Wednesday, April 13, 2022

రాజేంద్ర చోళుడు- గజని మహమ్మద్- సోమనాథ్-బ్రిటిష్ వారు


.
1. ఉత్తరభారత దేశంపై జరిగిన రెండు ముఖ్యమైన దాడులు
.
ఉత్తరభారతదేశం పదకొండవ శతాబ్దప్రారంభంలో రెండు పెద్ద ముట్టడులను ఎదుర్కొంది. దక్షిణభారతదేశంలో తంజావూరును రాజధానిగా చేసుకొని పాలిస్తున్న మొదటి రాజేంద్ర చోళుడు (1014-1044) సా.శ. 1022 లో తూర్పుతీరంవెంబడి 1600 కిమీ ప్రయాణించి తూర్పు ఉత్తర భారతదేశపు కళింగ, పాల, సామ్రాజ్యాలను జయించాడు. బెంగాల్లోని మహిపాల ఆలయం నుండి ఈశ్వరుని కంచు విగ్రహం, ఒరిస్సా నుంచి భైరవ, భైరవి, కాళి విగ్రహాలను, యుద్ధంలో కొల్లకొట్టి తన రాజ్యానికి తరలించుకొని పోయాడు.
రాజేంద్రచోళుడు వెనుదిరిగి వచ్చేటపుడు గంగానదీ జలాలను సైనికులచే పాత్రలతో మోయించి తమిళనాడుకు తీసుకొచ్చాడు. ఒక చోట నుయ్యి తవ్వించి దానిని ఈ జలాలతో నింపి, అక్కడ గంగైకొండచోళపురం (గంగను తెచ్చిన చోళుని పురం) అనే ఒక కొత్త నగరాన్ని నిర్మించాడు. ఇది 250 సంవత్సరాలపాటు చోళ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండింది.
రాజేంద్రచోళుని విధ్వంసం జరిగిన రెండేళ్ళకే, సా.శ. 1025 లో మధ్య ఆసియానుండి సుల్తాన్ మహమ్మద్ గజని (997-1030) ముప్పైవేలమంది సైన్యంతో ఉత్తరభారతదేశాన్ని పశ్చిమం వైపునుంచి దాడి చేసాడు. 1025 డిశంబరులో గుజరాత్ తీరంపై అప్పటికి వందేళ్లుగా పూజలందుకొంటూన్న సోమనాథ్ ఆలయంపై దాడిచేసి సంపదలను దోచుకొని, శివలింగాన్ని ధ్వంసం చేసినట్లు అప్పటి సమకాలీన పర్షియన్ స్కాలరైన Al-Biruni రాతల ద్వారా తెలుస్తుంది.
సోమనాథ్ ఎందుకంత ప్రముఖమైనదంటే – అదొక గొప్ప ఓడరేవు. భారతదేశం నుండి చైనాకు, ఆఫ్రికాకు సముద్రమార్గంలో వెళ్ళటానికి అక్కడనుంచి ఓడలు బయలుదేరేవి. వ్యాపారులు, దళారులు, ధనపుమూటలతో కిక్కిరిసిపోతూ ఉండే ఓడరేవది.
1025 లో సోమనాథ ఆలయం నుంచి గజని ఎత్తుకెళ్ళిన ధనం సుమారు 2 కోట్ల దీనార్లు గా ఒక అంచనా. 1029 లో ఇదే గజనీ మహమ్మద్ రాయ్ (Rayy in Persia) అనే చోట ఒక పెర్షియన్ మసీదును కొల్లగొట్టగా కొంచెం తక్కువగా అంతే సొమ్ము దక్కించుకొనటాన్ని బట్టి, ఇతనికి సంపదల పట్ల దృష్టే తప్ప మతపరమైన వివక్ష ఉన్నట్లు కనిపించదు.
2. సోమనాథ ఆలయవిధ్వంసం గురించి స్థానిక కథనాలు
.
పెర్షియన్ రాతలలో సోమనాథ్ ఆలయ విధ్వంసం గురించి చేసిన రసవత్తర వర్ణనలు లాంటివి ఆనాటి సమకాలీన హిందూ శాసనాలలో కానీ జైన రాతలలో కానీ పెద్దగా కనిపించవు.
గోవాని పాలిస్తున్న కదంబ రాజు 1038 లో తాను చేసిన పుణ్యక్షేత్ర సందర్శనా యాత్రలో భాగంగా సోమనాథ ఆలయాన్ని దర్శించుకొని పూజలు చేసినట్లు చెప్పటాన్ని బట్టి 1025 లో గజనిమహమ్మద్ సోమనాథ ఆలయాన్ని నేలమట్టం చేసి ఉండకపోవచ్చునని భావించాలి.
1169 నాటి ఒక సోమనాథ ఆలయ శాసనంలో సోమనాథ ఆలయ జీర్ణోద్ధరణ జరిపినట్లు ఉంది తప్ప గజని మహమ్మద్ దాడుల ప్రస్తావన లేదు. ఇదే సంవత్సరం నాటి మరో శాసనంలో సోమనాథ ఆలయానికి భవ బృహస్పతి అనే ప్రధాన అర్చకుని నియమించినట్లు ఉంది.
