Showing posts with label టాగూర్ క్రిసెంట్ మూన్ తెలుగు అనువాదం. Show all posts
Showing posts with label టాగూర్ క్రిసెంట్ మూన్ తెలుగు అనువాదం. Show all posts

Wednesday, December 2, 2009

ఆట వస్తువులు

(విశ్వకవి రవీంద్రనాధ్ టాగోర్ రచించిన క్రిసెంట్ మూన్ లోని “ప్లే థింగ్స్” అనే కవితకు స్వేచ్చానువాదం.)

బాలకా
ఉదయం నుంచీ ఆ ఇసుకలో కూర్చొని
విరిగిన ఆ పుల్లతోఆడుకొంటూ ఎంత
ఆనందంగా ఉన్నావూ!

ఆ సన్నని విరిగిన పుల్లముక్కతో నీ ఆటను
చూసి నేను నవ్వు కొంటాను.
గంటలతరబడి అంకెల్ని కూడుకొంటో
నేను నా పద్దులతో తీరిక లేకుండా ఉంటాను.

బహుసా నీవూ నా వైపు చూసి
“ఈ శుభోదయాన్ని నాశనం చేసే ఎంతటి
మూర్ఖపు ఆట అది” అని అనుకోవచ్చు.

చిన్నారీ
పుల్లముక్కలు, మట్టి ముద్దలలో లీనమయ్యే కళ
నేనేనాడో మరచిపోయాను.
ఖరీదైన వస్తువులు, వెండి బంగారు ముద్దలపైనే నా దృష్టి.

దొరికిన దానితో నీ ఉల్లాసకేళులను సృష్టించుకోగలవు.
నేనేమో నేనేనాటికీ పొందలేని విషయాలపట్లే
శక్తినీ, కాలాన్ని వెచ్చిస్తూంటాను.

నా ఈ దుర్భల నావతో కోర్కెల సంద్రాన్ని
దాటటానికై పోరాడుతూంటాను,
నేనూ ఓ ఆటాడుతున్నానన్న విషయాన్ని విస్మరించి.

బొల్లోజు బాబా