Saturday, August 29, 2020

కొప్పర్తి కవిత్వం - ఒక నిరంతర సత్యాన్వేషణ


కొప్పర్తి కవిత్వం - ఒక నిరంతర సత్యాన్వేషణ

.
(ప్రముఖ కవి శ్రీ కొప్పర్తి వెంకటరమణ మూర్తి గారికి సోమసుందర్ లిటరరీ అవార్డు వచ్చినసందర్భంగా చేసిన ప్రసంగపాఠం. ఈ వ్యాసం "కవిసంధ్య పత్రికలో ప్రచురింపబడింది. సంపాదకవర్గానికి ధన్యవాదములు)
***
.
కొప్పర్తి రాసింది మూడు పుస్తకాలు మాత్రమే. అవి పిట్టపాడే పాట, విషాదమోహనం, యాభైఏళ్ళవాన. అప్పుడప్పుడూ కొన్ని వ్యాసాలు వ్రాసారు కానీ అవి పుస్తకరూపంలోకి రాలేదు. ఈ మూడు కవితాసంకలనాలను పరిశీలిస్తే- పిట్టపాడే పాట రాళ్లమధ్య గలగలమంటూ పారుతూ ఈ ప్రపంచాన్ని నిబిడాశ్చర్యంతో చూస్తూ సాగే సెలయేరులాగ; విషాదమోహనం సుళ్ళుతిరుగుతూ, పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే వరద గోదావరి ఉద్రేకం లాగ; యాభై ఏళ్లవాన నింగినీ నేలనూ తాకుతూ నిశ్చలంగా అనంతంగా విస్తరించిన ఒక తాత్విక సముద్రంలాగా కనిపిస్తాయి.

మూడు పుస్తకాలతో కొప్పర్తి తెలుగు కవిత్వంపై వేసిన ముద్ర చాలా బలమైనది. ఎంతబలమైనదీ అంటే వీరి కవిత్వంలో ఉండే స్పష్టత, గాఢత, విభిన్నత తెలుగు కవిత్వంలో ఒక గీటురాయిగా నిలిచాయి.

సమకాలీన కవిత్వాన్ని పరిశీలిస్తే ఒక్కొక్కకవిది ఒక్కొక్క శైలి. శిఖామణి కవిత్వంలో మానవసంబంధాలు ఆర్థ్రంగా పలుకుతాయి. శివారెడ్డి కవిత్వానికి సామాజిక సంఘర్షణ ప్రధాన ముడిసరుకు. ఆశారాజు కవిత్వానికి లాలిత్యం స్థానీయతా నేపథ్యంగా ఉంటాయి. వాటిని ఆయా కవుల ముద్ర లేదా స్టాంప్ లుగా బావించవచ్చు.
కొప్పర్తి కవిత్వంలో చక్కని పదచిత్రాలు ఉంటాయి. అద్భుతమైన ఉపమానాలు ఉంటాయి. వస్తువులో నవ్యత అమోఘంగా ఉంటుంది. ఇది కాక మరే ఇతర లక్షణాలు ఈ కవిత్వాన్ని ఇతరుల కవిత్వం నుండి వేరు చేస్తున్నది అని పరిశీలించినపుడు - చరిత్ర, తర్కం అనే రెండు లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఈ రెండు లక్షణాలు కొప్పర్తి కవిత్వానికి విశిష్టతను సంతరించిపెట్టాయి అనిపిస్తుంది.
***

1. చరిత్ర శకలాలను పొదువుకొన్న కవిత్వం
.
చారిత్రిక సంఘటనలను వర్తమానంతో పోల్చి వాటి రిలవెన్స్ ను విశ్లేషించి చెప్పటం చరిత్రకారుల బాధ్యత. ఈ కవి వృత్తిరీత్యా చరిత్ర అధ్యాపకుడు. కవిగా ఇతనికి అదొక వెసులుబాటు. బహుసా అందుకేకావొచ్చు కొప్పర్తి అనేక కవితలలో చారిత్రిక అంశాలను సందర్భోచితంగా అల్యూడ్ చేయటం, చారిత్రిక వ్యక్తుల ప్రాసంగితను కవిత్వం చేయటం కనిపిస్తుంది.

