నేను నిత్యం స్ఫూర్తి పొందే వ్యక్తులతో శ్రీ దాట్ల దేవదానం రాజు గారు ముఖ్యులు. కవిగా, కాలమిస్ట్ గా, కథకునిగా, చరిత్రకారునిగా వారి కృషి అసమాన్యమైనది.
సమకాలీన చరిత్రకారునిగా వారు చేసిన ఈ సమీక్ష నాకెంతో విలువైనది. రాజు గారికి ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను
బొల్లోజు బాబా
****
.
చదవాల్సిన పుస్తకాలు ఎదురుగా వేచి చూస్తున్నాయి. వాటిని పక్కనబెట్టి బొల్లోజు బాబా 'తూర్పుగోదావరి జిల్లా - మెకంజీ కైఫియ్యతులు' చేతిలోకి తీసుకొన్నాను. దానికి కారణం మా ప్రాంతం గతం తాలూకు విశేషాల్ని తెలుసుకోవాలనే ఉత్సుకత ఒక్కటే కాదు మా బాబా ఏం రాశారో చూడాలని ఆతురత కూడా ఉంది. చాలా సంవత్సరాల క్రితం దినపత్రికలో ఒక వార్త నన్నెంతో ఆకర్షించింది. రాజస్థాన్ ప్రభుత్వం ఎనభై ఏళ్ళ వయసు ఉన్నవారి దగ్గర్నుంచి ఆయా గ్రామాల విశేషాల్నీ స్థలపురాణాల్నీ తెలుసుకుని గ్రంథస్థం చేస్తే ప్రభుత్వమే ముద్రిస్తుందని ఆ వార్త సారాంశం. ఆ తరం గతిస్తే వారితోనే అవి మురుగుపోతాయని భావించి వారుండగానే నమోదు చేయాలనే మహత్తర ఆలోచన అది. నాకు చాలా ఆనందం అనిపించింది. అది నన్ను యానాం చరిత్ర రాయడానికి పురిగొల్పడం కూడా జరిగింది. అది వేరే సంగతి.
కైఫియ్యతుల ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. మెకంజీకి ఏం అవసరం ఉండి వీటి పట్ల ఆసక్తి చూపించాడో తెలియదు. సేకరణ పనిని గ్రామకరణాలకు అప్పగించాడు. వారు రాసిందాన్ని జాగ్రత్త చేశాడు. భాషకు సంబంధించి పండితులు కారు వారు. విన్నది విన్నట్టుగా ప్రచలితంలో ఉన్నది ఉన్నట్టుగా వచ్చిన భాషలో రాశారు. రాసేటప్పుడు వారి నమ్మకాలూ విశ్వాసాలూ అందులో చోటు చేసుకోవడం తప్పదు. వాటిని మరలా నేటికాలానికి సరిపడా వాడుకభాషలో మార్చి రాయడం లోనే అసలు ప్రతిభ ఉంటుంది.
బొల్లోజు బాబా తన ముందుమాట లోనే చెప్పారు. పొడవుగా ఉన్న వాక్యాన్ని తను ఎలా విడగొట్టి రాయడం జరిగిందో అసలు వాక్యంతో బాటు తిరగ రాసిన వాక్యం ఉదహరించారు. తన విధానం చెప్పారన్నమాట. జరిగుండొచ్చు భావించొచ్చు అనుకోవచ్చు అంటూ తను రాసింది తన వ్యక్తిగత అభిప్రాయమే తప్ప నిర్ధారణ కాదు అన్నట్టుగానే చెప్పారు. చరిత్రను కొన్ని చోట్ల ఊహించాల్సి ఉంటుందన్నది నిజమే. ఆ ఊహకు కొన్ని ప్రాతిపదికలుండాలనేది ఒక వాస్తవం.
సర్కారు జిల్లాల నుంచి ఫ్రెంచి వారి నిష్క్రమణ చరిత్ర ఆధారంగానే (కైఫియతులు ఆధారం కాదు) చక్కగా చెప్పారు. ఇక గ్రామ కైఫియ్యతులు ద్వారా మనం కొత్తగా తెలుసుకునే అంశాలేమిటో చదివితేనే అర్ధం అవుతుంది. స్థల పురాణాలు అంటే కొన్ని కట్టుకథలు వ్యాప్తిలోకి తెచ్చి ఆయా దేవాలయాలకు మహిమలు కలిగించడం ద్వారా భక్తి వ్యాప్తి చేయడానికే అనుకొంటాను. ఇవన్నీ వాస్తవానికి దూరంగానే ఉంటాయి. సరదాగా చదువుకోడానికి ఉపయోగపడ్తాయి.
బొల్లోజు బాబా దృష్టి ఎప్పుడూ ఖాళీలను భర్తీ చేసే దాని మీదే ఉంటుంది. మెకంజీ ఎక్కువ కాలం సీమ ప్రాంతంలో ఉండటం వల్ల అక్కడి కైఫియ్యతులనే ఎక్కువగా సేకరించాడు. తూర్పుగోదావరి జిల్లా కైఫీయతులు చాలా తక్కువగానే లభిస్తున్నాయి. వాటిని శ్రమకోర్చి, అంతర్జాలం, శాసనాలు, గ్రంధాల ద్వారా సేకరించి ఒక చోట గుదిగుచ్చి మనకు అందించారు. ఇప్పటి వరకు వెలుగు చూడని వీటిని సంస్కరించి రాయడంలో బాబా చేసిన విశేష కృషి ప్రతి పేజీలోనూ చూస్తాం. ఆధారాలను ఎక్కడికక్కడ ఇవ్వడం బావుంది.
తర్వాత చరిత్రపరంగా బొల్లోజు బాబా చూపు ఇపుడు దేని మీద పడుతుందో చూడాలి. ఇంత శ్రమనూ కాలాన్నీ వినియోగించి చేసిన కృషి తప్పక మంచి గుర్తింపును తెస్తుందని నమ్ముతున్నాను. కవిగా కవిత్వం, విమర్శకునిగా కవిత్వభాష, చరిత్రకారునిగా చారిత్రక విశేషాల్నీ అందించడం సృజననూ అవగాహనా పరిధినీ పెంచుకుంటూ వెళుతున్న బొల్లోజు బాబాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
.
- దాట్ల దేవదానం రాజు
(పుస్తకం దొరుకు చోటు - పల్లవి ప్రచురణలు, 9866115655)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment