జీవిత విశేషాలు
శ్రీ యర్రోజు మాధవాచార్యులు 1913, అక్టోబరు 22 న కృష్ణాజిల్లా నూజివీడులో జన్మించారు. వీరి తండ్రి శోభనాద్ర్యాచార్యులు, తల్లి రుక్మిణమ్మ. శోభనాద్ర్యాచార్యులు వేదపండితులు. జ్యోతిష్య శాస్త్రంలో ప్రావీణ్యం ఉండేది. వీరు నూజివీడు జమిందారీలో స్వర్ణకార కులవృత్తిని నెరిపారు. మాధవాచార్యులుగారికి చిన్నతనంలోనే తండ్రిగారు గతించటంతో తల్లి రుక్మిణమ్మ గారి పెంపకంలోనే పెరిగారు. వీరి బాల్యం, ప్రాధమిక విద్యాభ్యాసం అంతా నూజివీడులోను, పిదప గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్ లోను తమ చదువు కొనసాగించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి బిఎ. హానర్స్ పట్టా పొందారు.
శ్రీ మాధవాచార్యులు గుడివాడ ఎ.ఎన్.ఆర్ కళాశాలలో ఓరియంటల్ లాంగ్వేజెస్ శాఖాధిపతిగా 1950 నుండి 1966 వరకు పనిచేసారు. శ్రీ రాజా రంగయ్యప్పారావు పాఠశాలలో తెలుగు పండితునిగా సేవలందించారు. తరువాత కొంతకాలం నూజివీడు ధర్మప్పారావు కళాశాల తొలి ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహించారు. వీరు ఎక్కడ పనిచేసినా ఆ ప్రాంతంలోని సాహిత్య, కళా రంగాలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి ఎందరో కళాకారులకు ఒక వేదిక కల్పించి వారిలోని ప్రతిభను పదిమందికి తెలిసేలా చేసేవారు. అలా గుడివాడలో రచయితల సంఘం, కృష్ణరాయ కళాసమితి మొదలైన సాంస్కృతిక సంస్థలు ఏర్పడటానికి దోహదపడ్డారు. గుడివాడలో కవిరాజ కళాభవనం నిర్మించటంలో వీరిపాత్ర ఎంతో ఉన్నది.[1] శ్రీ మాధవాచార్యులు గుడివాడలో ఉండగా- కోడూరు అచ్చయ్య, తుమ్మలపల్లి కామేశ్వర రావు, కఠారి సత్యనారాయణరావు, జి.ఎస్.ఆర్ ఆంజనేయులు, శ్రీమతి పువ్వుల అనసూయ, శ్రీ నెరుసు వీరాస్వామి లాంటి ప్రభృతులతో కూడి గుడివాడ కళాసమితి అనే సంస్థ ఆధ్వర్యంలో అనేక సాహిత్య కార్యక్రమాలను,[2] ఎందరో లబ్దప్రతిష్టులతో సాహిత్య సభలు, అవధానాలను ఏర్పాటు చేసారు.
సాహిత్య కృషి
శ్రీ మాధవాచార్యులు మఘవలయము, ప్రతిమా శంబూకము, మణి ప్రవాళము, భువన విజయము, ముక్కోటి, వ్యాసాలు-ఉపన్యాసాలు వంటి వివిధ రచనలు గావించి గొప్ప కీర్తి నార్జించారు.
“మఘవ లయము” అను పద్యకృతిని ఆనాటి కళలు ఎక్సైజ్ శాఖా మంత్రి అయిన రాజా రంగయ్యప్పారావు బహద్దరు కు 1965లో అంకితమిచ్చారు
“మఘవ” అనేది మహా ఘనత వహించిన అనే వాక్యానికి సంక్షిప్తనామం. నిజాం అధినేత మీర్ ఉస్మాన్ అలీఖాన్ కు బ్రిటిష్ ప్రభుత్వం హిస్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అనే బిరుదు ఇచ్చింది. దీనిని తెలుగులో “మహా ఘనత వహించిన” అని వ్రాసేవారు. 1930 ల ప్రాంతంలో నిజాం రాజును వ్యంగ్యంగా సంబోధించటానికి మఘవ అని పిలిచేవారు మఘవ లయము అంటే మహాఘనత వహించిన నిజాం రాజుయొక్క అధికార లయము (నాశనము) అని సంకేతార్ధము.
