గురువుకు ఒక శిష్యుడు ఎత్తిన హారతి - " నది కాలం అతడు "
ఇస్మాయిల్ గారు తెలుగు కవిత్వలోకంలో నిలువెత్తు మనిషి. ఆయన మార్గం అపూర్వమైనది. వీరి కవిత్వంలో యుటోపియన్ స్వర్గాలు ఉండవు. నేలవిడిచి సాముచెయ్యటం కనిపించదు. జీవితాన్ని యధాతథంగా స్వీకరించి కవిత్వం చేసిన గొప్ప కవి ఇస్మాయిల్. ఇస్మాయిల్ దృక్ఫధం ఒకప్పుడు ఒక సంచలనం. ఎన్ని విమర్శలు ఎదురైనా తుదివరకూ తనమార్గాన్ని వీడని కవిత్వశూరుడు ఇస్మాయిల్.
ఈ క్రమంలో ఎందరో యువకులు ఇస్మాయిల్ కవిత్వం పట్ల ఆకర్షితులయ్యారు. ఇస్మాయిల్ గారు ఎవరినీ తన శిష్యులుగా చెప్పుకపోయిన, ఆయన కవిత్వాన్ని తమకు దిక్సూచిగా భావించారు అనేకమంది కవులు. వీరంతా ఇస్మాయిల్ వారసత్వాన్ని కొనసాగించే ప్రేమికులు, దూతలు, భక్తులు. వారిలో రవూఫ్ ఒకరు. కాకినాడలో మెడికోగా ఉండే రోజుల్లో రవూఫ్ ఇస్మాయిల్ గారిని నిత్యం కలుస్తూ, కవిత్వం గురించి చర్చిస్తూ ఒక రకంగా వారింట్లో మనిషిలా మెసిలారు. రవూఫ్ ‘అంతర్నేత్రం’ కవిత్వసంపుటికి ఇస్మాయిల్ గారు మొదటిసారిగా ముందుమాట వ్రాసారు. ఆ ముందుమాటలోనే "తెరుచుకొన్న పద్యాలు" అన్న కొత్త భావనను తెలుగు కవిత్వానికి అందించారు. అప్పట్లో అదొక సంచలనం. 'మిగిలిన వారివి మూసుకొన్న పద్యాలా" అని వాద ప్రతివాదనలు నడిచాయి.
ఇదంతా గతం. ప్రస్తుతానికి వస్తే - " నది కాలం అతడు " అనే పేరుతో ఇస్మాయిల్ కవిత్వతత్వానికి రవూఫ్ అక్షరరూపాన్ని ఇచ్చారు. ఇది నిజానికి ఇస్మాయిల్ జీవిత చరిత్ర. వారికవిత్వం లోనే వారి జీవితం ఉంది. జీవితాన్ని కవిత్వాన్ని ఆయన ఏనాడూ వేరుగా చూడలేదు. తెలుగులో ఒక కవి జీవితం గురించి, అతని కవిత్వం గురించి ఒక కవితా సంపుటి తేవటం బహుసా ఇదే మొదలు కావొచ్చు. అదీకాక ఆ కవి గతించి పదిహేనేళ్ళు గడిచిన తరువాత. ఇదొక ప్రేమపూర్వక కాన్క.
ఒకే తూలికలు కల్గిన పక్షులు గుంపు కడతాయి అన్నట్లు రవూఫ్ కవిత్వంలో ఇస్మాయిల్ కవిత్వ ఛాయలు కనిపిస్తాయి. అందుకనే ఆయన ఇస్మాయిల్ గారికి ఇష్టుడైనాడు. ఈ పుస్తకంలో ఇస్మాయిల్ గారి కవితాత్మను అద్భుతంగా ఆవిష్కరించగలిగారు.
ఇస్మాయిల్ కవిత్వంలో ఆయన జీవితం పరచుకొని ఉంటుంది. సహచరి సహనం, మనవల అల్లరి, సన్నిహితుల స్నేహం, సాయింత్రపు నడకలు, టాగోర్, కృష్ణ శాస్త్రి, చలం లపై ఉన్న భక్తి, టీసమయాలు లాంటి సామాన్య జీవనాంశాలు వారి కవిత్వంలో సహజంగా ఒదిగిపోయాయి. రవూఫ్ వీటన్నిటిని చాలా ఒడుపుగా పట్టుకొని, గొప్ప నైపుణ్యంతో నేతగాని పనితనంతో చిక్కని కవిత్వంగా మలచారు.
