Tuesday, November 17, 2009
వృద్ద జంట
తేనెవానల్ని కురిపించిన
వెన్నెల రాత్రులు
అదృశ్యమయ్యాయి.
స్వర్ణ వాసనల్ని ఎగరేసిన
జాజులు నేలకొరిగాయి.
ఇంధ్రధనస్సులపై
స్వారీ చేసిన మహోద్రేకాలు
ఇక శలవన్నాయి.
నే పూయించిన
విజయాలు కరిగిపోయాయి.
నే సాగించిన
యుద్దాలు ముగిసిపోయాయి.
నే మొలిపించిన
స్వప్నాలు వెలిసిపోయాయి.
నువ్వు మాత్రమే మిగిలావు నాకు.
ఈ దుర్భల దేహానికి
కాస్తంత
నమ్మికనివ్వటానికి
నా అనంత శయనాన
రవంత
కన్నీరు నించటానికి
నువ్వు మాత్రమే మిగిలావు నాకు.
పెళ్లిచూపుల్లో
తలుపు సందులోంచి నన్ను చూసి
సన్నగా నవ్విన ఆనాటి
నువ్వు మాత్రమే మిగిలావు నాకు.
బొల్లోజు బాబా
Labels:
కవిత్వం,
వృద్దాప్యం,
సాహిత్యం
Subscribe to:
Post Comments (Atom)
నువ్వు మాత్రమే మిగిలావు
ReplyDelete-----------------
ఈ దుర్భల దేహానికి
కాస్తంత
నమ్మికనివ్వటానికి
నా అనంత శయనాన
రవంత
కన్నీరు నించటానికి
పెళ్లిచూపుల్లో
తలుపు సందులోంచి నన్ను చూసి
సన్నగా నవ్విన ఆనాటి
నువ్వు మాత్రమే మిగిలావు నాకు!
ఇంతే కవిత.. మిగతా అంతా వచనం.. తేడా గమనించగలరు.
subbu gaaru
ReplyDeletethank you sir.
i am considering those lines quoted by you as vachanam. :-)
wah. what a contrast between you and me.
can anybody pl. help
bollojubaba
బొల్లోజు బాబా గారూ ! మీ వచన కవిత బావుంది.
ReplyDeleteబాబా గారు..
ReplyDeleteతొలగించిన వాక్యాల్లో మంచి పదచిత్రాలుండొచ్చు గానీ, అవి కవితకి అక్కరలేని విషయాలు, వివరణలు ఐతే మాత్రం వాటిని వచనంగానే పరిగణించాలి అన్నది నా అభిప్రాయం.
"నువ్వు మాత్రం మిగిలావు" అంటే పోయినవన్నీ ఏమిటో పాఠకుడు ఊహించుకోగలడు. అతని ఊహకి కొంత వదిలెయ్యాలి. పాఠకుల్ని తక్కువ అంచనా వెయ్యకండి :)
yeah. i got your point of view.
ReplyDeletethat poem may may convey what is inteded to by those lines only.
but if we chisel/remove each and every line thinking it as unnecessary, only haiku remains in our hand (i am not undermining haiku here pl.)
a poem needs flesh and blood too.
బాబాగారు, మీరు చెప్పింది నిజమే కావచ్చు కానీ "నువ్వు మాత్రమే మిగిలావు నాకు" అనడంలో ఉన్న అందం ముందు రెండు ఖండికల్లో చెప్పిన విషయాల వల్ల పల్చబడిందనిపించింది. ఒక్కోసారి చెప్పివెయ్యడంకంటే చెప్పకుండా వదిలేస్తేనే కవిత అందం ఇనుమడిస్తుంది.
ReplyDeleteహమ్మయ్య తెలుగులోకి వచ్చేసాను :)
ReplyDeleteఒక్కోసారి చెప్పివెయ్యడంకంటే చెప్పకుండా వదిలేస్తేనే కవిత అందం ఇనుమడిస్తుంది.
అవును అది మీ కవితలలో చాలా బాగా ప్రతిబింబిస్తూంటుంది. అందుకే చాలా లోతుగా ఉంటాయి.
ఒక్కోసారి మిస్ ఫైర్ అయ్యే అవకాశాలూ ఉంటాయి. చదువరి వేవ్ లెంగ్త్ కవితతో మాచ్ అవ్వని సందర్భాలలో. దానికి కవి బాధ్యుడు కాదనే నా విశ్వాసం.
అన్నట్టు
కవితకు ఉండాల్సింది రక్తమాంసాలు కావు "ఆత్మ" అని మీరెక్కడ కౌంటరిస్తారోనని హడిలి చచ్చాను. :-)
రవీందర్ గారు థాంక్యూ
హత్తుకునేలా వుందండి.
ReplyDelete"నువ్వు మాత్రమే మిగిలావు"అని నాలాంటివాళ్ళందరూ రాస్తారు.కానీ కవి చతురత,భావం మిగిలినవాటిలోనే వున్నాయని నా అభిప్రాయం.బాబాగారితో ఏకీభవిస్తున్నాను.అలా అని సుబ్బుగారితో విబేధించలేకపోతున్నాను :)
రాధిక గారు,
ReplyDeleteనా కవితను హెచ్చింపచేయటం కోసం మిమ్ములను మీరు తగ్గించుకోవటం బాగాలేదు. ఆ వాక్యాన్ని నేను అంగీకరించటం లేదు. :-/
మిగిలిన పార్టుకు థాంక్యూ మేడం.
బొల్లోఝు బాబా
This comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteబాబా గారు చాలా బాగుందండి. 'మనసున మనసై బ్రతుకున బ్రతుకై.. తోడొకరుండిన అదే భాగ్యమో...' గుర్తుకు తెచ్చారు. సుబ్బు గారి వాదనకూడా బాగానే ఉంది. కానీ.. ఒక ఘడియ జీలకర్ర బెల్లాలకి మనం రెండు రోజుల సంబరాలూ.. నాలుగు నెలల తయారీలూ చేయడంలేదూ.. పది నిమిషాల ముగింపుకోసం మూడు గంటల సినిమా చూడటంలేదూ.. సుందరకాండ చదివితే.. రామాయణం అర్ధం కాదూ.. కానీ మనం ఎంచుకున్న పదార్ధానికి పూర్తి స్థాయిలో న్యాయం చెయ్యాలంటే నోరారా చెప్పాల్సిందే.. మనసారా హత్తుకోవాల్సిందే.. కానీ చిన్ని చిన్ని వాక్యాల్లో చాటంత చెప్పగల నేర్పు సుబ్బుగారి దగ్గర నేర్చుకోవాల్సిందే.. నేనూ మీ పార్తీనే.. బైదివే.. ఈ నా కవితను ఓ సారి చూడండి.
ReplyDeletehttp://aatreya-kavitalu.blogspot.com/2009/08/blog-post_11.html
బాగుంది బాబా గారు.
ReplyDeleteఏంటో నాకు చాలా సందేహాలు వచ్చేస్తున్నాయి.
ReplyDeleteఏమైనా, హృద్యమైన భావోద్రేకాలని సూటిగా చెప్పాలి అంటే నేను రాయడాన్ని ఆశ్రయించను. కవితా మార్గాన్ని అసలు ఎంచుకోను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నా చేత చెప్పించుకోవాలి అంటే, ముందు తను నాకేంటో అనేది నేను చెప్తుంటే వినాల్సిందే.. :) అలా చెప్పడం మొదలుపెట్టిన తరవాత, తను ఎంత ఎదురు చూసినా అసలు తనని ప్రేమిస్తునానని కూడా చెప్పకపోవచ్చు. కానీ, నా మాటలని తను వెతుక్కుంటే అంత కన్నా బరువైన, విలువైన భావాలని తను ఏరుకోవచ్చు. అసలు ఆ మాటలకోసమే ఎదురు చూసి, ఈ సుత్తంతా ఎందుకు అంటే, తనకి నా భావోద్రేకాలు అర్ధం కానట్టే! అప్పుడు అసలు తను నన్ను అర్ధం చేసుకున్నట్టేనా? ప్రేమించినట్టేనా? కానీ నేను తనని ప్రేమిస్తున్నాను అని నా ప్రతి వర్ణనలోనూ చెప్తున్నానే... నా వర్ణనలకి, నాలో భావావేశానికి ఆమే మీద ప్రేమే ప్రేరణే... కానీ కేవలం నా భావాన్నే వ్యక్తపరచాలి అంటే, నాలో భావావేశాన్ని నేను ఎవరితో పంచుకోను...
తనని చూడగానే పరుగున చెంత చేరి హత్తుకుని నువ్వంటే నాకిష్టం అంటే, అది చెప్పడానికి ఇలా పరుగుపెట్టి హత్తుకోవాలా? అక్కడ ఉండే చెప్పొచ్చు కదా అంటే..?! నా భావావేశం ఏం కానూ? దాన్ని ఎవరితో పంచుకోనూ?
అలంకారాలూ, అతిశయాలు లేని కవితను నేను అన్ని కాలాల్లో ఆస్వాదించలేను. నా వర్ణనని, భావావేశాన్ని పంచుకోలేని తను నా ప్రేమనీ ఆస్వాదించలేదు,నేను కూడా...
ఇంతకీ ఏది కవిత? ఏది వర్ణన? ఏది భావుకత? ఏది వచనం?
కవిత్వం గురించి వ్యాఖ్యానించేంత సామర్థ్యం నాకు లేదు. కానీ ఈ అనవసర చర్చ ఇక్కడ జరగడంవలన అది కవితను నే చదవగానే చెమర్చిన నా కన్నీళ్ళను ఇంకిపోయేట్లు చేసింది. వాక్యం వెనక దాపెట్టి చెప్పే అలవాటు నాకు లేదు. సూటిగా హృదయానికి హత్తుకునేట్లు చెప్పే బాబాగారి స్టైల్ నాకిష్టం. ఇది ఆయనకు పొగడ్తగా కాదు.
ReplyDeleteబాబా గారూ, బాగుంది.
ReplyDelete@దిలీప్
వ్యక్త పరిచేందుకు పదాలు ఒక మార్గం మాత్రమే కదా... అమ్మ, తన ప్రేమని మాటల్లో చెప్తుందా..?
స్పందించే మనసులో పుట్టేవి భావాలు. మనసులో ఊరిన భావం, సమయానికి, సందర్భానికి అణుగుణం గా కురియచ్చు, పారచ్చు, పొంగచ్చు, ఒక్కో సారి ముంచెయ్య వచ్చు కూడా.... ఇలాంటి ప్రక్రియ లో మాటల ఆధారంగా వ్యక్త పరిచిన భావం ఎలాంటి రూపాంతరం అయినా చెందవచ్చు. దాన్ని ఏదో ఒక వర్గంలోకి తోసేసే భారం సామన్యులం నెత్తి మీద వేసుకుంటే ఇల్లాంటి సందేహాలు ఇంకా చాలానే వస్తాయి. ఎందుకంటే భావం వ్యక్త పరిచేది యాదృచ్చికంగా జరిగిపోతుందే తప్ప, నియమాలు, నిబంధనలు పాటించేది ఉండదు.
సాహితీ పోషకులు కూడా స్పందించి వ్యక్త పరిచేవారే. కానీ వారు వ్యక్తపరిచే దానిలో ఒక నైపుణ్యం కనిపిస్తుంది, అందం వెతకక్కర్లేదు. పొందిక దానికదే కూరుతుంది. భావం ఉప్పొంగుతుంది. వీతన్నిటినీ పద్ధతి, క్రమశిక్షణ కట్టిపెడతాయి. అందుకే ఇది వచనం, ఇది కవిత లాంటి వర్గీకరణ తేలికవుతుంది.
వ్యక్తపరచడం లో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి.. అదే యే భావానికైన అందం చేకూర్చేది.
@అందరికీ,
ఇది నా ఉద్దేశం మాత్రమే. తప్పుగా మాటడితే సరిచేయగలరు.
బాబా గారూ, నా అలోచన పంచుకునే వీలు అందించిన మీకు ధన్యవాదాలు.
ఇలాగే రాయాలి అన్న నియమాల్లోకి కవిత్వాన్ని తేవడం కష్టం ఏమో అనిపిస్తుంది నాకు - ఒక్కోళ్ళదీ ఒక్కో శైలి. ఇన్నేళ్ళ సాహితీ చరిత్రలో - ఎన్ని రకాల కవులు, కవితలు పుట్టి ఉండొచ్చు అంటారు?