నిజాం రాజ్యాన్ని స్వతంత్ర్యభారతావనిలో విలీనం చేయటానికి జరిపిన భారతప్రభుత్వ పోలీసు చర్య ఈ మఘవలయ కావ్య వస్తువు. ఈ కావ్యంపై గోల్కొండ పత్రికలో వచ్చిన ఒక సమీక్షలో- యర్రోజు మాధవాచారి శైలి విశ్వనాథ సత్యన్నారాయణ రచనా పోకడలతో ఉన్నదని సమీక్షకుడు అభిప్రాయపడ్డాడు[3].
దుష్టుడైన ఒక వ్యక్తి నిజాం రజాకార్లతో కలిసి చెడు వర్తనుడై ప్రజలను పీడిస్తుండగా, అతని సోదరుడే అతనిని చంపివేయటం మఘవలయ కావ్యాంశము. ఈ కావ్యంలో శ్రీ మాధవాచార్యులు ఎంతో ధైర్యంగా రజాకార్ల కోపాగ్నికి గురికావచ్చునేమోనని కూడా ఆలోచించక, ఆనాడు రజాకార్లు హిందువుల పట్ల, వారి ప్రార్ధనాలయముల పట్ల జరిపిన అత్యాచారములను ఎంతో వేదనతో ఇలా వర్ణించారు. ఇవి ఆనాటి పరిస్థితులను కళ్ళకు కడతాయి.
//దివ్యస్థలంబుల దేవాలయంబుల| మధుమాంస దుర్గంధమయ మొనర్చి
విగ్రహంబుల నెల్ల విధ్వంసనము చేసి| మూత్రాభిషేకాల ముంచి యెత్తి
భూషణాదుల దొంగపోటుగా హరించిన| వాహనాలెక్కి సవారిచేసి
చేదికందినవారి సిగలెల్ల గొరిగించి| యుపవీతముల మొలకుచ్చుపోసి
యర్చకస్త్రీల గర్భాలయముల బట్టి| చెప్పరానట్టి విధముల జెఱచి చెఱచికఱకు
గుండెలు రూపులు తిరుగు మొఱకు|రక్కసుల రాజ్యమైపోయె నక్కట కట|
అయ్యవార్లనదల్సి రొయ్యలు దినిపించి|నిష్టాగరిష్టులనిచ్చి సున్తీచ్చేసి కుచ్చుటోపీలు పెట్టి మతము మార్చినారు........ అంటూ దుఃఖపడుతూ ఆనాటి హిందువుల నిస్సహాయ పరిస్థితులను, రజాకార్ల దుష్ట చేష్టలను చరిత్రలో నిక్షిప్తం చేసారు శ్రీ యర్రోజు మాధవాచార్యులు. ఇది వీరు నిర్వహించిన ఒక చారిత్రిక బాధ్యతగా నేడు గుర్తించవచ్చును.
అలాంటి క్రూరపరిస్థితులనుండి నిజాం రాజ్యాన్ని విడిపించి ప్రజలకు విముక్తికలిగించిన సర్ధార్ వల్లభాయి పటేల్ ధైర్యసాహసాలను మాధవాచార్యులు ఈ విధంగా స్తుతించారు
వల్లభాయి పటేలు మేధా విభవ ప్రయోగ సముదారుడ’యి
చేసిన వీర కార్యము ఫలితము త్రిలింగ విషయాభ్యుదయారున
కాంతి పూరమైనది. ఇది ఫలోదయము [4]//
***
రామాయణంలోని శంబుకవధ ఘట్టంలోని ఔచిత్య, అనౌచిత్యాలను తాత్వికంగా చర్చించిన కావ్యం ప్రతిమా శంబూకము. భువన విజయము ఏకాంకిక నాటిక.
