Thursday, October 1, 2009

ఇస్మాయిల్ కవిత్వం, కాసిన్ని జ్ఞాపకాలు, కొన్ని ఫొటోలు



అప్పుడు నేను పి.జి. విద్యార్ధిని. కవిత్వం అంటే తిలక్, ఇస్మాయిల్, శిఖామణి, చలం అని అనుకొనే రోజులవి. అప్పటికి అచ్చయిన నా కొన్ని కవితలనుఇస్మాయిల్ గారికి చూపించాలని నా తాపత్రయం. మిత్రుని ద్వారా ఓ రోజు ఆయనకు పరిచయం చేయించుకొన్నాను. పసుపుపచ్చని దేహచ్ఛాయ, ఎత్తైన విగ్రహం, సన్నని స్వరం, రంగులు చిమ్మే సాదా దుస్తులతో ఆయనను చూడగానే కవిత్వంతో నిండిన గౌరవం కలిగింది. కుశలప్రశ్నలయ్యాకా నా కవితల గురించి ఆయనన్న మాటలు ఇప్పటికీ నాకు గుర్తే. “నీ కవిత్వంలో స్పార్క్ ఉంది. ఆవేశాన్ని పదాలలోకి ఒంపేప్పుడు తేలికైన పదాల్ని ఎంచుకోవాలి. భావాన్ని మరింత క్లుప్తంగా చెప్పగలగాలి” అన్నారు. ఇది జరిగి సుమారు పదిహేను సంవత్సరాలు అయ్యింది. ఇప్పటిదాకా వ్రాసిన నా కవితలను తరచి చూసుకొంటే క్లుప్తత, పదాల ఎంపిక విషయంలో ఆయన పరిశీలన ఎంతటి సూక్ష్మమో తెలుస్తూంటుంది.

Your browser may not support display of this image.
Your browser may not support display of this image.
Your browser may not support display of this image.
Your browser may not support display of this image.
Your browser may not support display of this image.
  • ఎందుకు బతకాలి అన్న ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం నాకిప్పటికీ గుర్తుంది. స్టాఫ్ రూం కిటికీ లోంచి బయటకు చూస్తూ “ఎండ వెచ్చగా ఉంది, పచ్చిక పచ్చగా ఉంది – ఇక్కడింత హాయిగా ఉంటే, బతక టానికేమయ్యిందయ్యా నీకు? అన్నారు. – విన్నకోట రవిశంకర్
Your browser may not support display of this image.
  • ఎనభైయవ దశకంలో కాకినాడలో నెల నెలా వెన్నెల పేరుతో జరిగే సాహితీసమావేశాలకు ఇస్మాయిల్ వచ్చేవారు. సమావేశమంతా అన్ని గంటలూ మౌనంగా ఉండే ఆయన, మధ్యలో జేబులోంచి ఒక తెల్లటి కాగితం మడత విప్పి ఒక కవిత చదివి వినిపించేవారు. ఆ కవితను రెండవ సారి కూడా చదివేవారు కాదు. ఆ సభలో ఆయన పార్టిసిపేషను అంతే. కానీ చివరిదాకా అలా అందరి కబుర్లనూ ఆస్వాదిస్తూ ఉండేవారు. – వాడ్రేవు వీర లక్ష్మీ దేవి
  • చాలా ఏళ్ల క్రితం నేను కాకినాడ వెళ్లినప్పుడు రోజల్లా విడుపు లేకుండా మాట్లాడుకున్న గంటలు, ఆయన నామీద చూపించిన ఆప్యాయత, వీధరుగు మీద విశ్రాంతిగా కూర్చుని తిరగేసిన పుస్తకాలు, ఆయనా, వాళ్లావిడ మాకిచ్చిన ఆతిథ్యం నాకిప్పటికీ గుర్తొస్తాయి. అన్ని గంటలసేపు ఆయనతో మాట్లాడినా ఆయన తన కవిత్వాన్ని గురించి ఏమీ చెప్పలేదు. చదివి వినిపించలేదు. వాటన్నిటికన్నా కూడా ఇప్పటికీ నన్ను పట్టుకొనేది ఆయన పద్యాల్లోని నిశ్శబ్దమే. --- వెల్చేరు నారాయణరావు

  • ఇస్మాయిల్ గారిని ఒక ప్రశ్న అడిగారు “ఒక మైనారిటీ మతస్తునిగా సమాజంలో సాహిత్య రంగంలో మీ అనుభవమేమిటి” అని. దానికి ఇస్మాయిల్ గారి సమాధానం
  • ఇస్మాయిల్ కవిగారి స్నానం గురించి – ఆ వ్రతవిధానం కనీసంగా ఒక గంటన్నర పడుతుంది. ... సెంట్లు పౌడర్లు స్నోలు అద్దుకుని ధౌత వస్త్రాలతో కడిగిన ముత్యంలా ఈయన గది బయటికొచ్చేవారు. --- సి. ధర్మారావు.

