Thursday, October 22, 2009

రాత్రి ఉత్సవం


వేకువ, ఆకాశం, పక్షులు, తరువులూ
వెలుగుని బంతిగా చేసి
ఒకదానికొకటి అందించుకొంటున్నాయి.
రాత్రి ఆటగాడు కాచ్ పట్టటంతో
ఆనాటి పగటి ఆట ముగిసింది.

రాత్రి ఉత్సవానికి తెరలేచింది.

ఎగిరే సాయింత్రపు పక్షులు
తమ ముక్కులతో చేసిన
ఆకాశపు చీలికల్లోంచి
స్వర్లోకపు ధూళి వెన్నెలై రాలుతోంది.

నల్లరాయి మెరిపించే లోహపలుకుల్లా
తారలు మినుకు మినుకు మంటున్నాయి.

కలలు, పలవరింతలు, నిశాచరుల సందడులు
రాతిపూల మాలలు ధరించి
మౌన వేణువులూదుకుంటో
ఉదయంలోకి ప్రవహిస్తున్నాయి.

బొల్లోజు బాబా

16 comments:

  1. రాత్రి ఉత్సవం కవిత బాగుంది..

    ReplyDelete
  2. బాబా గారూ !
    ఈ ప్రవాహం అనంతం. మీ కవిత బాగుందండీ !!

    ReplyDelete
  3. ప్రకృతి మీ కవితతో మరింత అందాన్ని సంతరించుకున్నట్టుందండీ !

    ReplyDelete
  4. భలే రేయింబవళ్ళ చెడుగుడాటలు!!!!

    ReplyDelete
  5. ఎగిరే సాయింత్రపు పక్షులు
    తమ ముక్కులతో చేసిన
    ఆకాశపు చీలికల్లోంచి
    స్వర్లోకపు ధూళి వెన్నెలై రాలుతోంది.

    అద్భుతం సార్, మీ అంతర్నేత్ర దృశ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ధన్యవాదాలు.

    ReplyDelete
  6. నాగరాజుగారికి, రావు గారికి, ఉషగారికి, కుమార్ గారికి ధన్యవాదములు

    ఉషగారూ
    ఈ కవితకు పేరు పెట్టలేక చాలా రోజులు అలా పోస్ట్ చేయలేదు. మీ కామెంటును బట్టి దీనికి దినోత్సవం అని పెట్టి ఉంటే బాగుంటుందనిపిస్తుంది.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  7. ఎగిరే సాయింత్రపు పక్షులు
    తమ ముక్కులతో చేసిన
    ఆకాశపు చీలికల్లోంచి
    స్వర్లోకపు ధూళి వెన్నెలై రాలుతోంది.

    ee lines super andi ilanTi prayogaalaku meeku meere saati.....

    ReplyDelete
  8. బాగున్నాయండి రాత్రి వుత్సవాలలో మెరిసిన వుదయపు వేకువలు..

    ReplyDelete
  9. బాబా గారూ. బాగా రాశారు ఎప్పుడూ లాగె.

    రాతి పూల మాలలు అర్థం కాలెదు. అది రాత్రి పూల కాదు కదా.

    స్వర్లోకపు అంటే స్వర లొకపు అనా?? ఈ ప్రయోగం వినలేదు ఎప్పుడూ . కొత్తగా ఉంది.

    నాకు మొదటి పాదం కంటే మిగతావి బాగా నచ్చాయి

    ReplyDelete
  10. వాసు గారు
    థాంక్యూ మంచి విషయాన్ని పట్టుకొన్నారు.

    రాతి పూలు: నేను ఉద్దేశించినది. రాత్రి వికసించే పూలు అని. అలా అనుకోవటానికి కారణం: కృశా; గారి ఈ గీతం

    రాలు పూల తేనియకై రాతిపూల తుమ్మెదనై.

    మీరు ఎత్తిచూపాక నేతెలుసుకొన్నది.

    రాతిపూలు అంటే గట్టిగా ఉండే సముద్రప్రవాళ పుష్పాలు. corals.

