యానానికి చెందిన ప్రముఖ కవయిత్రి శ్రీమతి కె. విజయలక్ష్మి గారు, వారి భర్త ప్రసాద్ గారు, చిన్నకుమారుడు కారు ప్రమాదంలో మరణించారన్న వార్త కలచివేసింది.
యానాం కాలేజీ లో పనిచేసిన నరసమ్మ మేస్టారిని శిఖామణి తెలుగు సాహిత్యంలో యానాం సరస్వతిగా ప్రతిష్ఠించారు. ఆ తరువాతి తరంలో అదే కళాశాలలో, తెలుగు అధ్యాపకురాలిగా పనిచేసిన వ్యక్తి శ్రీమతి విజయలక్ష్మి గారు. వీరిని కూడా నరసమ్మ గారి స్థానంలో ఊహించుకొనే వాళ్లం. అదే ఆదరణ, అంతే పాండిత్యం, అంతే విదుషీమత్వం.
గొప్ప సమయస్ఫూర్తి, వాగ్ధాటి, సమయోచిత కవిత్వ ఉటంకింపులు, స్పష్టమైన ఉచ్ఛారణలతో తాను వ్యాఖ్యాతగా వ్యవహరించే ఏ సభకైనా ఒక సాహిత్య ఆంబియన్స్ కలిగించేవారు.
పదేళ్లక్రితం యానాం ఉగాది ఉత్సవాల సభలో నేను రచించిన "ఫ్రెంచిపాలనలో యానాం" పుస్తకాన్ని ఆవిష్కరించుకోవటానికి ఓ పదినిముషాలు సమయాన్ని దక్కించుకొన్నాను. ఆ సభకు విజయలక్ష్మి గారు వ్యాఖ్యాత. మంత్రులు, చీఫ్ సెక్రటరీ, ముఖ్య అతిధులు, ఎమ్మెల్యేలు, వేలమంది ఆహూతులు ఉన్న సభ అది. రచయితనైన నన్ను వేదికపైకి ఆహ్వానిస్తూ ఈమె సుమారు ఐదు నిముషాలపాటు నన్ను సభకు పరిచయం చేసారు. ఆ గళ గాంభీర్యానికి అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ గా విన్నారు. సభ అయిపోయాకా- మేడమ్ గారు మీరు నాగురించి చాలా ఎక్కువ చెప్పారు అంటే 'నా తమ్ముడి గురించి నేను కాక మరెవ్వరు చెబుతారు" అని ప్రేమగా నవ్వేసారు.
విజయలక్ష్మి గారి అమ్మగారు మా అమ్మా క్లాస్ మేట్స్. ఏదో మాటల్లో ఆవిడనంబరు కావాలని మా అమ్మ అడిగింది. తీసుకొని ఇచ్చాను. జీవితాన్ని సంపూర్ణంగా పండించుకొన్న డబ్బై ఏండ్లు దాటిన ఇద్దరు స్త్రీలు "ఏవే.... పోవే" అంటూ ఆరుదశాబ్దాల క్రితపు ముచ్చట్లను ఫోనులో మాట్లాడుకోవటం ఆశ్చర్యంగా అనిపించేది. (నిజానికి వ్యక్తిగతంగా కలుసుకోకుండానే ఇద్దరూ కాలగతులయ్యారు).
విజయలక్ష్మి గారి మాతామహులు శ్రీ మహేంద్రవాడ వీరగణపతి శాస్త్రి గారు (1911-1976) ఫ్రెంచి ప్రభుత్వంచే బెస్ట్ టీచర్ అవార్డు పొందారు. ఆంధ్రదేశం గర్వించదగిన జ్యోతిష్యశాస్త్ర పండితులు. వీరు హస్తసాముద్రికము, బృగురాజకాండ, సంఖ్యా జ్యోతిష్యసారము, అరచేతిలో అదృష్టము వంటి గ్రంధాలు వ్రాసారు.
విజయలక్ష్మి గారి తండ్రిగారు శ్రీ టి. శ్రీరామచంద్రకీర్తి మా తెలుగు మాస్టారు. వీరు "శ్రీ వెంకటేశ్వర శతకం" అనే గ్రంధాన్ని రచించారు. మా క్లాసులో అప్పుడప్పుడూ దానిలోని ఒక్కో పద్యం చెప్పి మాకు అర్ధం విడమరచి చెప్పేవారు. విద్యార్ధులను ఎన్నడూ పల్లెత్తు మాట అనేవారు కాదు. బాగా కోపం వస్తే చేతిలో సుద్దముక్కను వేళ్లమధ్య బలంగా నలుపుతూ అది పొడుం అయ్యేవరకూ మౌనంగా ఉండేవారు.
విజయలక్ష్మి గారు కూడా ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొన్నారు. విద్వత్తు, సౌశీల్యం, ప్రేమ కలబోసిన వ్యక్తిత్వం ఆమెది. "యానాం కవులు" అనే వ్యాసంలో ఆమె గురించి ఇలా వ్రాసాను.
.
శ్రీమతి కె. విజయలక్ష్మి
చక్కని కవిత్వం, మేలైన అనువాదాలతో శ్రీమతి కె. విజయలక్ష్మి గారు తెలుగు సాహిత్యాన్ని పరిమళింపచేస్తున్నారు. వీరు 2005 లో “కదిలేమేఘం” పేరుతో కవితాసంపుటి తీసుకొచ్చారు. ప్రముఖ తమిళకవి అమృత గణేషన్ పుస్తకాన్ని “ఊయలలో సూర్యుడు” గా తెలుగులోకి అనువదించారు. విజయలక్ష్మిగారి కవిత్వంలో సందేశాత్మక సామాజిక ప్రయోజనం అంతర్లీనంగా కనిపిస్తుంది. బలహీనవర్గాలపట్ల సహానుభూతి, సమాజపోకడలపై తనదైన వ్యాఖ్యానం, లోతైన వివేచనతో కూడిన హృదయసంస్కారం వీరికవిత్వ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. స్త్రీవాదదృక్పథంతో ప్రత్యేకించి కవితలు వ్రాయకపోయినా వీరికవిత్వంలో స్త్రీవాదం స్వాభావికంగా పలుకుతుంది. వృత్తిపరంగా తెలుగు అధ్యాపకురాలు కావటంతో వీరి కవిత్వం చక్కని పదచిత్రాలు, ఉపమానాలు, భాషాగరిమ, భావపటిమలతో ఉంటూ అలరిస్తుంది.
.
శ్రీమతి విజయలక్ష్మి గారి మృతి యానాం సాహిత్యలోకానికే కాదు, వ్యక్తిగతంగా నాకూ వెలితిగానే ఉంది. వారి ఆత్మకు శాంతికలగాలని కోరుకొంటున్నాను.
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment