టుని మించిన
వ్యక్తిత్వ వికాస పుస్తకం ఏది?

2.
జీవితం అతని మోముపై
నర్తించి నర్తించి
అలసిపోయింది.
ఆ ముఖంపై ముడుతలన్నీ
దాని పాదముద్రలే.

3.
ఒక్క ప్రార్ధనతో
ఈ గాజుపెంకులు
తొలగిపోతాయంటే
ఆత్మను కొవ్వొత్తిలా
మండించటానికి
నెనెప్పుడూ తయారే!

కానీ బెల్లు నొక్కితే
ఈశ్వరుడు ప్రత్యక్షమౌతాడా?

4.

అందరూ ఏదో ఒకనాడు
సూదిబెజ్జంలోంచి సాగాల్సిందే
వెలుగులోకో, చీకట్లోకో!

ఆ దినాంతాన
ఇచ్చిన వాటిని
పంచావా అంటే
ఏం చెప్పాలీ?


5.
తేనెటీగ కుట్టిన బాధలో
నాకు గుర్తుకే రాలేదు
అది కాసేపట్లో
అది చచ్చిపోతుందని.


భవదీయుడు
బొల్లోజు బాబా

Wednesday, December 2, 2009

ఆట వస్తువులు

(విశ్వకవి రవీంద్రనాధ్ టాగోర్ రచించిన క్రిసెంట్ మూన్ లోని “ప్లే థింగ్స్” అనే కవితకు స్వేచ్చానువాదం.)

బాలకా
ఉదయం నుంచీ ఆ ఇసుకలో కూర్చొని
విరిగిన ఆ పుల్లతోఆడుకొంటూ ఎంత
ఆనందంగా ఉన్నావూ!

ఆ సన్నని విరిగిన పుల్లముక్కతో నీ ఆటను
చూసి నేను నవ్వు కొంటాను.
గంటలతరబడి అంకెల్ని కూడుకొంటో
నేను నా పద్దులతో తీరిక లేకుండా ఉంటాను.

బహుసా నీవూ నా వైపు చూసి
“ఈ శుభోదయాన్ని నాశనం చేసే ఎంతటి
మూర్ఖపు ఆట అది” అని అనుకోవచ్చు.

చిన్నారీ
పుల్లముక్కలు, మట్టి ముద్దలలో లీనమయ్యే కళ
నేనేనాడో మరచిపోయాను.
ఖరీదైన వస్తువులు, వెండి బంగారు ముద్దలపైనే నా దృష్టి.

దొరికిన దానితో నీ ఉల్లాసకేళులను సృష్టించుకోగలవు.
నేనేమో నేనేనాటికీ పొందలేని విషయాలపట్లే
శక్తినీ, కాలాన్ని వెచ్చిస్తూంటాను.

నా ఈ దుర్భల నావతో కోర్కెల సంద్రాన్ని
దాటటానికై పోరాడుతూంటాను,
నేనూ ఓ ఆటాడుతున్నానన్న విషయాన్ని విస్మరించి.

బొల్లోజు బాబా

Thursday, October 22, 2009

రాత్రి ఉత్సవం


వేకువ, ఆకాశం, పక్షులు, తరువులూ
వెలుగుని బంతిగా చేసి
ఒకదానికొకటి అందించుకొంటున్నాయి.
రాత్రి ఆటగాడు కాచ్ పట్టటంతో
ఆనాటి పగటి ఆట ముగిసింది.

రాత్రి ఉత్సవానికి తెరలేచింది.

ఎగిరే సాయింత్రపు పక్షులు
తమ ముక్కులతో చేసిన
ఆకాశపు చీలికల్లోంచి
స్వర్లోకపు ధూళి వెన్నెలై రాలుతోంది.

నల్లరాయి మెరిపించే లోహపలుకుల్లా
తారలు మినుకు మినుకు మంటున్నాయి.

కలలు, పలవరింతలు, నిశాచరుల సందడులు
రాతిపూల మాలలు ధరించి
మౌన వేణువులూదుకుంటో
ఉదయంలోకి ప్రవహిస్తున్నాయి.