విషాదమోహనం సంపుటిలోని “చిత్రలిపి” అనే కవిత భారతదేశ చరిత్రకు ఒక మొజాయిక్ పెయింటింగ్ లా అనిపిస్తుంది. ఒక మహా అరణ్యాన్ని నలభై పంక్తులలో మొలిపించటం అల్యూజన్ అనే కవిత్వ టెక్నిక్ వల్ల సాధ్యపడింది.
.
భూమి పుత్రుడి మీద నుంచి
మూడు పాదాలు బలంగా నడిచివెళ్లిన చిహ్నాలు కనిపిస్తాయి
దండకారణ్యంలో
ఒక తెగిపడ్డ బొటనవేలు దొరుకుతుంది ... అనే వాక్యాలలో ఆర్య అనార్య సిద్ధాంతం ధ్వనింపచేస్తాడు కవి. (ఈ సిద్ధాంతం తప్పా ఒప్పా అనేది వేరే చర్చ) ఆర్యులు వ్యాప్తిచేసిన వేద సంప్రదాయం, భూమిపుత్రుడి సంస్కృతిని, ఉనికిని విస్మరించింది అని సూచిస్తున్నాడీ కవి.
.
ఒక్కడు మాత్రం
ప్రశ్నించి కోపించి దుఃఖించి శాసించి
పద్యాలల్లుకుంటూ దిశమొలతో సాగిపోతాడు - సాహిత్యం ద్వారా సంఘాన్ని సంస్కరించాలని ప్రయత్నించిన వారిలో వేమనను మించిన వారుండరు. దురాచారాల్ని,మూఢనమ్మకాల్ని పురాణాల వైరుధ్యాల్ని, వేదాంతపు డొల్లతనాన్ని, మానవ బలహీనతల్ని వేమన తన పద్యాలతో ఖండించి, ప్రశ్నించి సాగిపోయిన వైనం తెలుస్తుందీ పంక్తులలో.

ఓడలు సముద్రాలమీద రహదార్లను గీస్తాయి
చిరుజల్లు తుఫానౌతుంది
రైతులు పాలికాపులై, పాలెకాపులు కూలీలౌతారు
కానీ ఓడలు మాత్రం బండ్లు కావు .... ఈ పాదాలలో బ్రిటిష్ వారు ఓడలపై చిరుజల్లుగా వచ్చి తుఫానై కబళించారని చెపుతున్నాదు కవి. తరువాత పాదంలో థామస్ మన్రో రైత్వారి సంస్కరణల ద్వారా ఉత్పత్తి రంగానికి సంబంధించి జరిగిన పునర్వవస్థీకరణ చెప్పబడింది. ఓడలు బండ్లు కాలేదనటంలో ధనవంతులు ఇంకా ధనవంతులయ్యారన్న చారిత్రిక సత్యం ఉంది.

సెయింట్ ఒకడు నడుచుకుంటూ వెళ్ళి
పిడికెడు సముద్ర స్ఫటికాల్ని గుప్పిటపడతాడు
ఆస్తి పంపకాలు జరుగుతాయి
తెలుపుకూ నలుపుకూ తేడాలేకుండా పోతుంది
పాతబస్తీలు చుండూరులు ఫలితాన్ననుభవిస్తాయి//
ఉప్పుసత్యాగ్రహం చేసిన గాంధిమహాత్ముని సెయింట్ అని సంబోధిస్తున్నాడు ఇక్కడ. ఆస్తి పంపకాలు అంటే దేశవిభజన. స్వపరిపాలన వచ్చినా సామాన్యుని జీవితంలో వచ్చిన మార్పేమీ లేదని కవి ప్రకటన. అదే దోపిడీ, అదే దాష్టీకం, అదే దౌర్జన్యం ల ఫలితంగా పాతబస్తీ మతకలహాలు, చుండూరులో కుల ఘర్షణలు లాంటి సంఘటనలు జరుగుతూండటం పట్ల తన ఆవేదన వ్యక్తంచేస్తాడు.
.
ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు గాంధియన్ ఫిలాసఫీ ఒక త్రోవ చూపగలదని మేధావుల అంచనా. భారతీయసాహిత్యంలో ప్రముఖ మళయాలీ కవి శ్రీ సచ్చిదానందన్, గాంధియన్ ఫిలాసఫీపై అనేక కవితలు వ్రాసారు. యాభై ఏళ్లవానలో కొప్పర్తి గాంధియన్ ఫిలాసఫీ వైపు ప్రయాణించటం గమనించవచ్చు. ఈ సంపుటిలో మూడు కవితలలో గాంధీతత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసారు.

వొక యుద్ధం-వొక ప్రత్యామ్నాయం అనే కవిత ఇలా మొదలౌతుంది
వాళ్ళిద్దరూ ఎదురెదురుగా నిలుచున్నారు
వాడివెనుక ఏడేడు ఉప్పు సముద్రాలు
అతని వెనుక ఒక్కటే జనసముద్రం
వాడు చేత్తో లాఠీపట్టుకొని
పైపుకాలుస్తూ గుప్పుగుప్పున పొగ వదుల్తూ నిలబడితే
ఉప్పుసముద్రాలు దాటొచ్చిన ఆవిరిఓడలా ఉన్నాడు
అతను కొల్లాయి కట్టి అనాచ్ఛాదిత వక్షంతో
చేతిలో ఎవరికీ కనిపించని ఆయుధం పట్టుకొని నిలబడితే
జనసముద్రానికి ఎత్తిపట్టిన వృక్షపు నీడలా ఉన్నాడు.//

దెబ్బల వర్షం కురిసింది
వాడు కొట్టికొట్టీ అలసి
ఆయాసంతో రొప్పుతూ
విజయగర్వంతో నిలబడ్డాడు
అతను రక్తమై, సిక్తమై అరుణమై
విరబూసిన మందారమొక్కై
వొరిగిపోయాడు//
హింస పిరికివాడి ఆయుధం అనీ
అత్యంత శక్తివంతుడు మాత్రమే
అహింసను ఆయుధంగా ధరించగలడనీ
సమరోత్సాహంతో పలికిందీ నేల.

చుట్టతాగే చర్చిల్ ను పొగలు కక్కే ఆవిరి ఓడగా, ఎవరికీ కనిపించని ఆయుధంగా అహింసను, గాంధీని చెట్టునీడగా పోల్చుతూ ఒక దృశ్యాన్ని రూపుకట్టించటం కొప్పర్తి అనన్యమైన ప్రతిభ. చివరకు హింస పిరికివాడి ఆయుధంగా, అహింస శక్తివంతుడి ఆయుధంగా చెప్పటం మొత్తం గాంధీ ఫిలాసపీని రెండు ముక్కల్లో కుదించటమే.
అంతిమ సత్యం అనే కవిత లో

తుపాకి పేల్చినవాడా
నీకు ధన్యవాదాలు//
నువ్వు పేల్చాకా కూడా అతను బతకగలిగి ఉంటే
నిన్నుకూడా తప్పకుండా బతికించి ఉండేవాడు
అప్పుడతని అంతిమ సత్యం నువ్వే అయ్యిండేవాడివి (అంతిమ సత్యం) - పై వాక్యాలలో గాంధీ బ్రతికుంటే గాడ్సే ని క్షమించి ఉండేవాడనే ఊహ చేస్తాడు కొప్పర్తి. ఏమో బహుసా అలాగే జరిగి ఉండేదేమో. అప్పుడు గాడ్సే ఖచ్చితంగా గాంధీ ఇచ్చిన సందేశంగా మిగిలిపోయి ఉండేవాడు. ఈ ఊహలన్నీ ఒఠి కల్పనలు కావొచ్చు, కానీ ఆ ఊహలు గాంధీ సిద్ధాంతాన్ని మరింత ప్రకాశవంతం చేస్తున్నాయి.

