లుంబిని గ్రామానికి సమీపంలోని సాలవృక్షాలతో నిండిన ఒక ఉద్యానవనంలో సిద్ధార్థ గౌతముడు జన్మించాడు. ఆయన తల్లి మాయాదేవి, తండ్రి శాక్య రాజు శుద్ధోదనుడు. ప్రసవ సమయం సమీపించినప్పుడు, కపిలవస్తు నుంచి ఆమె తన పుట్టింటి గ్రామమైన దేవదహకు ప్రయాణిస్తూ, మార్గమధ్యంలోని లుంబిని ఉద్యానవనంలో విశ్రాంతి కోసం ఆగింది. అక్కడ సమీపంలోని కొలనులో స్నానం చేసిన అనంతరం, ఒక సాలవృక్షపు కొమ్మను పట్టుకుని నిలబడి ఉండగా సిద్ధార్థుడికి జన్మనిచ్చింది. సాలవృక్షాలతో నిండిన ఈ ఉద్యానవనం బౌద్ధ సంప్రదాయంలో బుద్ధుని జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం నేపాల్ లో ఉంది.
ప్రాచీన బౌద్ధ గ్రంథాల ప్రకారం, సిద్ధార్థుడు తల్లి గర్భం నుంచి వెలువడినప్పుడు దేవతలు తొలుత స్వీకరించి, అనంతరం మనుషులకు అప్పగించారట. జన్మించిన వెంటనే ఏడు అడుగులు నడిచాడట. అలా బుద్ధుని జననం సాధారణ జననానికి భిన్నంగా, అద్భుతమైన సంఘటనగా బౌద్ధ గ్రంథాలు వర్ణించాయి.
బొరొబుదూర్ బౌద్ధ స్మారకంలోని జనన శిల్పాలు ఈ కథను దృశ్యరూపంలో ప్రదర్శిస్తాయి. చెట్టు కొమ్మను పట్టుకుని నిలబడిన మాయాదేవిని, ఆమె చుట్టూ ఉన్న పరిచారికలను ఆ శిల్పాల్లో చూడవచ్చు. (see pic). ఈ ఘట్టానికి సంబంధించి అనేక చారిత్రక అంశాలు ఇలా ఉన్నాయి.
I. లుంబిని – నేను జన్మించిన ప్రదేశం
గౌతమ బుద్ధుడు తన ఎనభయ్యవ ఏట కుశీనగరంలో పరినిర్వాణం పొందడానికి ముందు, తన ప్రియశిష్యుడైన ఆనందునితో నాలుగు పవిత్ర స్థలాల ప్రాముఖ్యతను వివరించాడు. విశ్వాసంతో కూడిన వ్యక్తులు భక్తిశ్రద్ధలతో సందర్శించవలసిన ప్రదేశాలు ఇవని తెలిపాడు.
మొదటిది లుంబిని. ఇక్కడ తథాగతుడు జన్మించాడు. రెండవది బోధగయ. ఇక్కడ ఆయన జ్ఞానోదయం పొందాడు. మూడవది సారనాథ్. ఇక్కడ ఆయన తొలిసారిగా ధర్మబోధన చేశాడు. నాలుగవది కుశీనగరం. ఇక్కడ తథాగతుడు పరినిర్వాణం పొందుతాడు.
ఈ నాలుగు ప్రదేశాలను దర్శించే భిక్షువులు, భిక్షుణులు, ఉపాసకులు, ఉపాసికలు ఆయా స్థలాల ప్రాముఖ్యతను స్మరించుకుంటూ భక్తిశ్రద్ధలతో పర్యటిస్తారని బుద్ధుడు వివరించాడు. ఈ వృత్తాంతం మహాపరినిబ్బాన సుత్తం (దీఘనికాయ 16)లో ఉంది.
బుద్ధుని జీవితానికి, బౌద్ధ గ్రంథాల్లో పేర్కొన్న సంఘటనలకు సంబంధించిన పురావస్తు ఆధారాలను కనుగొనాలని పరిశోధకులు ఆసక్తి చూపారు. బ్రిటిష్ కలోనియల్ పురావస్తు శాస్త్రవేత్తలు బుద్ధుని జ్ఞానోదయ స్థలాన్ని, ధర్మబోధన చేసిన స్థలాన్ని గుర్తించినప్పటికీ, ఆయన జన్మస్థలమైన లుంబినిని, బాల్యం గడిపిన కపిలవస్తును, పరినిర్వాణం పొందిన కుశీనగరాన్ని గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టింది.