ReplyDeleteకథ కానీ, కవిత్వం కానీ - ఇలాగే ఉండాలి అన్న రూల్స్ లోకి ఇమడలేవేమో అనిపిస్తుంది. ఒక కవిత మనపై ఎలాంటి ప్రభావం చూపింది, తర్వాత మళ్ళీ చదవాలనిపించిందా? ఇంకోళ్ళతో పంచుకోవాలనిపించిందా - అలా అనిపిస్తే అది మంచి కవిత అవదా??
(పైన మోహన అన్నట్లు - నావి కూడా సొంత అభిప్రాయాలు మాత్రమే. నేను కవిత్వం చదివేది, రాసేది తక్కువే. నాకు అర్థమైనంతలో నా అభిప్రాయాలు ఇవి.]
బాబా గారు : కవిత నాకు నచ్చింది. పొద్దున్నే మంచి కవిత చదివే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
పెద్దల మధ్య చాలా చర్చ జరిగినట్టుంది ..బాబా గారు ,అవేవీ నాకు తెలీవండీ
ReplyDelete"నా అనంత శయనాన
రవంత
కన్నీరు నించటానికి
నువ్వు మాత్రమే మిగిలావు నాకు."
మీ కవిత నా హృదయాన్ని హత్తుకుంది....బావుందండీ !
బాబా గారు.. క్షమించండి. మీ సున్నితమైన కవిత మీద చర్చ లేవదియ్యడం నా ఉద్దేశం కాదు.. కానీ ఉదయం మీ కవితలోని కామెంట్లని చూసినప్పుడు అనవసరంగా ఆ కామెంటు పెట్టానా అనిపించింది. ఎమ్మెస్ నాయుడు రాసిన కింది కవిత చూడండి.
ReplyDeleteనువ్వు నన్ను ...
------------
పాతిపెట్టిన విత్తనంలోని చిగురాకూ నిద్రలో ఉంది
ఎందుకు నన్నీ వాక్యంముందు లేని అద్దంలో ఉంచుతావ్
తిరిగి చూడని అర్థాల్తో కాలం నల్లబడింది
ప్రేమే మరొక నలుపు కుంచె
నిస్తేజమైన వస్తువులన్నీ కదులుతున్నాయ్
నా నిరీక్షనే ప్రయాణించట్లేదు
ఏ వెలితీలేని అక్షరాలమధ్య
మళ్ళీ అక్షరం రాయటమే దుఃఖం
నువ్వు నన్ను సమాధిచేసుకునే నిశ్శబ్దానివి
-- * * * ---
ఏ వెలితీలేని అక్షరాల మధ్య మళ్ళీ అక్షరం రాయడమే దుఃఖం.. కవితలో ఒక్క అనవసర పదాన్నీ సహించలేనితనానికి పరాకాష్ట ఈ వాక్యాలనిపిస్తుంది.
నమస్సులతో,
సుబ్రహ్మణ్యం
సుబ్బు గారికి
ReplyDeleteనమస్కారములు
మీ అభిప్రాయాన్ని మీరు చెప్పారు. ఇందులో బాధ పడాల్సిన అంశమేమీ లేదు.
మీపై కానీ, మీ కవిత్వంపై కానీ నాకేవిధమైన అపోహలు కానీ, దురభిప్రాయాలు కానీ లేవని మనస్పూర్తిగా విన్నవించుకొంటున్నాను.
మీరు చెప్పినదానిలోని విషయం పై నాకు ముందునించీ కొంత పేచీ ఉంది. అదే క్లుప్తత గురించి. దానిపై మునుపు ఆవకాయ.కాం లో పాల్గొన్న చర్చలు మీకు తెలిసిందే.
ఇక ఇక్కడ చెప్పబోతున్న అంశాలు నా పై కవితను దృష్టిలో ఉంచుకొని చేస్తున్న సమర్ధింపుగా దయచేసి భావించరాదు.
మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను. అదే సమయంలో విభేదిస్తున్నాను కూడా. ఒక కవితను అదే పనిగా పదే పదే చిత్రీ పట్టుకొంటూ పోతే, గుప్పెడు అక్షరాలు మాత్రమే మిగుల్తాయి. అది రససిద్దిని కలిగించటంలో విఫలమౌతుందన్న అనుమానం. కవి రససిద్ది గురించెందుకు ఆలోచించాలి, అతని పని రాసుకుపోవటమే అని ఒక సారి ఓ పెద్దాయన కోప్పడ్డారు. కానీ నేనే ఒక పాఠకుని గా అలాంటి కవితలు చదివినప్పుడు, నాకు రససిద్ది కలుగకపోగా, నా టైమంతా వేస్ట్ చేసాడు అని తిట్టుకొన్న సందర్భాలూ ఉన్నాయి.
కవిత్వం భిన్నపొరలలో కనిపించటం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పొరలో కనిపించటం అని కాదని నా ఉద్దేశ్యం. ఒక్కనికే భిన్నపొరలలో కనిపించిన నాడే అది ఉత్తమ కవిత్వం అనిపించుకొంటుంది. ఇప్పుడు రాస్తున్న కొంతమంది కవితలలో వస్తున్న చిక్కే ఇది. అంటే అలాంటి కవిత (ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కొండొకచో పరస్పరవిరుద్దమైన అర్ధాలలో, ఒకరి కోణం మరొకరికి కనిపించని రీతిలో) అస్పష్టత కు దగ్గరగా ఉన్నట్లు నా అభిప్రాయం. కవిత్వంలో అస్పష్టత అవసరమా?
సరే మీరు ఉటంకించిన పద్యం గురించి మాట్లాడుకుందాం
నిర్మొహమాటంగా చెప్పాలంటే నాకు చాలా వాక్యాలు అర్ధం కాలేదు. బహుసా అవి ఒక కవితలోని కొన్ని పంక్తులు కావొచ్చు. కనీసం వాక్యమైనా అర్ధం కావాలిగా. రెండవ వాక్యమైతే మరీనూ.
రెండు మూడవ వాక్యాల అన్వయం నా బుర్రకు అందటం లేదు.
ఏ వెలితీలేని అక్షరాలమధ్య
మళ్ళీ అక్షరం రాయటమే దుఃఖం
అన్న వాక్యం అర్ధమైంది కానీ సందర్భం తెలియటం లేదు. దీనికీ దీని పై వాక్యాలకూ ఉండాల్సిన లింక్ అందటం లేదు.
సరే నా బుర్ర చిన్నది కనుక అర్ధం కావటం లేదు అని అనుకొంటాను. అలా ఒప్పుకోవటానికి నేనే భేషజాలకూ పోను.
తెలుగు కవిత్వంలో ఇలాంటి అస్పష్టత మో గారి చలవే చాలా మట్టుకు. తిలక్, ఆశారాజు, శిఖామణి, ఎండ్లూరి, కొండేపూడి నిర్మల, జింబో, కొప్పర్తి, అఫ్సర్, ఆకెళ్ళ హెచ్చార్కె, రేవతీ దేవి, చినవీరభద్రుడు వంటి వారల కవిత్వంలో ఇలాంటి అస్పష్ట ఛాయలు కనిపించవు. చెప్పదలచుకొన్న విషయాన్ని మంచి ఎత్తుగడతో మొదలెట్టి, మంచి నడకనిచ్చి, అందమైన ముగింపుతో ముగుస్తాయి వారి కవితలు. ఇస్మాయిల్ గారిది మరొక శైలి. ఆయన క్లుప్తతను పరాకాష్టకు తీసికెల్లి వదిలారు. (సుబ్బుగారి కవిత్వం కూడా అల్లానే అనిపిస్తూంటుంది నాకు).
చదువరుల మెదళ్లలోకి తేటగా, హాయిగా వికసించేలా కవిత్వానికి అంతటి వెసులుబాటు ఎందుకివ్వరు?
వాక్యాల మధ్య వాక్యాలను ఎగరగొట్టేసి, దాన్నోబ్రహ్మ పదార్ధంగా అప్పుడప్పుడూ ఓ పొడుపుకధకంటే అన్యాయంగా తయారు చేసి, అదే కవిత్వమని ఎందుకు కొంతమంది భావిస్తారో నాకు అర్ధం కాదు.
నా పై వాదనను సమర్ధించుకోవటానికి ఇక్కడ మరికొన్ని ఉదాహరణలను ఇస్తున్నాను.
తరగని నడకల్ని వేలాడేసిన సమయాన్ని పీలుస్తూ
రాత్రి మెల్లగా కూల్చే సంభాషణ
ఇద్దరమూ ఎదురుగానే కూర్చున్నాం
తన గాజు బిందువుల్ని నా తలమీదుగా ఒదులుతూ
అరచేతులు కలగనే కన్నీళ్లు బయటపడని రోడ్డు పగులుతూ.... (పేజి.నం: ౩ నిఘాలు, వృత్తాలూ, వెల్తురారిన కళ్లు)
ఇంద్రధనస్సుతో నది ఘనీభవించాకా....
కత్తితో నరికారు
కదలని గుర్రాన్ని... రోడ్లపై రైళ్లని లాక్కుపోతూ....
వాళ్లంతా గుడిసెల్లో నిద్రించారు. (పేజి.నం: 10 నిఘాలు, వృత్తాలూ, వెల్తురారిన కళ్లు)
సరే ఒక పూర్తి కవితను చూద్దాం
పునరుత్ధానం
సృష్టి బిందువుని తాకుతూ
సన్నని నాచువేళ్ల కలవరమూ ... పిస్తోలు
స్వర్గాన్నీ తుడువలేదు
ఆవిరిలో కమిలిన నీటి పేటిక
వొరలుగా రాలిన నూతిలో రాతికేకలు కూలిపోయి
జల్లుల వరండాపై గీసిన చివరి కుంచె, దాని రక్తమూ
నిద్రించే వెన్నెముకల పిచ్చి చూపులూ
పొదివి పట్టుకొనే కాటుక జూలు
మ్లానంగా వేలాడుతూ డైరీ పొరల్ని కాల్చే రోదన
కొండ లావలకి పాకిన ఛాయా పాదాలు
చూపుల్నిండా ఊదుతూ
భాస్వరం.... ముద్రించిన మూడో కన్ను పోరాటం
ఎందుకనిలా...
మరణించే ముంచుకొస్తావు (పేజీ: 25 సంకలనం: నిద్రతలుపు అను పొడవైన గది వేళ్లు)
ఈ కవి అత్యంత ప్రతిభాశాలి. సందేహం ఏమీ లేదు. గొప్ప ప్రతీకలని తీసుకొంటున్నాడు. మాంచి భాషాపటిమ ఉంది. శబ్దం పై గ్రిప్ ఉంది. అన్నీ ఉన్నాయి, కానీ తాను ఎవరికోసం ఈ కవితను రాసాడో అతనికి అర్ధం కాకుండా చేయటం ధర్మమా?
బొల్లొజు బాబా
23456789
బాబా గారు, మీ వివరణలు ఏ కవితకి సంభందించిన చర్చలో కనపడినా విడవక చదువుతాను. పూర్తి రచనలు అందుబాటులో లేకపోవటం/సమయాభావం/కాసింత అనాసక్తి మూలంగా తెలియనెవెన్నో మీరు ఒకచోట వ్రాస్తారు. ఈ కవిత నాకు చాలా నచ్చింది.
ReplyDelete"నువ్వు మాత్రమే మిగిలావు నాకు" ఇది వేదమంత్రం. ఏ పెళ్ళి మంత్రానికీ ఇంత బలం లేదు.
నేను మీ బాణీనే లేదూ అసలు ఓ బాణీకి చెందనేమో కూడా. స్పందన, భావన చూస్తాను. భాష, స్పష్టత తెలియకనే వెనక్కి తోసేస్తాను. ఈ బ్లాగ్ నా వరకు పరిచయం చేసిన మంచి కవి/విమర్శకులు మీరు.
ఆత్రేయ గారు, అన్యాయం :) మీ ఆ కవిత మొదట ఆ చిత్రం చూడగానే ఈ కవిత చదవకముందే నా వ్యాఖ్యలో ప్రస్తావించాలనుకున్నాను.
:))
ReplyDeleteచివరి రెండు ఖండికలు సూపర్. మొదటి ఖండికలు చివరి రెంటికి ఉపోద్ఘాతంలా ఉన్నాయి. విన్నకోటవారి కవితలు కొన్ని ఇలానే సా...గుతాయి. అయినా బాగుంటాయి ఈ కవితలానే. కవిత్వంలో క్లుప్తత అవసరం అనే విషయంలో నాకైతే ఎటువంటి సందేహాలూ లేవు.