జెండర్ పాలిటిక్స్ అనే కవితలో ఈ వాక్యాలు ఆలోచింపచేస్తాయి.
జోన్ ఆఫ్ ఆర్క్
కాకతిరుద్రమ
లక్ష్మిబాయ్ ఆఫ్ ఝాన్సీ
పురుషులుగా మారిన స్త్రీలు

బుద్ధుడు
అశోకుడు
జీసస్
స్త్రీలుగా మారిన పురుషులు (జెండర్ పాలిటిక్స్) ఇదే కవితలో “గాంధీ కూడా పురుషుడు కాదు, స్త్రీ, తనలోని కరుకుదనాన్ని కరిగించి కరిగించి ఏకకాలంలో మృదువుగా ధృఢంగా మారిన స్త్రీ” అనే వాక్యాలలోని తాత్వికత గాంధియన్ ఫిలాసఫీని కొత్తకోణంలో ఆవిష్కరింపచేస్తుంది.

కొప్పర్తి తొలికవిత్వసంపుటి పిట్టపాడే పాటలో కూడా చరిత్ర శకలాలు కవితలుగా రూపుదిద్దుకోవటం కనిపిస్తుంది.
ప్రశ్న జవాబు వేరు వేరు కాదు
ప్రశ్నించడం అంటే జవాబు చెప్పడమే
క్రీస్తు, బుద్ధుడూ, మార్క్సూ
ప్రశ్నలుగా పుట్టి జవాబులుగా నిష్క్రమించారు//
ప్రశ్నల పోరాటంలో
స్పార్టకస్, గెలీలియోలు, ఫ్యూ జిక్ లు, మొలాయిజేలు
కూలిపోతూంటారు. (ప్రశ్నలు ఉదయిస్తూనే ఉంటాయి).

ప్రశ్నలుగా పుట్టి జవాబులుగా నిష్క్రమించటం అనే వాక్యంలో మొత్తం మానవజాతి సృష్టించిన జ్ఞానమంతా ఇమిడిపోయింది. రెండో వాక్యంలో ప్రశ్నలపోరాటంలో ఉండే ఘర్షణను పట్టిచూపుతుంది. స్పార్టకస్ రాజ్యాన్ని ప్రశ్నించినందుకు, గెలిలియో మతాన్ని ప్రశ్నించినందుకు, ఫ్యూజిక్, మొలాయిజేలు నియంతృత్వాన్ని ప్రశ్నించినందుకు చంపబడ్డ వ్యక్తులు. అయినా ఈ ప్రపంచం ప్రశ్నించటాన్ని ఆపేయలేదు అనే చారిత్రిక సత్యం పైకవితలో దొరుకుతుంది.

కవికి చారిత్రిక స్పృహ ఉంటే అతను వ్రాసే కవిత్వానికి గొప్ప లోతు, కాలిక స్పృహ వస్తుంది. ఈ రహస్యం కొప్పర్తికి తెలుసు. అందుకే బహుసా “కవి తాత్వికుడే కాదు చరిత్రకారుడు కూడా కావాల్సిందే” అంటాడు ఊరూవాడ కవితలో. నదీ, చరిత్రా, కాలమూ పర్యాయపదాలు అంటాడు మరో కవితలో (రహస్యనది). గొంతునులిమి చరిత్ర చేత అబద్దం పలికించొచ్చునేమోగానీ/చరిత్రగోడలమీద జారిన నెత్తుటి చారికలు మాత్రం అబద్దం చెప్పవు అంటాడు ఇంకో కవితలో (త్రిశూలం).

తెలుగు కవిత్వానికి చరిత్ర సంబంధ దృక్పథాన్ని అద్ది దాన్ని దేదీప్యమానం చేసిన కవిగా కొప్పర్తి గుర్తుండిపోతారు.

2. కొప్పర్తి కవిత్వంలో తర్కం

సాధారణంగా కల్పన అనేది కవిత్వ లక్షణంగాను, తర్కం,కథనాత్మకత అనేవి వచనలక్షణాలుగా చెపుతారు. తర్కం ద్వారా ఒక సత్యం ఆవిష్కరించబడుతుంది. అంటె కల్పనకు అది వ్యతిరేకం. తాత్విక చింతనలలో Inductive logic, Deductive logic అనే పద్దతులను ఉపయోగించి తీర్మానాలను చేస్తారు. కొప్పర్తి కూడా ఈ పద్దతులలో ఆధారంగా చేసుకొని అనేక తార్కిక సారూప్యాలు తీసుకొస్తారు. ఇవి చదువుతున్నంతసేపూ విభ్రమ కలిగిస్తాయి. ప్రాచీనాలంకారికులు విభ్రమను ఒక కవిత్వలక్షణంగా చెప్పారు.