  • రేడియో కవి సమ్మేళనంలో కవులంతా కొత్త సంవత్సరం మీద ఊగిపోతూ పద్యాలు చదివితే, ఈయన మాత్రం తాపీగా పదేళ్ల క్రితం వచ్చిన తన పాత పుస్తకాల నుంచి కవితలు వినిపించటం లాంటిది కూడా ఆయనకే చెల్లింది (ఉగాది మీద పద్యాలు రాయటమేమిటి?) -- విన్నకోట రవిశంకర్
Your browser may not support display of this image.
  • ఇస్మాయిల్ కుటుంబం ఆ ఇంట్లోకి మారి మూడే రోజులైంది. ఇంకా సామాన్లు సర్దుకోలేదు. మాకు చాయ్ ఇవ్వాలని ఆయన తాపత్రయం. పాలకోసం వాళ్లబ్బాయి వెళ్లాడు. ఆయన మమ్మల్ని చూసి ప్రసన్నవదనుడైనా, ఆ పొరల వెనుక ఏదో వేదన లాంటిది కనిపించింది. అనారోగ్యంగా ఉన్నా, వద్దన్నా కారు దాకా వచ్చారు. మళ్లీ ఎప్పుడు చూస్తామో ఆయన్ని అనిపించింది. మరో వారంరోజుల్లోనే చూడలేని లోకాలకు వెళ్లిపోతారనుకోలేదు. -- డా. ఎన్. గోపి
  • ఇస్మాయిల్ గార్ని తలుచుకోగానే తక్షణం గుర్తొచ్చేవి ఆయన ఆకుపచ్చ అక్షరాలే. శిధిల నేత్రాలు అనే నా కవిత అచ్చులో చూసి “ఇది తెలుగు పద్యంలా లేదు” అంటూ మెచ్చుకుంటూ రాశారాయన. – అఫ్సర్

  • ఆయన చిన్నతమ్ముడు వజీర్ రెహ్మాన్, నలుగురు అన్నదమ్ముల్లో ఆఖరివాడు మరణించిన కొంతకాలానికి ఆయన మూడో తమ్ముడు చనిపోయారు. అప్పుడు ఇస్మాయిల్ గారు ఉత్తరం రాస్తూ “ఈ వరస కింది నుంచి మొదలైనట్టుంది. మనకి ఆట్టే దూరం లేదు” అన్నారు. అన్నట్టుగానే అదే వరుసలో మరణాలు జరిగాయి –స్మైల్

  • ప్రజాతంత్రలో నా విస్మృతి కవిత అచ్చుకాగానే కవిత నచ్చిందని చెపుతూ రాసిన ఉత్తరంతో పాటు ఇంకెక్కడా ఖాళీ దొరకనట్టు అనంతపురం వెళ్లారేమిటి? అక్కడసలే గాడిదలు ఎక్కువ అంటూ ఓ చెణుకు. ఇస్మాయిల్ గారు అనంతపురం కాలేజీలో పనిచేసారు – కల్పనా రెంటాల

  • పతంజలి శాస్త్రి కి ఇస్మాయిల్ గారు తమ కుమారుని పెళ్ళికి ఆహ్వానిస్తూ వ్రాసిన ఉత్తరం ధర్మపత్ని సమేత: ఇస్మాయిల్ కవి: స్వపుత్రస్య పరిణయ మహోత్సవం....... అంటూ సరదాగా సంస్కృతంలో సాగుతుంది.

  • ఆయన నాకు రాసిన కార్డు (26-10-2003) ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన పడ్తున్నట్టు అనిపించింది. నా ఆరోగ్యం కూడా నన్ను మర్చిపోయింది. చాలా జబ్బుపడ్డాను అని – యాకూబ్

  • మేం (ఉభయులం) స్వేచ్ఛా భావుకులం, అభయులం, నిత్యబాలలం, నిత్యసంతోషులం, మాకులం విమల విశ్వశాంతి కులం, మంచి జీవన శిల్పులం, నాకు ఇస్మాయిల్ అంటే ఇష్టమంత ఇష్టం -- పి.వి. నరసింహారావు

  • అతని ప్రతికవితలోను ఒక మనోహరత్వాన్ని, ఒక హృదయరంజకత్వాన్ని అనుభవించాకనే నేను ఆయన మొదటి కావ్యాన్ని ప్రచురించాను - సోమసుందర్

  • తనకు పోటీగా ఎన్ని ప్రబల కవి సిద్దాంతాలు ఉన్నా, తనదైన వాదాన్ని కడదాకా నిలిపిన గొప్ప కవి, కవిత్వాన్ని మానవతా ప్రబోధ సాధనంగా మహోన్నత శిఖరాలపై నిలిపాడు ఇస్మాయిల్ -- సి.నా.రె.