బాబాగారు, కవిత నా మనసుకు హత్తుకుంది.
ReplyDeleteసుబ్బూ చెప్పిన విషయాలతో నాకు విభేదం లేదు. కాని వాటిని ఈ కవితకి అన్వయించడంతో నేను ఒప్పుకోలేను. ఉదాహరణకి "ఒక్కోసారి చెప్పివెయ్యడంకంటే చెప్పకుండా వదిలేస్తేనే కవిత అందం ఇనుమడిస్తుంది." అన్న వాక్యం నేను పూర్తిగా అంగీకరిస్తాను. ఇందులో "ఒక్కోసారి" అన్నది కీలక పదం.
"కవితలో ఒక్క అనవసర పదాన్నీ సహించలేనితనానికి పరాకాష్ట ఈ వాక్యాలనిపిస్తుంది." - నిజమే. "అనవసర" అంటే ఏమిటన్న దగ్గరే వస్తుంది చిక్కల్లా. దీనికి ఎవరి మనసు వాళ్ళకి ప్రమాణం.
బాబాగారు, దీని గురించి ఇంత చర్చ అనవసరం. మీరు చెప్పిన అస్పష్ట కవితలకీ ఇదే వర్తిస్తుంది. మీ మనసు ఆ కవిత్వానికి "ట్యూను" కాలేదు కాబట్టి దాని మీద మీకు అసహనం కలిగింది. అలాగే మీరు రాసిన కవితకి సుబ్బూ మనసు ట్యూను కాలేదు కాబట్టి అందులో చాలా వాక్యాలు అక్కరలేనివిగా అనిపించాయి.
కామేశ్వరరావు గారికి,
ReplyDeleteచర్చ సుబ్బుగారి మీద కేంద్రీకృతం అవ్వటం నాకూ ఇష్టం లేదు. కనుక ఆయనను పక్కన పెట్టేసి, ఆయన వాదనను మాత్రమే నేను తీసుకొంటున్నాను.
మీ మనసు ఆ కవిత్వానికి "ట్యూను" కాలేదు కాబట్టి దాని మీద మీకు అసహనం కలిగింది.
బాగా చెప్పారు. మిమ్ములను నేను కోరేదేమిటంటే, నేనుటంకించిన పాదాల అర్ధాలను దయచేసి మీరు కొంచెం "ట్యూను" చేసుకొని చెప్పండి. ప్లీజ్. :-)
నేనెందుకిలా అడగవలసి వచ్చిందంటే, ఈ మధ్య ఇదో స్టైల్ గా మారింది. అర్ధం కాకుండా రాసేసి అదే గొప్ప కవిత్వమని బుకాయించటం. ఇలాంటి పోకడలు, నే పైన చెప్పిన కవుల కవిత్వంలో నాకుతెలిసి కనిపించలేదు.
నే పైన ఉటంకించిన కవితా పుస్తకాల సమీక్ష గతనెల "నేటినిజం" పత్రికలో పడింది. సదరు విమర్శకుడు, ఈ కవిత్వాన్ని ఇలియట్ వేస్ట్ లాండ్ కవిత్వంతో పోల్చి, అది అప్పుడుకూడా మొదట్లో అర్ధం కాలేదు, తరువాత తరువాత గొప్ప కవిత్వంగా పేర్గాంచింది అని పేర్కొన్నాడు. ఈ పోలికను ఎలా అర్ధం చేసుకోవాలో అర్ధం కాలేదు.
సరే మరో బేసిక్ ప్రశ్న, కవిత్వం అనేది అర్ధం కావాలా అక్కర్లేదా?
అర్ధమైపోతే చవక కవిత్వమూనూ, అర్ధం కాకపోతే గొప్ప కవిత్వమూనా?
చర్చలలో జరిగే విషయప్రసరణ మనలను (నన్ను) మెరుగుపరుచుకోవటంలో సహకరిస్తుందని నమ్ముతూ.....
భవదీయుడు
బొల్లోజు బాబా
ఆహా... చక్కటి చర్చ జరుగుతోంది నాలాంటి వాళ్ళు కొద్దో గొప్పో నేర్చుకోడానికి :)
ReplyDeleteనేను అనుకునేదైతే, సూటిగా ఖంగుమనే మాటల్తో కుండ బద్దలు కోట్టే శ్రీశ్రీ శైలి అయినా, చిన్న చిన్న వాక్యాల్లో అనంతమైన అర్ధాన్ని ఇమిడ్చే మరొకరి శైలి అయినా అంతర్లీననంగా ఒక స్పష్టత ఉంటుంది. అప్పుడే ఏ కవిత ఐనా మన్స్ఫుర్తిగా నచ్చుతుందేమో !
అనంతమైన ప్రపంచంలొ అంతా మన స్వంత మనుకుంటాం. కాని దినాలు గడిచిపోతుంటే, సత్తువ ఉడిగిపోతుంటే కొంతైనా మనది కాకపోతుందా అని ఆశ పడతాం. చివరికి నీ చిటికెనవేలు పట్టుకుని, తలవంచుకుని నీ వెంట వచ్చిన ఒకనాటి నీ వసంతం ఇప్పటికీ నీకు వసంతంగానే కనిపించడం నీ గొప్పదనం. కాని ఆ వసంతానికి మటుకు నువ్వు ఎప్పుడూ సువాసనలతో గుబాళిస్తున్న నిండైన పూలతోటవే.. ఆ గుబాళింపులని ఎప్పుడూ ఆమె ఆశ్వాదిస్తూనే ఉంటుంది. చెప్పలేదనకపోయేవు.. చెప్పకుండానే నీకు తెలిసివుండాలే..
ReplyDeleteఅదే తెలిసిపోయిందిగా..
ReplyDeleteబాబా గారూ,
ReplyDeleteఏం చెప్పమంటారు! గుండెలో మధురమైన శూన్యాన్ని నిండా నింపేశారు.
చర్చ జోలికి వెళ్ళి ఆ మాధుర్యాన్ని కోల్పోవాలనుకోవడం లేదు.
బాబాగారు,
ReplyDeleteమీరడిగిన ప్రశ్నలకి నా సమాధానాలు ఇస్తున్నాను. వాటికి మీరు అంగీకరించక పోవచ్చని ముందే హెచ్చరిస్తున్నాను. ఇవి కేవలం నా వ్యక్తిగత అభిప్రాయాలు. వీటికి ఎలాంటి "ప్రామాణికత" లేదు.
>కవిత్వం అనేది అర్ధం కావాలా అక్కర్లేదా?
నేను వేసే ఎదురు ప్రశ్న, ఎవరికి? ఒక కవి వ్రాసిన కవిత్వం అందరికీ 'అర్థం' కాకపోవచ్చు. ఒకవేళ అయినా, 'ఒకేలా' అర్థం కాకపోవచ్చు. అసలంటూ ఏ ఒక్కనికైనా అర్థం అవ్వాలా అని మీరు ప్రశ్నిస్తే, అవ్వాల్సిన పని లేదని నా జవాబు. అర్థమవ్వడం అనేది మన మెదడులో "విశ్లేషణ" చేసే భాగానికి చెందిన కార్యక్రమం. దాని ద్వారా "అర్థం" చేసుకొని, అది "అనుభూతి"కి సంబంధించిన భాగాన్ని ప్రేరేపిస్తే మనం ఆ కవితని అనుభవిస్తాం. ఇది సాధారణంగా జరిగే పని. ఆ లింకు తెంచేసి, "విశ్లేషణ" చేసే భాగాన్ని గందరగోళ పరచి, దానిద్వారా వింత అనుభూతిని కవిత్వం ఎందుకు కలిగించ కూడదు?
>>అర్ధమైపోతే చవక కవిత్వమూనూ, అర్ధం కాకపోతే గొప్ప కవిత్వమూనా?
ఇది నా ఉద్దేశం కాదు. దీన్ని నేను అంగీకరించను. అసలు కవిత్వాన్ని బేరీజు వెయ్యడమే నాకు కిట్టదు. మరి విమర్శ ఎందుకు అంటారా. మనకి నచ్చిన కవితలో, నచ్చిన అంశాలని మనం వివరించ గలిస్తే అది మరో పాఠకునికి ఉపయోగపడే అవకాశం ఉంది, అలాంటి మరికొన్ని కవితలు స్వయంగా ఆస్వాదించడానికి. అదీ విమర్శ వల్ల ఉపయోగం. మనకి కవిత నచ్చలేదనుకోండి, దాని గురించి ఇంక విమర్శ దేనికి? ఇంకో పాఠకునికి కూడా అది నచ్చకుండా చెయ్యడం వలన ప్రయోజనం ఏమైనా ఉందా?
కవిత్వాన్ని బేరీజు వెయ్యాలంటే దానికొక నిర్దిష్టమైన framework అవసరం ఉంటుంది. కవిత్వాన్ని రచించేవాళ్ళూ దాన్ని ఆస్వాదించేవాళ్ళూ, ఈ frameworkని ఆమోదించాలి. ఆ framework కాలానుగుణంగా కొన్ని మార్పులకి గురి కావచ్చు. ఇలాంటి వ్యవస్థ ఉంటే కవిత్వాన్ని బేరీజు వేసి విలువగట్టే పని సాధ్యమవుతుంది, ఆ framework పరిమితిలో. పూర్వ కాలంలో ఇది ఉండేది. ఇప్పుడది లేదు. మహా అయితే, అనేకానేక frameworks ఉన్నాయి అనుకోవచ్చు. ప్రతివాడూ తనకిష్టమైన framworkలో ఉన్న కవిత్వమే కవిత్వమని భావిస్తాడు. లేదా తనే ఒక కొత్త framework సృష్టిస్తాడు. తన frameworkలో లేని కవిత్వాన్ని విమర్శిస్తాడు, అసలు కవిత్వమే కాదంటాడు. తన frameworkని స్థాపించడానికి ప్రయత్నిస్తాడు.
ఇది మంచిదనో చెడ్డదనో నేను చెప్పడం లేదు. జరుగుతున్నది ఇది. అయితే ఒక framework దృష్టితో చూస్తూ, అందులోకి ఇమడని కవిత్వాన్ని కవిత్వం కాదని, లేదా చవకబారుదని విమర్శించడం సమంజసం కాదని నా ఉద్దేశం.
>>మిమ్ములను నేను కోరేదేమిటంటే, నేనుటంకించిన పాదాల అర్ధాలను దయచేసి మీరు కొంచెం "ట్యూను" చేసుకొని చెప్పండి. ప్లీజ్. :-)
పైన నేనిచ్చిన వివరణ చదివిన తర్వాత కూడా ఒకవేళ ఈ ప్రశ్న మళ్ళీ మీరడిగితే, నేను చెప్పింది మీకు అర్థం కాలేదని అర్థం :-)
వావ్ వావ్ .. చాలా ఏక్షను మిస్సయిపోయానే.
ReplyDeleteచర్చ అంతా ఫాలో అవలేదు. ఈ వ్యాఖ్య అసలు పద్యానికీ, మొదట్లో సుబ్రహ్మణ్యంగారికీ బాబా గారికీ జరిగిన చర్చకి మాత్రం పరిమితం.
నా వుద్దేశాలివి -
1. పద్యం చాలా బావుంది.
2. క్లుప్తత అవసరం కవిత్వంలో. కానీ అన్ని రూల్సుకి లాగానే దీనికీ ఎక్సెప్షన్సు ఉన్నాయి. ఈ పద్యం విషయంలో పద్యం మొదట్లో వచ్చే చరణాలు (అవి ఖండికలు కాదు బాబోయ్ - ఖండిక అంటే పూర్తి పద్యం) అనవసరపు సాగతీత కాదనే నకనిపించింది.
3. అలాగని అందరిదీ అదే అభిప్రాయం కాకపోవచ్చు. దట్సోకే.
4. చర్చ కూడా అనవసరం కాదు. చర్చించే వాళ్ళు రసహృదయులూ, సరసహృదయులూ అయినప్పుడు, చర్చ కూడా రసవత్తరంగానే ఉంటుంది, చదువరులకి పనికొచ్చేదిగానూ ఉంటుంది.