1216 లో ఆలయంపై స్థానిక మాల్వా రాజుల దాడులు నేపథ్యంలో చుట్టూ రాతినిర్మాణాలతో బలోపేతం చేయటం గురించి ఒక శాసనం ఉన్నది.
సోమనాథ ఆలయ ధ్వంసం గురించి -గజని మహమ్మద్ సమకాలీన కవి అయిన ధనపాలుడు Satyapuriya Mahavira Utsaha అనే జైన రచనలో మహమ్మద్ గజని సోమనాథ ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేయగలిగాడు కానీ సత్యపురం లో ఉన్న జైన ఆలయంలోని జైన విగ్రహాన్ని ఏమీ చెయ్యలేకపోయాడు అంటూ పరోక్షంగా సోమనాథ ఆలయ విధ్వంసాన్ని ప్రస్తావించాడు. అదేవిధంగా మరో జైన రచయిత జినప్రభసూరి- గజని మహమ్మదు మహావీరుని విగ్రహాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించగా అతని ఏనుగులు, గుర్రాలు దాన్ని కొద్దిగా కూడా పెకిలించలేకపోయాయని కూడా గొప్పగా చెబుతాడు. దీనిని బట్టి గజని హిందూ ఆలయాలనే కాక జైన ఆలయాలను కూడా ధ్వంసం చేసాడని భావించాలి.
ఆలయంలో దాచిన సొమ్ములకొరకు వాటిపై దాడులు సహజం. హిందూ రాజులు కూడా ఆలయాలను దోచుకొన్నట్లు చరిత్రలో అనేక సంఘటనలు కనిపిస్తాయి. సోమనాథ ఆలయం మినహాయింపు కాకపోవచ్చు. చరిత్రలో సోమనాథ ఆలయం అనేక సార్లు విధ్వంసానికి గురయింది. అన్నిసందర్భాలలోను వెంటవెంటనే పునర్నిమించుకొన్నట్లు కూడా ఆధారాలు కనిపిస్తాయి.
3. హిందూ ముస్లిమ్ ల సామరస్యత?
.
నిజానికి పన్నెండో శతాబ్దం వరకూ హిందువులు ముస్లిములు అనే విభజన లేదు. సంస్కృత శాసనాలలో ముస్లిములను మ్లేచ్ఛ, చండాల, యవన, పారశీక లాంటి మత ప్రమేయం లేని పదాలతో సంబోధించేవారు. ఒకవేళ రాజులుగా అంగీకరించవలసి వచ్చినప్పుడు మ్లేచ్ఛాధిపతి (barbarian king) అని పిలిచేవారు. (చాతుర్వర్ణ వ్యవస్థను పాటించని దేశాన్ని మ్లేచ్ఛదేశంగాను దానికి వెలుపల ఉన్నప్రాంతాన్ని ఆర్యావర్తమని ఏడవ శతాబ్దపు వైష్ణవ ధర్మశాస్త్రం నిర్వచించింది)
కాలచక్ర తంత్ర లాంటి బౌద్ధ గ్రంధాలలో ఇస్లామ్ గురించి చెప్పవలసి వచ్చినప్పుడు మ్లేచ్ఛధర్మ అని చెప్పబడింది. 1190 నాటి జయానక కవి విరచిత పృథ్విరాజ విజయ కావ్యంలో ముస్లిములను మాతంగ, చండాల, అసుర, రాక్షస, పిశాచ, అధమ, పాపి, మ్లేచ్ఛ, తురుష్క లాంటి పదాలతో పిలవటం గమనించవచ్చు. ఇవేమీ మతపరమైన పేర్లు కావు. తురుష్క పదం మినహా మిగిలినవి తక్కువ స్థాయికి చెందిన వారని సంబోధించటానికి అప్పట్లో వాడే పదాలు.
కాలక్రమేణా ముస్లిమ్ రాజులు వివిధ యుద్ధాలలో విజయం సాధించి సుల్తానులుగా తమని తాము ప్రతిష్టించుకొన్నాక సంస్కృత శాసనాలలో వారు హమ్మీర (అమీరు), సురత్రాణ (సుల్తాను) లాంటి సాంస్క్రిటైజ్ చేయబడిన పేర్లతో పేర్కొనబడ్డారు. ఇవే పేర్లను హమ్మీర చౌహాన్, హమ్మీర వర్మన్ అంటూ కొందరు హిందూ రాజులు కూడా అనుకరించటం గమనార్హం.
శాసనాలలో హిందూ అన్నపదం 1347 లో విజయనగర రాజు మారెప్ప తనని తాను “హిందురాయ సురతాల” గా (హిందూరాజులలో సుల్తాను) చెప్పుకొన్నప్పుడు మొదటి సారిగా కనిపిస్తుంది. కొన్నాళ్ళకు ఈ పదం హిందూరాయ సురత్రాణ గా స్థిరపడింది.
