అంత తక్కువకైతే కిట్టదయ్యా
మరో రెండు రూపాయిలిప్పించండి.
లేదు లేదు, నీకు కిడితేనే ఇవ్వు
బలవంతం ఏముంది?
ఆ రాత్రి, కప్పుకంతల్లోంచి చుక్కల్ని చూస్తున్న
జాంకాయల వ్యాపారినడిగింది – భార్య
“వచ్చే వారం పిల్లాడి పుట్టిన రోజు గుర్తుందా?”
ఊరిలోని పెద్దపులిని ఎవరో చంపేసార్ట.
షట్టర్లు మూసుకొన్నాయి, తాళాలు పడ్డాయి,
లాఠీలు పగిలాయి, తుపాకులు పేలాయి.
డబ్బు డబ్బును కాపాడుకొంటూంది.
రేపేమిటన్న ప్రశ్నకు మత్తుమందిచ్చి
నిద్రపుచ్చిన పాత బట్టల వ్యాపారి
“నాకాకలిగా లేదు నువ్వుతినేసి పడుకో” అన్నాడు.
“బేరంలేదని నేటి వడ్డీ రేపుకడతానంటే ఎలా”
ఉన్నదంతా పీల్చుకుపోయింది
రోజుకు ఇరవై రూపాయిల వడ్డీ జలగ.
నిద్రకు ముందు ఆ తాళంచెవుల వ్యాపారి విన్న ఆఖరుమాటలు
“కొన్న మందులు రేపటితో అయిపోతాయి
డాక్టరు చీటి జేబులో పెడుతున్నాను
తెచ్చుకోవటం మర్చిపోవద్దు”
ఎండిన ఖర్జూరం లాంటి దేహంతో
అలంకరణ సామాన్లమ్మే ఆ ఒకనాటి ఆటకత్తె
ఎర్రటి ఎండకు తాళలేక చెట్టుకిందకు చేరింది.
“అమ్మా పుస్తకాలు తొందరగా కొనుక్కోమంటున్నారే
రేపు కొంటావా?” అనడిగిన కొడుకుకు
ఆ రాత్రామేం సమాధానం చెప్పింది?
“మామ్మా ఇవి తీసుకో” అని మిగిలిపోయిన
పళ్లని వీధి బిచ్చగత్తె కిచ్చేసి ఇంటికి
బయలుదేరాడతను చుక్కల వెలుగులో.
“నాన్నా స్కూలుకు వెళ్లాలంటే భయంగా ఉంది.
ఓ కుర్రాడు వెంటపడి వేధిస్తున్నాడు” బేలగా అంటోంది కూతురు.
“బండి ఇక్కడ ఎందుకు పెట్టావురా దొంగ వెధవా”
తన్నిన తన్నుకు బండిమీది చైనా వస్తువులు
రోడ్డుపై చెల్లా చెదురు – ట్రాఫిక్ ఆగుతుందా?
కొన్నిరోజుల తరువాత
సూర్యుని వెనుకే ఉదయించిన
మీసాలింకా రాని స్వరమొకటి ఇలా అరుస్తోంది
“జత పది జత పది జత పదీ”
బొల్లోజు బాబా