@ వేమన .. శ్రీశ్రీ శైలి కుండ బద్దలు కొట్టే శైలి అనేది అపోహ మాత్రమే. ఉదాహరణకి, కవితా ఓ కవితా, జయభేరి .. ఇత్యాది కవితల్లో చాలా మార్మికత ఉంది.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete@ కొత్తపాళీగారూ - నాకైతే శ్రీశ్రీ 'కవితా ఓ కవితా'తో సహా, ఏ కవిత తీసుకున్నా, మార్మికత ఉంటే ఉండవచ్చుగాక, Force behind the words ఐతే చాలా ఎక్కువ అనిపిస్తుంది, నచ్చుతుంది కూడా. 'ఖడ్గసృష్టి ' సంపుటి మటుకు వేరే అనుకోండి. పద్యం, గేయం, కవిత్వం కలగలిపిన శైలి, శ్రీశ్రీ శైలి అనే ధైర్యం చేస్తాను :)
ReplyDelete@బాబాగారు - కవిత మటుకు బావుంది.
ఒక పని చేయండి -
ReplyDeleteనువ్వు మాత్రమే మిగిలావు నాకు అన్న పాదం తో సహా పై పాదాల్ని ఒక కవిత గానూ, అదే పాదంతో చివరి పాదాల్ని ఇంకో కవిత గానూ విడదీయండి. మీకు ఒకటికి రెండు కవితలు , చాలా ఆత్మలకు శాంతి :-). ఆ పాదాన్ని పటం కట్టడం కోసమే చెక్కిన ఫ్రేము కదా మిగతాదంతా!
మీరు ఒక్క పాదం రాసినా, అదే వాక్యాన్ని పుస్తకంగా విస్తరించినా చిట్టచివరికి పాఠకుడి మనసులో కలిగిన అనుభూతి ఒక్కటే గీటురాయి. కొందరికి ఆ పాదమే చాలు, కొందరికి దాని ముందు వెనకలూ కావాలి. కొందరికి ఆత్మ చాలు, రూపం సృజించుకోగలరు. కొందరికి చక్కగా చెక్కిన రూపమే కాక దానికి అలంకరణలూ కావాలి. ఏం చేస్తాం, జిహ్వకో రుచి.
పేచీ ఎక్కడంటే ఇదే కవిత్వం అని కొలతలూ, గీతలూ పెట్టుకోవడం దగ్గర. సృజనాత్మకత ఏ నియమాలకీ లొంగదు.
స్పందించిన మిత్రులందరకూ కృతజ్ఞతలు
ReplyDeleteవేమన గారూ
చిన్న చిన్న వాక్యాల్లో అనంతమైన అర్ధాన్ని ఇమిడ్చే మరొకరి శైలి అయినా అంతర్లీననంగా ఒక స్పష్టత ఉంటుంది.
మీరన్నది కరక్టే. నానుంచి మరొక్క పరిశీలన. కుండబద్దలు కొట్టినట్లు చెప్పే కవితలలో "ఒక నూతన ఆలోచన" లేకపోతే చాలా పేలవంగా ఉంటాయి. నర్మగర్భంగా చెప్పేవాటిలో ఒక నూతన దృష్టి కనిపిస్తూంటుంది. స్పష్టత అనేది అంతర్లీనంగా లేనప్పుడు గందరగోళమే మిగులుతుంది.
శ్రీలలిత గారూ,
మీ వాఖ్య లోతుగా చాలా చాలా బాగుంది. నిజమే కదూ. అలాంటి పరస్పరానురాగమే, సహజీవనాన్ని ఆనందమయం చేసేది. థాంక్యూ మేడం.
ఉషగారూ, సుజాతగారూ, పరిమళం గారూ థాంక్యూ
భైరవభట్ల గారికి
:-//
పై ఎక్స్ప్రెషను ఎందుకో అర్ధం అయిందనుకొంటానండీ.
ఎందుకంటే
ఓ పెద్ద డిస్క్లైమర్ ఒకటి పెట్టేసి మొత్తానికి అన్నీ వేస్ట్ అని తేల్చేసారు. :-)
మిమ్ములను నేను అడిగిన ప్రశ్నలివి
౧. కవిత్వం అనేది అర్ధం కావాలా అక్కర్లేదా?
౨. అర్ధమైపోతే చవక కవిత్వమూనూ, అర్ధం కాకపోతే గొప్ప కవిత్వమూనా?
మీ వాఖ్యద్వారా నేనర్ధం చేసుకొన్నవి ఇవి.
1 కవిత్వం అనేది అర్ధం కావక్కరలేదు.
2.ఒక కవిత అర్ధం కాకపోవటం కూడా ఒక అనుభూతే
3. మనము ఇదీ కవిత్వం అని అనుకొంటున్న framework లో లెని కవిత్వాన్ని కవిత్వం కాదు అని అనకూడదు.
4. చివరలో మరో డిస్కైమర్ :-)))
మొదటి పాయింటుకు: నెట్లో ఎక్కడో హైకూ జెనెరేటర్ అని ఓ సాఫ్ట్ వేర్ చూసాను. కొన్ని పదాలతో హైకూను అదే తయారు చేసి పెడుతుంది. అలా వచ్చిన కవిత్వపు ప్రామాణికత ఎంత? అర్ధాలు ఎలా ఉంటాయో నేచెప్పలేను కానీ, కవిత్వం అనేది ఒక చేతనతో, కల్పనతో సాధించబడే ఒక ప్రక్రియ అని నా నమ్మకం. మరి అలాంటి ప్రక్రియద్వారా వచ్చినదానికి, అదే చేతన అదే కల్పన కలిగిన మరో మెదడుకు అర్ధం కావాలన్నది దానికుండాల్సిన ప్రధమ లక్షణమని నా అభిప్రాయం. (ఇక్కడో నానుంచో డిస్క్లైమర్ )
అలాకాకుంటే, నిఘంటువులోని పదాలను రాండం గా పేర్చుకొంటూ ఒక పేజీ మేటరు తయారుచేసి దాన్ని ఓ కవితగా ప్రచారించుకోవచ్చు. (నేను పైన ఉదహరించిన కవితలు అలాంటివేమోనని నా ప్రగాఢ అనుమానం)
రెండు: ఒక కవిత అర్ధం కావట్లేదు అంటే ఆ కవి అసమర్ధత క్రింద నేను పరిగణిస్తాను. అతను తనకు కలిగిన అనుభూతినో/ఆవిష్కరణనో/ఆవేశాన్నో అక్షరాలలోకి సరిగ్గ ఒంపలేకపోయాడని నమ్ముతాను.
అలా అర్ధంకాకపోవటం కూడా ఓ టెక్నిక్కే అని వాదించటం విచిత్రంగా ఉంది. (ఇదివరలో "జీవితమే అర్ధం కాకుండా ఉన్నప్పుడు దాన్ని ప్రతిబింబించే కవిత్వం కూడా అలానే ఉంటుంది" అని ఎవరో వాదించారు. జీవితం ఎంత సంక్లిష్టమైపోయినా, ఆహార,నిద్రా,మైధునాలు ఎలాగైతే మారిపోలేదో అనుభూతి కూడా మారలేదనే నా అభిప్రాయం)
వాక్కు వెంబడి అర్ధం రావాలన్నది ఈనాటి మాటా?
మూడు:కొంతవరకూ నిజమే.. కానీ అకవిత్వాన్ని అకవిత్వమనీ, చెత్త కవిత్వాన్ని చెత్తకవిత్వమనీ చెప్పవచ్చనుకుంటాను. ఈ నిర్ణయం తాను నిర్ధేశించుకొన్న పరిమిత దృష్టితో కాక, ఒక విశాలమైన ప్రాతిపదికపై జరగాలి. ఏది విశాలం ఏది పరిమితం అనేదానికి కొలతలు కష్టమే. ఇక్కడ అనుభూతి మాత్రమే ప్రధాన పాత్ర వహిస్తుంది.
అన్ని ఆలోచనలకూ తెరుచుకొని ఉండే, ఒక వొరేషియస్ రీడర్ కి ఏది అకవిత్వం, ఏది చెత్తకవిత్వం అనేది ఖచ్చితంగా హృదయానికి అర్ధమయ్యే విషయమేనని నా నమ్మకం.
నాలుగు: పైవి కూడా నా వ్యక్తిగత అభిప్రాయాలు. ;-)
కొత్తపాళీగారూ థాంక్సండీ,
శ్రీనివాస్ గారు అంతే నంటారా. రెండేం ఖర్మ ఓ అయిదారు నానీలు జల్లించవచ్చు ఈ కవితలోంచి :-).
కొత్తపాళీగారికి, మరియు ఇతర బ్లాగ్మిత్రులకు చిన్న విన్నపం. ఈ క్రింది ప్రశ్నలపై మీ అభిప్రాయాల్ని పంచుకోండి దయచేసి.
౧. కవిత్వం అనేది అర్ధం కావాలా అక్కర్లేదా?
౨. అర్ధమైపోతే చవక కవిత్వమూనూ, అర్ధం కాకపోతే గొప్ప కవిత్వమూనా?
భవదీయుడు
బొల్లోజు బాబా
౧. కవిత్వం అనేది అర్ధం కావాలా అక్కర్లేదా?
ReplyDelete౨. అర్ధమైపోతే చవక కవిత్వమూనూ, అర్ధం కాకపోతే గొప్ప కవిత్వమూనా?
------------------------------
కవిత్వం ప్రధానంగా అర్థకళ.అర్థంతోనే కవిత్వానికి ప్రమేయమెక్కువ.
బహుళార్థాలు సిద్ధించేలా రాయడం కవిత్వంలో సర్వసామాన్యం.కాబట్టే
కవిత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఇన్ని గొడవలున్నాయి.కవిత్వం అనేది
అర్థం కావాలా అంటే అవుననే సమాధానం.కానీ వెంటనే మరో ప్రశ్న
పుట్టుకొస్తుంది..ఎవరికి అర్థం కావాలి ?? అని .అన్ని కవితలు అందరికీ
అర్థం కావు.నాకు సులువుగా అర్థమైనది ఇతరులకు ఏమాత్రం తలకెక్కక
పోవచ్చు.ఇతరులకు సులువుగా అర్థమయినది నాకు బోధపడక పోవచ్చు.
కావున,అర్థం కావడం,కాకపోవడమన్నది కవిత్వస్థాయిని నిర్ణయించదు.
ప్రస్తుత కవిత:వృద్ధ జంట
క్లుప్తత వివరింపలేని బ్రహ్మపదార్థం కాదు.భావాంతం,పదాంతం
ఒకే సారి జరగడమే క్లుప్తత.ప్రస్తుత కవితలో క్లుప్తతకు వచ్చిన
లోటు లేదు.గత యవ్వనం,గత వైభవం రెండు ఖండికల్లో చెప్పి
ప్రస్తుతానికి- "నువ్వు మాత్రమే మిగిలావు నాకు " అని ఆగి
ప్రస్తుత నిస్సహాయ స్థితి,మళ్ళీ నల్ల మేఘానికి వెండి అంచులా
పెళ్ళినాటి జ్ఞాపకం ,తిరిగి "నువ్వు మాత్రమే మిగిలావు నాకు "
అన్న ఓదార్పు.అంతటితో అయిపోయింది కవిత.కవితకు ఒక
క్రమ పరిణామం ఉంది,కాబట్టి తొలి ఖండికలను తొలగిస్తే చివర
చెప్పినది తేలిపోయేది.ఎత్తుగడ దెబ్బతింటుంది.నాకుచూడగా
ప్రస్తుత కవితలోని లోపం క్లుప్తత కాదు,పదప్రయోగం:
వాసనలను ఎగరేయడం,విజయాలను పూయించడం విషయంలో ఇంకోసారి
ఆలోచించుకోవాలి.స్వప్నాలను మొలిపించడం కొంతవరకు ఫరవాలేదు.
చర్చను పరిశీలిస్తే క్లుప్తత,అస్పష్టతల విషయంలో-
అవి కవిత్వస్థాయిని పెంచే,దించే విషయాల్లో చాలా
అయోమయం నెలకొని ఉందనిపిస్తుంది.దానికి గలకారణం
భిన్న కవిత్వాలను ఒకే కొలబద్దతో కొలిచే ప్రయత్నం.
అధివాస్తవిక కవితలను,మామూలు కవితలను ఒకేగాటన
కట్టివేయరాదు.అధివాస్తవిక కవితలు మనకు నచ్చినా
నచ్చకపోయినా వాటిని నిర్ణయించే ప్రమాణాలు వేరు.
వాటి మీద చర్చ ప్రస్తుతానికి అప్రస్తుతం.బాబా ఉదహరించిన
కవుల చిట్టా తప్పు దారి పట్టిస్తుందనడంలో సందేహం లేదు.
