Tuesday, September 19, 2023

ప్రముఖ కవి, రచయిత శ్రీ బొల్లోజు బాబా ప్రత్యేక ఇంటర్వ్యూ



నేను రచించిన ప్రాచీనపట్టణాలు తూర్పుగోదావరి జిల్లా పుస్తక నేపథ్యంగా సంచిక పత్రిక సంపాదకులు శ్రీ కస్తూరి మురళీకృష్ణగారు చేసిన నా ఇంటర్వ్యూ పాఠం ఇది. ఎడిటర్ గారికి కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను.
భవదీయుడు
బొల్లోజు బాబా
.
ప్రముఖ కవి, రచయిత శ్రీ బొల్లోజు బాబా ప్రత్యేక ఇంటర్వ్యూ


.
1. మీరు కవి. అధ్యాపకుడు. అదీ జంతుశాస్త్రం. మీకు చరిత్ర అధ్యయనం పట్ల ఆసక్తి ఎలా కలిగింది? ఎందుకు కలిగింది?

జ. నేను పుట్టి పెరిగింది ఒకనాటి ఫ్రెంచి కాలనీ అయిన యానాంలో. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడేళ్ళకు ఈ ఫ్రెంచికాలనీలకు స్వాతంత్ర్యం వచ్చింది. భారతదేశంలో బ్రిటిష్ వారిని ఎదిరించటానికి ఎలాగైతే ఉద్యమం జరిగిందో 1954 లో ఈ ఫ్రెంచి కాలనీలలో కూడా ఉద్యమం జరిగింది. మా నాన్నగారు శ్రీ బొల్లోజు బసవలింగం అప్పుడు ఒక విద్యార్ధిగా ఆ ఉద్యమంలో పాల్గొని ఫ్రెంచి పోలీసులచే దెబ్బలు తిన్నారు. మా మిత్రుల పిచ్చాపాటి మాటల్లో ఆ చారిత్రిక సందర్భంలో మా తండ్రులు ఏవిధంగా వారి వంతు పాత్ర నిర్వహించారో ఒకసారి చర్చించుకొన్నాం. నా మిత్రుడొకరు తన తండ్రి కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నారని, ఆయన ఉద్యమకారులకు రహస్యంగా ఆహారం అందించేవారని చెప్పాడు. ఈ రోజు వారెవరిగురించీ ఎవరూ మాట్లాడుకోరు. ఫ్రెంచివారినుండి ఈ దేశం విమోచనం అవ్వటంలోని కొన్ని విస్మృత గాథలను, వ్యక్తులను పుస్తకరూపంలోకి తేవాలని భావించాను. అలా 2007 లో “యానాం విమోచనోద్యమం” అనే పుస్తకాన్ని రచించాను. ఇది నా మొదటి పుస్తకం. ఈ పుస్తకంలో 1954 లో ఫ్రెంచివారికి వ్యతిరేకంగా యానాంలో జరిగిన ఉద్యమవిశేషాలు, దానిలో పాల్గొన్న యానాం స్థానికుల వివరాలు, అప్పటి రాజకీయ, సాంఘిక అంశాలు, ఛాయాచిత్రాలు, వార్తా కథనాలను పొందుపరచాను. అప్పటికి చాన్నాళ్ళుగా పత్రికలలో కవితలు వస్తున్నప్పటికీ మొదటగా చరిత్ర రచన పుస్తకరూపంగా తేవటం వెనుక నేపథ్యమిది.


మానాన్నగారు స్వయంగా కవి, నాటక రచయిత. వారు “ఫ్రెంచి యానాం చరిత్ర” పుస్తకాన్ని రాయాలని భావించేవారు. అది కార్యరూపం దాల్చకుండానే 2004 లో గతించారు. వారి స్ఫూర్తితో 2011 లో “ఫ్రెంచిపాలనలో యానాం” అనే పుస్తకాన్ని రచించాను. gallica.bnf.fr అనే వెబ్ సైటునుండి యానానికి సంబంధించిన కొన్ని వందల ఫ్రెంచి డాక్యుమెంట్లను గూగుల్ ట్రాన్స్ లేటర్ ద్వారా ఇంగ్లీషులోకి మార్చి, వాటిని మరలా తెలుగులోకి అనువదించుకొని ఆ రచన చేసాను. అది నా రెండవ చరిత్రపుస్తకం.
 