మాధవాచార్యులు జానపద వాజ్ఞ్మయం పై పి.హెచ్.డి చేసి సమర్పించటానికి రైలులో వెళుతుంటే రజాకార్ల ఉద్యమసమయంలో జరిగిన అల్లర్లలో సూట్ కేస్ పోవటంతో ఆ పరిశోధన తాలూకు పత్రాలను పోగొట్టుకొన్నారు. అలా డాక్టరేట్ ను మిస్ అయ్యారు. ఆ లోటు తీర్చుకోవటం కొరకు ఉద్యోగవిరమణ అనంతరం హానరరీ ఫెలోషిప్ తీసుకొని “మేకా రాజా రంగారావు అప్పారావు – జీవిత చరిత్ర” అనే పరిశోధనా గ్రంధాన్ని రచించారు[5].
శ్రీ మాధవాచార్యులు గొప్ప వాక్పటిమ కలిగిన ఉపన్యాసకులు. ఆకాశవాణిలో తెలుగు సాహిత్యంపై అనేక ప్రసంగాలు చేసారు. ఈ రేడియో ఉపన్యాసాలను ఇంకా మరికొన్ని వ్యాసాలను కలిపి “వ్యాసాలు-ఉపన్యాసాలు” పేరుతో పుస్తకరూపంలో వెలువరించారు.
మహా గురువు బిరుదు ప్రధానం
మలేషియా ఆంధ్రసంఘం వారు మాధవాచార్యులను మలేషియా ఆహ్వానించారు. వీరు అక్కడ ఒక నెలరోజుల పాటు తెలుగు సాహిత్యం గురించి వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ సందర్భంగా వీరికి మలేషియా ఆంధ్రసంఘం వారు “మహా గురువు” అనే బిరుదును ఇచ్చి గొప్పగా సత్కరించారు
సామాజిక సేవ
మాధవాచార్యులు స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. 1942 లో బొంబాయిలో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ మహాసభలకు తెలుగు ప్రతినిధిగా హాజరయ్యారు. స్వాతంత్ర్యానంతరం కూడా కాంగ్రెస్ తో తన అనుబంధాన్ని కొనసాగిస్తూ- వితంతు పునర్వివాహం, అనాధప్రేత సంస్కారము లాంటి వివిధ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు.
నూజివీడు జమిందారు కుమారరాజాగా ప్రసిద్ధిచెందిన మంత్రివర్యులు శ్రీ మేక రంగయప్పారావు గారితో యర్రోజు మాధవాచార్యులకు ప్రగాఢమైన స్నేహానునుబంధం ఉండేది. తన మఘవలయం కావ్యాన్ని కుమారరాజా గారికి అంకితం ఇచ్చారు. మాధవాచార్యుల ప్రోత్సాహంతోనే 1966లో శ్రీ కుమారరాజా వారు నూజివీడులో ధర్మప్పారావు కళాశాల నెలకొల్పారు[6]. ఇది నేడు శాఖోపశాఖలుగా విస్తరించి నడుస్తూ ఉన్నది.
***
ఆంధ్రనాటక కళాపరిషత్తు 1929లో స్థాపించబడింది. 1944 లో దీనిని పునర్వవస్థీకరించే వరకూ పెద్దగా చెప్పుకోదగిన కృషి కాని తెలుగు నాటకరంగ అభివృద్ధికాని జరగలేదు. అలా ఆంధ్ర నాటక కళాపరిషత్తును పునర్వవస్థీకరించిన పెద్దలలో శ్రీ రాజా రంగయ్యప్పారావు, శ్రీ యర్రోజు మాధవాచార్యులు, కాజ వెంకట్రామయ్య, దుక్కిపాటి మధుసూదనరావు తదితరులు ముఖ్యులు. వీరందరూ పరిషత్ నిర్వహణ బాధ్యత వహించి, ఒక నియమావళిని ఏర్పరచి పరిషత్తు నిర్విఘ్నంగా, సమర్ధవంతంగా పనిచేయటానికి దోహదపడ్డారు. వీరిలో మాధవాచార్యులు క్రియాశీలకపాత్ర పోషించించారు. అప్పటినుంచి ప్రతిఏటా నాటకపోటీలు జరపటం ఆంధ్రదేశంలోని నాటకసంఘాలలో గొప్ప ఉత్తేజాన్ని, చైతన్యాన్ని నింపింది.