  • సాదీ మహాకవి ఒక మాటంటాడు " జ్ఞానవంతులకు పచ్చని చెట్టులోని ఒక్కొక్క ఆకు ఒకో దివ్యజ్ఞాన ప్రపంచంలాగ కనిపిస్తుందని" , నిజంగా మాటలకు నూటికి నూరు పాళ్లూ సరిపోయే తెలుగు కవి ఇస్మాయిల్ మాత్రమే -- శిఖామణి
Your browser may not support display of this image.
  • ఒక రుషిలాగ, సూఫీ కవిలాగ, ఒక హైకూగా ఇస్మాయిల్ బతికాడు. తెలుగు భాష ఉన్నంత వరకు సాహిత్య చరిత్ర పుటల మీద పచ్చని సంతకంలా ఇస్మాయిల్ పది కాలాలు పదిలంగా ఉంటాడు - ఎండ్లూరి సుధాకర్

  • ఈయన సదా బాలకుడిగా లోకాన్ని చూసాడు, నిత్య నూతనుడిలా జీవించాడు -- స్మైల్
  • వెయ్యి సంవత్సరాల సాహిత్య జీవితంలో తెలుగులో ఇలాంటి కవి మరొకరు లేరు - వేల్చేరు నారాయణరావు
  • ఇస్మాయిల్ ఎందుకు విశిష్టకవి అయ్యారంటే, ఏ వ్యాసం ద్వారానో, విస్తృతమైన నవలద్వారానో, కధ ద్వారానో, వార్తా కధనం ద్వారానో చెప్పదగిన ఆవేశకావేషాలను, సిద్దాంత చర్చలను, ఒక నిలువెత్తు పద్యంలా పోతపొయ్యటానికి ఆయనెప్పుడూ ప్రయత్నించలేదు – ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

  • నేను పెద్ద సాహిత్య విమర్శకుడిని కాదు కాని, శ్రీశ్రీ తర్వాత తెలుగు కవిత్వాన్ని మరో మలుపు దాటించిన వాడు ఇస్మాయిల్ అని నేను గట్టిగా నమ్ముతాను -- సి. ధర్మారావు.

  • సాదా సీదాగా ఉండే ఇస్మాయిల్ కవిత్వానికి అంతశక్తి ఎక్కణ్ణించి వచ్చిందంటే ’నిబద్దత లేకపోవడమే ఆయన కవిత్వ శక్తికి కారణం” అని ఆయన (అఫ్సర్ తండ్రిగారు) లెనిన్ అన్నమాటని గుర్తుచేసేవారు -- అఫ్సర్

  • క్షణక్షణం మనల్ని ప్రత్యక్షంగా తాకే అనుభవాలూ, వాటి స్పందనలూ, జీవితాన్ని జీవనపాత్రంగా మార్చే అనంతమైన అనుభూతులూ, ఇవి కాక కవిత్వానికేవీ అర్హం?
Your browser may not support display of this image.
  • అనుభూతి ఎప్పుడూ వైయక్తికమే. అనుభవ వస్తువు ఒకటైనా, ఎవరి అనుభూతి వారిది. అది ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. ఒకరి అనుభూతిలా మరొకరి అనుభూతి ఉండదు. ఈ నవనవోన్మేషమైన అనుభూతిని ఆవిష్కరించటమే కవి కర్తవ్యం
  • కవి అనుభవాల్ని తనలో ఇంకించుకుని, అంతర్దర్శి ఐననాడే మంచి కవిత్వం జనిస్తుంది.
  • అనుభూతులు శబ్ద ప్రపంచానికి చెందినవి కావు. ఈ నిశ్శబ్దాన్ని శబ్దంలోకి ప్రవేశపెట్టటమే కవిత్వం విశిష్ట లక్షణం. కవిత్వానికి శబ్దమెంత ముఖ్యమోనిశ్శబ్దం కూడా అంతే.
  • పదచిత్రమనేది ఐంద్రియకం (sensuous). ఇంద్రియ జ్ఞానాన్ని ప్రేరేపిస్తుంది. హేతుబుద్ధికి సంబంధించింది కాదు. లోతైన అనుభూతుల్నీ(feelings), భావాల్నీ(emotions) ఆవాహించే శక్తి పదచిత్రానికుంది.
  • లేబిల్స్ ఉపయోగించడం నాకిష్టం లేదు. అందుకనే నా కవిత్వానికి పేరు పెట్టనీయలేదు

  • ప్రస్తుతం తయారవుతున్న కవిత్వాన్ని రెండు రకాలుగా విశాలంగా వర్గీకరించవచ్చు ననుకుంటాను. poetry of ideas (అభిప్రాయ కవిత్వం), poetry of experience (అనుభవ కవిత్వం).