బుద్ధుని జన్మస్థలమైన లుంబినిని గుర్తించడానికి, అశోకుడు “ఇక్కడ శాక్యముని బుద్ధుడు జన్మించాడు” అని వేయించిన శాసనం, వివిధ కాలాల్లో విదేశీ బౌద్ధ యాత్రికులు లుంబినిని సందర్శించినప్పుడు నమోదు చేసిన పరిశీలనలు ఎంతగానో ఉపకరించాయి.
II. అశోక చక్రవర్తి వేయించిన శాసనం
క్రీ.పూ. మూడవ శతాబ్దం లుంబిని చరిత్రలో ఒక కీలకమైన కాలం.
అశోకుడు తన గురువు ఉపగుప్తునితో కలిసి లుంబిని తీర్థయాత్రకు వెళ్లాడు. అక్కడికి చేరుకున్న తరువాత ఉపగుప్తుడు, మాయాదేవి చెట్టు కొమ్మను పట్టుకుని సిద్ధార్థునికి జన్మనిచ్చిన వృక్షాన్ని చూపిస్తూ, “మహారాజా! ఇక్కడే తథాగతుడు జన్మించాడు” అని చెప్పాడు. అప్పటికే అది ఒక దర్శనీయ స్థలంగా పూజాలందుకొంటోంది. అశోకుడు అక్కడ కొన్ని స్మారక చిహ్నాలను ఏర్పాటు చేశాడు.
క్రీ.పూ. 249లో తన లుంబిని సందర్శనకు గుర్తుగా అశోకుడు అక్కడ ఒక రాతి స్తంభాన్ని ప్రతిష్ఠించి, దానిపై శాసనాన్ని చెక్కించాడు. ఈ శాసనంలో ఐదు పంక్తులు, 90 అక్షరాలు ఉన్నాయి. ఇది బ్రాహ్మీ లిపిలో చెక్కబడింది.
ఆ శాసనంలోని మొదటి భాగం ఇలా చెబుతుంది: “దేవతలకు ప్రియుడైన, ప్రియదర్శి రాజు తన పట్టాభిషేకం జరిగిన ఇరవయ్యవ సంవత్సరంలో స్వయంగా ఇక్కడికి వచ్చాడు. ఎందుకంటే ఇక్కడ శాక్యముని బుద్ధుడు జన్మించాడు” అని తెలియజేస్తుంది.
ఈ వాక్యం లుంబినిని సిద్ధార్థ గౌతముని జన్మస్థలమని స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ శాసనం బుద్ధుడు జన్మించిన కాలానికి సుమారు రెండు శతాబ్దాల తరువాతిది.
“ఈ ప్రదేశం చుట్టూ ఒక రాతి ప్రాకారం కట్టించమని, ఒక రాతి స్తంభాన్ని నిలబెట్టమని ఆజ్ఞాపించాడు.”
శాసనంలోని చివరి భాగం ప్రకారం, బుద్ధుడు ఇక్కడ జన్మించినందున లుంబిని గ్రామానికి పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చి, దిగుబడిలో కేవలం ఎనిమిదో వంతు మాత్రమే చెల్లించవలసిందిగా నిర్ణయించాడు.
ఈ శాసనం ద్వారా అశోకుడు బుద్ధుని జన్మస్థలాన్ని సందర్శించి గౌరవించాడని, అక్కడ రాతి స్తంభాన్ని ప్రతిష్ఠించాడని, ఆ ప్రాంత ప్రాముఖ్యతను శాశ్వతంగా గుర్తించేందుకు చర్యలు తీసుకున్నాడని తెలుస్తుంది.
III. చైనా యాత్రికుల వృత్తాంతాలు
1. జీ సెంగ్జాయ్ (Zhi Sengzai)
చైనాకు చెందిన బౌద్ధ సన్యాసి జీ సెంగ్జాయ్ క్రీ.శ. 350–375 మధ్య లుంబినిని సందర్శించిన తొలి చైనా యాత్రికుడు. ఆయన వృత్తాంతం షుయ్జింగ్జు (Shui-Ching-Chu) అనే గ్రంథంలో లభిస్తుంది.