ఆంధ్ర నాటక కళాపరిషత్తు కార్యవర్గ కమిటీలో మాధవాచార్యులు వివిధ హోదాలలో దాదాపు 1944 నుంచి మూడు దశాబ్దాలపాటు పని చేసి తెలుగు నాటకరంగానికి తమ విశిష్టమైన సేవలను అందించారు. పలు నాటక పోటీలను నిర్వహించటం, నటులను ప్రోత్సహించటం, ప్రతిభకలిగినవారిని సన్మానించటం[7] లాంటి పనులద్వారా ఎంతో మంది ప్రతిభావంతులను సినీ నాటకరంగాలకు పరిచయం చేసారు. అలా ఈ పరిషత్తు ద్వారా వెలుగులోకి వచ్చిన రచయితలలో ఆచార్య ఆత్రేయ, భమిడిపాటి రాధాకృష్ణ, డి.వి. నరసరాజు, పినిశెట్టి, బెల్లంకొండ రామదాసు, కొండముది గోపాలరాయ శర్మ తదితరులు; నటులలో ఎన్.టి. రామారావు, రమణమూర్తి, మిక్కిలినేని, జగ్గయ్య, రావికొండలరావు, చదలవాడ, వల్లం నరసింహరావు లాంటివారు ముఖ్యులు[8].
మాధవాచార్యులు పంతొమ్మిది వందల అరవైలలో ఆంధ్రప్రదేష్ సంగీత నాటక అకాడెమీ కి మెంబరుగా తమసేవలందించారు. [9]
విశ్వబ్రాహ్మణ ధర్మపీఠ వ్యవస్థాపన
విశ్వబ్రాహ్మణ వంశీయులకు ధర్మప్రభోదం చేయటానికి, సంఘీయులకు చేయూతనీయటం కొరకు శ్రీ మాథవాచార్యులు 1974 లో వ్యవస్థాపక సభాపతిగా విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ను స్థాపించారు. దురిశేటి వెంకటరామాచార్యులు, కొండూరి వీరరాఘవాచార్యులు సంచాలకులుగా వ్యవహరించారు. ఈ సంస్థ నేటికీ గొప్ప గణనీయమైన సేవలందిస్తున్నది[10].
***
రచయితగా, సాంస్కృతిక సేవకునిగా, కళాపోషకునిగా, సంఘసేవకునిగా తన జీవితాన్ని సమాజానికి అర్పించుకొన్న శ్రీ యర్రోజు మాధవాచార్యులు 1983, ఆగస్టు 31 న నూజివీడులోని తమ స్వగృహంలో పరమపదించారు. తెలుగు నేలకు సంబంధించిన సాహిత్య, కళా విద్యారంగాలలో వీరి పాత్ర గణనీయమైనది.
బొల్లోజు బాబా
కాకినాడ
[1] గుడివాడ వైభవం, తాత రమేష్ బాబు పే.నం. 73
[2] ఆంధ్రజ్యోతి దినపత్రిక 11, ఆగస్టు 1964, పేనం. 5
[3] రి. గోలకొండ పత్రిక 12-12-1965
[4] ఉద్యమ దర్శనము, శ్రీ ముదిగొండ శివప్రసాద్. పే.నం. 334
[5] శ్రీ యర్రోజు మాధవాచార్యులు గారి కుమార్తె శ్రీమతి కల్యాణి గారు, వారి బంధువులైన ప్రొ. డా. నూతలపాటి శ్రీనివాస్ గారు ఈ వ్యాసరచనా సమయంలో అమూల్యమైన సమాచారాన్ని అందించారు.
[6] పుష్కర కృష్ణ, కృష్ణాపుష్కర విశేష సంచిక 2016, పేనం. 112
[7] విశాలాంధ్ర, దినపత్రిక 3-5-1964 , పేనం. 6
[8] ఆధునిక నాటకరంగం ఈ దశాబ్ది ప్రయోగాలు by బోయిన వెంకటేశ్వర రావు. పే.నం.317-318. అదృష్టవంతుని ఆత్మకథ, డి.వి. నరసరాజు స్వీయ చరిత్ర, పే.నం. 148
[9] The Andhra Pradesh Legislative Asbembly Debates, official Report 15th July, 1967
[10] విశ్వబ్రాహ్మణ సర్వస్వము-విశ్వబ్రాహ్మణ ప్రముఖులు (ప్రధమ భాగము), శ్రీ రాపాక ఏకాంబరాచార్యులు, పేనం. 288
No comments:
Post a Comment