Showing posts with label నగర జీవనం. Show all posts
Showing posts with label నగర జీవనం. Show all posts
Monday, February 9, 2009
సూర్య నమస్కారం
ఈ రోజుకూడా సూర్యుడు బహుసా
ఆకాశపుటటెండెన్స్ రిజిష్టరులో
రెండు సంతకాలూ చేసేసి వెళిపోయుంటాడు.
మోరెత్తి సూర్యుడ్ని చూసి ఎన్నాళ్లయిందో!
టన్నులకొద్దీ వెలుగుని కుమ్మరిస్తూ
దినాన్ని స్ఫటికంలా మెరిపించి
అనంతాంధకారాల్నీ కలుగులోకి తరిమేసిన
సూర్యుడ్ని పలకరించి చాన్నాళ్లయింది.
నీడలు, గోడలు, నేలను తప్ప మరొకటెరుగని కనులు
ధవళ కాంతి రహస్యాలను పరిమళించలేవు.
గదుల్లోంచి, గదుల్లోంచి, గదుల్లోంచి గదుల్లోకి జారే
మన దైనందిక ఇనపక్షణాల్లో
మసకవెలుతురే అన్నిచోట్లా రాజ్యమేలుతుంది.
చలువ కనులజోడు కిటికీ కర్టెనై
కిరణ విహంగాల రెక్కలు కత్తిరిస్తుంది.
పడమటి నల్లబల్ల రంగుల్ని చెరిపేసుకొన్నాకా
మసక చీకటి మరింత చిక్కబడుతుంది.
అయినా భ్రమ కాకపోతే కానీ
ఈ నగర జీవనాంధకారారణ్యంలో
కాంతి తన కిరణ పాదాలతో సంచరించగలిగే
ఆరుబయళ్లెక్కడున్నాయి
ఇళ్ల మధ్య పిచ్చిగా పరుగులెత్తే రోడ్లు తప్ప.
వెలుగు రేకలు ఈతలు కొట్టటానికై
విశాలమైదానాలెక్కడున్నాయి
తేనెగూళ్ల లాంటి ఇరుకు హర్మ్యాలు తప్ప.
నగర మనిషికసలు మోరెత్తి సూర్యుడ్ని చూసే
తీరికేదీ? ధైర్యమేదీ?
బొల్లోజు బాబా
Subscribe to:
Posts (Atom)
