Showing posts with label వృద్దాప్యం. Show all posts
Showing posts with label వృద్దాప్యం. Show all posts

Tuesday, November 17, 2009

వృద్ద జంట



తేనెవానల్ని కురిపించిన
వెన్నెల రాత్రులు
అదృశ్యమయ్యాయి.
స్వర్ణ వాసనల్ని ఎగరేసిన
జాజులు నేలకొరిగాయి.
ఇంధ్రధనస్సులపై
స్వారీ చేసిన మహోద్రేకాలు
ఇక శలవన్నాయి.

నే పూయించిన
విజయాలు కరిగిపోయాయి.
నే సాగించిన
యుద్దాలు ముగిసిపోయాయి.
నే మొలిపించిన
స్వప్నాలు వెలిసిపోయాయి.

నువ్వు మాత్రమే మిగిలావు నాకు.

ఈ దుర్భల దేహానికి
కాస్తంత
నమ్మికనివ్వటానికి
నా అనంత శయనాన
రవంత
కన్నీరు నించటానికి
నువ్వు మాత్రమే మిగిలావు నాకు.

పెళ్లిచూపుల్లో
తలుపు సందులోంచి నన్ను చూసి
సన్నగా నవ్విన ఆనాటి
నువ్వు మాత్రమే మిగిలావు నాకు.

బొల్లోజు బాబా