Friday, April 22, 2022

పక్షి దాహం


.
మద్యాహ్నం వేడి గాలుపు
చెట్టునీడలో కూర్చొని నేను
కొమ్మపై కాకి ఒకటి వాలింది
బొంగురుపోయిన గొంతుతో
అరుస్తోంది... దాహం కాబోలు
గోలెం అంచుపై వాలి నీళ్ళకోసం చూసింది
కుళాయి టాప్ రంద్రాన్ని నీటికోసం తడిమింది

పక్షి నాలుకని తడుపలేనందుకు
నా కనులు చెమర్చాయి
చూస్తుండగానే
ఆ కాకి మనిషిరూపం ధరించి
మొఖాన్ని చేతుల్లోకి తీసుకొని
నా కన్నీళ్ళు తుడిచింది
తేరుకొనేలోపే అదృశ్యమైంది.

పిట్టగోడపై గుచ్చిన గాజుపెంకులపై
ఎండ తళతళా మెరుస్తోంది
చెట్టుపైనుండి ఎప్పటిదో
పాత పక్షిగూడొకటి గాలికి నేల కూలింది
గాలినిండా ఉత్త పొడిపొడి ఉక్కపోత

బొల్లోజు బాబా

No comments:

Post a Comment