తిలక్ ను అందరిలో కలిపెయ్యడం పెద్ద తప్పు.మిగిలిన వారిలో
చాలా మందిలో ఘరానా దోషాలున్నాయి.ఏ మంచి కవైనా క్లుప్తత
విషయంలో సదా జాగరూకత వహిస్తాడు.ఇస్మాయిల్ ఘనతను
క్లుప్తతతో కొలవలేము.క్లుప్తత అంటే కట్టె,కొట్టె,తెచ్చె అని
రామాయణాన్ని మూడు ముక్కల్లో చెప్పడం కానే కాదు.
మనవాళ్ళు హైకూను కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదని
నా అభిప్రాయం.అది జపనీయ సంస్కృతిలో విడదీయరాని
భావం.దాని రచనా/విమర్శనా పద్ధతులు పూర్తిగా వేరు.
కవిత్వాన్ని అణాకాణీ స్థాయికి దించివేయడానికి మంచి
మందీ మార్బలంతో బయల్దేరుతారు మన యూనివర్సిటీ
పండితమ్మన్యులు;అందులో భాగమే నానీ;వాటి గురించి
ఎంత తక్కువ మాటాడుకుంటే అంత మంచిది.
కామేశ్వరరావు గారి వ్యాఖ్యల్లో అసమంజమైనదేమీ లేదు.
ప్రశాంతచిత్తంతో చదవకపోతే విపరీతమైన వ్యాఖ్య అనిపించే
ప్రమాదం లేకపోలేదు;విషయం అటువంటిది కావున అది
మామూలే.మోహన గారు చెప్పినంది సర్వ సమగ్రంగా ఉంది.
ఇతర పాఠకులు కూడా ఎంతో చక్కగా తమ అభిప్రాయాలు
వ్యక్తం చేశారు.ఇది చాలా గొప్ప విషయం.మన సాహిత్యానికి
గొప్ప భవిష్యత్తు ఉందనడానికి ఇది నిదర్శనం. శుభం.
తమ్మినేని యదుకుల భూషణ్.
భూషణ్ గారికి
ReplyDeleteసందేహ నినృత్తి చేసినందుకు ధన్యవాదములు.
ముఖే ముఖే సరస్వతి అంటే ఇలాగ కూడా నని అనుకొంటున్నాను
భవదీయుడు
బొల్లోజు బాబా
:))భూషణ్ గారు - నమస్కారం.
ReplyDeleteప్రస్తుత కవితలో క్లుప్తతకు వచ్చిన లోటేమీ లెదన్నారు. మొదటి రెంటిలో (ఖండికలంటే కొత్తపాళీ గారు బాదేస్తారేమో :)) మీకు వాచాలత్వం కనిపించట్లేదా? జస్ట్ ఓ చిన్న అనుమానమే - మీరేమంటారో అని.
ఇంకొక విషయం ఇది కథన కవిత (narrative poem) అన్న విషయం మరచి పోరాదు.
ReplyDeleteఇందులో సంభాషణ కూడా భాగమే.వృద్ధుల్లో,పిల్లల్లో వాచాలత సహజమే.
శ్రీ శ్రీ గురించి ఒక పరిశీలన : శ్రీ శ్రీ ప్రధానంగా కథన కవి.అతని కవితా ఓ కవితా కథన కవితే.ఈ రకంగా ఆలోచిస్తే శ్రీ శ్రీ తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పలేదు.కవిత్వంలో కథనాన్ని ఒప్పించడం అన్నది చాలా పాత విద్య.పలువురు పాశ్చాత్య కవులనుండి శ్రీ శ్రీ నేర్చుకున్న శైలీవిశేషం కూడా ఇదే.ఇదే విషయాన్ని నేను మొన్న డెట్రాయిట్ లో జరిగిన శ్రీ శ్రీ శత జయంతిలో చర్చించాను.శ్రీ శ్రీ లో మార్మికత లేదు,టాగోర్ లో ఉన్నది మార్మికతే ,కాబట్టే శ్రీ శ్రీకి టాగోర్ నచ్చలేదు,వడ్డాది సుబ్బరాయకవి రాసిన భక్త చింతామణి గీతాంజలి కన్నా నయమని శ్రీ శ్రీ అభిప్రాయం.
ఖండిక అన్న పదానికి కొత్తపాళి రూఢిలో ఉన్న సరైన అర్థాన్ని ఇచ్చారు.కవితా ఖండిక అని వాడుకలో ఉన్నదే.చర్చ నేను మొదలు పెట్టలేదు కాబట్టి,మీ అందరూ వాడుతున్న పదాన్నే నేను వాడాను.నా అభిప్రాయంలో రెండు అచ్చుతప్పులు:చెప్పినంది -> చెప్పినది,భావమే --> భాగమే, అని చదువుకోవలసినది.
ప్రశ్నలు :
ReplyDelete౧. కవిత్వం అనేది అర్ధం కావాలా అక్కర్లేదా?
౨. అర్ధమైపోతే చవక కవిత్వమూనూ, అర్ధం కాకపోతే గొప్ప కవిత్వమూనా?
ఎందరో మహానుభావులు అందరికి వందనాలు,
ప్రతి మనిషిలోను హృదయం ఉంటుంది అక్కడికి చేరేదే కవిత్వం. అర్థాలు అపార్థాలు కేవలం మెదడుకు, హృదయానికి కాదేమో ?
"వృద్ధ జంట" హృదయానికి సంబందించింది. ఆ సౌందర్యం ఉట్టిపడింది.
ఈ పామరుడు మధ్యలో దూరినందుకు పండితులు క్షమించాలి.
హృదయపూర్వక నమస్సులతో
నరసింహ మూర్తి
కథన కవిత్వమైతే, సంభాషణలు కూడా ఉండవచ్చా? ఇక దాన్ని కవిత్వం అనటం దేనికి? కథనమే అనుకోవచ్చుగా! వృద్ధుల గురించో, పిల్లల గురించో కవిత్వం వ్రాసినప్పుడు వాచాలత ఉన్నా తప్పేమీ కాదన్న మాట. మీ నుంచి ఇటువంటి మినహాయింపు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.
ReplyDeleteగత వైభవాన్ని వర్ణించిన ఖండికల్ని తొలగిస్తే ఎత్తుగడ దెబ్బతింటుంది అంటున్నారు.. బానే ఉంది. కానీ ఆ ఖండికల్లో అక్కిరాజువారు ఆక్షేపించిన విస్తరాధికరణం, నిదర్శనాధికరణం, పులుముడుఘటనాధికరణం మొదలైన కావ్యదోషాలు మీకు కనిపించకపోవడం ఆశ్చర్యకరం! వృద్ధుల మీద కవితని వాటికి కూడా మినహాయింపు ఇచ్చేసారా?
ReplyDeleteఇక కవిత్వం అర్ధం కావాలా అక్కరలేదా అన్న ప్రశ్నకి భైరవభట్ల వారితో ఏకీభవిస్తున్నాను.
ReplyDeleteకథన కవిత్వమైతే, సంభాషణలు కూడా ఉండవచ్చా? ఇక దాన్ని కవిత్వం అనటం దేనికి? కథనమే అనుకోవచ్చుగా!
ReplyDelete--------------------------
ఉండవచ్చు.మీకు ఆశ్చర్యం కలగవచ్చు శ్రీ శ్రీ రాసిన మహాప్రస్థానం కథన కవితే.
అందులో ఉన్నది సంభాషణే.అలాగే శైశవగీతి,అవతలి గట్టు,సాహసి,కళారవి
పరాజితులు,ఆః,స్విన్ బర్న్ కవికి,వాడు ,వ్యత్యాసం,మిథ్యావాది,కవితా ఓ
కవితా,దేనికొరకు,జగన్నాథుని రథ చక్రాలు ఇవన్నీ సంభాషణ మీద
ఆధారపడిన కథన కవితలు.ఆకాశదీపం,బాటసారి,భిక్షువర్షీయసీ,
ఉన్మాది ఇవన్నీ ఒక చిన్న కథాచట్రం చుట్టూ అల్లిన కథన కవితలు.
శ్రీ శ్రీ మీద ప్రభావం నెరిపిన Georgian Poets,Swinburn
కథన కవులే.(వీటి మీద ఒక పరిశోధనా వ్యాసాన్ని నేను రాసి ఉన్నాను.
ఆసక్తి గలవారికి లింకు పంప గలను.ఇంతకాలం శ్రీ శ్రీ మీద విమర్శ రాక
శ్రీ శ్రీ కవిత్వానికి తెలుగులో సరైన స్థానం ఎవరూ కల్పించలేదు.నేను ఒక
ప్రయత్నం చేశాను.వీటన్నిటీ మీద ఎవరైనా ముందే రాసి ఉంటే కథన
కవిత్వమ్మీద ఇంత గందరగోళం ఉండక పోవును.)అనాదిగా కవిత్వం రెండు రకాలు:భావ కవిత్వం,కథన కవిత్వం.పాతరోజుల్లో కథ చెప్పేవాడు కవి వేరు కాదు.కాబట్టి,కవిత్వం కథనం విడదీయరానంతగా పెనవేసుకుపోయాయి,ఆ దశలో.భావ కవిత్వం (lyrical poetry)లో వ్యక్తమయ్యేది
కవిభావాలు మాత్రమే.ఆ కవిత్వంలో కవి తప్ప మరో పాత్ర
కనిపించదు.తర్వాత్తర్వాత దీన్ని పునాదిగా చేసుకుని మరింత
మూర్తంగా ఉన్న ఆధునిక కవిత్వం ( ఫ్రెంచి లో verse libre,
ఆంగ్లంలో free verse ,తెలుగులో వచ్చే సరికి అదే వచన కవిత్వం)
వెలువడింది.ఈ చారిత్రక కారణాల వల్ల కవిత్వంలో కథనాన్ని ఒప్పించే
పాత పద్ధతి కొన సాగింది.తిలక్ ,శ్రీ శ్రీలు విస్తారంగా రాశారు ఈ తరహా
కవిత్వాన్ని.కాబట్టి,ఈ తరహా కవిత్వంలో భావకవిత్వం తరహా క్లుప్తత
ఆశించరాదు.అక్కిరాజు వారి ప్రధాన విమర్శ భావ కవిత్వమ్మీద అని
మరువరాదు.భావ /ఆధునిక కవిత్వాన్ని కొలిచే కొలబద్ద దీనికి సరిపోదు.
-------------
వృద్ధుల గురించో, పిల్లల గురించో కవిత్వం వ్రాసినప్పుడు వాచాలత ఉన్నా తప్పేమీ కాదన్న మాట. మీ నుంచి ఇటువంటి మినహాయింపు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.
----------------------
ఇది వృద్ధుని గొంతుకతో రాసిన కవిత్వం.వృద్ధుని గూర్చి రాసిన కవిత్వం కాదు.
స్వల్ప వ్యత్యాసం ఉంది గ్రహించగలరు.ఈ నేపథ్యంలో నేనన్న మాట (వృద్ధుల్లో,
పిల్లల్లో వాచాలత సహజమే.)తీసుకోవాలి.ఇది ఒక ముసలివాడి మోనోలాగ్.
కవిత్వంలో వృద్ధులకు బాలలకు మినహాయింపులు ఉండటానికి ఇది ప్రభుత్వ
వ్యవహారమా?? కవిత్వం హృదయానికి సంబంధించింది,ప్రభుత్వానికి కాదు.
బొల్లోజు బాబా రాసినా మల్లోజు కోటేశ్వర్రావు రాసినా,మహాకవి రాసినా
అనామకుడు రాసినా నా కవితా ప్రమాణాలు మారవు.నేను చెప్పేదల్లా
విమర్శ సందర్భోచితంగా ఉండాలి.ఆధునిక కవిత్వం కొలబద్దతో ప్రాచీన
కవిత్వాన్ని కొలవరాదు.(అలా చేసి అవన్నీ వృధా అని అటకెక్కించారు)
విమర్శ కత్తిమీద సాము.కొన్ని తూనికరాళ్ళు పట్టుకుని బయల్దేరరాదు.
అక్కిరాజు ఉమాకాంతం చెప్పినా రాళ్ళపల్లి చెప్పినా కొంత మన ఇంగిత
జ్ఞానానికి పదును పెట్టాలి.వారు ఏ సందర్భంలో చెప్పారు ఆలోచించాలి,
ప్రస్తుత సందర్భానికి అన్వయించుకోగలగాలి.లేదంటే కవిత్వ విమర్శ
మూఢత్వంలోకి దిగజారిపోతుంది.అధ్యయనం లేని విమర్శకుడు ,
అప్పుడప్పుడు ఆకురాయిని తాకని కత్తి పదును కోల్పోతాయి.
