Showing posts with label మట్టి కవిత. Show all posts
Showing posts with label మట్టి కవిత. Show all posts

Wednesday, April 30, 2008

మట్టి కనుల నాపల్లె

అపరిచిత ప్రపంచంలో బతకడం అంటే
వసంతాన్ని పారేసుకొన్న తుమ్మెద
ఎడారి కన్నులపై వాలటమే!

ఏ కరచాలనాల ప్రారంభం
ఏ ఆత్మ స్నేహాల వాకిళ్లు తెరుస్తుందో లేక
పరచుకోబోయే ఏ విష జాలం అవుతుందో
తెలియని స్థితి.

అపరిచిత ప్రపంచంలో బతకటం అంటే
జీవితాన్ని అవమానం స్థాయిలో లాగించేయటమే.
ప్రసవించే స్త్రీ, ఆ వేదనలో ఎంత ఒంటరో
అంతే ఏకాకితనం ముసురుకుంటుంది.
మహా సంద్రంలో ఒంటరి నావికుని
మనో రోదనను ఏ ప్రవచనాలు
శాంతింపచేయలేవు.

అపరిచిత ప్రపంచంలో బతకటం అంటే
మబ్బుల మద్య గుంపును కోల్పోయిన
కొంగపిల్ల తుమ్మ చెట్టుకు గాయమై
వేలాడడమే!

ప్రజా సమూహపు సానరాయిపై
గంధపు మాటల చెక్కని అరగదీసి అరగదీసి
నాగుండెకు పరిచయాల లేపనాన్ని పూద్దామంటే
గుండె కనపడదే!

ఒక వేళ
నెరళ్లు తీసిన నా పల్లె మట్టి నయనాల్లో
ఉండి పోయిందా?