    బహుసా అదే అర్ధంలో కృశాగారు ఉపయోగించారు తప్ప రాత్రి వికసించే పూలు కాదేమోనని అనిపిస్తుంది. కనుక ఆ ప్రయోగం తప్పు. రాతిరి పూల అని ఉండాలి. లేదూ చీకటి పూల అని కానీ.

    రాతిపూలు అని ఉంచేసినా తప్పుకాదు కానీ, అన్వయం గందరగోళమవుతుంది. కదూ?


    స్వర్లోకము అంటే మేఘాలపైన ఉండే లోకం.

    ఈ క్రింది లింకులో కొంత సమాచారమ్ స్వర్లోకం గురించి చూడవచ్చు.
    http://krishnasree.blogspot.com/2009_08_01_archive.html

    మొదటి పాదం మిస్ ప్లేస్ అయినట్టే నాకూ అనిపిస్తుంది. :-)

    థాంక్యూ for correcting

    kaarthik gaaru, bhaavana gaaru thaaMks aMDI

    bollojubaba

    ReplyDelete
  11. బాబా గారు
    కవిత చాలా బాగుందండి,
    మీరీమధ్య అరుదుగా రాస్తూన్నారు.
    మొదటి స్టాంజాలో...
    వేకువ పదఅర్ధం,పద సంబంధమూ అర్ధం కాకుండా ఉంది.
    వివరించగలరు.

    ReplyDelete
  12. శ్రీనిక గారికి
    వేకువ అంటే ఉదయం అనే అర్ధంలో వాడానండీ. ఈ లైను కి ప్రేరణ ఇస్మాయిల్ గారి ఈ వాక్యాలు

    ఉదయాలు అనాది నుంచీ సూర్య శిశువును ఎన్నివిధాలుగా ఎగరేసి పట్టుకొన్నాయో/

    ఆ భావనే హృద్యంగా అనిపించి కొత్తగా కొనసాగించాను. అంతే

    ఇకపోతే ఆ మొత్తం స్టాంజా మిస్ ఫిట్ అయినట్టు తెలిసిపోయింది. థాంక్యూ మేడమ్.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  13. ఏమీ అనుకోరనుకోండి. అయినా సారీ.. గందరగోళం తప్ప కవిత్వం ఎక్కడా లేద్సార్. చివరికి ఇస్మాయిల్ కవిత్వాన్ని కూడా అనువదిస్తున్నారన్న మాట (మొదటి ఖండికలో)! మీ రాతిపూల వివరణ కూడా ఇది గందరగోళమనే నా అభిప్రాయాన్ని బలపరుస్తున్నది.

    కొద్దో గొప్పో బాగున్నాయనుకున్న వాక్యాలు కూడా మరోసారి చదివితే పేలవంగా ఉన్నాయి.

    ఎగిరే సాయంత్రపు పక్షులు (అంటే, ఉదయం పక్షులు, మధ్యాహ్నం పక్షులు కూడా ఉంటాయంటారా?)

    ఎవరి ముక్కులతో చీలికలు చేసాయో అనుమానం లేకుండా "తమ ముక్కులతో" అనే వివరణ!

    మీరు పెన్ను సరిగ్గా విదిలించి వ్రాయాలని ఓ మనవి.

    ReplyDelete
  14. సాయి కిరణ్ గారికి
    :-)

    ఒక్కోసారి అంతే. ఏం చేయలేను.

    మరో మాట "evening birds" అని గూగిల్లితే లక్షా ఎనభై ఆరు వేల ఎంట్రీలు దొరికాయి. తెలుగులో అయితే ఇలా ఈకలు పీకేస్తున్నారు. :-)
    బొల్లోజు బాబా

    ReplyDelete
  15. థాంక్స్ బాబా గారు. నాకు కొన్ని కొత్త విషయాలు చెప్పారు. మీరు ఇచ్చిన లంకె బావుంది. రాతి పూల (Corals అని అర్థం తెలిసాకా) కుదరదనిపించింది.

    ReplyDelete