నేను పుట్టిన ఊరు పట్ల ప్రేమ, జన్మనిచ్చిన తండ్రిపట్ల అభిమానమే నాకు చరిత్ర అధ్యయనం పట్ల ఆసక్తి కలిగేలా చేసాయని భావిస్తాను.
.
2. తూర్పు గోదావరిజిల్లా, ప్రాచీనపట్టణాలు అన్న అంశంపై పుస్తకం రాయాలన్న ఆలోచన ఎలాకలిగింది?

జ. 2020 లో నేను “మెకంజీ కైఫియ్యతులు తూర్పుగోదావరి జిల్లా” పుస్తకాన్ని రాసాను. తూర్పుగోదావరి జిల్లా నుండి కాలిన్ మెకంజీ సేకరించిన పది గ్రామాల చరిత్రకు సంబంధించిన పుస్తకమిది. మెకంజీ కైఫియ్యతులు అనేవి స్థానికులు తాటియాకులపై వ్రాసుకొని శతాబ్దాలపాటు భద్రపరచుకొన్న చరిత్ర. వీటిలో ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలు, సంస్కృతులు, చరిత్రా అన్నీ మిళితమైపోయి ఉంటాయి. వీటిలోని విషయాలను ప్రధానస్రవంతి చరిత్రతో అనుసంధానించటానికి ప్రయత్నించాను. 
ఈ ప్రయత్నంలో తూర్పుగోదావరి జిల్లా చరిత్రకు సంబంధించిన అనేక పుస్తకాలను విస్తృతంగా అధ్యయనం చేసి రాసుకొన్న నోట్సు కైఫియ్యతుల పరిధి దాటిపోయింది. చెప్పాల్సిన విషయాలు మెకంజీ కైఫియ్యతులు పుస్తకంలో చెప్పలేకపోయానన్న వెలితి నన్ను వెంటాడేది. ఆ సమయంలో ఆదిరాజు వీరభద్రరావు గారు రచించిన ప్రాచీనాంధ్రనగరములు అనే పుస్తకం చూసాను. దీనిలో కొలనుపాక, గోలకొండ, అలంపురము, వరంగల్లు లాంటి కొన్ని తెలంగాణ నగరముల చరిత్రను చాలా ఆసక్తికరంగా చెప్పారు. అదే ఒరవడిలో “తూర్పుగోదావరి జిల్లా ప్రాచీన పట్టణాలు” పుస్తకం రాయాలన్న తలంపు కలిగింది. ఆ విధంగా చారిత్రిక ప్రాధాన్యత కలిగిన వివిధ పట్టణాల చరిత్రను భిన్నకోణాలలోంచి ఆవిష్కరించటానికి ప్రయత్నించాను.
.
3. ఈ పుస్తకం రాసేందుకు సమాచార సేకరణ ఎలా చేశారు? మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు, సహాయ సహకారాల గురించి చెప్పండి.

జ. ఈ రోజు సమాచారం అపరిమితంగా లభిస్తోంది. అర్చైవ్.ఆర్గ్ లాంటి వెబ్ సైట్లలో ఒక్క క్లిక్ తో వేల పేజీల సంబంధిత సమాచారం మనముందుంటుంది. దాన్ని సమన్వయపరచుకొని ఎలా వ్యాఖ్యానించాలి అనేది చాలా సార్లు ప్రధాన ఇబ్బంది.
 
