Wednesday, February 10, 2010

పదాలు చలికి చచ్చిపోవు - శ్రీ కేదార్ నాధ్ సింగ్

పదాలు చలికి చచ్చిపోవు
ధైర్యం లోపించటం వల్ల చస్తాయంతే
పదాలు తడి కాలంలో
చెడిపోతాయి ఎక్కువగా

మా ఊరి ఏటిగట్టుపై
ఒకసారి నేనో పదాన్ని కలిసాను
మెరిసే ఎర్రపిట్టలా ఉందది
ఇంటికి తీసుకొచ్చాను
గుమ్మం వద్దకు చేరగానే
వింతైన బెదురు చూపులతో
నన్ను చూస్తూ చచ్చిపోయింది అది

అప్పటి నుంచీ పదాలంటే భయం నాకు
వాటి మధ్యకు వెళ్లినా వెంటనే వెనక్కు వచ్చేస్తాను
రంగు రంగుల దుస్తులు వేసుకొని
జుట్టు విరబోసుకున్న పదం నా వైపు రావటం చూస్తే
వెంటనే నా కనులు మూసేసు కొంటాను

నెమ్మది నెమ్మదిగా
ఈ ఆటను ఆనందించటం మొదలెట్టాను
నేనో రోజు గడ్డి మేటు కింద
పాములా నక్కిన ఓ అందమైన పదాన్ని
రాయితో గాయపర్చాను అకారణంగా

దాని చక్కని మెరిసే కళ్ళను
ఈ నాటికీ నేను మరచిపోలేదు

కాలం గడిచే కొద్దీ
నా భయం తగ్గసాగింది
ఈ రోజు పదాలు ఎదురైతే
కుశల ప్రశ్నలు వేసుకుంటాం

ఇపుడు నాకు
అవి దాక్కునే చోట్లెన్నో తెలిసాయి
వాటి వివిధ వర్ణాలు చాలామట్టుకు
నాకు పరిచితమయ్యాయి
సాదా పదాలు, గోధుమ చామనిచాయ రంగుల్లోను
విధ్వంశక పదాలు, లేత పసుపు పింక్ రంగుల్లోను
ఉంటాయని నేనిప్పుడు చెప్పగలను

విషాదకర, గంభీర సందర్భాలకోసం
మనం దాచుకొన్న పదాలు
వాటికుద్దేశింపబడిన సందర్భాలలో
చాలా జుగుప్స కలిగించే పదాలే కావటం
తరచూ జరిగేదే


బొత్తిగా పనికి రానివనీ
హీన వర్ణాలను తొడుక్కొన్నాయనీ
చెత్తలో పారేసిన పదాలే

నా ఆపత్కాలలో సహాయపడ్డాయన్న 
నిజాన్ని కనుగొన్నాను
ఇపుడేం చేయగలను నేను

నిన్నేం జరిగిందంటే
ఓ అరడజను సొగసైన పదాలు
చీకటి వీధిలో అకస్మాత్తుగా
నన్ను చుట్టు ముట్టాయి
భయమేసింది నాకు

మాటల్లేకుండా కొద్దిసేపు వాటిముందు
అలా నిలచుండి పోయాను, చమటతో తడుస్తో
తేరుకొని పరుగు ప్రారంభించాను
నా పాదాలు గాల్లోకి లేస్తుండగా
రక్తంలో తడిచిన ఓ చిన్నారి పదం
ఎక్కడినుంచో ఆయాసపడుతూ నన్ను చేరి
" రా, నేను నిన్ను ఇంటికి చేరుస్తాను" అంది.

మూలం: WORDS DON’T DIE OF COLD - KEDARNATH SINGH


భవదీయుడు
బొల్లోజు బాబా

8 comments:

 1. చాలా బాగుంది బాబా గారు. ప్రాణాలొచ్చిన పదాలు చేసే విన్యాసాలు అబ్బురంగా చూస్తున్నాను. నేనెన్ని సార్లు పదాలకు భయపడి పారి పోయానా అని ఆలోచిస్తే చాలా సార్లే వున్నట్లనిపించింది నిజానికి ప్రాణమొచ్చిన పదాలు అనునిత్యం నన్ను తరుముతూనే వుంటాయి... తోడుకని తెచ్హుకున్న పదాల సాయం తో తరిమి కొట్టినా అధిక శాతం నిరుపయోగకరమే అని తోచింది కవితలో అన్నట్లు. :-) మంచి అనువాదం.

  ReplyDelete
 2. బాబాగారు,

  చాలా బాగుంది! అనువాదంలా కాక అసలైన కవితలాగానే అనిపించింది. మంచి కవితకి మంచి అనువాదం.

  చిన్న అచ్చుతప్పు, "విధ్వంశక" కాదు "విధ్వంసక".

  ReplyDelete
 3. hi. coldness crept like a star in its womb. don't you feel that this is an abstract poem with more clarity. good choice in selecting a poem.

  ReplyDelete
 4. భలే గమ్మత్తుగా ఉంది. :) బాగుంది.

  ReplyDelete
 5. భావన గారికి
  థాంక్సండీ. కవితలో ఏదో తెలియని మెస్మరిజం ఉంది కదండీ.

  మహేష్ గారు
  థాంక్సండి

  కామేశ్వర రావు గారు

  నెనర్లు. స్పెల్లింగుల విషయంలో ఈ మధ్యేమీ దొరకటం లేదేమిటబ్బా అనుకొంటున్నాను. థాంక్యూ సార్ :-))

  నాయుడు గారు
  అవునా! ఇది అధివాస్తవిక కవితైనప్పటికీ పూర్తి మిస్టిక్ గా లేదు కదా?

  మోహన గారికి
  కేదార్ నాధ్ గారి కవితలలో మొదటగా చదివింది దీన్నే. completely flat అయిపోయానండీ.
  థాంక్యూ

  భవదీయుడు
  బొల్లోజు బాబా

  ReplyDelete
 6. marvellous poetry! బాబాజీ!
  నేటి కవితలకు అవసరమైన నియమావళి గా ఈ కవిత, నిల బడుతూన్నది.

  స్వతంత్ర రచనల కన్నా, అనువాదాలు చాలా కష్టము, క్లిష్ట తరమైనవీ, అని నా వ్యక్తిగత అభిప్రాయం.
  మీ కలం ఈ దిశలో అద్భుతమైన కావ్య సేద్యము చేస్తున్నదండీ!
  మీ కృషికి ధన్య వాదాలు!
  (కాదంబరి)

  ReplyDelete
 7. చాలా బావుందండి, కవిత, మీ అనువాదం.

  ReplyDelete