1550-1600ల మధ్య కంచి వరదరాజ ఆలయంలో విజయనగర రాజులు కట్టించిన ఒక మండప స్తంభ శిల్పాలలో గుర్రంస్వారీ చేసే వ్యక్తి, ఒకవైపు ముస్లిం సైనకుడుగా(గడ్డం, ఫాంటుతో) మరొక వైపు హిందూ సైనికుడిగా (పంచె, మీసకట్టు లేకుండా) ఉంటాడు. ఇది బహుసా ఆ కాలపు హిందూ ముస్లింల సామరస్యత/అబేధంగా తీసుకోవచ్చు.
సాహిత్యంలో, శాసనాలలో ముస్లిం వ్యతిరేకత పెద్దగా కనిపించదు. దక్షిణభారత కుతుబ్ షాయి పాలనలో ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో కూడా వెలువరించేవారు. ఈ సమయంలోనే తెలుగులోకి అనేక ఉర్దూపదాలు వచ్చి చేరాయి. ఒరిస్సారాజులకు గజపతులని, విజయనగర రాజులను నరపతులని, గోల్కొండ రాజులను అశ్వపతులని సమానహోదాతో హిందూ ముస్లిము రాజులు వ్యవహరించుకొన్నారు.
4. హిందూ ముస్లిమ్ విభజన ఎప్పటిది?
గజని మహమ్మద్ చేసిన దండయాత్రను హిందూమతంపై చేసిన దాడిగా అభివర్ణించటం 1840ల నుంచి మొదలైంది. 1842 లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపనీ ఆఫ్గనిస్తాన్ పై చేసిన దండయాత్రలో 16 వేలమంది సైనికులను కోల్పోయింది. తనసైన్యంలో ఉండే హిందూ సైనికులలో ఉత్సాహం నింపటానికి కొంతమంది బ్రిటిష్ సైన్యాధికారులు- గజని మహమ్మద్ సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేసి దాని సింహద్వార తలుపులను ఆఫ్ఘనిస్తాన్ ఎత్తుకుపొయాడు; వాటిని కనుగొని సోమనాథ ఆలయానికి చేర్చటం మన బాధ్యత అంటూ ఒక కట్టు కథ అల్లారు. అలా అప్పుడు అల్లిన కట్టుకథ కారణంగా ముస్లిమ్ దండయాత్రలు హిందూమతాన్ని నాశనం చేసే ఉద్దేశంతో జరిగాయనే అపోహ భారతీయులలో బలంగా నాటుకొంది.
ఆ తరువాత సోమనాథ ఆలయ తలుపులు అంటూ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెచ్చిన తలుపులు నిజమైనవి కాదని, అవి అప్పటికి నూరేళ్ళక్రితం, ఆఫ్ఘనిస్తాన్ లో లభించే స్థానిక చెక్కలతో చేసినవని రుజువవ్వటంలో ఈస్ట్ ఇండియా కంపనీ అధికారుల బండారం బయటపడింది. (ఇవి ఇప్పుడు ఆగ్రా ఫోర్ట్ లో ఉన్నాయి) కానీ వారి విభజించి పాలించే విధానం హిందు-ముస్లిమ్ విభజనకు బీజప్రాయమయి ఉండవచ్చునన్న ఊహను కొట్టిపడేయలేం.
***
ముగింపు
గజని మహమ్మద్, రాజేంద్ర చోళుడు దాదాపు ఒకే కాలంలో చేసిన దండయాత్రలలో ఇరువురి సేనలు సుమారు 1600 కిమీ ప్రయాణించి, కొన్ని ఉత్తరభారత రాజ్యాలను జయించి, దోచుకొని, అక్కడి ఆలయాలను ధ్వంసం చేసి కొన్ని విగ్రహాలను, సంపదలను తమ ప్రాంతాలకు ఎత్తుకుపోవటంలాంటి సారూప్యతలను కలిగి ఉండటం ఆసక్తి కలిగించే ఒక చారిత్రిక విశేషం.
.
బొల్లోజు బాబా
.
.
ఉపయుక్త గ్రంథాలు
1. The Language of History, Sanskrit Narratives of Muslim Pasts -Audrey Truschke
2. India in Persianate age1000–1765- Richard M. Eaton
3. Somanatha The Many Voices of a History -Romila Thapar
4. Wikipedia






1 comment:

  1. 'ఇతనికి సంపదల పట్ల దృష్టే తప్ప మతపరమైన వివక్ష ఉన్నట్లు కనిపించదు'
    Bullshit spotted

    ReplyDelete