ఈ విషయంలో ప్రముఖ చరిత్రకారులు, విశ్రాంత ఆచార్యులు, కీర్తిశేషులు శ్రీ కూచిభొట్ల కామేశ్వరరావు గారు ఇచ్చిన సలహాలు, సూచనలు ఎంతో విలువైనవి. ఒక్కో చాప్టరు రాసేముందు నేను ఇలా రాద్దామనుకొంటున్నాను అని నా స్కీమ్ వారి తో చర్చించేవాడిని. ఆయన కొన్ని సూచనలు చేసేవారు. లేదా ఏవైనా ఖాళీలుంటే చెప్పేవారు. ఉదాహరణకు- బిక్కవోలు ఊరిలో ఉన్న ఆలయసంపద గురించి చెబుతూ "అపురూప" అనే పదాన్ని వాడినందుకు.....ఎందుకు అపురూపం అనుకొంటున్నావు, వాస్తు పరంగానా, నిర్మాణ పరంగానా, వివిధ రాజులు నిర్మాణశైలుల పరంగానా ఆ తేడాలు చెప్పమని సూచించారు. వారి నిశిత గమనింపు అది.
 
ఈ పుస్తకంలో వచ్చే కొన్ని పద్యాలు, శాసనవాక్యాలకు శ్రీ మధునాపంతుల సత్యనారాయణమూర్తి, శ్రీ రామకృష్ణ శ్రీవత్సలు తాత్పర్యసహిత వ్యాఖ్యానాలు చెప్పారు.
 
ద్రాక్షారామ శాసనాలపై కొన్ని అరుదైన పిడిఎఫ్ లను ఆంధ్రభారతి రూపకర్త శ్రీ వాడపల్లి శేషతల్పశాయి అందించారు. ఈ పుస్తకరచనలో వారి సహకారం మరువరానిది.
.
4. మీరు శిక్షణ పొందిన చరిత్ర పరిశోధకులు కారు. కేవలం ఆసక్తివల్ల చరిత్రను అధ్యయనం చేస్తున్నవారు. మీకు చారిత్రిక అంశాల ఆధారంగా వ్యాసాలు రాసేటప్పుడు మీ రచనల ప్రామాణికతను, అర్హతను ఎవరూ ప్రశ్నించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. అలా ప్రశ్నించేవారికి మీ సమాధానం ఏమిటి?

జ. ఔను. నేను ఔత్సాహిక చరిత్రకారుడినే తప్ప శిక్షణపొందినవాడిని కాదు. నాకు అల్టర్నేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూల పట్ల ఆసక్తి ఎక్కువ. వాటిగురించి భిన్న వాదనలను చదువుతాను. వాటినుంచి నాదైన అవగాహనను ఏర్పరచుకొని దానిని వ్యాసాలుగా రాయటానికి ప్రయత్నిస్తాను. నా వాదనను సమర్ధించే ఉటంకింపులకు సంబంధించిన రిఫరెన్సులను ఎక్కడికక్కడ పేజినంబర్లతో సహా ఇస్తాను. తద్వారా చదివే పాఠకునికి తాను ప్రామాణిక రచనను చదువుతున్న భావన కలుగుతుంది. రచనపై విశ్వాసం ఏర్పడుతుందని అనుకొంటాను. ప్రాచీనపట్టణాలు పుస్తకంలో ఏదైనా శాసనాన్ని ఉటకించవలసి వచ్చినపుడు దాని నంబరు మాత్రమే కాక చాలాచోట్ల సంబంధిత శాసన వాక్యాన్ని కూడా ఇవ్వటం జరిగింది.
 
ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా కొందరు నా రచనలతో విభేదించవచ్చు. ప్రశ్నించవచ్చు. కొన్ని సందర్భాలలో నన్ను దూషించవచ్చు కూడా. అదంతా దృక్ఫథాల మధ్య వైరుధ్యమే తప్ప నా వైఫల్యమో లేక వారి అహంకారమనో భావించను.
.
5. ప్రస్తుతం చరిత్ర విశ్లేషణలో సత్యం కన్నా దృక్పథం ప్రాధాన్యం వహిస్తోంది. ఒక వ్యక్తి రచనను అంచనా వేయటంలో కూడా దృక్పథమే ప్రాధాన్యం. అలాంటి పరిస్థితిలో అందరికీ ఆమోదయోగ్యంగా చరిత్ర రచనలు ఎలా చేస్తున్నారు?