అక్కిరాజు వారి విమర్శ భావ కవిత్వం మీదనే అన్నది మనం మరువరాదు
ReplyDelete-----------------------------------------------
ఒప్పుకుంటాను. కానీ ఆయన భావ కవిత్వాన్ని విమర్శించే క్రమంలో గొప్ప కవిత్వానికి ఉదాహరణలుగా కాళిదాసాదులను ప్రతి చోటా ఉటంకించారు. కాళిదాసు కవిత్వం కూడా మీరన్న కథన కవిత లోకే వస్తుంది మరి. అది భావ కవిత కాదే! అలాంటి కాళిదాసు కృతుల్లోనే విస్తరదోషం కనబడితే మమ్మటుడు విమర్శించాడని మీరు వినే ఉంటారు. అక్కిరాజు వారి ఆక్షేపణ భావ కవిత్వం మీదే అయినా వారు సూచించిన ప్రమాణాలు కొన్ని ఆధునిక కవిత్వానికి కూడా వర్తిస్తాయని నాకు అనిపిస్తుంది.
కామేశ్వరరావు గారితో నిన్న మాట్లాడినప్పుడు ఇదే విషయం లేవనెత్తారు. ఆయన్ని కూడా అడిగాను అక్కిరాజు వారి ప్రమాణాల్లో ఏవి నేటి కాలపు కవిత్వానికి వర్తిస్తాయో.. ఏవి వర్తించవో మీరొక వ్యాసం రాస్తే బావుంటుందని.
"అనంత వర్ణాలలో చిత్రకారుడు ఎంచుకునే రంగులు కొన్నే. అలాగే కవి కూడా పదాలు పొదుపుగా సంగ్రహిస్తాడు. అనవసర పదం వచ్చి పడిందంటే , రావలిసిన రంగు రానట్టే.ఎక్కువ పదాలు పడ్డాయంటే రంగు వలికిందే. చాలా సంయమనం, లాఘవం అవసరం. కవిత్వంలో మరీనూ, కారణం అది అన్నిటికంటే లలితమైన కళ కావడమే"
ReplyDelete-- నేటి కాలపు కవిత్వం - తీరు తెన్నులు, ౨౨ పేజీ.
మీ విమర్శ పుస్తకంలో ఇలా అన్న మీరే, మీద కామెంటులో "ఈ తరహా కవిత్వంలో భావ కవిత్వ తరహా క్లుప్తతని ఆశించలేం" అనడం ఎలా ఉందంటే , కొన్ని రకాల కవిత్వాల్లో రంగులు వలికినా ఫర్వాలేదు అన్నట్టుంది. ఆలోచించండి.
BTW, మీరు శ్రీశ్రీ కవిత్వం మీద రాసిన వ్యాసం లంకె ఇక్కడ పోస్టు చేయగలరా? అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది.
ReplyDeleteకాళిదాసు రాసినవి ప్రధానంగా నాటకాలు,ఇతిహాసాలు.ఋతుసంహారం,మేఘసందేశం వీటికి మినహాయింపులు.గొథే లాంటి కవులను ఆకట్టుకొన్నది ప్రధానంగా నాటకాలే,ముఖ్యంగా అభిజ్ఞాన శాకుంతలం.ఇప్పటి కథన కవితను బావుంది బాగాలేదు అనడానికి కాళిదాసు దాకా వెళ్ళనవసరం లేదని నా అభిప్రాయం.అక్కిరాజు విమర్శ ఆధునిక కవిత్వానికి కూడా వర్తిస్తుంది;అందులో సందేహం అవసరం లేదు.నేను చెబుతున్నది ఏమంటే ఆధునిక కవిత్వంలో narrative poetry అన్నది ఒక పాయ.అది ఒక ధూసర ప్రదేశం (grey area).ఆంగ్లంలో లూయీ సింప్సన్ లాంటి వాళ్ళు కేవలం అటువంటి కవిత్వమే రాశారు.మనకు నచ్చకపోయినా ఆ తరహా కవిత్వం ఒకటుందని విమర్శకులకు తెలియాలి.(కవులకు తెలియనవసరం లేదు).నాకు వ్యక్తిగతంగా ఆధునిక కవిత్వంలో ,narrative poetry ఇష్టం లేకపోయినా అది ఒకటి ఉంది అని గుర్తించి దానికి కావలసిన విమర్శ వేరు అని చెప్పడంలో ఇబ్బంది లేదు.విమర్శకుడి మూలాలు అజ్ఞానంలోంచి మొదలుకారాదు. కూలంకషంగా చదివి తెలుసుకొని విమర్శకు ఉపక్రమించాలి. narrative poetry నే పట్టుకొని ఊగేవాడు ఎప్పటికీ సర్వ సమగ్రమైన కవితను రాయలేడు.ఒక కవికి narrative poetry రాయడంలో ఉన్న స్వేచ్ఛను మనం కాదన రాదు.ఉటంకించిన నా అభిప్రాయం శుద్ధ కవిత్వాన్ని (కథనాలు గట్రా లేనిది)అర్థం చేసుకొనే సందర్భంలోనిదే.
ReplyDelete"అనంత వర్ణాలలో చిత్రకారుడు ఎంచుకునే రంగులు కొన్నే. అలాగే కవి కూడా పదాలు పొదుపుగా సంగ్రహిస్తాడు. అనవసర పదం వచ్చి పడిందంటే , రావలిసిన రంగు రానట్టే.ఎక్కువ పదాలు పడ్డాయంటే రంగు వలికిందే. చాలా సంయమనం, లాఘవం అవసరం. కవిత్వంలో మరీనూ, కారణం అది అన్నిటికంటే లలితమైన కళ కావడమే"
ఇందులో మరో వాక్యం కూడా ఉంటుంది."చూసే కొద్దీ కొత్త కోణాలు వ్యక్తమయ్యే చిత్రంలా తరచి చూసే కొద్దీ కొత్త లోతులు అనుభవంలోకి రావాలి.అది గొప్ప కవిత్వం ".ఇది narrative poetry కి వర్తించదు.కారణం నా దృష్టిలో narrative poetry గొప్ప కవిత్వం కాదు.నా దృష్టిలో గొప్ప కవిత్వానికి ఒక ఉదాహరణ :http://pustakam.net/?p=2409
------------
సర్వులకూ ఒక వినతి.ఒక కవిత మనకు అర్థం కానంత మాత్రాన అది చెత్త కవిత కాదు,గొప్ప కవితా కాదు.అది మనకు అర్థం కాలేదు అంతే.అంటే ఇంకా మనవైపు నుండి సదరు కవితను అర్థం చేసుకోవలసిన పని మాత్రం మిగిలుంది.ఒక కవిత మీకు అర్థమైందా సంతోషం.అంత మాత్రాన అది గొప్ప కవిత కాదు,చెత్త కవితా కాదు.అర్థం కావడం/కాకపోవడం ఒక కవిత గొప్పదనాన్ని నిర్ణయించలేవు.
ఎందుకు గొప్ప కవిత / ఎందుకు చెత్త కవిత అని ప్రశ్న మీలో ఉదయించిందా ?? మీకు తెలియకుండానే మీరు విమర్శ అన్న పొలిమేరను సమీపిస్తున్నారు.అది చాలా ప్రమాదకరమైన పొలిమేర.అది నిజంగా నీవు ఆ పొలిమేరను తాకావా ఆ
తర్వాత నీకు సాహితీమిత్రులు ఎవరూ మిగలరు.జీవితంలో కావలసినంత ఏకాంతం లభిస్తుంది.దాన్ని తట్టుకోగలిగిన చేవ ఉంటేనే ఆ పొలిమేర తొక్కాలి.అది ఆత్మానందకరీ శుభకరీ అనడంలో సందేహం లేదు.
మంచి విషయాలు చెప్పారు. మీరు చెప్పిన చాలా వాటితో అంగీకరిస్తాను. నావి కొన్ని పోయింట్లు.
ReplyDelete౧. ఇప్పటి కథన కవితను బావుంది, బాగాలేదు అని చెప్పడానికి కాళిదాసు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదని నా అబిప్రాయం.
--------------------------------------
నిజమే. కానీ కాళిదాసు దాకా వెళ్ళింది కేవలం బావుంది/బాగా లేదు అని చెప్పడానికి కాదని మీరు గమనించాలి. ఈ కవిత మొదట్లో వాచాలత ఉందని ఒప్పుకుంటునే, కథన కవితల్లో వాచాలత పెద్ద దోషం కాదు అని మీరు అన్నందుకే కాళిదాసు దాకా వెళ్ళాల్సి వచ్చింది.
౨. కథన కవిత్వం గొప్ప కవిత్వం కాదు:
---------------------------
హమ్మయ్య.. నేను బలంగా నమ్మిన విషయాన్ని మీ నోటి వెంట వినడం ఆనందంగా ఉంది.
౩. అది ఒక ధూసర ప్రదేశం / కథన కవితని రాయడంలో వాళ్ళ స్వేచ్చని మనం కాదనరాదు :
-----------------------------------------
ఇదే వచ్చిన చిక్కల్లా.. ఈ లెక్కన శివారెడ్డి, సినారె కవిత్వాన్ని కూడా కథన కవితలని వాదించొచ్చేమో ! ఇదే విషయంలో లోగడ ముకుంద రామారావు గారి "ఒకానొక రాత్రి న్యూయార్కు" కవిత విషయంలో మీతో వాదించినట్టు గుర్తు. అది కవిత ఎలా అవుతుంది అని. మీరు అప్పడు కూడా అది కథన కవిత అని చెప్పారు. ఏమైనా అది గొప్ప కవిత్వం మాత్రం కాదు అని మీరు అనేసారు కాబట్టి ఇంక పేచీ లేదు.
౪. మీకు తెలియకుండానే విమర్శ అనే పొలిమేరని సమీపిస్తున్నారు.
-------------------------------------------
ప్రతి కవి తనకు తనే మొదటి విమర్శకుడు కావాలని బలంగా నమ్ముతాను. ఆ క్రమంలో ఆ పొలిమేర తొక్కినా నష్టం లేదు. ఆ పొలిమేర తొక్కినా, సాహితీ మిత్రుల్ని ఎలా కాపాడుకోవాలో ఇస్మాయిల్ గారి దగ్గర నేర్చుకోవచ్చేమో!
-- మూలా సుబ్రహ్మణ్యం.
చక్కటి కవిత, కవితా చర్చ చాలా బాగున్నాయి.
ReplyDeleteతమ్మినేని వారి వివరణ చాలా బాగుంది.
కవిత్వం అనేది అర్ధం కావాలా అక్కర్లేదా?
ఖఛ్ఛితంగా కావాల్సిందే. అర్ధం కాని కవితను ఆస్వాదించగలమా? అయితే బాబా గారన్నట్లు..అది చదువరి వేవ్ లెంగ్త్ ని బట్టి ఉంటుంది. సాధారణంగా అందరి వేవ్ లెంగ్త్ లకు సరిపడా రాయడం ఎవరి తరం. ఒకవేళ అలా రాయాలంటే దానికుండే పారామీటర్స్ ఏమిటి? వీటిని ఎవరైనా నిర్వచించారా? అవి ఏ కాలమాన పరిస్తితులకు సరిపోతాయి. ' ఇదే ప్రామాణిక కవిత ' అని కొలదగ్గ కవితంటూ ఏదైనా ఉందా? ఉంటే అది ఎంత మందికి అర్ధమయింది.
ఇక్కడ కేవలం చర్చ కోసం చర్చ కొనసా.....గుతూం....దనిపిస్తుంది.
ఆమధ్య కత్తి మహేష్ కుమార్ గారి బ్లాగు లో అనుకుంటాను..సాహిత్యానికి సామోజిక ప్రయోజనం ఉండాలా లేదా
అనే అంశం మీద ఇలానే చర్చలు జరిగాయి.
ఇహ రెండో విషయం
అర్ధమవక పోతే.......
అర్ధమవడం, కాకపోవడం అనేది చాలా విషయాల మీద ఆధార పడుతుందని నా అభిప్రాయము.
పాఠకుడి మానశిక వికాశం, భాషాపరిజ్ఞానం, సాహిత్యాభిలాష ఇలా అనేక అంశాల పై ఆధారపడుతుంది.
