Tuesday, October 19, 2021

ఒక apocalypse అనంతరం.....

 ఒక apocalypse అనంతరం.....

అడవి మధ్య పెద్ద మైదానంలో
ఒక గుంపు పోగుబడి ఉంది
పూసలు ధరించిన ఓ ముసలి వ్యక్తి
రాళ్ల మధ్య అటూ ఇటూ తిరిగి
గుండ్రంగా నునుపుగా ఉన్న చిన్న రాయిని ఎంపికచేసి
శుభ్రం చేసిన నేలపై ఉంచాడు.
చుట్టూ నాలుగు పుల్లలు పాతి
పుల్లలపై ఏదో అడవి చెట్టు ఆకులు పేర్చి
ఎదురుగా కూర్చొని ఆ రాయినే చూస్తూ
ఏదో మాట్లాడుతున్నాడు
అతని చుట్టూ అందరూ ఒక వలయాకారంగా కూర్చొని
కనులు మూసుకొని మౌనంగా ఉన్నారు
రకరకాల హావభావాలతో అతనా రాయితో
మెల్లగా మాట్లాడుతున్నాడు- మధ్యమధ్యలో నవ్వుతూ,
ఏడుస్తు, ఒక్కోసారి గంభీరంగా, కొన్ని సార్లు అభావంగా
చివరగా నేలను ముద్దాడి,
తన మనుషులకు నవ్వుతూ సైగ చేసాడు
అందరూ గంతులు వేస్తూ, డప్పులు మోగిస్తూ,
ఆనందించటం మొదలెట్టారు
అతని వద్దకు నెమ్మదిగా వెళ్ళి అడిగాను
ఆ రాయేమిటని
మా దేవుడు
ఎం చేసావు ఇంతసేపూ
మాట్లాడాను
ఏం మాట్లాడావు
పోయినేడు పంపించిన పెద్దలను చల్లగా చూసుకోమని
అడవి పూలు విరగకాయాలని
పిట్టలు, జంతువులూ సంతోషంగా జతకట్టాలని అడిగాను
ఇంకా
జీవులన్నీ పంచుకోగా పళ్ళూ దుంపలు మిగలాలనీ
వానలతో కప్పల నోళ్ళు నిండాలనీ
పుట్టబోయే బిడ్డలకొరకు వారి తల్లుల గర్భాలు గట్టిపడాలని
దేవుడు ఏమన్నాడు?
అలాగేనన్నాడు
మీ దేవుడి పేరేమిటి?
దేవుడు
పేరు
దేవుడికి పేరేమిటి? దేవుడి పేరు దేవుడే!
ఇదిగో జీలుగు రసం తాగు అంటూ
చిన్న తాటాకు దొప్ప చేతిలో ఉంచాడు.
బొల్లోజు బాబా

No comments:

Post a Comment