  • మినీ కవిత్వం రాస్తున్న యువకవులు చమత్కారమే కవిత్వం అనుకుంటున్నారు. చమత్కారం వేరు, కవిత్వం వేరు.
  • కవిత్వం వల్ల కొంపలు కాల్తాయి. విప్లవాలు వస్తాయి అని మీరనుకున్నట్టయితే నిరాశ కోసం సిద్ధపడండి. అది చేసే పనల్లా చదువరి మనస్సులో దీపం వెలిగించడమే. దీని వల్ల అతని అవగాహన పరిధి విస్తరిస్తుంది. తన మనస్సులో వెలిగిన దీపం వెలుతురు తన దారి తను వెతుక్కోవడానికి సహాయపడుతుంది. ఫలానా దారినే నడవమని ఒకరు చెబితే వినడు మనిషి. అది తనకు తోచాలి. తన దారేదో తను నిర్ణయించుకోవాలి. ఈ నిర్ణయానికి కవిత్వం తోడ్పడుతుంది.
  • బ్రహ్మాండం బద్దలయ్యే సంఘటనలకి బ్రహ్మాండం బద్ధలయే కవిత్వం పుడ్తుందని ఆశించడం అమాయకత్వం.
Your browser may not support display of this image.
  • ప్రతిదేశంలోనూ అభ్యుదయం పేరనో, విప్లవం పేరనో రచయితల సంఘాలు ఏర్పరచి, రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడని సాహిత్యం పనికిమాలినదని యువ రచయితలకు నూరి పోసి వాళ్ల చేత నినాద ప్రాయమైన శుష్కరచనలు రాయించి పార్టీ ప్రచారం చేయించుకొంటున్నారు. సాహిత్యంలో రాజకీయ కాలుష్యాన్ని మొదట్నించీ ఎదిరిస్తూ వచ్చాను. కమ్యూనిష్టు ప్రభావం వల్ల ఎంతో మంది యువరచయితలు, జబ్బుపడి సాహిత్యపరంగా శవ ప్రాయులయ్యారు. ఆ అకవిత్వ కల్మషం దేశమంతా అలముకొంది. ఈ వెల్లువ ఇంకా తగ్గినట్టు లేదు. దీనికి వ్యతిరిక్తంగా, అంటే సాహిత్యంలో స్వేచ్ఛకోసమూ, రచయితల వ్యక్తి ప్రాధాన్యాన్ని ఉగ్గడిస్తూనూ, నలభైయ్యేళ్ల బట్టి పోరు సాగిస్తున్నాను.
Your browser may not support display of this image.
  • కవిత్వం హృదయ సంబంధి. ఆలోచనా వ్యవస్థ బుద్ధికి సంబంధించినది. కవిత్వాన్ని బుద్ధి (Reason) శాసించలేదు.దాని సామ్రాజ్యమే వేరు.
  • కవిత్వమనేది కవి సంపూర్ణ అస్తిత్వంలోంచి ఉద్భవిస్తుంది. నేను బ్రాహ్మణుణ్ణి లేదా దళితుడిని అని జీవితాన్ని కుంచింపజేసుకున్నవాడు కవిత్వమేం రాయగలడు?
  • జీవిత మహోత్సవంలోని అద్భుతాన్ని ఆవిష్కరించడమే కవిత్వం పని. ఈ విధంగా మన చేతనని సుసంపన్నం చేస్తుంది కవిత్వం.

Your browser may not support display of this image.
Your browser may not support display of this image.
  • 1989లో ఇస్మాయిల్ గారి షష్టిపూర్తి, రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ శ్రీమతి కుముద్ బెన్ జోషి గారి చేతులమీదుగా జరగటం ఒక గొప్ప విశేషం.
  • 1999 లో కళాసాగర్ వారి విశిష్ట పురస్కారాన్ని అందుకొన్నారు
  • 15-6-2003 హైదరాబాద్, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో “చెట్టంత కవికి పిట్టంత సత్కారం” పేరిట ఇస్మాయిల్ అభినందన సభ జరిగింది.
  • కవిత్వంలో నిశ్శబ్దం అన్న సాహిత్య వ్యాసాలకు తెలుగు విశ్వవిద్యాలయం వారు అవార్డు నిచ్చారు.

Your browser may not support display of this image.
  1. Md. రెహ్మాన్ లెక్చరర్, కాకినాడ (ఇస్మాయిల్ గారి బంధువు)
  1. అంతర్జాలంలో పైన ఉటంకింపబడిన లింకులలోని ఇస్మాయిల్ గారి వివిధ రచనలు
  1. సలాం ఇస్మాయిల్ – వ్యాస సంపుటి
  1. Tribute to Ismail –DVD by Indraganti’s Family