ప్రపంచం లో ఏ భాషాసాహిత్యాన్ని చూసినా రచనలు జన బాహుళ్యానికి చేరువులో ఉండాలని ఏ రచయితైనా ప్రయత్నించాడుకాని
సమాజం లో కొంత వర్గానికి మాత్రమే తన రచనలు పరిమితం చేయలేదు. ఒకవేళ అలా చేసుంటే..
ఉదాహరణకు ' రూబెన్ డారియో' కవితను తెలిసిన వాళ్ళు యూరప్ లో కొద్దిమందే ఉన్నారు.
కానీ నేడు ' నెరుడా' , అమాడో, గిల్లెన్ పుస్తకాలను ఆపేక్షతో చదవని యూరోపియన్ సాహితీ ప్రియుడు ఎవడూ లేడు.
అంతమాత్రంచేత వీరివన్నీ చవక రచనలు అని ఒక ముద్ర వేసేద్దామా?
అలాగయితే వేదాలు మాత్రమే మంచి గ్రంధాలు మిగిలిన పురాణాలన్నీ చవకబారు సాహిత్యమనే అనుకోవాలి.
ఇక బాబాగారి కవితలో...
మొదటి రెండు స్టాంజాలు (ఇది సబబేనా..కొత్తపాళీ గారంటే నాకూ భయమే) తరవాతి వాటికి తెరతీసినట్లుగా సరిపోయినవని నాఅభిప్రాయం.
పెద్దలకూ, ఆత్మీయ మిత్రులకూ గౌరవంగా కృతజ్ఞతతో చేతులు జోడించి నమస్కరించటానికి ఏదైనా స్మైలీ లాంటిదుంటే ఎంతబాగుణ్ణూ.....
ReplyDeleteభవదీయుడు
బొల్లోజు బాబా
ఈ కవిత పరమైన చర్చ వలన నాకు చాలా నేర్చుకునే అవకాశం కలిగింది. నిజానికి ఇక నావి కవితలేనా అన్న అనుమానం, భయం కూడా కలిగాయి. నేను నేర్చుకోవాల్సిన ఎన్నో అంశాలని తెలిపాయి. ఇంత చక్కని అభిప్రాయాలు ఇక్కడ చేర్చిన అందరికీ నా ధన్యవాదాలు కూడా.
ReplyDeleteసుబ్బూ,
ReplyDeleteఉమాకాంతంగారి చాలా ప్రమాణాలు ఆధునిక కవిత్వానికి కూడా వర్తిస్తాయనడంలో సందేహం లేదు. కాకపోతే, వాటిని అన్వయించుకోడంలో జాగ్రత్త ఉండాలి. ఇది ఏ ప్రమాణాలకైనా వర్తించే విషయమే. ముఖ్యంగా కవిత్వాన్ని చదివేటప్పుడు అసలు ఎలాంటి విమర్శ సిద్ధాంతాలు మన మనసులోకి రాకుండా జాగ్రత్తపడాలని నా ఉద్దేశం. ఆ తర్వాత ఆ కవిత్వం మనకి ఎందుకు నచ్చిందీ లేదూ అని విశ్లేషించుకోవడానికి విమర్శ ఉపయోగపడవచ్చు.
ఈ కవిత విషయానికి వస్తే, అక్కిరాజుగారు చెప్పిన విస్తరణ నిదర్శ దోషాలు ఇందులో లేవని నేననుకుంటున్నాను.
చెప్పవలసినదాని కంటే "హెచ్చు"గా కవిగాని, పాత్రలు గానీ చెప్పడం విస్తరదోషం. దీనివల్ల విసుగు, రసభంగం కలుగుతాయి. ఇది విస్తరణ దోషం.
భావం హృదయంగమంగా "స్ఫుట పడ్డ తర్వాత" దాన్ని ఇంకా నిదర్శన పరంపరలతో చెప్పడం విసుగును రోతను పుటిస్తుంది - ఇది నిదర్శన దోషం. రెండూ ఇంచుమించు ఒకలాంటివే.
ఈ రెండు దోషాలు ఈ కవిత మొదటి రెండు పేరాల్లో ఉన్నాయని మీరు భావిస్తున్నారు. నేనీ కవిత చదివిన తర్వాత పొందిన అనుభూతి ఆధారంగా అది ఎందుకు కాదో విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.
ఈ కవిత ఒక వృద్ధుడు తన సహచరితో చెపుతున్న మాటలు. ముసలితనానికీ స్మృతులకీ అవినాభావ సంబంధం ఉంది. గత జీవిత జ్ఞాపకాలు ముసురుకోవడం చాలా సహజం. పైగా "నువ్వు మాత్రమే మిగిలావు నాకు." అన్న భావనకి మూలం కూడా ఆ జ్ఞాపకాలే. మరి అలాంటి జ్ఞాపకాలు లేకుండా నేరుగా "నువ్వు మాత్రమే మిగిలావు నాకు" అని అంటే, అది ఒక వృద్ధుడు చెపుతున్న మాటలన్న అనుభూతి ఎలా కలుగుతుంది? నువ్వు మాత్రమే మిగిలావు అంటే, మిగలనివి ఏమిటి? ఇది పాఠకుల ఊహకి వదిలెయ్య వచ్చు అని మీ అభిప్రాయం. నిజమే. ఎవరి అనుభూతి వారిది. ఎవరి జ్ఞాపకాలు వారివి. కాని ఆ జ్ఞాపకాల తుట్టని రేపే సాధనం ఉండాలి కదా. ఆ ముసలివాని స్మృతులు ఆ పని చేస్తున్నాయి. తన యవ్వనపు తొలిరోజులు గుర్తుచేసుకుంటూ కవిత మొదలయ్యింది. అది ఎక్కడా వాచ్యంగా చెప్పక కేవలం ఆ అనుభూతుల ద్వారా సజెస్ట్ చేసారు. ఈ జ్ఞాపకాల పరంపర అలా మూడు నాలుగు పేరాలు (అదీ వస్తు ప్రధానమైన జ్ఞాపకాలై) ఉంటే, మీరన్న విస్తర/నిదర్శన దోషాలు వచ్చి ఉండే అవకాశం ఉంది. ఇందులో అలా జరగలేదు. అంచేత ఇది విసుగు కలిగించేంతగా విస్తరించ లేదని, రస వ్యంజకమే అయిందని నా అభిప్రాయం. పైగా ఏ జ్ఞాపకాలైతే తనలో ఒక నిర్లిప్త భావాన్ని కలిగించాయో, అలాంటి మరో జ్ఞాపకమే (పెళ్ళిచూపులలో ఆమె సన్నని నవ్వు) అతని మనసుకు ఊరట కూడా కలిగించడం కవితకి ఒక సంపూర్ణత ఇచ్చిందని నేననుకుంటున్నాను.
ఈ కవిత మొదట్లో వాచాలత ఉందని ఒప్పుకుంటునే, కథన కవితల్లో వాచాలత
ReplyDeleteపెద్ద దోషం కాదు అని మీరు అన్నందుకే కాళిదాసు దాకా వెళ్ళాల్సి వచ్చింది.
---------------
చెప్పవలసిన దానికన్నా ఎక్కువ చెప్పడం వాచాలత ( తెలుగులో వాగుడు).
క్లుప్తత ఉంది అంటే వాచాలత లేదనే.. ఈ కవితలో క్లుప్తతకు వచ్చిన లోటు
లేదు అని ఒక లఘు టిప్పణి లిఖించాక కూడా మన మిత్రులు వాచాలత
ఉందని ఆరోపించారు.నాకు వాచాలత కానిది వారికి వాచాలతలా కనిపిస్తోంది..
ఆ నేపథ్యంలో నేను చెప్పిన వాక్యాలు :
"ఇంకొక విషయం ఇది కథన కవిత (narrative poem) అన్న విషయం మరచి
పోరాదు.ఇందులో సంభాషణ కూడా భాగమే.వృద్ధుల్లో,పిల్లల్లో వాచాలత సహజమే."
ఈ వాక్యాలు కొంచెం తప్పు దోవ పట్టించినట్లున్నాయి.ఇక్కడ కొంచెం వివరణ అవసరం.
గత యవ్వనం గురించి రాసిన మొదటి మూడు వాక్యాలు, గత వైభవం గురించి
రాసిన తర్వాతి మూడు వాక్యాల్లో 'వాచాలత 'లేదా అంటే అది మీకు 'వాచాలతే'
ఐతే ఆ మాత్రం ఉండవచ్చు.ఆ మాత్రం 'వాచాలత' శిల్పపరంగా ఇక్కడ దోషం
కాదు అని నా భావం. ముందు చెప్పినట్లు ఈ కవితలోని సమస్య పద ప్రయోగం,
వాచాలత కాదు నా అభిప్రాయం.
"కథన కవితల్లో వాచాలత పెద్ద దోషం కాదు "అన్న వాక్యం నాది కాదు.
కథన కవితైనా ,శుద్ధ కవితైనా కవిని బట్టి రాణిస్తుంది.శ్రీ.శ్రీ ప్రధానంగా కథన కవి
అంటే నమ్మగలరా ?? చాలా మందికి ఆయన రాసినవి కథన కవితలు అన్న
వివేచన లేదు. శ్రీ శ్రీ కథన కవిత్వంలో బలహీనతల గురించి,శివారెడ్డి కొత్త
పాత కవిత్వాల గురించి విమర్శ నా దగ్గర ఉంది.సమయం వచ్చినప్పుడు
వెల్లడి చేస్తాను. ఇప్పటికింతే.సెలవు
కామేశ్వర రావు గారు.. వాచాలత విషయంలో నా వాదన తర్వాత మనవి చేస్తాను. కొంచెం పెద్ద కామెంటు రాయాలి.
ReplyDeleteభూషణ్ గారు,
"కథన కవిత్వంలో భావ కవిత్వ తరహా క్లుప్తతని ఆశించలేం"
"క్లుప్తత ఉంది అంటే వాచాలత లేదనే"
ఈ రెండు వాక్యాలు కలుపుకుంటే, "కథన కవితల్లో వాచాలత పెద్ద దోషం కాదు" అనే అర్ధం స్ఫురిస్తోందేమో! (వాక్యం మీది కాకపోయినా)
ఆ విమర్శ ఇప్పుడే వెల్లడి చేస్తే బావుంటుందేమో! ఇంత కన్నా మంచి సమయం ఉంటుందంటారా?
నాకైతే అలా స్ఫురించడం లేదు.అంతే కాక "క్లుప్తత ఉంది అంటే వాచాలత లేదనే" అన్న వాక్యం రాయక ముందే మీకలా స్ఫురించింది ,ఇది ఏమంత పెద్ద విషయం కాదు.తర్క శాస్త్రంలో వీటినే unstated and invalid assumptions అంటారు.రాయబారులకు ,దౌత్యవేత్తలకు ఈ దోషానికి లోను కాకుండా మంచి శిక్షణ ఇస్తారు.మన వాదాన్ని ఇతరులు చెప్పని విషయాల మీద నడిపించరాదు.వారు ఇలా చెప్పి ఉంటారులే అనుకోరాదు.ఎక్కువ ప్రశ్నలు వేసి విషయాన్ని రాబట్టాలి.ఈమాట సంపాదకులు వేలూరి వెంకటేశ్వర రావు గారు రచ్చబండలో ఈ తరహా చిల్లర తప్పులు తరచు చేసేవారు.(ఇటువంటి తప్పులు మరింత ఘరానాగా చేస్తూ కొత్త కవులకు కొన్ని సంగతులు (2002,నవంబర్,ఈమాట) అన్న వ్యాసం మీద చర్చ లేవ దీశారు.ఆసక్తి ఉన్నవారు చదువుకొండి.వ్యాసానికి లింకులిద్దామని ప్రయత్నించాను,కానీ ఈ మాట వారు ఆ పెద్ద హృదయంతో ఆ వ్యాసాన్ని తొలగించారు.
ReplyDeleteఅలాగే జయప్రభ కవిత్వాన్ని విశ్లేషిస్తూ నేను రాసిన వ్యాసాలను కూడా.ఇది మన వారి సభ్యత.చర్చలో పాల్గొన్న కొందరైనా ఆ వ్యాసాన్ని చదివే ఉంటారని అనుకొంటాను.)
http://www.sahiti.org/yahoo/view.jsp?id=808
http://www.sahiti.org/yahoo/view.jsp?id=818
http://www.sahiti.org/yahoo/view.jsp?id=824
http://www.sahiti.org/yahoo/view.jsp?id=827
http://www.sahiti.org/yahoo/view.jsp?id=841
కథన కవిత్వ విషయం:
నేను ఒక రెండు ఉదాహరణలు ఇచ్చివుంటే విషయం మరింత విశదమయ్యేది.