బొల్లోజు బాబా

Monday, October 5, 2009

క్షుద్ర క్రీడ

మూరెడు మట్టి గాజులకు
ఆమె చేతుల్ని తొడిగారు.

సోలడు పసుపుకు
ఆమె ముఖాన్ని అద్దారు.

సంజె బింబానికి
ఆమె నుదురును తగిలించారు.

బుట్టెడు పూలకు
ఆమె కురులను ముడి వేసారు.

ఇవేమీ పట్టని ఆమె
భోరు భోరున దుఖి:స్తోంది
భర్త శవంపై పడి.

**********


చాలారోజులక్రితం

రాత్రివేళల్లో రోడ్లు ఊడ్చే కార్మికులపై వ్రాసిన నిర్మాల్యం అనే కవిత ప్రేరణ గురించి అక్కడ చేసిన కామెంటు ఇది.....

ఈ కవిత వ్రాయటానికి ప్రేరణ, చాన్నాళ్ల క్రితం, సెకండ్ షో సినిమాచూసి వస్తుంటే, మా ఆఫీసు అటెండరు, రోడ్లు శుబ్రం చేస్తూ కనపడ్డాడు. బండి ఆపి వానితో మాట్లాడి,, కుటుంబ ఖర్చులకోసం, ఇలా పార్ట్ టైముగా చేస్తుంటాను అని తను చెప్పగా తెలుసుకొన్నాను.
ఆ అనుభవం మనసులో ముద్రించుకు పోగా, ఇంటికొచ్చి వ్రాసుకొన్న కవిత ఇది.

ఇక ప్రస్తుతానికి వస్తే
కొద్దిరోజుల క్రితం పైన చెప్పిన మా ఆఫీసు అటెండరు చనిపోయాడు. అక్కడ చూసిన ఒక దృశ్యం కలచివేసింది. భర్తపోయిన దుఖంలో ఉన్న స్త్రీని అలా (సుమంగళిలా) అలంకరించే ఆచారం ఎలా వచ్చిందో కానీ చూడటానికి చాలా అనాగరీకంగాను, inhuman గానూ అనిపించింది.

ఆ అనుభవం మనసులో ముద్రించుకు పోగా, ఇంటికొచ్చి వ్రాసుకొన్న కవిత ఇది.

ఇలా మీతో పంచుకొంటున్నాను.

ఈ విధంగా నా రెండు కవితలలో నిద్రిస్తున్న మిత్రుడు బి.శ్రీనివాసరావు ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ........

బొల్లోజు బాబా

Friday, September 25, 2009

Broken love


ఆమె లేని ఎడారిని
గ్లాసులతో ఎత్తుకొని
తాగీ తాగీ అతను
పాత చీకట్లలో కరిగిపోయాడు.

రాత్రి చలికి ఆమె చనిపోయింది.
తన సంచిలో, బట్టల అడుగున
నూనూగుమీసాలతో నవ్వుతున్న
నలిగిన అతని ఫొటో.

ఇన్నాళ్లూ పిచ్చిదనుకొన్నాం ఆమెను.

వైఫల్య రధానికి
దౌర్భల్యం, కన్నీళ్లు
రెందు చక్రాలు.

బొల్లోజు బాబా

Monday, September 7, 2009

వివిధ వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డ పాబ్లో కవిత్వానువాదాలు

పాబ్లో నెరుడా రచించిన 20 ప్రేమ కవితలు మరియు ఒక విషాద గీతం అనే పుస్తకానికి నే చేసిన తెలుగు అనువాదాలు ఈ క్రింది లింకులలో చదువు కొన వచ్చును. ప్రచురించిన ఆ యా వెబ్ పత్రికల ఎడిటర్లకు ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను. మొత్తం అన్ని కవితల అనువాదం పూర్తయింది త్వరలో ఇ.బుక్ గా మీ ముందుకు తీసుకువస్తాను.






(కవితా కౌముది శీర్షికలో రెండవ కవిత)



భవదీయుడు

బొల్లోజు బాబా