చాలా కాలం కవిత్వానికి దూరంగా ఉండటం వలన, ఆయనను కలుసుకోవటం అదే మొదలు మరియు చివరు అయ్యింది నాకు. ఇదిగో ఇప్పటికి మరలా ఇలా........
ఇస్మాయిల్
ఇస్మాయిల్ గారు 26 మే, 1928 న జన్మించారు. వీరు కాకినాడ పి.ఆర్. కళాశాలలో ఫిలాసఫీ లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా పని చేసారు. 25 నవంబర్, 2003 న ఆయన అనంత నిశ్శబ్దం లోకి జారిపోయారు.
కవిగా, విమర్శకునిగా ఇస్మాయిల్ గారు పోషించిన పాత్ర తెలుగు సాహితీవనంలో నిలువెత్తు పొగడచెట్టై పరిమళాలు చిందిస్తూనే ఉంటుంది. ఆయన రచించినవి పదిపుస్తకాలే కావొచ్చు, అన్నీ కలిపి ఓ మూడు, నాలుగొందల పేజీల సారస్వతమే అవ్వొచ్చు, కానీ వాటి ముద్ర మాత్రం తెలుగు సాహిత్యంపై ఏ నాటికీ చెరగనిది.
ఇస్మాయిల్ కవిత్వం
ఇస్మాయిల్ గారనగానే రెండు విషయాలు చాలామంది స్మరణకు వస్తాయి. మొదటిది “’చెట్టు నా ఆదర్శం అన్న ఇస్మాయిల్, రెండవది ఆయన ఆంధ్రదేశానికిపరిచయం చేసిన హైకూ. ఇస్మాయిల్ కవిత్వ భాష విశిష్టమైనది. క్లిష్టపదాలు, పొడుగు వాక్యాలు ఉండవు. ఛందస్సులు, లయ శయ్యల వంటివి కనపడవు. అయినప్పటికి ఈయన కవిత్వం ఒక అనుభూతిని పదచిత్రాల ద్వారా పఠితకు ప్రసారం చేసి అతనూ అనుభూతి చెందేలా చేస్తుంది, అదీ ఎంతో నిశ్శబ్దం గా.
సౌందర్యారాధన, మానవత్వంపై విశ్వాసం, స్వేచ్ఛాశీలత, ప్రకృతి ఉపాసన ఆయన కవిత్వానికి కాన్వాసు. మన దైనందిక విషయాలను, చిన్న చిన్న అనుభవాల్నీ, అపుడపుడూ ప్రకృతి కరుణించే సుందర దృశ్యాలకు, కరుణ తాత్వికలను అద్ది కవిత్వంగా మలచి మనకందించారు. ఇస్మాయిల్ కవిత్వంలో ఇజాలు, వాదనల వంటి శృంఖలాలు కనిపించవు. కేవలం కవిత్వం మాత్రమే వినిపిస్తూంటుంది. జీవితోత్సవాన్ని ఎన్నికోణాల్లో ఆనందించవచ్చో అన్ని కోణాల్నీ ఆయన తన కవిత్వంలో ఆవిష్కరించారు. అందుకనే ఇస్మాయిల్ గారి పుస్తకాలను వరుసగా చదువుతున్నపుడు ఇతివృత్త సంబంధమైన మొనాటనీకనిపించదు.
ఆయన కవిత్వంలో పదచిత్రాల సౌందర్యం పరిమళిస్తూంటుంది. పదచిత్రాల్ని ఎవరైనా కల్పన చేయగలరు. కానీ ఒక దృశ్యాన్ని నలుగురూ చూసే దృష్టితో కాక కొత్తగా దర్శించి దాన్ని పదచిత్రంగా మలచటం ఇస్మాయిల్ గారికే చెల్లింది. ఒక్కోసారి ఈయన “ఇలా ఎలా” చూడగలిగారబ్బా అని విస్మయంతో ఆశ్చర్యపడక తప్పదు. ఈ క్రింది ఉదాహరణలను చూస్తే అర్ధం అవుతుంది ఆయన విలక్షణ వీక్షణం.
ఎక్కడెక్కణ్ణించో ఎగిరి వచ్చిన కాకులు చింతచెట్టులో నల్లగా అస్తమిస్తాయి /
ప్రణయక్రీడలో మన అంగాల పాచికల్ని మహోద్రేకంతో విసిరి నక్షత్రాల పావుల్ని రాత్రల్లా నడిపించాం గుర్తుందా! /
కిటికీలోంచి చూస్తే వెలుతురునిండిన బెజ్జాలతో పిల్లం గోవిలా ఊళవేసుకుంటూ దూసుకుపోతోంది రైలు /
తొలిసంజె నారింజని ఎవరు ఒలిచేరు, తెలిఎండ తొనలను ఎవరు పంచారు /
ఊగుతోంది వేయి పిర్రల సముద్రం /
మూగిన బంధుమిత్రులు మోసుకుపోయి అతణ్ణి విత్తనంలా పాతారు /
భూమి బుగ్గపై చల్లటి నవ్వు సొట్టలా బావి /
ఉదయాలు అనాది నుంచీ సూర్య శిశువును ఎన్నివిధాలుగా ఎగరేసి పట్టుకొన్నాయో/
నీడల విసనకర్రను విప్పి ఎండలో సేదదీరుస్తుంది చెట్టు ----- ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన
కవితలనన్నీ టైప్ చెయ్యవలసి ఉంటుంది. ఎన్ని పదచిత్రాలు, ఎన్నెన్ని సునిశిత దృశ్యాలు.
బుద్దిగా ప్రేమించుకోక
యుద్దమెందుకు చేస్తారో
నాకర్ధం కాదు.
పై వాక్యాల సారాంసమే ఇస్మాయిల్ కవిత్వమూ, జీవితమూను. జీవితానందాల్ని గానం చేసే కవికి, వానిని పాడుచేసే మనుష్యులను చూస్తే ఇలాకాక వేరెలా అనిపిస్తుందీ!
తనని బాధిస్తున్న ప్రపంచపు ముల్లుని
పీకి పారేసి
ఈ పిల్ల చకచక ఎటో నడిచిపోయింది (ఆత్మహత్య)
ఆత్మహత్యకు ఎంత అద్బుత నిర్వచనం. ఈ గుప్పెడు వాక్యాలలో, ఒక అమ్మాయి జీవితంలో ఓడి పోవటం, తద్వారా ఎదుర్కోవలసి వచ్చిన సామాజిక వివక్ష, నిత్యం ముల్లై బాధించిన ఈ ప్రపంచాన్ని ఇక ఏమాత్రమూ తప్పించుకోలేని దోషిగా నిలబెట్ట టమూ – ఎంతగొప్పగా ఇమిడి పోయాయి.
సెలయేరా సెలయేరా
గలగలమంటో నిత్యం
ఎలా పాడ గలుగుతున్నావు?
చూడు, నా బతుకునిండా రాళ్లు
పాడకుంటే ఎలా?
జీవితంలోని కష్టాలను కప్పిపుచ్చు కొని ఆనందంగా ఉండక తప్పదు అని ప్రవచించే ఈ కవితే ఇస్మాయిల్ గారి జీవితాదర్శం. ఆయనకు ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా చిరు నవ్వు ను, సంతృప్తిని వీడ లేదంటారు సన్నిహితులు. అందుకేనేమో ఓ కవితలో ఇలా అన్నారు.
నేను డబ్బు సంపాదించలేదని
మా ఆవిడ సణుగుతుంది.
డబ్బెందుకు?
కిటికీ లోంచి వాలి టేబుల్ పై పుస్తకాన్ని, పెన్నుని
ఇంకు స్టాండుని మంత్రించే సూర్యకిరణం ఖరీదెంత!
ఎంత డబ్బు పెడితే దొరుకుతుంది.
సూర్యకిరణాలు, చంద మామలు, సాయింత్రపు కలువలూ, పక్షుల కిలకిలలు, నదిలోనీడలు, గదిలో కాంతులు, ఆకాశపు దీపాలు, ఇవీ ఇస్మాయిల్ కవితాలోకపు డబ్బులు. వారి సతీమణిని మరో కవితలో వర్ణించిన తీరు చాలా హృద్యంగా ఉంటుంది.
మా ఆవిడ ఒక చేత్తో ఆకాశాన్ని ఎత్తిపట్టుకొంటుంది
ఒక చేత్తో భూమిని బుజ్జగిస్తుంది.
ఒక పిట్టచేత్తో కన్నీటి బీజాల్ని ఏరుకుంటుంది.
ఒక సెలయేటి చేత్తో బండల్ని నిమిరి ఓదారుస్తుంది......
నా ఇల్లు, నా సంసారం అనుకుంటూ నిత్యం శ్రమించే ఇల్లాలిని ఇంతకన్నా గొప్పగా వర్ణించే వాక్యాలు తెలుగు సాహిత్యంలో లేవు అంటే అతిశయోక్తి కాదు.
ఇస్మాయిల్ గారు తన పద్యాల్ని తెరుచుకొన్న పద్యాలు అన్నపుడు, మిగిలిన వారివి మూసుకొన్న పద్యాలా అంటూ తెలుగు సాహిత్యవిమర్శనా లోకంలో కొంతఅలజడి రేగింది. అలా అన్నప్పుడు ఇస్మాయిల్ గారి ఉద్దేశ్యం ఒక కవిత చదవగానే పాఠకుడు పద్యానికి కంటిన్యూ అవుతారనీ, అంటే అతను కవితనుతనంతట తానుగా కొనసాగించుకొనే అవకాశం ఉంటుందని. అలాంటి "ఓపెన్ నెస్" ఈయన కవితలలో ఉండి పాఠకుల కల్పనా శక్తికి పని కల్పించటం ద్వారా అవిమరింతగా వారి హృదయంలోకి ఇంకటం జరుగుతుంది.
స్త్రీవాద కవిత్వాన్ని ఇస్మాయిల్ గారు అహ్వానించలేదన్న అపవాదు వారిపై ఉంది. కానీ నిజానికి ఆయన ఉద్దేశ్యం కవిత్వం ప్రకృతిని ప్రతిబింబిస్తుందనీ, స్త్రీ ప్రకృతికి దగ్గర కనుక వారికి కవిత్వం వ్రాసే అవసరం రాకపోవచ్చుననీ మాత్రమే అన్నారు. ఆ తరువాత వచ్చిన స్త్రీవాద కవిత్వాన్ని చూసిన ఆయన,కవిత్వం అనేది అంతర్గతకల్లోలాల వల్ల జనిస్తుంది, ఈనాడు స్త్రీలకు కూడా ఈ మానసిక అశాంతి తప్పటం లేదన్న మాట అని అభిప్రాయ పడ్డారు.
జ్ఞాపకాలూ – అనుభవాలు
ఇస్మాయిల్ గారితో వివిధ ప్రముఖుల అనుభవాలు, అభిప్రాయాలు వారి మాటల్లోనే ..........