ఉదాహరణకు సింధునది అనే కవిత ఇలా ముగుస్తుంది.

పంచపాండవులంటే
మంచంకోళ్లలాగా ముగ్గురంటూ రెండు వేళ్లు చూపించి
నల్లబల్లపైన ఒకటి వేసిన
ఉపాద్యాయుడిది తెలివితక్కువతనం కాదు. (సింధునది)
ఈ వాక్యాలను విడిగా చదివితే ఒక అర్ధంలేని వాదనగా అనిపించక మానదు. కానీ కవితను మొత్తం చదివినపుడు ఆ ప్రతిపాదన ఔచిత్యం అర్ధమౌతుంది. ఇందులో మనకు Inductive Logic కనిపిస్తుంది. అంటే ఒక specific అంశాన్ని ఒక General అంశంతో ముడివేసి రెండు ఒకటే అని చెప్పటం.

తొంభైలలో దళిత, బహుజన కవిత్వం విరివిగా వచ్చింది. ఆ సందర్భంగా వ్రాసిన కవిత ఇది. సింధుదేశంలో ప్రవహించిన అయిదునదుల గురించి వర్ణిస్తూ ఒక్కోనదినీ ఒక్కో వర్ణానికి ప్రతీకగా తీసుకోవటం అబ్బురపరుస్తుంది. నిజానికి ఈ ఐదునదుల్లో సింధు, గంగ, యమున బ్రహ్మపుత్ర నదులు మాత్రమే జీవనదులు. ఐదవది అయిన సరస్వతి నది ఎండిపోయి అంతర్జలలా ప్రవహిస్తున్నది.

వాటిలో ఒకటి సూర్యుడికి అర్ఘ్యమైంది
ఒకటి నెత్తురై ప్రవహించింది
ఒకదాని మీద సరుకుల ఓడలు లంగరెత్తాయి
ఒకటి చెమట కాల్వగా బీడుల్ని మాగాణుల్ని చేసింది.
ఇంకిపోయిన ఐదోదిప్పుడు
ఊటలు ఊటలుగా ఉబికి యేరై పరవళ్ళు తొక్కుతోంది
ఇప్పుడా ఐదూ సంగమించి
ఒక మహా ప్రవాహం కావాలి. (సింధు నది)

పై పంక్తులలో నాలుగు నదులు చతుర్వర్ణాలకు ప్రతీకలై నిలువగా, దళిత కవిత్వం ఉత్తుంగ తరంగంలా వెల్లి విరియటాన్ని అయిదోనది తొక్కుతోన్న పరవళ్ళుగా వర్ణిస్తాడు. అంతే కాక ఆ అయిదు నదులూ సంగమించి ఒక మహా ప్రవాహం కావాలనటం ద్వారా సరిహద్దులు చెరిపేసి “మనిషితనం” భూమికగా ఉండే మరో ప్రపంచాన్ని స్వప్నిస్తున్నాడు. కవిత పూర్తిగా చదివాక, చివరలో చెప్పిన ఉపాద్యాయుడు చేసిన పని తార్కికంగా ఆలోచిస్తే తెలివితక్కువ తనం కాదని అంగీకరించక తప్పదు. ఇది కొప్పర్తి తర్కం ద్వారా సాధించిన విభ్రమ.

నిరపేక్షం అనే కవిత పూర్తిగా తర్కాన్ని ఆధారంగా చేసుకొని వ్రాయబడింది.
మొదలూ లేదు చివరా లేదు
మొదలంటే రెండు చివరల మధ్య నుండటమే
చివరంటే రెండు ఆరంభాల మధ్య నిలవడమే ......... అంటూ మొదలయిన కవిత
మధ్యనుండటంలో
మధ్యన అన్నది నిజం కాదు ఉండటం ఒక్కటే నిజం
ఉండటం ఒక్కటే నిజమైనప్పుడు
లేకపోవడం కూడా నిజమే అవుతుంది ........... అంటూ ముగుస్తుంది.

