టేబుల్ పై చేతి వాచీ
నెలవు తప్పిన కలువలా ఉంది.
ఇది విచ్చలవిడిగా తిరిగిన దూరాల్లోంచి కానీ
అపురూపంగా చూసుకొన్న నడకల్లోంచి కానీ
ఒక్క అడుగు కూడా తిరిగి రాదు కదా!
దాని డయల్ నూతిలో
అనుభవాలు, జ్ఞాపకాలు, కాలపు తునకలు,
మాగ్గట్స్ లా లుకలుకలాడు తున్నాయ్.
ఎంత జీవితాన్ని ముక్కలు ముక్కలుగా
కత్తిరించి ఉంటాయో కదా దీని ముళ్ళు.
టేబుల్ పై చేతి వాచీ
కాలం లా ముసలిదైపోయింది.
ఎంతకాలాన్ని
నిరీక్షణలు, నిస్ఫ్రుహలు, అసహనాలుగా
పోతలు పోసి ఉంటుందో కదా ఈ వాచీ.
ఎన్నిటిక్కట్టు ముక్కల్ని చింపిందో.
ఎన్ని సిగరెట్ పీకల్ని రాల్చుకొందో కదా!
ఎన్ని నిలుపుకోలేని
వాగ్ధానాల్ని పరిహసించి ఉంటుందో కదా.
టేబుల్ పై చేతి వాచీ
అపుడూ, ఇపుడూ అదే మోనాలిసా నవ్వుతో.
గంటల్ని రోజులుగా,
రోజుల్ని ఋతువులుగా
కొన్నింటిని వేగంగా, మరి కొన్నింటిని నీరసంగా
మార్చుకొంటూ సాగిపోయిందీ వాచీ.
కాలాన్ని బంధించాననుకొన్నడు మనిషి, కానీ
దీని డయల్ ఊబిలో పీకలోతు కూరుకుపోయాడు.
టేబుల్ పై చేతి వాచీ
ఒకనాటి పెళ్ళి కానుక.
ఒక వనాన్ని పొడుం చేయగల
ఒడ్రంగి పిట్ట ముక్కంత బలంగా
ఒక జీవితాన్ని పొడుచుకుంటూ
పోయిందీ ముల్లు గర్ర.
దీని రేడియం అంకెల నక్షత్రాల వెలుగులో
రాత్రులు కూడా మినుకు మినుకు మంటూ మెరిసేవి.
టేబుల్ పై చేతి వాచీ
ఇల్లు ఖాళీ చేసేపుడు డ్రాయర్ సొరుగులో దొరికింది.
మా నాన్న పోయిన మూడోరోజున అది ఆగిపోయి ఉంది.
యుద్దానంతరం విస్మరింపబడే సమరయోధునిలా.
బొల్లోజు బాబా
ఈ కవిత కొద్ది మార్పులతో ఈమాట జనవరి సంచికలో ప్రచురింపబడినది. సంపాదక వర్గానికి కృతజ్ఞతలతో
ఆ లింకు ఇక్కడ http://www.eemaata.com/em/issues/200901/1394.html
Showing posts with label జ్ఞాపకాలు. Show all posts
Showing posts with label జ్ఞాపకాలు. Show all posts
Saturday, January 31, 2009
Friday, December 5, 2008
ప్రవాసి కలలు
చీకటి పడింది
పగటి వేషం తీసేసి
సుగంధ స్వప్నాల లోతుల్లోకి
నిశ్శబ్ధంగా జారిపోయాను.
కొబ్బరి పుల్ల తో కత్తి యుద్దం చేస్తుండగా
చెడ్డీ జారిన తమ్ముణ్ణి చూస్తూ
" షేమ్ షేమ్ పప్పీ షేమ్" అంటూ
పువ్వులా నవ్వుతుంది పాపాయి.
ఆ నవ్వుల పరిమళంలో తడుస్తూ
నువ్వూ నేనూ.
చెడ్డి పైకి లాక్కొని
కాంతారావు కాస్తా రాజనాలగా మారిపోయాడు.
మనిద్దరి చుట్టూ వాళ్లిద్దరూ
గిర.. గిర.. గిర.. గిర...
పూర్వానుభవాల్ని స్వప్నాల్లో
చూసుకొంటోంది హృదయం
వసంతార్భాటాల్ని విత్తనాల్లో
దాచుకొన్న వనంలా.
బొల్లోజు బాబా
Thursday, October 23, 2008
ఒక జ్ఞాపకం.......
ఏకాంత సాయింకాలపు పలుచని వెలుతురులో
హృదయంలో విరిసిన సన్నజాజుల గానంలా
ఓ జ్ఞాపకం హాయిగా సలుపుతుంది.
గుప్పిట రహస్యాలను విప్పిన నూత్న యవ్వన వనాల
పరిమళాలు విరజిమ్మే శీతాకాల రాత్రులలో
నీ సాంగత్యపు కొలిమిలో నన్ను నేను
వెచ్చచేసుకొని, కరిగించుకొని మరిగించుకొనే క్షణాన
వర్షించిన సౌందర్యానందం నిన్నూ నన్నూ
ఆకాశపుటంచుల వరకూ విసిరికొట్టిన
జ్ఞాపకం హాయిగా సలుపుతుంది.
రొచ్చులు, రోతలూ, రేషన్లు, నెలసరి వాయిదాలూ
ఇంకా కబళించని రోజులలో
వెన్నెల పిట్టలు వాలిన పొగడ చెట్టు క్రింద
రాలిపడే పొగడపూల వానలో తడుస్తూ
పెదవులతో దేహవీణియలను మీటుకుంటూ
ఆ గానలోకంలో విచ్చలవిడిగా విహరించి
కనిపెట్టిన రహస్యాలను దాచుకొంటూ
దోచుకొంటూ, పంచుకొంటూ పరువులిడిన దూరాల
జ్ఞాపకం హాయిగా సలుపుతుంది.
పోటీలు, పోలికలూ, పధకాలు, పన్నాగాల వలల్లో
ఇంకా చిక్కుకోని ఆ అకలుషిత దినాల్లో
పట్టుకుచ్చులతో స్పృశించే నారింజ కాంతుల రాత్రిలో
వాంఛ, అంగీకారం పెనవేసుకొన్న క్షణాన
నీ కురులమల్లియలను కాల్చేలా నా శ్వాస జ్వలించేవేళ
విచ్చుకొన్న పెదవులు, సగంమూసిన కనులతో
నీ సౌందర్యం శాటిన్ తెరై నా హృదయంపై పరచుకొన్నప్పుడు
ఒక అదృశ్య హస్తం నిన్నూ నన్నూ ఎత్తుకపోయి
కాలరహిత, ఆలోచనారహిత, చేతనారహిత స్థితిలో కప్పెట్టిన
జ్ఞాపకం హాయిగా సలుపుతుంది.
********************
ఏమిటీ పరధ్యానం! వింటున్నారా?
స్కూలు ఫీజ్ కట్టటానికి రేపే ఆఖరు రోజుట.
చంటిదాన్ని హాస్పటల్ కి తీసుకెళ్ళాలి నంబరుబుక్ చేసారా?
జ్ఞాపకం హాయిగా సలుపుతుంది
వాస్తవం ముల్లుగర్రై పొడుస్తుంది.
బొల్లోజు బాబా
Subscribe to:
Posts (Atom)
