Monday, February 8, 2010

దేవుడు లేకుండానే!


శ్రీ కేదార్ నాధ్ సింగ్ (1934) ప్రముఖ ఆధునిక హిందీ కవి. వీరు రచించిన Akaal Mein Saras (Cranes in Drought) సాహిత్య అకాడమీ అవార్డు పొందింది. శ్రీ కేదార్ నాధ్ న్యూ ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లో హిందీ భాషా ప్రొఫసరుగా పనిచేసారు.

వీరి కవిత్వం సరళంగా ఉంటూనే లోతైన భావాల్ని కలిగి ఉంటుంది. ఈయన శైలి "బహుళ స్వరాలతో సంభాషణాయుతం" గా ఉంటుందని విమర్శకులు అంటారు.
రోజూ దర్శించే దైనందిక విషయాలే వీరి కవిత్వంలో గొప్ప నిగూఢార్ధంతో, ఒక నూతన దృష్టితో వర్ణింపబడుతూంటాయి.

స్థూలంగా చెప్పాలంటే్, శిల్పం పట్ల మక్కువ కలిగిన, ప్రయోగశీలి అయిన, ఒక మానవతావాద కవిగా శ్రీ కేదార్ నాథ్ సింగ్ గారిని చెప్పుకోవచ్చు.

శ్రీ కేదార్ నాథ్ సింగ్ రచించిన Even Without God కు స్వేచ్ఛానువాదం ఇది. మరికొన్ని వీరి కవితానువాదాలు మరోసారి........

దేవుడు లేకుండానే!

ఇదేమి వింత
ఉదయం పదికల్లా ఈ ప్రపంచం
తన పని తాను చేసుకుపోతోంది
దేవుడు లేకుండానే!

వాహనాలు నిండిపోయాయి
జనాలు తొందరలో ఉన్నారు
ఎప్పట్లానే.

భుజానికి సంచి తగిలించుకొన్న
తపాలావాలా రోజూలానే
తిరుగుతున్నాడు
దేవుడు లేకుండానే!

బ్యాంకులు వేళకే తెరవబడ్డాయి
గడ్డి పెరుగుతూనే ఉంది
అన్ని లెక్కలూ ఎంత క్లిష్టమైనవైనా
చివరకు ఓ కొలిక్కి వచ్చేస్తున్నాయి
జీవించాల్సిన వాళ్లు
జీవిస్తున్నారు
చనిపోవాల్సిన వాళ్లు
చనిపోతున్నారు
దేవుడు లేకుండానే!

ఇదేమి వింత
రైళ్లు ఆలస్యంగానో సమయానికో
ఏదో గమ్యానికి వెళ్లటమో రావటమో
జరిగిపోతూనే ఉంది
ఎన్నికలు జరుగుతున్నాయి
ఆకాశంలో విమానాలు ఎగురుతూనే ఉన్నాయి
దేవుడు లేకుండానే!

దేవుడు లేకుండానే!
గుర్రాల సకిలింపు కొనసాగుతూంది
సాగరంలో ఉప్పు ఇంకా తయారవుతూనే ఉంది
అటూ ఇటూ పిచ్చిగా తిరిగిన పిచ్చుక
చివరకు ఎలానో
తన గూటికి తిరిగి చేరుకొంటూంది
దేవుడు లేకుండానే!

దేవుడు లేకుండానే!
నా విషాదం మునుపెన్నడూ లేనంత
చిక్కబడుతూనే ఉంది
పది సంవత్సరాల నా పాత ప్రియురాలి కురులు
ఎన్నడూ లేనంత నల్లనైనాయి
ఇంటినుంచి బయటకెళ్లి తిరిగి చేరుకోవటం
ఇంకా వ్యామోహం గానే ఉంది ఎప్పట్లానే

ఇదేమి వింత
నీరు ప్రవహిస్తూనే ఉంది
ప్రవాహం మధ్యలో చేతులు చాపి
అలా నుంచునే ఉంది వంతెన
దేవుడు లేకుండానే!

మూలం: శ్రీ కేదార్ నాథ్ సింగ్ రచించిన Even Without God
బొల్లోజు బాబా

6 comments:

 1. ఇంతకీ ఇది నాస్తిక కవితా లేక ఆస్థిక కవితా?

  ఫణి

  ReplyDelete
 2. అర్ధం కాలేదు? :-(

  ReplyDelete
 3. కవిత, మీ అనువాదం రెండూ బాగున్నాయి.

  ఎక్కడచూసినా ఆంగ్ల అనువాదాలే దొరుకుతున్నాయి. దీని హిందీ మాతృక లింకు దొరికితే ఇక్కడ ప్రచురించండి ప్లీజ్.

  ReplyDelete
 4. అనానిమస్ గారూ
  అదే ఈ కవిత గొప్పతనంగా భావిస్తున్నాను.

  భావనగారూ
  అంతే నంటారా? :-(

  మినర్వా గారు
  థాంక్యూ
  హిందీ మరియు తెలుగు మాతృకల లింకు ఇది.


  http://india.poetryinternationalweb.org/piw_cms/cms/cms_module/index.php?obj_id=2877

  ఈ అనువాదంలో నేను ఎక్కువగా ఇంగ్లీషు అనువాదం పైనే ఆధార పడ్డాను. అక్కడక్కడా సరిచూసుకోవటానికి హిందీ వెర్షను ఉపయోగపడింది.

  బొల్లోజు బాబా

  ReplyDelete
 5. hi.
  read your translation like a butterfly in cocoon. it's smiling wings are black even without god.
  read your transmesmerism in telugu like a snake leaving its poison on moon even without god.
  reading your transother'sformations like tom and jerry going to the school even without god.
  nice one.

  ReplyDelete