కవిత ఎత్తుగడ చివరకు వచ్చేసరికి దాదాపు యు టర్న్ తీసుకొంటుంది. ఇక మధ్య భాగం లో కనిపించే పోలికలు, ప్రతీకలు అన్నీ విషయాన్ని క్రమక్రమంగా ఒక్కో మెట్టూ ఎక్కిస్తూ తారాస్థాయికి తీసుకెళ్ళి వదుల్తాయి. అద్భుతమైన శిల్పనైపుణ్యానికి ఈ కవిత మంచి ఉదాహరణగా నిలుస్తుంది. ఈ తరహా తర్కాన్ని Deductive Logic అంటారు. అంటే ఒక General అంశాన్ని ఒక specific అంశంతో ముడివేసి రెండు ఒకటే అని చెప్పటం.
దాదాపు ఇట్లాంటిదే విస్మృతి పేరుతో మరోకవిత యాభైఏళ్లవానలో ఉంది

అల్లంత దూరాన
ఒక ఊళ్ళో
ఒక పాప పుట్టింది
వెళ్ళిచూడాలనుకొనే వాళ్ళం
వీలయ్యింది కాదు
వెళ్ళనూ లేదు
చూడనూ లేదు
ఈలోగా
పాప
ప్రపంచాన్ని ఖాళీచేసి
వెళిపోయింది

ఎట్లా ఉంటుందో తెలీని పాప
ఎట్లా లేకుండా పోతుంది

అందుకని ఇప్పటికీ
ఎప్పటికప్పుడు
వెళ్ళి చూడాలనే అనుకుంటున్నాం (విస్మృతి)
ఎట్లా ఉంటుందో తెలీని పాప, ఎట్లా లేకుండా పోతుంది అనే ఒక్క తార్కిక వాక్యం వల్ల కవిత నిలబడింది. దీనిలో ఇండక్టివ్ లాజిక్ కనిపిస్తుంది. (Specific to General)

అలాగే నిర్నిద్రం అనే కవితలో
చీకటనీ వెలుతురనీ
రెండుంటాయంటాం కానీ
ఉండేది చీకటే
వెలుతురు వచ్చి వెళుతుంది అనే వాక్యంలోని తర్కం కూడా చకితుల్ని చేస్తుంది.
కొప్పర్తి కవితానిర్మాణంలో కనిపించే తర్కం అతని కవిత్వాన్ని ప్రతిభావంతం చేస్తుంది. ఇది పారడాక్సికల్ వ్యక్తీకరణ కాదు. భిన్న విరుద్ధ భావాలను తీసుకొని రెండూ ఒకటే అనే తార్కిక ప్రతిపాదన చేయటం. ఇది కొప్పర్తి స్టాంప్ అనుకొంటాను.
****
స్పందించాల్సిన సమయాలలో కొప్పర్తి సూటిగా స్పష్టంగానే స్పందించాదు.
దళితకవిత్వంలో బూతు పదాల వాడకం పెరిగినపుడు “సాతాను దేవుడు కానట్లే, బూతు కవిత్వం కాదు” అని కుండబద్దలు కొట్టాడు.
తెలుగునాట కవులందరూ సాయుధవిప్లవాన్ని సమర్ధిస్తూ వ్రాసే రోజుల్లో కొప్పర్తి “పోరాటం రాజ్యంతో అయితే, యుద్దం పోలీసులతోనా” అని ప్రశ్నించి నక్సలైట్ ఎదురుకాల్పుల్లో మరణించిన పోలీసుల పక్షాన నిలిచాడు. అది ఆ కాలానికి ఎదురీతలాంటిది.

ప్రత్యేక తెలంగాణ సమయంలో చిన్నరాష్ట్రాల ఏర్పాటును సమర్ధిస్తూ “ఈ దేశం/లోపలి పదార్ధమంతా ఒకేలా ఉండే యాపిల్ లా లేదు//ఒకదానినొకటి అంటిపెట్టుకొని ఉండే తెల్లతొనల నారింజలా ఉంది//ఇపుడు ఎర్రగింజల దానిమ్మలా పరిపక్వమౌతుంది…. అంటాడు. మరిన్ని చిన్న రాష్ట్రాలు ఏర్పడి అన్నికలసి ఎర్రగింజల దానిమ్మలా ఉండాలని కవి ఆకాంక్షించాడు. ఇవన్నీ కొప్పర్తి తన అభిప్రాయాలను చెప్పటానికి ఏనాడూ సంశయించలేదు అనే విషయాన్ని నిరూపిస్తాయి.

