Sunday, April 27, 2008

ఆస్పత్రిలో ఓ చావు

కట్లు తెంచుకొని ఓ హంస ఎగిరి పోయింది

ఎళ్ళి పోయావా అమ్మా
బతినన్నాళ్ళూ మాకోసమే బతికి ...........
నిన్నటి దాకా ఆమెను పనిమనిషిలాగ వాడుకొన్న
ఓ కొడుకు భోరుభోరున నటిస్తున్నాడు.

మిగతా రోగుల మొహాలపై
భయం యాసిడ్డై విస్తరించింది.
చావు వాసన వైరాగ్యమై,వేదాంతమై,కర్మ సిద్దాంతమై,
వార్డంతా మంచులా పరచుకొంది.

ఓ ముసలాయన కళ్లు మూసుకొని
తనులేని ప్రపంచం ఎలాఉంటుందో
కలల తెరపై చిత్రించుకొంటున్నాడు.

నాడాలు కొట్టబడుతున్న ఎద్దులా
నిస్సహాయంగా పడున్న పక్షవాత రోగి కనుగుడ్లు
బొట్లు బొట్లై ద్రవించినయ్.... అసూయతో.

ఏయ్ అటు వెళ్లకు - అంది ఓ పురటాలు
డాక్టర్ని చేయ్యాలనుకొంటున్న తన పెద్ద కొడుకుతో.

అందరూ పోతున్నారు కానీ వీడింకా పోడు - అని
ఓ రోగి భందువు గుండె తన ద్రాక్ష గుత్తుల స్వప్నాలు
నిజమయ్యేదెపుడోనని మూలుక్కుంది.

ఇద్దరికీ ఇంకా బేరం కుదిరినట్టు లేదు
మృతురాలి భంధువు జేబు బరువుగానూ,
వార్డు బాయ్ జేబు ఖాళీగాను ఉన్నాయి.

వాసన పసిగట్టిన ఓ శవాల రిక్షా వాడు,
తలుపుమూసిన వంటింట్లోకి ఎలా వెళ్లాలో తెలీని పిల్లిలా
ఎవర్ని కదపాలో తెలీక కిటికీ వద్ద తచ్చాడుతున్నాడు.

దూరంగా ఓ బైరాగి - తోలుతిత్తి ఇది తుటులు తొమ్మిది .....'
అని తత్వం గొణుగుతూ మధ్యలో దగ్గు రాగా
దగ్గరుకు మింగుతున్నాడు.

ఆసుపత్రి పక్కనే ఉన్న గబ్బిలం గదుల లాడ్జికి
ఎదురుగుండా ఉన్న మందుల షాపుకీ
గోడకానుకుని ఉన్న రౌండ్ ది క్లాక్ హొటల్ కి
ఉప్పచేపలా వడలిన దేహంతో ఖాలీ సేసాలమ్మే ముదుసలికి
ఈ రోజుతో ఓ బేరం తగ్గిపోయింది.

దూరంగా చెట్టుపై వాలిన హంస ఓ సారి నవ్వుకొని
ఎగురుకొంటూ మబ్బుల్లో కలసిపోయింది.


బొల్లోజు బాబా

7 comments:

  1. బాగా రాసారండి.

    ReplyDelete
  2. వోవ్!!!
    మాంఛి బలిష్టుడైన పహిల్వాన్ చేతిలో లెంపకాయ తిన్నట్టు బుర్ర గింగిరాలు తిరిగింది.

    ReplyDelete
  3. నగ్నకవిత్వంతో మనసుని కసకసా కోసేసారు!

    ReplyDelete
  4. చేదు నిజాన్ని "రమ్యంగా" రుచి చూపించారు.

    ReplyDelete
  5. చాలా అధ్భు తంగా ఉంది మీ కవిత
    మీ పద పర్ యోగం చాలా బాగుంది.

    యాంతిర్క అనుభంధాలు, క్లుషిత పేర్్మల మీద్ ఒక కొ ర్డా దెబ్బ మీ కవిత

    ReplyDelete