Tuesday, February 16, 2010

రెండు నిముషాల మౌనం -Two minutes silence by కేదార్ నాథ్ సింగ్

సోదర సోదరీ మణులారా 

ఈ రోజు మరణిస్తున్నది మరణిస్తున్న ఈ దినం కోసం రెండు నిముషాల మౌనం

ఎగిరిపోతూన్న పక్షికోసం నిశ్చల జలాల కోసం మీద పడుతున్న రాత్రికోసం రెండు నిముషాల మౌనం

దాని కోసం కాని దాని కోసం అయిఉండాల్సిన దానికోసం రెండు నిముషాల మౌనం

విసిరేసిన తొక్కకోసం నలిగిపోయిన గరిక కోసం ప్రతీ యత్నం కోసం ప్రతీ పధకం కోసం రెండు నిముషాల మౌనం

ఈ గొప్ప శతాబ్దం కోసం ఈ శతాబ్దపు ప్రతీ గొప్ప ఆలోచన కోసం దాని గొప్ప పదాలకోసం ఇంకా గొప్ప ఉద్దేశాలకోసం రెండు నిముషాల మౌనం

సోదర సోదరీమణులారా ఈ గొప్ప విజయాలకోసం

రెండు నిముషాల మౌనం రెండు నిముషాల మౌనం

మూలం: శ్రీ కేదార్ నాథ్ సింగ్,  Kedarnath Singh -- A Two-Minute Silence

అనువాదం:  బొల్లోజు బాబా

9 comments:

  1. తెలంగాణా కోసమా సమైఖ్యాంద్రా కోసమా ఈ రెండు నిముషాల మౌనం

    ReplyDelete
  2. mana raaja keeya nayakula kosam
    cinema herola kosam

    koodali blogarla kosam
    pra.pi.sa.na. sabhyula kosam

    sharath kosam
    malak kosam
    marthanda kosam
    kaagada kosam

    taa.la.baa.su kosam
    taalibanla kosam
    ajnaatala kosam

    ReplyDelete
  3. మన్నించండి, మూలం ఇక్కడ ఇవ్వగలరా . లేదంటే లంకె.

    "దాని కోసం
    కాని దాని కోసం
    అయిఉండాల్సిన దానికోసం
    రెండు నిముషాల మౌనం"

    మొదటిచూపులో, మొదట "అయిన" అనేపదం అచ్చుతప్పులో జారిపోయిందేమో అన్నట్టు ఉంది.

    ReplyDelete
  4. @మొదటి అనానిమస్
    ఇంటరెస్టింగ్ ఇంటర్ప్రెటేషను. :-)

    @రెండవ అనానిమస్
    దట్ ఇస్ టూ మచ్ :-)

    వర్మ గారికి
    థాంక్యూ

    ఊకదంపుడు గారికి
    అక్కడ అయిన అనే మాట నేను ఉద్దేసించలేదండీ. మాతృక లోని భావాన్ని కొంచెం సొంతంగా రాయాలని ప్రయత్నించాను. మెట్టు మెట్టుగా సాగే వాక్య నిర్మాణం కోసం

    ఆ పదాల మాతృక ఇది

    for that which is
    for that which is not
    for that which could have been
    a two-minute silence

    దాని కోసం
    కాని దాని కోసం
    అయిఉండాల్సిన దానికోసం
    రెండు నిముషాల మౌనం


    ఇక లింకు
    http://india.poetryinternationalweb.org/piw_cms/cms/cms_module/index.php?obj_id=2869


    btw i followed the english version.


    thank you very much for the interest sir.
    bollojubaba

    ReplyDelete
  5. బొల్లోజు బాబా గారు,
    అడగ గానే లంకె ఇచ్చినందుకు ధన్యవాదములు...
    కవి హృదయం అర్ధం కాలేదు,దానికి నన్ను తప్ప వేరెవరినీ నిందించను లెండి...
    నాకు ఈ కవిత వ్రాసిన హిందీ కవి గురించి కానీ - ఆంగ్ల అనువాదకుడి గురించి కానీ - ఏమీ తెలియదు... వారు ఏ వాదమునకు కట్టుబడిన వారో తెలిస్తే బహుశః విపుల దృశ్యాన్ని ఏమైనా చూడగలిగే వాడినేమో ...

    కవిత బడ్డీ కొట్టుదగ్గ టీ తాగుతూ ఊదరగొడుతున మిత్రుణ్ణి ఊరకుండబెట్టటానికి చెప్పినదా ...లేక.. విశ్వవ్యాపితంగా తను సంతాపము/ చింత వ్యక్త్యం చేయదలుచున్నవాటి నిర్దుష్టమైన జాబితా నా అన్నది తెలియ రాలేదు.
    ఈ చరణం చూడండి ఎంతటి వైరుధ్యాన్ని సంతరించుకుందో:
    "or the discarded peel
    for the crushed grass
    for every plan
    for every project
    a two-minute silence"
    [హిందీ పాఠాన్ని కాపీ చేయటం కుదరలేదు]
    మీరు ఆంగ్లాన్ని పాటించి తర్జుమా చేయటం కూడ నాకు కొంత విస్మయాన్ని కలిగించింది..
    భాషా సారూప్యం తెలుగుకు కాస్తో కూస్తో హిందీతోనేనేమో...

    కవి అంతర్లీన భావం మరణమే కావచ్చు - కానీ దానికి ఆయన యెంచుకున్న శబ్దం "డూబ్".. ఆంగ్లసేత దానిని "డయింగ్" చేస్తే మీరు దానిని తెనిగించారు...
    "క్రుంకే పొద్దుకు" అంటే మూలం లోని నర్మగర్భత కూడా తెలుగులోకి వచ్చేదేమో ...
    అట్లనే - మూలం లో "జో హై ఉస్ పర్" అన్నాడు .. అది ఆంగ్లం లో " ఫర్ దట్ ఉచ్ ఈజ్" అన్నాడు..
    ఈ రెంటి ముందూ "దాని కోసం" బరువు తూగ లేదు. [అనువాదం లోని బాధలు ఇన్నిన్నిగావు]
    మరీ ముఖ్యంగా ఇది కొత్త చరణం ఎత్తుకోలు అవ్వటం చేత .. "దాని కోసం" అని గాక - ఒకటి రెండు పదాలు కలుపుకొని ఐనా విస్తృతార్ధం/స్పుటార్ధము వచ్చేటట్లు ప్రయోగించ వలసినది.
    ప్రతీ యత్నం - ప్రతీ పధకం అన్నపుడు - తి కి ఇచ్చిన దీర్ఘం కొత్తగా ఏమీ మోసుకురాలేదు ..
    "ఇరాదా" అన్నపుడు - ఆలోచన తో పాటు కాస్త పట్టుదల కనిపిస్తుందిట - ఆ పట్టుదలని అనువాదకుడు "ఐడియా" అనే మాట తో ఆంగ్లం లోకి పట్టుకెళ్ళలేక పోయాడు. అందువల్ల అది తెలుగు లోకి రాలేదు. "వాదా" ప్రతిజ్ఞ కాకుండా ఉద్దేశ్యం అవ్వటానికి కూడా ఇదే కారణం కావచ్చు. (చచ్చిన) ఉద్దేశ్యానికి కన్నా చచ్చిన ప్రతిజ్ఞ కోసమే కవి మౌనం పాటించే వాడేమో - [ఈ చరణం రాజకీయమేమో అని అనిపించింది నాకు.]
    అలానే హింది లో "ఔర్" వల్ల మరియు అనే అర్ధమే స్పురించింది - ఆంగ్లం లో కూడా. మీరు "ఇంకా" అనటం వల్ల పదాల కన్నా గొప్పవైన ఉద్దేశ్యాలు అన్న అర్ధం వచ్చి చేరింది. ఉద్దేశ్యమో కాదో తెలియదు.

    మీరు ఇంకాస్త స్వతంత్రత తీసుకొని యుండవలసినది అని నా అభిప్రాయము.

    నేను కవినీ కాను, కత్తినీ కాను.
    నేను పండితుణ్ణీ కాను, విమర్శకుణ్ణీ కాను.
    ఒక పఠయితగా మీ అనువాద కవిత మీద నాకు తోచినది కొంచం చనువు తీసుకొని చెప్పానంతే.
    తప్పులుంటే - నొప్పిస్తే మన్నించండి.
    మీ కవితాశైలికి తగిన మాతృక ను ఎన్నుకోలేదెమో అని అనిపించింది.

    భవదీయుడు
    ఊకదంపుడు

    [దయ చేసి ఇది రంధ్రాన్వేషణ గా ఎంచవద్దు.]

    ReplyDelete
  6. ఊకదంపుడు గారికి
    అద్బుతమైన సమీక్ష చేసి తప్పులుంటే ..... అని అనటం బాగాలేదు.