“మతం గురించి కులం గురించి ఆలోచన నాకెప్పుడూ రాలేదు. నేను మొదట్నుంచి అందరిలో ఒకణ్ణిగా, తెలుగువాణ్ణిగా ఫీలవుతూ వచ్చాను..... నా మైనారిటీ మతం నాకు ’హేండీకేప్’ కాలేదు” ---సి. ధర్మారావు
ఇస్మాయిల్ ఉత్తరాలు
ప్రముఖుల అభిప్రాయాలు
ఆణిముత్యాలు
ఇస్మాయిల్ గారు వివిధ సందర్భాలలో వెలువరించిన అభిప్రాయాలు
ఇస్మాయిల్ రచనలు
1. చెట్టు నా ఆదర్శం 2. మృత్యువృక్షం 3. చిలకలు వాలిన చెట్టు 4. రాత్రి వచ్చిన రహస్యపు వాన 5. బాల్చీలో చంద్రోదయం 6. కప్పల నిశ్శబ్దం 7. రెండో ప్రతిపాదన (అనుసృష్టి) 8. కరుణ ముఖ్యం 9. కవిత్వంలో నిశ్శబ్దం (ఒక వ్యాసం) 10. పల్లెలో మా పాత ఇల్లు
చివరి మూడు రచనలలో, మొదటి రెండూ సాహితీ విమర్శనా వ్యాస సంపుటులు, చివరది ఆయన మరణానంతరం, అభిమానులు వెలువ రించిన కవితాసంకలనం. (హైపర్ లింకులు కలిగిఉన్న పుస్తకాల పేర్లపై క్లిక్ చేసినట్లయితే ఆ పుస్తకాలను ఈమాట వారి ఆర్చైవులలో చదువుకొనవచ్చును)
కవితా పఠనం చేస్తున్న ఇస్మాయిల్ గారి వీడియో కోసం ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి
అవార్డులు/రివార్డులు
చివరగా
కీర్తి శేషుడైన కవి
కాలతీరాన
కాసేపు పచార్లు చేసి
గులకరాయొకటి
గిరవాటేసి
తిరిగి వెళ్లిపోయాడు
అన్న ఆయన కవితావాక్యాలలోని కవి ఎవరనేది ఇన్నాళ్లకు అర్ధం అయ్యింది. ఆయన ఎవరో కాదు ఇస్మాయిల్ గారే.
చెట్టు నా ఆదర్శం అని ప్రకటించుకొన్న ఇస్మాయిల్ గారి కవిత్వం తెలుగు సాహిత్య చరిత్ర లో చిరస్థాయిగా నిలుస్తుంది.
ఆయన సాహిత్య శకటాన్ని ఎక్కడ ఆపారో దాన్ని అక్కడి నుండి కొనసాగించటం తదుపరి కర్తవ్యం, భుజానికెత్తుకోవలసిన ఇంకొక పని - ఆయన ఎంతో ప్రేమతో, ఓపికతో నెరవేర్చినదే – ఎందరో సదా బాలకుల రాకకు అనుకూలంగా దారిని సుగమం చేయటం - అన్న తమ్మినేని యదుకుల భూషణ్ గారి మాటలు స్మరించుకొందాం.
Acknowledgements