బుద్ధుడు జన్మించిన సమయంలో మాయాదేవి పట్టుకున్న సాలవృక్షాన్ని జీ సెంగ్జాయ్ అశోక వృక్షంగా పేర్కొన్నాడు. మాయాదేవి చెట్టు కొమ్మను పట్టుకుని ప్రసవిస్తున్న దృశ్యాన్ని అశోక చక్రవర్తి లాపిస్ లాజులీ అనే నీలిరంగు రత్నంతో చేసిన విగ్రహంగా ఏర్పాటు చేసినట్లు తెలిపాడు.
పాత వృక్షం నుంచి కొత్త చిగుళ్లు రావడం ఆగిపోయినప్పుడు, బౌద్ధ సన్యాసులు దాని పాత కాండాన్ని తీసుకెళ్లి తిరిగి నాటేవారని, అలా అదే పాత వృక్షం ఇంకా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నాడు. ఆ వృక్షపు కొమ్మలు రాతి విగ్రహానికి నీడనిచ్చేవని కూడా తెలిపాడు.
సిద్ధార్థుడు జన్మించిన తరువాత ఏడు అడుగులు వేసినట్లు చెప్పబడే పాదముద్రల గుర్తులకు అశోకుడు నీలిరంగు రత్నాలను పరిపించి, చుట్టూ ఒక పొడవైన రాతి పలకతో రక్షణ కల్పించినట్లు జీ సెంగ్జాయ్ వర్ణించాడు. ప్రజలు ఆ పాదముద్రలకు సువాసనగల పూలతో పూజలు చేసేవారు. వాటిపై మందమైన పత్తి వస్త్రాలను అనేక పొరలుగా కప్పినా అవి మరింత ప్రకాశవంతంగా కనిపించేవని యాత్రికుడు పేర్కొన్నాడు
2. ఫాహియాన్ (Faxian)
చైనా బౌద్ధ సన్యాసి ఫాహియాన్ క్రీ.శ. ఐదవ శతాబ్దం ప్రారంభంలో లుంబినిని సందర్శించాడు. ఆయన యాత్రా వృత్తాంతంలో లుంబిని గురించి పేర్కొన్న వివరాలు ఇవి.
“నగరానికి తూర్పున సుమారు యాభై లీ ల దూరంలో ఒక రాజ ఉద్యానవనం ఉంది. దానిని లుంబిని అని పిలుస్తారు (1 లీ = 1.6 కిమీ). అక్కడ శుద్ధోదన రాజు భార్య ఒక కొలనులో స్నానం చేసింది. కొలను నుంచి బయటకు వచ్చి, ఇరవై అడుగులు ముందుకు నడిచి, ఒక చెట్టును చేతితో పట్టుకుని తూర్పు దిశగా తిరిగి సిద్ధార్థునికి జన్మనిచ్చింది.”
శిశువు నేలపైకి వచ్చి ఏడు అడుగులు నడిచాడు. ఇద్దరు నాగరాజులు అతనికి స్నానం చేయించారు. శిశువు శరీరాన్ని కడిగిన ప్రదేశంలో ఒక బావిని నిర్మించారు. మాయాదేవి స్నానం చేసిన కొలనులోని నీటిని సన్యాసులు పవిత్రంగా భావించి తాగుతున్నారని ఫాహియాన్ పేర్కొన్నాడు.
మాయాదేవి ప్రసవ సమయంలో పట్టుకున్న అశోక వృక్షం అప్పటికీ సజీవంగా ఉన్నట్లు ఆయన తెలిపాడు.
3. హ్యూయెన్త్సాంగ్ (Xuanzang)
క్రీ.శ. ఏడవ శతాబ్దంలో ప్రసిద్ధ చైనా బౌద్ధ యాత్రికుడు హ్యూయెన్త్సాంగ్ లుంబినిని సందర్శించాడు. తన యాత్రా వృత్తాంతంలో లుంబినిని ‘లా-ఫా-ని’ ఉద్యానవనంగా పేర్కొన్నాడు.
కపిలవస్తు నుంచి ఈశాన్య దిశగా ఎనభై నుంచి తొంభై లీ దూరం ప్రయాణిస్తే లుంబిని చేరుకోవచ్చు. అక్కడ శాక్యుల స్నానపు కొలను ఉంది. దాని నీరు అద్దంలా స్వచ్ఛంగా ఉంటుంది. నీటిపై పూలు తేలుతూ కనిపిస్తాయి.
ఆ కొలనుకు ఉత్తరంగా ఇరవై ఐదు అడుగుల దూరంలో ఒక ఎండిపోయిన అశోక వృక్షం ఉంది. బోధిసత్త్వుడు జన్మించిన పవిత్ర స్థలం అదే అని హ్యూయెన్త్సాంగ్ పేర్కొన్నాడు.
