Tuesday, November 10, 2009

ఫార్వార్డ్ ట్రేడింగ్.*....

ప్రజాకవీ! రవీ!
ఏం తినేట్టు లేదు
ఏం తాగేట్టు లేదని
ఎంత సూటిగా చెప్పేసావూ!

పెద్దయ్యా!
నీవా మాటలన్నప్పుడు
బ్లాక్ మార్కెటింగ్ ఒక నేరం.
ఇపుడు అంతా చట్టబద్దమే.
ఎంత ఎదిగిపోయామో! చూసావా?

నిత్యావసర వస్తువుల్ని
ఫార్వార్డ్ ట్రేడింగ్ చేసి పారేసి
సామాన్యుని కడుపుపై
ఆకలి వాతల్ని పెట్టటం
చట్టప్రకారమే జరుగుతోందిపుడు.

వచ్చే ఏడాది
ఏ సరుకెంతకమ్మాలో ఇపుడే నిర్ణయించేసి
రేపటి శ్రమని కూడా పిండుకొనే
పగడ్భందీ పధకానికి తెర లేచింది.

జీవితాలకు భరోసా లేదు కానీ
ధరలకూ, దరిద్రాలకు మాంచి
గారంటీ లభిస్తోందిపుడు.

ప్రతీదీ ఓ వినిమయ వస్తువైనచోట
ఉప్పులు, పప్పులకు మాత్రమే
ఈ ఫార్వార్డ్ ట్రేడింగ్ పరిమితమవటం
ఆశ్చర్యమే మరి.

బహుసా ముందు ముందు
కలలు, కన్నీళ్లు, రోగాలు, చావుల్నీ కూడా
ఈ విష వ్యాపార పరిధిలోకి తీసుకొస్తారేమో!

అపుడిక
ఏడాది చివరకల్లా
ఇన్ని కలలు కొనాలి, ఇన్ని కన్నీళ్లు కార్చాలి
ఇన్ని సార్లు చావాలి, ఇన్ని రోగాల్ని
మోసుకు తిరగాలి అన్న
వాళ్ల లెక్కల ప్రకారం జీవించేస్తాం.

చూస్తా చూస్తా చచ్చిపోలేం కదా!

బొల్లోజు బాబా

(ఫార్వార్డ్ ట్రేడింగ్ విధానాన్ని నిరసిస్తూ..... ప్రజాకవి కాళోజీ మాటల్ని తల్చుకొంటూ)


*ఫార్వార్డ్ ట్రేడింగ్ అంటే: భవిష్యత్తులో పలానా వస్తువు ఇంత ధర పలుకుతుందన్న అంచనాతో ఈరోజే అమ్మకాలు కొనుగోళ్లు జరపటం. ఉదా: 2010 జనవరికి 1 నాటికి కందిపప్పు రెండు వందలుండవచ్చని ఈరోజే అమ్మకాలు కొనుగోళ్లు జరిగితే, జనవరి రెండవ తారీఖునుంచి మనం కందిపప్పుని రెండువందల పదిరూపాయిలకు కొనవలసి వస్తుంది. ధరల పెరుగుదలకు ఈ విధానమే ప్రధాన కారణమని ఒక అంచనా.


ఈ క్రింది లింకులోని వ్యాసాన్ని చదివితే విషయం మరింత స్పష్టమౌతుంది.
http://www.cpiml.in/Periodicals/Eco%20Notes%20Political%20economy%20of%20price%20rise%20PJ.html



15 comments:

  1. ఈవారా నాకు వరకట్నాలు ఎందుకు అంతగా పెరిగాయో కూడా తెలిసివచ్చింది. కాగాపోగా జీతాలు ఎందుకు పెంచుతారో కూడా బోధపడింది. నేనంతేనండి, ఒకటి చదివితే పది ఆలోచనలు చేస్తాను. అవి మరో వంద విషయాలు బోధపరుస్తాయి. సమకాలీన సమస్యని చక్కగా వివరించారు.