ఇదే వ్యాసం పుస్తకం.నెట్ లో ప్రచురించబడినది. ఆ పత్రికా నిర్వ్యాహకులకు ధన్యవాదములు.

ఫొటోలతో కూడిన ఈ వ్యాసం యొక్క పి.డి.ఎఫ్. ను ఈ క్రింది లింకునుండి డవున్లోడ్ చేసుకొనవచ్చును.


బొల్లోజు బాబా

14 comments:

  1. అధ్బుతం.. ఆయన గురించి కొద్ది కొద్ది గా తెలుసు గాని ఇంత సమగ్రం గా తెలుసుకునే అవకాశం ఇచ్చారు చాలా చాలా థ్యంక్స్ బాబా గారు. కాలమనే నది ఒడ్డున ఆడుకుంటు నేను నా నిర్లక్ష్యం తో ఇసుకలో జారవిడుచుకున్న క్షణాలెన్నో ఏ దేవతో కరుణించి వాటన్నిటిని నాకు తిరిగిస్తే ఇటు వంటి అధ్బుత వ్యక్తులను కలిసే భాగ్యం పొందుదును కదా..

    ReplyDelete
  2. మిత్రుడు మూలా సుబ్రహ్మణ్యం ఇస్మాయిల్ కవితలను పరిచయం చేసారు. కాని ఇస్మాయిల్ గారి గురించి చదవలేదు.మీరు చాలా విషయాలు వ్రాశారు.ధన్యవాదాలు

    ReplyDelete
  3. ఇస్మాయిల్ గారి పేరు విన్నాను కానీ మరేమీ తెలియదు. ఇప్పుడు మీ ద్వారా కొంత తెలిసింది. ధన్యవాదాలు.

    ReplyDelete
  4. మీరు పెట్టిన చిత్రాలు కనిపించట్లేదు. దయచేసి సరిచేయగలరు.