తథాగతుడు జన్మించిన స్థలం వద్ద ఒక పెద్ద రాతి స్తంభం ఉంది. దాని పైభాగంలో గుర్రం తల విగ్రహం ఉంది. ఈ స్తంభాన్ని అశోక చక్రవర్తి ప్రతిష్ఠించినట్లు, ఒక భయంకరమైన ఉరుము కారణంగా స్తంభం కొంతమేరకు పగిలిపోయిందని హ్యూయెన్త్సాంగ్ పేర్కొన్నాడు.
4. ఇతర చైనా యాత్రికులు
తరువాత చైనా నుంచి వూ-కోంగ్, ఫాంగ్ చీ వంటి యాత్రికులు లుంబినిని సందర్శించారు. బుద్ధుడు జన్మించిన ప్రదేశంలో ఒక పెద్ద స్థూపం ఉన్నట్లు వారు తమ వృత్తాంతాల్లో పేర్కొన్నారు. వూ-కోంగ్ సుమారు క్రీ.శ. 764లో లుంబినిని సందర్శించాడు.
హ్యూయెన్త్సాంగ్ రాతి స్తంభం గురించి వివరించినప్పటికీ, దానిపై ఉన్న శాసనం గురించి ప్రస్తావించలేదు. అయితే, ఫాంగ్ చీ ఆ స్తంభంపై బుద్ధుని జననానికి సంబంధించిన వివరాలు నమోదై ఉన్నాయని పేర్కొన్నాడు.
5. రిపు మల్ల యువరాజు తీర్థయాత్ర
అశోక స్తంభం పైభాగంలో క్రీ.శ. పద్నాలుగవ శతాబ్దానికి చెందిన ఒక శాసనం ఉంది. లుంబిని క్షీణిస్తున్న దశలో దాన్ని దర్శించిన రాజు ఇతనే కావచ్చు.
పశ్చిమ నేపాల్లోని నాగరాజ వంశానికి చెందిన రిపు మల్ల యువరాజు తన పేరు, ఒక ప్రార్థనను స్తంభంపై చెక్కించాడు. ఆ శాసనంలోని మొదటి వాక్యం మహాయాన బౌద్ధ ప్రార్థన. తరువాతి వాక్యం “మల్ల యువరాజు చిరకాలం విజయవంతుడిగా ఉండాలి” అనే అర్థాన్ని ఇస్తుంది.
రిపు మల్ల కాలం వరకు లుంబిని, కపిలవస్తు ప్రాంతాలు బుద్ధుని జన్మస్థలంగా, దర్శనీయ క్షేత్రాలుగా ఉన్నట్లు ఈ శాసనం సూచిస్తుంది.
తరువాత లుంబిని క్రమంగా పొదలు, అడవులతో కప్పబడి ప్రజల జ్ఞాపకాల నుంచి కనుమరుగైంది. పరిశోధకులు దీనికి హిందూమత పునరుజ్జీవనం, రాజకీయ ఒడిదుడుకులు కారణమని అభిప్రాయపడ్డారు.
6. 1896 తరువాత లుంబినిని సందర్శించినవారు
1896 డిసెంబరు 1న, పురావస్తు శాస్త్రవేత్త అంటోన్ ఫ్యూరర్, జనరల్ ఖడ్గ శంషేర్ రాణాలు లుంబినిని సందర్శించారు. వారు అక్కడి అశోక స్తంభాన్ని గుర్తించారు; దానిపై ఉన్న శాసనాన్ని చదివి అర్థం చేసుకున్నారు. అంటోన్ ఫ్యూరర్ తన పరిశోధనలను Antiquities of Buddha Sakyamuni’s Birthplace in the Nepalese Tarai అనే శీర్షికతో ప్రచురించాడు.
అశోకస్తంభానికి కొంతదూరంలో ఒక చిన్న గదిలో మాయాదేవి జనన శిల్పం ఉంది. అయితే హిందూ యాత్రికులు ఆ విగ్రహాన్ని రుమిందేవిగా (దుర్గ) భావించి పూజలు, జంతుబలులు చేసేవారు. ఈ ప్రాంత చారిత్రకతను గుర్తించాక జంతుబలులను అక్కడ నిషేధించారు.
బుద్ధభగవానుడి జన్మస్థలంగా లుంబినీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది.