శ్రీ శ్రీ కవితలు ఒక రాత్రి,శైశవగీతి పోల్చి చూడండి,నేను చెప్ప దలచుకొన్న విషయం అర్థమవుతుంది.
భూషణ్ గారు - చాలా మంచి విషయాలు చెప్పారు. దాదాపు నాలుగైదేళ్ళ క్రితం కవిత్వంపై నాకున్న భ్రమలు తొలగించింది మీరే. అందుకుగానూ, మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలానే, మరి కొన్ని భ్రమలు ఇప్పుడు కూడా తొలగించారు.
ReplyDeleteమీరు చెప్పిన విషయం బానే అవగతమయ్యింది. కానీ, నా బాధల్లా ఏమిటంటే, ఇప్పుడు చెప్పుకున్నట్లుగా వృద్ధులకు, బాలలకు వాచాలత సహజమే కాబట్టి, పై కవిత మాదిరిగా వాచాలత (నాకు అనిపించినంత) ఆ మాత్రం ఉండవచ్చని సర్దుకుపోతే, రేపు మేము విప్లవ కవులము. నినాదాలు మాకు సహజమే, కాబట్టి నినాదాలతో కుమ్మేస్తూ ఆమాత్రం భరించలేరా మా విప్లవ కథన కవితలు అనే పెద్దమనుషుల గురించే. వాళ్ళకు కూడా మీరు చెప్పిన విషయాలు మరింత ధైర్యాన్ని ఇస్తాయనే.
ఏదేమైనా, సుబ్బు చెప్పినట్లుగా, తాను వ్రాసిన కవితకు కవే మొదటి విమర్శకుడు కావాలి.
బాబాగారు - ఒక మంచి చర్చకు మీ బ్లాగు వేదిక కావటం అభినందనీయం.
మీరు (భూషణ్ గారు) అడిగినట్లుగా "నానీలపై" నేనిదివరలో వ్రాసిన వ్యాసాన్ని త్వరలోనే బ్లాగులో కూడా ప్రచురిస్తాను.
Who is this bhooshan, amazing guy, amazing explanation
ReplyDeleteanonymous gaaru,
ReplyDeleteమీ సంబోధన కొంచెం తేలికగా ఉన్నప్పటికీ, మిగిలిన వాఖ్యలో ఆయనపై గౌరవం ఉన్నట్లు గానే కనపడుతుంది.
వీరి గురించి
తమ్మినేని యదుకుల భూషణ్ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.
అంతే కాక వీరు తెలుగులో "నేటి కాలపు కవిత్వ తీరుతెన్నులు" అని తెలుగు కవిత్వ విమర్శనం పై పుస్తకాన్ని రచించారు. ఈ మాట ఆర్చైవులలో వీరుసాగించిన చర్చలను చూడవచ్చు.
bollojubaba
భూషణ్ గారు..
ReplyDeleteనేను అడిగిన ఏ ప్రశ్నకూ మీరు సూటిగా సమాధానం చెప్పలేదు. అలా చెప్పి ఉంటే ఇంత గందరగోళం నెలకొనేది కాదు.
ఉదాహరణకి,
ఈ కవిత మొదట్లో వాచాలత మీకు కనిపించలేదా అంటే,
పిల్లల్లోనూ, వృద్ధుల్లోనూ వాచాలత సహజమే అన్నారు. అందులోనూ ఇది కథన కవిత అన్నారు. కథన కవితలో భావ కవిత్వ తరహా క్లుప్తత ఆశించలేం అన్నారు.
అలా కాకుండా నాకైతే వాచాలత ఏమీ కనిపించలేదు అని మీరనేసి ఉంటే విషయం ఇంతదాకా వచ్చి ఉండేది కాదు. ఇంత మంచి చర్చ కూడా జరిగుండేది కాదనుకోండి అది వేరే విషయం.
నాకు క్లుప్తత పాఠాలు చెప్పిన మీకే ఈ కవిత మొదట్లో వాచాలత కనిపింఛక పోవడం ఆశ్చర్యం కలిగించి అందుకు కారణాలు తెలుసుకోవాలనుకున్నాను. అంతే! ముఖ్యంగా కవితలో ఒక్క వ్యర్ధ పదం మాట అటుంచి ఒక్క అక్షరాన్నైనా సహించలేని మీనుంచి ఆ కామెంటు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఉష గారు: నావి కవితలేనా అన్న అనుమానం , భయం కలుగుతున్నాయన్నారు. ఆ అనుమానమే మిమ్మల్ని గొప్ప కవిత్వం వైపు నడిపిస్తుంది. ఐదేళ్ళ క్రితం నాకు అలాంటి అనుమానమే కలిగించి, కవిత్వం మీద నాకున్న భ్రమల్ని పటాపంచలు చేసి , దిశా నిర్దేశం చేసిన వ్యక్తిగా భూషణ్ గారికి నేను సర్వదా ఋణపడి ఉంటాను.
బాబా గారు : చర్చని ముందుకు తీసుకెళ్ళే క్రమంలో మీ కవితని కావల్సిన దానికంటే ఎక్కువే భూతద్దంలోంచి చూడాల్సొచ్చింది. ఏమీ అనుకోకండి. అద్భుతమైన ముగింపు ఉన్న ఈ కవిత మొదటి చరణాల్లోని (కొత్తపాళీ గారు వింటున్నారా :)) ఉపోద్ఘాతం వల్ల దెబ్బతిందేమో అనిపించే అలా కామెంటు పెట్టాల్సి వచ్చింది.
సుబ్బుగారికి
ReplyDeletefirst of all we all should thank you for paving way to a great discussion.
ఒకానొక దశలో ఈ చర్చ ఎక్కడకు దారితీస్తుందో నని భయపడ్దాను. భూషణ్ గారి నుంచి విషయాల్ని తోడుకోవటంలో, ఈ చర్చ కారణం కావటం నాకు గర్వంగా/ఆనందంగా ఉంది. వారు కూడా చాలా సహనంతో ఓపికగా సమాధానాలిచ్చారు. (బడిలో మాస్టారల్లె)
కామేశ్వరరావు గారి కామెంట్లు బోనస్ గా లభించాయి :-)
సాధికారికత కలిగిన వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు, నేనేం మాట్లాడినా అప్రస్తుత ప్రసంగంలా ఉంటుందని అలా వింటూనే ఉండిపోయాను.
అందరికీ
ధన్యవాదములతో
బొల్లోజు బాబా
తేనెవానల్ని కురిపించిన
ReplyDeleteవెన్నెల రాత్రులు
అదృశ్యమయ్యాయి.
Vs.
వెన్నెల రాత్రులు
అదృశ్యమయ్యాయి.
రెండిటికీ ఏదైనా తేడా ఉందా?
తేడా కనబనడితే విస్తరణ దోషం కనిపించినట్టే.
"తేనె వానల్ని కురిపించిన" వంటి వాక్యాలు వాచాలత కాదు, విస్తరణ. అలానే "స్వర్ణ వాసనలు" వంటి అమూర్తాలు కూడా ఉపోద్ఘాతాన్ని ఘాతంలానే తగిలించాయి.
చివర్లో తలుపు సందునుంచి చూసి నవ్వింది బొల్లోజు బాబాగారేనని బొల్లోజు బాబాగారే sign off చేయడం భలేగావుంది :))
మొత్తం మీద కవిత సాధారణం.
రఘుగారికి,
ReplyDeleteమీ దౄష్టి ఇంకా ఇక్కడ పడలేదేమిటా అని అనుకొన్నాను..... :-) థాంక్యూ
మీ ప్రశ్న ఇలా ఉందాలేమో!
తేడా కనిపిస్తే విస్తరణ దోషం లేనట్లే
ఒకె. మీ భావం అర్ధం అయ్యింది.
నా వివరణ
వెన్నెల రాత్రులు అప్పుడూ ఉంటాయి, ఇప్పుడూ ఉంటాయి. కానీ తేనె వానల్ని కురిపించిన వెన్నెల రాత్రులు లేవు కదా అని చెపుతున్నాడు.
కనుక రెండింటికీ తేడా ఉంది అని అనుకొంటున్నాను.
భవదీయుడు
బొల్లోజు
బాబాగారు,
ReplyDeleteమీరేమీ అనుకోరన్న ధైర్యంతో నాదో చిన్న మనవి/సలహా. మీరు మీ కవితలకి వివరణ(లు) ఇవ్వడం మానుకోండి. దానివల్ల ప్రయోజనం లేదు, నష్టమే తప్ప!
భైరవభట్ల గారికి
ReplyDeleteఅంతే నంటారా? అయితే ఒకే
ఒక్కోసారి నాకూ అనుమానమే, ఇలా వివరణ ఇవ్వటం వలన చదివిన వారి మనసుల్లో గొప్పగా ఊహించుకొన్న దానిపై నేనేమైనా నీళ్లు చల్లేస్తున్నానా అని. (సొంత డబ్బా కాదండోఇ)
ఎందుకంటే ఆత్రేయ గారు ఓ సారి పెద్ద షాకిచ్చారు ఇలానే ఈ లింకులో :-)
http://sahitheeyanam.blogspot.com/2008/12/blog-post_29.html
సిగ్గుతో చచ్చినంత పనయ్యింది సారూ. :-)
భవదీయుదు
బొల్లోజు బాబా
వివరణల విషయంలో భైరవభట్ల గారితో నేను ఏకీభవిస్తున్నాను.
ReplyDeleteచర్చకు వస్తే "తేనె వానల్ని" పాఠకుల ఊహాశక్తికి వదిలేయండి. ఓ పాఠకుడిగా నాకు నేను "తేనె వానల్ని" ఊహించుకుని చదివిననాడు మీ కవితను మీకంటే ఎక్కువగా నేనే ఆస్వాదించగలను.
తమతమ వ్యక్తిగత జీవితాల్లో "తేనె వానల్ని" అనుభవిస్తున్న పాఠకులు, వాటిని పోగొట్టున పాఠకులు - తమతమ ఊహాశక్తితో మీ భావనని అందుకోలేరా? వారిపై మీకెందుకంత జాలి, దయ?
"వెన్నెల రాత్రులు అదృశ్యమయ్యాయి" అన్నప్పుడు "అదృశ్యం" అన్న పదంలో ఉన్న సాంద్రత చాలదూ "తేనె వానలు" వగైరాలు పోయాయని? ఆ సాంద్రతను వివరణలతో పల్చబరచడం దేనికి?
మీకు "తేనె వానలు" పోయినట్టు అనిపించవచ్చు. నాకు చల్లదనం(తోడు) లేకుండా సదరు వెన్నెలరాత్రులు వేడిగా అనిపించవచ్చు. "తేనె వానలు" మాత్రమే పోయాయని ప్రకటించేసి భావ విస్తృతిని మీకు మీరుగా ఎందుకు కుదించాలి?
raghu gaaru wonderful
ReplyDeletethank you sir.
bhairavabhaTlagaaru EmI maaTlaaDoddannaaru. nenEmI maaTlaaDanu saar. :-)
ఏంటో అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు
ReplyDeleteబాబా గారు కవిత బాగుంది...
నే పూయించిన
ReplyDeleteవిజయాలు కరిగిపోయాయి.
నే సాగించిన
యుద్దాలు ముగిసిపోయాయి.
నే మొలిపించిన
స్వప్నాలు వెలిసిపోయాయి.
పెళ్లిచూపుల్లో
తలుపు సందులోంచి నన్ను చూసి
సన్నగా నవ్విన ఆనాటి
నువ్వు మాత్రమే మిగిలావు నాకు.
బాబాగారూ!
ఈ పదాలు నన్నెంతగా కదిలించాయో చెప్పలేను. పదాలలోని ఆర్ద్రత మనసును తట్టి మరీ పలుకరిస్తుంది. తాతగారు అహాన్ని మరిచి మా బామ్మతో చెప్పినట్లు, ఆ ఇద్దరు వ్యక్తులు నాకెంతో పరిచయమున్నట్లు అనిపిస్తుంది. ఏమిటీ వింత?
నిజమే కదా! సహచరి విలువ తెలిసే సమయమదేనేమో?
చాలా బావుంది సార్.
hi. inspite of few typing errors, the poem is not so good. (i am not writing this comment after reading the previous posts) let me go through the serious/simple critiques, on a poem once again. thank you.
ReplyDelete