    ReplyDelete
  5. bhaavanagaaru, venkaTaramanagaru thanksaMDI

    vijaayawardhan gaariki

    i could not upload photos to this blog post. but you can watch some rare and unique photos of ismaayil gaaru in the link given at the bottom of the post.
    is. scribid pdf file link.

    thank you sir

    bollojubaba

    ReplyDelete
  6. బాబా గారూ,
    ఈ టపా ఒక పరిశోధనా వ్యాస పరిధిని దాటి సమగ్రంగా ఉంది. ఇది భవిష్యత్తులో ఆయన గురించిన ఒక డాటా గా వాడుకునే అవకాశాలు లేకపోలేదు.మీ రవీంద్రుని అనువాదం చాలా బాగుంది.
    మరొక్క మనవి.
    సాహిత్య వినువీధుల్లో ప్రయాణించిన ఎందరో బాటసారులందరికీ తెలుసు. కాని వీధి కిటికీల్లోంచి విసిరిన కవితాసుమాల గుభాళింపులెందరు ఆఘ్రాణించారో. గడపదాటి రాని వారి ప్రతిభకు అవరోధాలను ఎందరు స్పృశించారో. కాస్త వారిపై కూడా దృష్టి సారించరూ.

    ReplyDelete
  7. ఇస్మాయిల్ గారి గురించి ఇంత విపులంగా తెలియచేసినందుకు ధన్యవాదాలు. నేను యానాంలో రాం వివాహం నాడు చూసాను ఆయనను. ఆ రోజు ఆయన వచ్చిన వారందరినీ పరిచయం చేసుకొని కవితలు చదవమన్నారు. అరోజు నేను వేశ్యా వృత్తిలోని వారిపై చిథ్రపటం పేరుతో రాసిన కవిత చదివాను. బాగుందని ఆయన మెచ్చుకోవడం ఇప్పటికీ మరిచిపోలేను. ఎండ్లూరి, యాకూబ్, శిఖామని వంటి వారు అక్కడే పరిచయమయ్యారు.

    ReplyDelete
  8. Dear Baba,

    Thank you for writing such a great introduction / overview of Ismail's poetry. I am now introduced to this marvellous poet due to your article over at Pustakam.net. That inspiration led to this English rendering of two of Ismail's poems. We need more such articles from you...!

    Regards, Crazyfinger

    ReplyDelete
  9. చాలా మంచి విశ్లేషణ. విలువైన విషయాల్ని తెలియజెప్పారు. ధన్యవాదాలు.

    ReplyDelete
  10. శ్రీనిక గారు
    థాంక్సండీ. మీసూచన బాగుంది. ప్రయత్నిస్తాను. ఎప్పటినుంచో నెలకో కవిత్వబ్లాగుని పరిచయం చేయాలని ఆశ. ఎప్పటికి ఫలించేనో. రోజుకు మరో రెందుగంటలుంటే బాగుండుననిపిస్తూంటుంది. (ఒకవేళ అలాజరిగితే మరో రెండు గంటలుండాలనిపిస్తుంది కదూ మేడం)
    కుమార్ గారు థాంక్యూ. అవునా. ఇస్మాయిల్ గారు అంత పెద్దవారయినప్పటికీ, యువకవులను చేరదీసి వారు చదివినవి విశ్లేషిస్తూ ప్రోత్సహించటం ఆయనకే చెల్లింది.

    మహేష్ గారు చాన్నాళ్లకు. బహుసా బిజీగా ఉన్నారనుకొంటాను. మీకూ రెండు గంటలు కావాలనిపిస్తుందా? :-))

    crazyfinger mitramaa

    welcome to my blog. thankyou for commenting. justnow saw your translations. they are wonderful. i feel honoured reading your comment. thank you very much for giving me a pat.
    your blog is very very juicy. going through it.

    once again thank alot

    bollojubaba

    ReplyDelete
  11. బాబాగారూ,
    ఇస్మాయిల్ గారి గురించి ఈ చిన్న వ్యాసం పరిధిలోనే వీలైనంత సమగ్రంగా రాసారు. ఆయన గురించి అసలేమీ తెలియని నాలాంటివారికి ఈ వ్యాసం చాలా విషయాలు చెప్పింది. నెనరులు.

    ReplyDelete
  12. కీర్తి శేషుడైన కవి

    కాలతీరాన

    కాసేపు పచార్లు చేసి

    గులకరాయొకటి

    గిరవాటేసి

    తిరిగి వెళ్లిపోయాడు

    పై పలుకులు చదివి గుండెల్నిఎవరో పిండిన భావన. శ్రీనిక గారు చెప్పినట్లు, యిది పరిశోధనా గ్రంధమే. మీ క్రుషి ప్రశంసనీయం బాబాజీ!..అభిననందనలతో......నూతక్కి

    ReplyDelete
  13. bollojubaba gariki namassulu.ismail garipai vyasam samagramga undi.
    -mallavarapu prabhakara rao(mallavarapujohn.blogspot.com)

    ReplyDelete
  14. This is a very comprehensive review and has the added advantage of presenting a person and his poetry not as a subjective interpretation but as a collective view of his contemporaries. That lends a lot of authenticity to it. Indeed this is a great effort, and as for myself, I am for the first time reading him from what he said than what others said of his poetry.
    Thank you so much Baba garu.

    ReplyDelete