    ఈ కవితను నేను రచయిత every thing is futile అని చెపుతున్నట్లు గా అన్వయం చేసుకొన్నాను. అందుకనే విజయాలనీ వైఫల్యాలనీ ఒకే గాటన కట్టేసి సంతాపం ప్రకటించేస్తున్నాడు కవి. ఇంకా గొప్ప అర్ధాలు మరొకరు చెప్పినా ఆశ్చర్యపోను.

    ఈ కవిగారి గురించి చిన్న ఇంట్రో ఈ లింకులో ఇచ్చాను.
    http://sahitheeyanam.blogspot.com/2010/02/blog-post_08.html

    మీరు చెపుతున్న డూబ్ పదం అర్ధం ఇప్పుడే చూసాను. మీ వాదన అంగీకరిస్తున్నాను.

    "దానికోసం" అన్న అనువాద వాక్యాలు చాలా కొట్టివేతల తరువాత ఖరారు చేసినవి. ఆ మొత్తం చరణాన్ని ను తెలుగు లో యధాతధంగా దించటానికి భయమేసింది కృతకంగా ఉంటుందేమోనని.

    పదాల్లో సొగసును కోల్పోతున్నా కనీసం రూపం లోనైనా కొంత అందాన్ని ఇవ్వటానికి చేసిన ప్రయత్నంగా భావించాను. (చెప్పినట్లుగా మెట్టు మెట్టు నిర్మాణం కోసం)

    ప్రతీ లో తీ కి దీర్ఘం ఎవ్రీ అన్న పదం కోసం వాడవలసి వచ్చింది.


    వాదా విషయంలో ప్రతిజ్ఞ పదం బాగుంటుంది.

    pl. you have every right to say anything..... because you are one whom i respect much sir.


    మరొక్కసారి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను మీ సమయాన్ని, మెదడును కేటాయించినందుకు.

    శ్రీ కేదార్ నాధ్ సింగ్ గారి కవితనొకదాన్ని కత్తి మహేష్ గారు అనువదించారు. ఇపుడు వీరి కవిత్వాన్ని మీరు కూడా రుచి చూసారు. అతనిని పరిచయం చేసిన (తెలుగు బ్లాగులకు) అనువాదకునిగా నాకు చాలా ఆనందంగా ఉంది.

    థాంక్యూ సర్

    భవదీయుడు
    బొల్లోజు బాబా

    ReplyDelete
  7. బొల్లోజు బాబా గారు,
    మీ స్పందనకు ధన్యవాదములు.
    >>
    ఆ మొత్తం చరణాన్ని ను తెలుగు లో యధాతధంగా దించటానికి భయమేసింది కృతకంగా ఉంటుందేమోనని.
    <<
    ఒప్పుకుంటాను.ఈ నాలుగు పంక్తులే అన్నిటికన్నా కష్టమైనవి.... 'తేలికైన' పదాలవటం చేత.
    ఇదే కారణం చేత.. ఆ పద నిర్మాణపు సొగసును క్రింది చరణం లో ప్రయోగించవలసినది.

    ఐనా .. మిగతా అనువాదకుల మాట ఏమో గానీ ....పద చిత్రాలు పుష్కలం గా ఉన్న మీకు చిత్రపదా(నిర్మాణ)లతో పని ఏముంది.
    గత వ్యాఖ్యలో మీరు మరికొంత స్వతంత్రత తీసుకొని ఉండాల్సినది అని అనటం లో నా ఉద్దేశ్యమదే.
    మీ కవితా శైలికి అన్న చోట ఈ లంకె ఇవ్వటనికి ప్రయత్నించాను, కానీ రాలేదు: http://sahitheeyanam.blogspot.com/2008/07/blog-post_21.html.
    ఇదే వస్తువు (every thing is futile) పై మీ స్వంత రచన ఐతే .. తొక్క వంటి పదము దొర్లకపోవచ్చునని నా గట్టి నమ్మకం.
    >>
    pl. you have every right to say anything..... because you are one whom i respect much sir.
    <<
    ధన్యుణ్ణి. ఆ గౌరవాన్ని నిలుపుకోవటానికి సదా ప్రయత్నిస్తాను.

    సవినయంగా,

    భవదీయుడు
    ఊకదంపుడు

    ReplyDelete
  8. బాబా గారు,

    ఆధునిక కవిత్వాన్ని అర్థం చేసుకోటానికి ప్రయత్నిస్తున్నాను.ఛందస్సు నియమాల గురించి కానీ,ఎక్కడ పదాలు,వాక్యాలు విరచాలో వివరంగా తెలిపే పుస్తకం ఏదైనా వుంటే చెప్పండి.చదివి తెలుసుకుంటాను.

    ReplyDelete