    ReplyDelete
  2. ఉష గారూ,
    మెత్తగా, తెలీకుండా భలే చురక పెట్టారు. వెరీ ఇంప్రెస్సివ్.
    KumarN

    ReplyDelete
  3. ఉషగారికి
    కామెంటినందుకు ధన్యవాదములు. మీ వాఖ్య అంతరార్ధం అర్ధమైంది. కట్నకానుకల గురించి మాట్లాడుకొనే సందర్భం కాదు కనుక దానిగురించి మాట్లాడటం లేదు. :-))

    గత మూడేళ్లుగా పెరుగుతున్న ధరలను గమనించారా? అప్పట్లో రెండువేలుండే నా పచారీ పద్దు నేడు ఏడువేలు దాటి పోతోంది. "ఆ వారా నా జీతమేమీ పెరగలేదు మరి." ఇలా పెరిగే ధరల కాస్కేడ్ ఎఫక్ట్ అనంతం.
    ఇది ప్రపంచ మాంధ్య ప్రభావమా? (లింకులో ఇచ్చిన వ్యాసం మన ఆహార ఉత్పత్తులు పెరుగుతున్నాయని చెపుతోంది మరి)


    ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెరగక ఎన్నో పనులకు కోతలు/వాతలు పెట్టుకొంటున్న సగటు భారతీయులలో నేనొకడిని. ఐరనీ ఏమిటంటే ఇంకంటాక్స్ పేయీని నేను.

    కొద్దిరోజుల క్రితం ఇరవై రూపాయిలమ్మిన పంచదార నేడు ముప్పై దాటింది. వారం క్రితం డబ్బై అమ్మిన మినప్పప్పు నేడు వంద చేరింది. ఇక బియ్యం సంగతి చెప్పక్కరలేదు. కేజీ నలభైచేరింది. మూడేళ్ల క్రితం పదహారు రూపాయిలుండేది. ఈ ఫ్లక్చుయేషన్లు ఎందుకని నా ఎకనమిక్స్ లెక్చరర్ కొలీగ్ ని అడిగితే, ఈ ఫార్వర్డ్ ట్రేడింగ్ గురించి చెప్పాడు. పంచుకోవాలనిపించి ఇలా....


    కుమార్ గారూ
    మనందరకీ పడుతున్న వాతలగురించి నే మాట్లాడుతుంటే, మీరు చురకలను చూస్తున్నారు. :-)

    బొల్లోజు బాబా

    ReplyDelete
  4. అందుకే "కూడా" అని కలిపింది. ఇక్కడ జరిగేదీ నిజమైన వ్యాపారమే. మాకు శుక్ర్వారం ఒక్కరోజే తాజా కూరగాయలు దొరుకుతాయి. ఆఫీస్ వర్క్ మధ్యలోనో, సాయంత్రం హడావుడిగానో వెళ్తాం/ను. తొమ్మిది కేజీల మసూరి బియ్యం ముప్పై డాలర్లు. అదీ (అప్పుడప్పుడూ) ఓ దీర్ఘం తీస్తాడు, "ఇకపై ఇంపోర్ట్ కావట. మీక్కావలిస్తే ముందే కొనేసుకోండి. మీరు రెగ్యులర్గా వస్తారు కనుక ...." ఇలా కొన్నిసార్లు తెలిసాక ఆగాను కానీ, పాప, బాబు వేరేవి తినరేమోనని ఒక అయిదో ఆరొ వేసుకు వచ్చేదాన్ని. కొన్నిసార్లు పెంకిపురుగు (రాన్రాను పడిపోతున్న క్వాలిటీకి గుర్తవి) పట్టి బ్యాగ్ అల్లనే పడేస్తా. ఇక పప్పులు, మా ఇంట్లో రోజూ ఇడ్లీ, దోశ వాడకం ఇప్పటికీను (ఇక్కడివారికి అర్థం అవుతుంది "ఇప్పటికీను" అన్నదెందుకు వడానో) అలాగే పెసర/శెనగ/కందిపప్పు వాడకం వారం లో కనీసం నాల్గు సార్లు. నాలుగు పౌన్డ్స్ బ్యాగ్ పది డాలర్స్ చేసేసారు ఓ సారి. అదీ కోటాగా ఒకరికి ఒకటే అన్నారు. ఇక చూడండి మా పాట్లు. ప్రక్క నున్న పెద్ద పట్టణానికి పోయి, ఓ పది షాప్స్ ఓ రోజంతా పడి తిరిగి ఇద్దరం కలిసి ఓ సం. సరిపడా పోగేసాం. ఇక తాజా కూరలు బెండ, బీర, సొర వంటివి ఖరీదు కూడా చూడను. అన్నీ కలిపి వారానికి దాదాపు ఓ యాభై వెచ్చించటం తప్పా. జామకాయ దాదాపుగా ఐదారు డాలర్స్ ఇలా ... ఇవికాక మళ్ళీ అమెరికన్ స్టొర్స్ లో కొనేవీ వుంటాయి.