రాళ్లు కూడా పుష్పిస్తాయనీ
శిల్పాలై విచ్చుకొంటాయనీ
ఇస్మాయిల్ కు బాగా తెలుసు
బాధని వ్యక్తపరచడు
చిర్నవ్వులే చిందిస్తాడు-- (రాళ్లూ-పూలూ). ఇస్మాయిల్ గారు ఆర్ధికంగా ఇబ్బందులు పడిన సందర్భాలలో ఏనాడూ మిత్రులను సహాయం అర్ధించలేదని సన్నిహితులు చెపుతారు. చివరి దశలో టౌన్ లో ఇల్లు అమ్ముకొని ఊరిచివర వలసపాకల అనే ప్రాంతానికి మారిపోయారు. ఆ సందర్భాన్ని ఓ కవితలో--
వలస పాకల లోని
ఒంటరి ఆకాసంలో
కుంగిపోయిన పక్షి ఒకటి
గిరికీలు కొడుతూ
దుఃఖ సముద్రాన్నీదుతుంది (వలస-పాకనాటి ఒంటరి పక్షి ఒకటి) అంటూ చాలా ఆర్థ్రంగా రవూఫ్ వర్ణిస్తారు.
విచ్చుకొన్న పూల సున్నితత్వం
ఒకవైపు
గుచ్చుకున్న ఖడ్గకాఠిన్యం
ఇంకొకవైపు - (ఇస్మాయిల్). ఇస్మాయిల్ గారి కవిత్వం ఎంత సున్నితంగా హృదయాన్ని తాకుతుందో కవిత్వంపై వీరి అభిప్రాయాలు అంతే నిష్కర్షగా, కుండబద్దలుకొట్టినట్లు ఉంటాయి. " ప్రతిదేశంలోనూ అభ్యుదయం పేరనో, విప్లవం పేరనో రచయితల సంఘాలు ఏర్పరచి, రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడని సాహిత్యం పనికిమాలినదని యువ రచయితలకు నూరి పోసి వాళ్ల చేత నినాద ప్రాయమైన శుష్కరచనలు రాయించి పార్టీ ప్రచారం చేయించుకొంటున్నారు" అంటూ ఇస్మాయిల్ వెలిబుచ్చిన పై అభిప్రాయం అప్పట్లో చాలామందికి గుచ్చుకొంది. వీరిని ప్రధాన స్రవంతి కవులనుండి వెలివేసేటట్లు చేసింది. తాను నమ్మిన అభిప్రాయం చెప్పటానికి ఎంతటి ఖడ్గకాఠిన్యం ఉండాలి!
అయినా అనుక్షణం జీవితమొక
మహోత్సవం అయినవాడికీ
సతతహరిత వృక్షానికీ
వయోకొలమానం ఏమిటీ? -- (విరమణ @55). అప్పట్లో యాభై అయిదేళ్లకే ప్రభుత్వోద్యోగులను బలవంత పదవీవిరమణ చేయించినపుడు ఇస్మాయిల్ గారు కూడా ఒక బాధితుడు. ఆ సమయానికి వీరు పి.ఆర్. కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు. ఈ అన్యాయాన్ని ఖండిస్తూ కవి, సహృదయుడు అయిన శ్రీ గోదావరి శర్మ "55 ఏళ్లకే పచ్చని చెట్టును కొట్టేస్తారా? అని వ్యాసం వ్రాసారు. రెండేళ్ల తరువాత ఆ జి.వొ రద్దు చేయగా, తిరిగి ఉద్యోగంలో జాయిన్ అయ్యే అవకాశం వచ్చినపుడు ఇస్మాయిల్ గారు తిరస్కరించారని అంటారు.