ప్రస్తుతం తవ్వకాల ద్వారా లభించిన పురావస్తు అవశేషాల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆలయంలో తేమ, నీటి లీకేజీ వల్ల అవశేషాలు దెబ్బతినకుండా చర్యలు చేపడుతున్నారు. 2026లోనూ యునెస్కో దీర్ఘకాలిక సంరక్షణపై పర్యవేక్షణ కొనసాగిస్తోంది.
IV. ముగింపు
నేడు కొందరు బుద్ధుడు చారిత్రక వ్యక్తి కాదని, కల్పిత పాత్ర అని ప్రచారం చేస్తున్నారు. ఈ తప్పుడు కథనాన్ని ముఖ్యంగా హిందుత్వవాదులు ప్రచారంలో పెడుతున్నారు.
క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో అశోక చక్రవర్తి లుంబినిని సందర్శించి ప్రతిష్ఠించిన స్తంభంపై ఉన్న బ్రాహ్మీ శాసనం, “ఇక్కడ శాక్యముని బుద్ధుడు జన్మించాడు” అని స్పష్టంగా తెలియజేస్తుంది. బుద్ధుని జన్మస్థలాన్ని గుర్తించే ఈ శాసనం, బౌద్ధ సంప్రదాయాలు, ఫాహియాన్, హ్యూయెన్త్సాంగ్ వంటి చైనా యాత్రికుల వృత్తాంతాలు, లుంబినిలో లభించిన పురావస్తు ఆధారాలు—ఇవన్నీ కలిపి పరిశీలించినప్పుడు బుద్ధుని చారిత్రక ఉనికి బలంగా నిరూపితమౌతుంది.
అయితే, ఈ ఆధారాలన్నింటినీ పక్కనపెట్టి బుద్ధుడిని కల్పిత పాత్రగా ప్రచారం చేయడం వెనుక ఉన్న ఉద్దేశం - హిందుత్వ రాజకీయ కథనానికి అనుకూలంగా చరిత్రను వక్రీకరించే ప్రయత్నంగా, బ్రాహ్మణీయ సంప్రదాయాలకు భిన్నమైన తాత్విక, సామాజిక వారసత్వాన్ని అందించిన బౌద్ధాన్ని చరిత్ర నుంచి చెరిపివేయాలనే ఆలోచనగా అనిపిస్తుంది.
హిందూమతమే ఈ నేలపై అనాదిగా విలసిల్లిన గొప్ప సనాతనధర్మం అంటూ చేసే హిందుత్వ కథనానికి హరప్పా నాగరికత, బౌద్ధమతానికి లభించిన ఆదరణ లాంటి చారిత్రక అంశాలు కొరుకుడు పడవు. తన వాదనకు సరిపోని చారిత్రక వాస్తవాలను నిరాకరించడం ద్వారా వాటిని చెరిపేయలేరు.
బుద్ధుడిని ప్రపంచం చారిత్రక వ్యక్తిగా అంగీకరించింది. ప్రపంచం అంగీకరించిన విషయాలను కాదనాలంటే బలమైన ఆధారాలు చూపాలి. లేదా, ఇష్టంలేకపోయినా ఆ ఆధారాల పరిధిలో ఆలోచించడం నేర్చుకోవాలి. చరిత్ర మన ఇష్టాలకు అనుగుణంగా జరగదు.
రామాయణ, భారతాలకు సంబంధించిన చారిత్రక, శాస్త్రీయ ఆధారాల కొరకు దేశం నలుమూలలా తవ్వకాలు, పరిశోధనలు జరిగినప్పటికీ, ఇతిహాసాల్లోని ప్రధాన పాత్రలు, యుద్ధాలను నిర్ధారించే ఆనవాళ్ళు ఇప్పటివరకూ ఎందుకు లభించలేదు? వాటి అన్వేషణలలో పాల్గొన్న బి.బి. లాల్, హెచ్.డి సంకాలియా, రాయ్ చౌదరి వంటి చరిత్రకారులు ఎందుకు నిరాశ చెందారో ఈ హిందుత్వవాదులు ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి.
హిందుత్వ ప్రచారానికి అనుగుణంగా చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను చరిత్ర గుర్తుంచుకుంటుంది.
బొల్లోజు బాబా
రిఫరెన్స్
The Sacred Garden of Lumbini Perceptions of Buddha’s birthplace, Published in 2013 by the United Nations Educational, Scientific and Cultural Organization




No comments:
Post a Comment