    ఇక్కడ అంతా నిరుద్యోగం, ఉద్యోగల్లో అస్థిరత, ఎకానమీ, ఇమ్మిగ్రేషన్, ఇన్స్యూరన్స్ వీటిపై ధ్యాస పెడతారు. లేదా స్పోర్ట్స్, హాలీడే షాపింగ్స్/ప్రయాణాలు (నేను చూసినంతలో) కనుక ఇంత లోతుకి నా సమస్య ఎవరితోనూ చర్చించలేదు.

    నిజానికి ఇవన్నీ ఎందుకు మానేయొచ్చుగా అంటే, ఏదో పిల్లలకిమన వేషభాషలు నేర్పినట్లే మన ఆహార పద్దతులు కొన్నైనా నేర్పాలని.

    మీరన్న ఆ ధరల పెరుగుదల అక్కడివారితో మాట్లాడిన ప్రతిసారి తెలుస్తుంది. కానీ ఐదేళ్ళ తర్వాత పోయినేడు వచ్చినపుడు అక్కడ షాప్స్ లో రద్దీ చూసాక ఖర్చు పెట్టటం పెరిగింది అనిపించింది. దిగువ మధ్య తరగతి, ఎగువనున్నవారు ఇద్దరూ నాకు అలాగే కనిపించారు.

    నేను చెప్పిన ఈ రెండూ మీ కవితకి అతకవు కానీ .. :) నేనంతే.

    ReplyDelete
  5. ఉషగారూ
    మీ కామెంటుకు ధన్యవాదములు. అక్కడి జీవన విధానానికి ఇక్కడ జీవన విధానానికి తేడాలున్నట్టున్నాయి. నేనైతే కంపార్ చేయలేను.

    నిజానికి ఇవన్నీ ఎందుకు మానేయొచ్చుగా అంటే, ఏదో పిల్లలకిమన వేషభాషలు నేర్పినట్లే మన ఆహార పద్దతులు కొన్నైనా నేర్పాలని.

    అన్న మీ మాట మీ ప్రయారిటీసి ని తెలుపుతోంది. may be you are paying an extra penny to your priority. that is good of you.

    థాంక్యూ
    బొల్లోజు బాబా

    ReplyDelete
  6. బ్లాగర్లకి మంచి సామాజిక సమస్యని తెలియజేసారు.
    మరువo గారి చర్చలు విజ్ఞాన దాయకంగా ఉన్నాయి.
    ధన్యవాదాలు.
    ఒక బ్లాగుకి కామెంటినపుడు మీ కవితలో నాలుగు లైన్లు (పుస్తకం లోకి నడవడ మంటే) మీ అనుమతిలేకుండా ఉదహరించాను. మన్నించరూ....

    ReplyDelete
  7. "ఇంటెర్నెట్ లో పేదవాడి 'గొడవ'ని పెడితే స్పందనలు ఇలాగే ఉంటాయి పేలవంగా ? " అనిపించింది. అసలు బాధ పడేవాడికి ఎలాగు తప్పదు.... ఆ మహానుభావుడు కాళోజి ని గుర్తు చేసినందుకు కృతజ్ఞతలతో మీకు హృదయ పూర్వక నమస్కారాలు ...

    ReplyDelete
  8. కవితాత్మకంగా మన బాధల వెనక దాగిన కుట్రను తెలియజేసారు. ప్రజా కవిని ఇలా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ధరల పెరుగుదల - జీతాల పెరుగుదల తక్కెడల వ్యత్యాసం నేటికీ పి.ఆర్.సి.ని ప్రకటించలేని ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనం. పెరిగిన వస్తు వ్యామోహం దిగువ మధ్యతరగతి జీవితాలలో కల్లోలానికి దారితీస్తోంది. పెరిగిన ఎలక్ట్రానిక్ వస్తు వినియోగం సకల దరిద్రాలకు ఆలంబనగా వుంది. బయటపడేందుకు ఏ సాకులూ దొరకక జనాన్ని ఒక భీతావహ వాతావరణాన్ని సృష్టించి మరిపించేందుకు మన ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

    ReplyDelete
  9. నరసింహమూరి గారు, ఇటువంటి సమస్యలని ఎవరికివారుగా గమనించి, తదనుగుణంగా స్పందించటమే కానీ ఒక వ్యాసమో, చర్చో మార్పు తేలేదు. సంఘటితంగా ప్రతిఘటించటానికి ప్రజలలో ఏక గళం రావాలి. ఈ మాధ్యామాలు కొందరినైనా చేరటానికేనని గ్రహించాలి. జనతలో మార్పు, ప్రభుత్వాలని ప్రభావితం చేయగల నేర్పు ఇట్టే రావు, ఇప్పట్లో రావు.

