Saturday, March 20, 2010

మార్చి 20 - ప్రపంచ పిచ్చుకల దినోత్సవం



ప్రతీ సంవత్సరం మార్చి ఇరవైన ప్రపంచ పిచ్చుకల దినంగా పరిగణించాలని పర్యావరణ వేత్తలు నిర్ణయించారు. ఈ సందర్భంగా
అంతరించిపోతున్న పిచ్చుకలపై ఇదివరలో నేరాసిన ఓ కవితను ఇక్కడమరో సారి పోస్టు చేస్తున్నాను.....


అంతరించిపోతున్న పిచ్చుకలపై........

నువ్విక్కడికి రావటం లేదంటే
ఎక్కడో ఉండే ఉంటావులే
అనుకున్నానింతకాలమూ

అక్కడా లేవట కదా! మరెక్కడికి పోయావూ?


రెక్కల టపటపల గమకాల్ని పలికిస్తూ
మెరుపు వేగంతో అటూ ఇటూ ఎగురుతో
మా పచ్చని హృదయాలపై వాలేదానివి.

ఇంటి చూరుకు వేలాడదీసిన

వరి కంకుల కుంచె ఓ నక్షత్రమై
నీకు ప్రేమగా స్వాగతం పలికేది.

నీ అవిశ్రాంత మైధున సంగీతానికి

ఊరు మొత్తం ముసిముసి నవ్వులతో
సిగ్గుపడుతూ మురిసిపోయేది.


చూరు అంచునో లేక మిద్దె కంతల్లోనో
నీవు నిర్మించుకొన్న స్వర్గంవైపు

ఎవరైనా తొంగిచూస్తే, వాని తలపై గింగిర్లు కొడుతూ,
అరుస్తూ నీవు చేసే హడావిడికి
గాలి కూడా బిత్తర పోయేది.

మట్టిలో పొర్లాడుతూ చేసిన ఇసుక స్నానాలు
చాతీపై నల్ల మచ్చతో నీ లైంగిక ద్విరూపకతా
పెరట్లో సస్యరక్షణ గావించిన నీ ఉక్కు ముక్కు
గాయపడ్డ నీ దేహాన్ని సంరక్షించిన మా బాల్యాలు
నా కిటికీ పై వాలి పాటలు పాడి తుర్రుమన్న
ఆ క్షణాలన్నీ, తమ గాలిపెదాలతో
ఈ బొమ్మల పుస్తక పుటల్ని రెపరెప లాడిస్తున్నాయి.

పెంకుటిళ్లు, నిద్ర పగుళ్లలోంచి
కారిపోయిన స్వప్నాలైన వేళ
అవని మొహంపై రసాయిన దాడి నేపధ్యంలో
సెల్ ఫోన్ రేడియేషన్ కనిపించని మృత్యువలై
నిన్నో ఎడ్రస్ లేని ఉత్తరాన్ని చేసేసిందా?

నువ్వు వస్తావని, గుడిలో శఠగోపమంత
అందంగా పేనిన వరికంకుల కుంచె
ఇంటి స్లాబ్ ఇనుప కొక్కానికి
కాశీ ఆవు ఐదో కాలులా వేలాడుతూ
మమ్ములను వెక్కిరిస్తూంది.
తరువాత 'మీవంతు' అంటూ
భయపెడుతూంది.

బొల్లోజు బాబా

చాలా కాలంగా పిచ్చుకలెక్కడయినా కనిపిస్తాయా అని చూస్తూనే ఉన్నాం. ఒక రోజు కనిపించిన వాటిని మా అమ్మాయి కెమారాలోబంధించింది. ఓ పిచ్చుక అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకొని దానితో అది దాదాపు అరగంట పైగా చేసిన హంగామాని కూడా వీడియోతీసింది మా అమ్మాయి. వాటిని మీ అందరితో ఇలా పంచుకొంటున్నాను.....



ప్రస్తుతం అక్కడక్కడా మాత్రమే కనిపిస్తున్నా, ముందుముందు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు. అలా జరగకూడదని ఆశిద్దాం.

6 comments:

  1. thank very much for the info and the pics and video.

    ReplyDelete
  2. బాబా గారు..మీ చిన్నారికి నెనరులు..1.అద్దం ముందు పిచ్చుక/ యుద్దం మొదలు/పందెం దేని మీదకాయను? 2.సెల్ ఫొన్లంటే పిట్టలకు కోపం/వాలడానికి-వైర్లుండవని.
    మీ ఫొటోలు చూసాక రాసాను.

    ReplyDelete
  3. మీ కవిత, వీడియో బాగున్నాయి. నేనూ ఇక్కడ రాసాను..http://sahavaasi-v.blogspot.com/2010/03/blog-post_20.html

    ReplyDelete
  4. మీ పాప నా వంటిదేనన్నమాట. భలే పట్టింది చిత్రాన్ని. అలా వచ్చినదాన్ని పట్టి నది ఒడ్డున వదిలానో లేదో నాకన్నా ముందు మా ఇంటికి వచ్చికూర్చుంది.

    పోయినేడు ఈ కవిత చదివి, మా పెరట్లో పిచ్చుకల మీద నేను రాసుకున్న ప్రతి కవిత, డిస్నీలాండ్ లో ఓ గుంపు పిచ్చుకలని చూడగానే మీరే గుర్తొచ్చిన వైనం పలకరించిపోయాయోసారి. ఏం చేస్తామండి ఇవి సామూహికంగా రావాల్సిన స్పృహ, పరిణామం.

    ReplyDelete
  5. థాంక్యూ ఒన్ అండ్ ఆల్
    ఉష గారికి
    చిరకాల దర్శనం.
    ఎలా ఉన్నారు?
    మీరు లేక సందడి లేదు బ్లాగుకవితా లోకంలో

    బిజీనా లేక వెకేషన్ తీసుకొంటున్నారా?

    ఈ రోజే మీ కవిత గోడమీద నీడలు చూసాను. చాలా బాగుంది. మీ శైలికి భిన్నంగా ఉంది. బహుసా పదునుపెట్టబడిన శైలేమోననిపించింది. చాలా చాలా బాగుంది.

    అభినందనలతో
    బొల్లోజుబాబా

    ReplyDelete
  6. బాబా గారు, మీ అభినందనకి కృతజ్ఞతలు. అభిమానంగా పలుకరించినంనందుకు ధన్యవాదాలు + సంతోషం. మునుపటి మీద రాసాక ఒ సారి చదవటం మాత్రం అలవాటైమ్దండి. :) కనుక పదును/కసరత్తు మొదలెట్టానేమో మరి. తొలి సద్విమర్శ ఇచ్చిన మీ నోట ఈ ప్రశంస కాస్త తృప్తి. ఇక విరామం అంటారా-- అదేమీ లేదు కానీ సమయాభావం కాస్త ఎక్కువైంది. కాస్త వచ్చిన పనుల బాగా చేయాలని [మారథాన్, డాన్స్, ఈత] రాని పనులు నేర్చుకోవాలని [బైక్ తొక్కటం - మునుపు ఎక్కగానే పడేదాన్ని ;) ఇప్పుడు కాస్త తొక్కాక ఫ్రండ్స్ ఇళ్ళ ముందు పడుతున్నాను కనుక ఫస్ట్ ఎయిడ్ ఖర్చు వాళ్ళదే..] ఇలా ఈ కొత్త సం. కొత్త వ్యాపకాలు. కాకపోతే మీ బ్లాగుకి వస్తూనే వున్నానండి. నెనర్లు.

    ReplyDelete