ప్రజాకవీ! రవీ!
ఏం తినేట్టు లేదు
ఏం తాగేట్టు లేదని
ఎంత సూటిగా చెప్పేసావూ!
పెద్దయ్యా!
నీవా మాటలన్నప్పుడు
బ్లాక్ మార్కెటింగ్ ఒక నేరం.
ఇపుడు అంతా చట్టబద్దమే.
ఎంత ఎదిగిపోయామో! చూసావా?
నిత్యావసర వస్తువుల్ని
ఫార్వార్డ్ ట్రేడింగ్ చేసి పారేసి
సామాన్యుని కడుపుపై
ఆకలి వాతల్ని పెట్టటం
చట్టప్రకారమే జరుగుతోందిపుడు.
వచ్చే ఏడాది
ఏ సరుకెంతకమ్మాలో ఇపుడే నిర్ణయించేసి
రేపటి శ్రమని కూడా పిండుకొనే
పగడ్భందీ పధకానికి తెర లేచింది.
జీవితాలకు భరోసా లేదు కానీ
ధరలకూ, దరిద్రాలకు మాంచి
గారంటీ లభిస్తోందిపుడు.
ప్రతీదీ ఓ వినిమయ వస్తువైనచోట
ఉప్పులు, పప్పులకు మాత్రమే
ఈ ఫార్వార్డ్ ట్రేడింగ్ పరిమితమవటం
ఆశ్చర్యమే మరి.
బహుసా ముందు ముందు
కలలు, కన్నీళ్లు, రోగాలు, చావుల్నీ కూడా
ఈ విష వ్యాపార పరిధిలోకి తీసుకొస్తారేమో!
అపుడిక
ఏడాది చివరకల్లా
ఇన్ని కలలు కొనాలి, ఇన్ని కన్నీళ్లు కార్చాలి
ఇన్ని సార్లు చావాలి, ఇన్ని రోగాల్ని
మోసుకు తిరగాలి అన్న
వాళ్ల లెక్కల ప్రకారం జీవించేస్తాం.
చూస్తా చూస్తా చచ్చిపోలేం కదా!
బొల్లోజు బాబా
(ఫార్వార్డ్ ట్రేడింగ్ విధానాన్ని నిరసిస్తూ..... ప్రజాకవి కాళోజీ మాటల్ని తల్చుకొంటూ)
*ఫార్వార్డ్ ట్రేడింగ్ అంటే: భవిష్యత్తులో పలానా వస్తువు ఇంత ధర పలుకుతుందన్న అంచనాతో ఈరోజే అమ్మకాలు కొనుగోళ్లు జరపటం. ఉదా: 2010 జనవరికి 1 నాటికి కందిపప్పు రెండు వందలుండవచ్చని ఈరోజే అమ్మకాలు కొనుగోళ్లు జరిగితే, జనవరి రెండవ తారీఖునుంచి మనం కందిపప్పుని రెండువందల పదిరూపాయిలకు కొనవలసి వస్తుంది. ధరల పెరుగుదలకు ఈ విధానమే ప్రధాన కారణమని ఒక అంచనా.
ఈ క్రింది లింకులోని వ్యాసాన్ని చదివితే విషయం మరింత స్పష్టమౌతుంది.
http://www.cpiml.in/Periodicals/Eco%20Notes%20Political%20economy%20of%20price%20rise%20PJ.html
Showing posts with label ఫ్యూచర్ ట్రేడింగ్. Show all posts
Showing posts with label ఫ్యూచర్ ట్రేడింగ్. Show all posts
Tuesday, November 10, 2009
Subscribe to:
Posts (Atom)