    కుమార్, శ్రీనిక, ఈ వ్యాఖ్యల్లో నా గురించి వ్యక్తం చేసిన అభిప్రాయాలకి ధన్యవాదాలు.

    ReplyDelete
  10. ఉష గారికి శిరస్సు వంచి నమస్కారాలు,
    నా మాట వల్ల మీ నుంచి సామాజికమైన అమృతగులికల్లాంటి మాటలు వచ్చాయి ఇవే నేను ఆశించింది.మీకు ధన్యవాదాలు.
    మార్పు వ్యక్తినుంచే మొదలు కావాలి అని విశ్వసించే వాడిని నేను.ఒక చర్చ మార్పు తేకపోవచ్చు కాని సానుభూతి కరువయ్యింది అని అనిపించింది.నేను అన్నది అదే,ఈ మాద్యమం(internet) కేవలం కొందరినే చేరవచ్చు అని. నాతో ఏకీభవించినందుకు ధన్యవాదాలు....

    మీ ముందు పసివాన్ని దాసుడి తప్పు దండంతో సరి అంటారు పెద్దలు .... మీకు దండాలు

    ఇట్లు
    నరసింహ మూర్తి

    ReplyDelete
  11. "బహుసా ముందు ముందు
    కలలు, కన్నీళ్లు, రోగాలు, చావుల్నీ కూడా
    ఈ విష వ్యాపార పరిధిలోకి తీసుకొస్తారేమో!"

    2010 జనవరి 1 నాటికి కందిపప్పు ధరను స్పెకులట్ చెసే ప్రాశశ్ లో పెరిగే కలలు, వాటితో వెలిగే బతుకులు, పెరిగే జీతాలు, పెరిగే అవసరాలు దాంతో పెరిగే డిమేండ్లు, వరదలు, వ్యాధులు తరిగే బతుకులు, కరిగే కలలు, కారే కన్నీళ్ళు, వాటితో తరిగే డిమేండు ఇవన్నీ పరిశీలనకొస్తాయి కదా బాబా గారు. అందుకని మనకు తెలియకుండానే పరోక్షంగా మన కలల్ని, బతుకుల్ని, కన్నీళ్ళని వ్యాపారంలో భాగం ఎప్పుడో చేసేసేరు.

    మీ కవిత బాగుంది.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

    ReplyDelete
  12. మీ కవితల్లో ఉండే కవితాత్మకత (పదం సరియైనదేనా ? పద చిత్రాలు ఎక్కువ ఉండడం) తగ్గినట్టుంది దీంట్లో . బహుశా వస్తువు వల్లేమో తెలియదు. చివరి పాదాలు బావున్నాయి.
    ఒక చిన్న సందేహం. చట్టప్రకారమే చాలా కరెక్ట్ ప్రయోగం లా అనిపించింది చూస్తే . కానీ ఎక్కువగా చట్టప్రకారంగా (ఇక్కడ చట్టప్రకరంగానే) వాడతారెందుకు? సమాస పరంగా ఎమన్నా తేడా ఉందా?

    ReplyDelete
  13. i thank one and all

    i was immensely moved when i was told about this kind of trading.

    i was astonished over the new ways to make the sufferers more suffocate.

    this poem is just reflection of what i felt and what i thought.

    i donot believe any kind of art form can bring change in society.

    but it always played a good vent to the poet. the thoughts of the reader may sometimes be provoked. what else is needed from poetry than this?

    i once again thank every one

    bollojubaba

    p.s. i am not able to type in telugu at present sorry.

    ReplyDelete
  14. sreenika gaariki

    its an honour to me madam. i feel very happy about it. pl. thank you very much

    bollojubaba

    ReplyDelete
  15. ఒక వ్యాసంలా వ్రాస్తే బాగుండేది.

    ReplyDelete