రక్తం యుద్ధానికి చిహ్నమైతే కన్నీళ్ళు మనిషితనానికి చిహ్నమని చెప్పే కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్; సామూహిక మరణాల గురించి గొప్ప దృక్కోణాన్ని అందించే మరణవైయక్తికం లాంటి కవితలు లోతైన ఆలోచనలను ప్రతిపాదిస్తాయి.

మీ చేతుల్లో రీడర్స్ డైజెస్ట్ ని ఇలస్ట్రేటెడ్ వీక్లీని
చార్లెస్ డికెన్స్ నూ, థామస్ హార్డీని చూసిన నాకు
చివరిరోజుల్లో హిందూ పేపర్ ను
తిరగేసి చూస్తున్నప్పుడు
తలక్రిందులౌతున్న మీ ప్రపంచాన్ని
ఎట్లా నిలబెట్టాలో తెలీలేదు --- అని కొప్పర్తి తన తండ్రిగారి గురించి వ్రాసిన వాక్యాలను చదివినపుడు హ్రుదయం ద్రవిస్తుంది. కొప్పర్తి తన సతీమణిపై వ్రాసిన సుశీల అనే కవితలో పలికించిచ స్త్రీ పట్ల ప్రేమ Burden of women in poetry కాదు Beauty of human relationships.

3. తెలుగు కవిత్వంలో కొప్పర్తి స్థానం ఎక్కడ?

సాధారణంగా ఒక కవి యొక్క కవిత్వాన్ని మదింపు చేసేటపుడు అతను ఎక్కడ ఉన్నాడు అనేదానిపై కూడా ఒక అంచనాకు రావాల్సిన అవసరం ఉంటుంది. నిజానికి ఒక కవిని ఏదో ఒక చట్రంలో ఇరికించలేం.

తెలుగు కవిత్వంలో శిఖామణి అనే కవి లేకపోతే మానవసంబంధాల కవిత్వం అనే అర అసంపూర్ణంగా ఉండేది అని ఒకచోట అన్నాను.
ఒకసారి ఇస్మాయిల్ గారిని ఒక ఇంటర్వ్యూలో మీరు అనుభూతి కవా అని ప్రశ్నిస్తే “నేను అనుభూతి కవిని కాను, నాకు లేబుళ్ళు తగిలించొద్దు” అన్నారాయన. అంతే కాదు మీరు “లేబుళ్ళు తగిలించినా నా మొఖాన అంత జిడ్డు లేదు కనుక అవి అంటుకోవు” అని కూడా మరోసందర్భంలో అంటారు. ఇదే విషయాన్ని కొప్పర్తి కవిత్వానికి కూడా అన్వయించుకోవచ్చు.

“వస్తువు గురించిన నిబద్దతా భావం ఎపుడు వెనుకబడుతుందో అపుడు రూపం, అనుభూతి, శిల్పం మొదలైన విషయాలు ముందుకు వస్తై” అన్న అజంతా మాటలు కొప్పర్తి కవిత్వానికి చక్కగా సరిపోతాయి. ఎందుకంటే ఈ కవి ఏ సిద్దాంతాలను తలకెత్తుకోక జీవితంలోంచి కవిత్వానుభవాలను ఏరుకొన్నాడు. వాటికి తర్కం, చరిత్రాత్మకత అనే జవసత్వాలను ఇచ్చి గొప్ప కవిత్వాన్ని సృజించాడు. మొదటి సంపుటిలో కొంత మార్క్సిష్టు భావజాలం కనిపించినప్పటికీ, మూడవ సంపుటివద్దకు వచ్చేసరికి ఇతని ప్రయాణం గాంధీ తాత్వికత వైపు సాగటం గమనించవచ్చు. ఇదొక మెటమార్ఫోసిస్. ఒక సత్యాన్వేషణ.

సత్యాన్వేషణ అనేది పరమసత్యం దర్శనమయ్యేవరకూ సాగాల్సిందే.

బొల్లోజు బాబా
16/11/2019

No comments:

Post a Comment