ఆమె గొంతు ముడి విప్పి
పాడుతుంటే
ఆ గళమాధుర్యంలో పడి
కొట్టుకు పోతూ
అతను అస్తిత్వం కోల్పోతాడు
అది అతనికి తెలుసు - (కవి-గాయని) ఇస్మాయిల్ గారికి గాయని ఐన ఒక స్నేహితురాలు ఉండేవారు. ఆమె పాటల మాధుర్యాన్ని ఓ కవితలో ఇస్మాయిల్ గారు ఇలా వర్ణించారు. హాయిగా గొంతుముడి విప్పి పాడు/ రయిక ముడి విప్పి/చంటి బిడ్డకు/చన్నిచ్చే తల్లిలా// నీ అంతరాళాల్లో/నీ రక్తసంధ్యలో లేచిన/తెల్లటి పాట పావురాన్ని/నా రక్త సంధ్యలో వాలనీ./వెలిగే పగళ్ళతో ఉభయ సంధ్యల్నీ కలపనీ.// (పాటకత్తెకి) . ఈ విషయాన్నే పై కవితలో రవూఫ్ వర్ణించారు. ఆమె గాత్రంలో కొట్టుకుపోయి తన అస్తిత్వాన్నే కోల్పోయిన విషయం ఆయనకు తెలుసు అని ఒక కవి, గాయని అలౌకికానుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు రవూఫ్.
ఇస్మాయిల్ చలాన్ని దర్శించినపుడు, ఎదురెదురుగా కూర్చొని ఎవరూ మాట్లాడుకోలేదట. మౌనంగా ఉండిపోయారట.
మమేకమైన రెండు హృదయాల
కల్లోలానికి మాటలతో పనిలేదు
కాబోలు
మౌనం పూనిన భిన్న తీరాల
నడుమ-
గడ్డకట్టిన మంచులాంటి
మాటల నది
నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది (మౌన సంభాషణం) అంటూ ఆ సందర్భాన్ని హృద్యంగా దృశ్యమానం చేసారు. రవూఫ్.
ఈ పుస్తకంలో ఇంకా ఇస్మాయిల్ స్నానం, సాయింత్రపు నడకలు, ఆయన నివశించిన లచ్చిరాజు వీధి, అందంగా వ్రాసే వారి ఉత్తరాలు, పని చేసిన కాలేజి వాడిన సైకిల్ లాంటి అనేక విషయాలపైనా, సమకాలీనులైన ఉమర్ ఆలిషా, వజీర్ రెహ్మాన్, పంతులు గారు స్మైల్ వంటి వ్యక్తులతో ఇస్మాయిల్ అనుబంధాన్ని వర్ణిస్తూనూ అనేక అందమైన కవితలున్నాయి.
తెలుగు సాహిత్యంలో ఇదొక గొప్ప ప్రయోగం. గతించిన ప్రముఖ కవుల ఇళ్లను ప్రజలు, ప్రభుత్వాలు కలిసి భద్రపరచుకోవటం వారి పేరిట మ్యూజియములు నెలకొల్పుకోవటం లాంటివి ప్రపంచంలో చాలా చోట్ల నిబద్దతతో చేస్తారని వింటాం. అవెలాగూ తెలుగునాట జరిగే విషయాలు కావని నిరూపణ అయిపోయింది. కనీసం అక్షరాలలోనైనా ఒక మహాకవి జీవించిన స్థల, కాలాదులను బ్రతికించుకొనే ప్రయత్నం చేసిన రవూఫ్ గారు ఎంతైనా అభినందనీయులు.
నావంటి వాడిని శిష్యునిగా పొందే భాగ్యం నన్నయకు లేదు తిక్కనకు లేదు మా గురువుగారైన చెళ్లపిళ్ల వారికి మాత్రమే దక్కింది అని విశ్వనాధవారు అన్నారట. అది అచంచలమైన ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఇస్మాయిల్ గారిని ఇతివృత్తంగా తీసుకొని వెలువరించిన "నది కాలం అతడు " కవిత్వసంపుటి రవూఫ్ గారు తన సాహితీ గురువుకు ఎత్తిన ప్రేమ పూర్వక హారతి.
ఈ పుస్తకానికి శ్రీ విన్నకోట రవిశంకర్, శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, శ్రీ శిఖామణి ఆత్మీయతతో కూడిన ముందుమాటలు వ్రాసారు. అందమైన ముఖచిత్రాన్ని బ్రహ్మం భావన గ్రాఫిక్స్ వారు అందించారు. ఇస్మాయిల్ కవిత్వాన్ని ఇష్టపడేవారికి, ఇస్మాయిల్ కవిత్వతీరాన్ని చేరుకోవాలనుకొనేవారికి ఈ పుస్తకం ఒక దీపస్థంభం.
బొల్లోజు బాబా
(ఈ వ్యాసం పాలపిట్ట నవంబరు సంచికలో ప్రచురింపబడినది. ఎడిటర్ గారికి ధన్యవాదములు
No comments:
Post a Comment