జ. చరిత్రకు సంబంధించి మనం సత్యానికి ఎంతదగ్గరగా వెళ్ళగలము అనేదే తప్ప పూర్తి సత్యాన్ని చేరుకోలేమని భావిస్తాను.
 
నేడు చరిత్రను మూడు కోణాలలో అధ్యయనం చేస్తున్నారు
1. చరిత్రను స్థలము, కాలము, అక్కడి ప్రజల సంస్కృతులను దృష్టిలో ఉంచుకొని చూడటం
2. చారిత్రిక దస్తావేజులను ఆ దేశ స్మృతులుగా గుర్తించటం
3. వివిధ శాస్త్రాల పరస్పర సహకారం అందించుకొని చరిత్రను నిర్మించటం
పై మూడు కోణాలలోంచి చరిత్రకారులు నెరేటివ్స్ ను నిర్మిస్తున్నారు. చరిత్రలో జరిగిన వివిధ సంఘటనల ద్వారా మానవజాతి గమనం ఇలా నడిచింది అని చెప్పే కథనాలను హిస్టారికల్ నెరేటివ్స్ అంటున్నారు. స్థానిక కథనాలు, జాతీయ అంతర్జాతీయ సంఘటనలతో సంబంధాలను కలిగి ఉంటాయి. వాటిని గుర్తించగలిగినప్పుడే సరైన స్థానిక చరిత్రను నిర్మించగలం. ఇది ఒక రకంగా Civil History of Mankind. దీనిలో ఆధారాలను సేకరించటం ఒక ఎత్తు అయితే వాటిని విశ్లేషించటం మరొక ఎత్తు. ఈ విశ్లేషణలో దృక్ఫథాల పాత్రను విస్మరించలేం.
 
మనం ఎవరి పక్షాన ఉండి వ్రాస్తున్నామనేది చాలా సందర్భాలలో అత్యంత కీలకంగా మారుతుంది. బౌద్ధుల కళ్ళతో చరిత్రను చూసినపుడు హిందువులు చెడ్డగాను, హిందువుల కళ్ళతో చూసినపుడు ముస్లిములు విధ్వంసకులుగాను, అట్టడుగు వర్గాల తరపున చరిత్రరాసేటపుడు అగ్రవర్ణాలవారందరూ పీడకులుగాను చెప్పటం సహజం. కానీ చరిత్రలో భిన్న సమూహాలు రాసులుపోసినట్లు నలుపుతెలుపులుగా విడిపోయి ఉండరు. అందరినీ ఒకే శక్తి నడిపించదు. అనేక nuances ఉంటాయి. వాటిని గుర్తించగలగాలి. అన్ని దృక్ఫథాలను ఆకళింపుచేసుకొని చరిత్రరచన చేయటం చరిత్రకారుని నైతికబాధ్యత అనుకొంటాను.

అందరకూ ఆమోదయోగ్యమైన చరిత్ర రచన చేయటం అనేది కష్టం ఈ రోజుల్లో. ఈ పుస్తకంలో కూడా ఒక చోట- బుద్ధుని దేహ అవశేషాలపై బౌద్ధ స్తూపాలు నిర్మించటం అనే ఆచారం శక్తిపీఠాలకు ప్రేరణ అయి ఉండవచ్చు అన్నందుకు నా మిత్రుడొకరు తీవ్రంగా విభేధించాడు. హిందూ ఆలయాల విధ్వంసం యుద్ధోన్మాదంతో చేసినదే తప్ప మతోన్మాదం కాదని అన్నందుకు నన్ను చాలామంది ఆక్షేపించారు.
.
6. ఈ పుస్తక రచనలో ఏ పట్టణానికి సంబంధించిన వివరాల సేకరణకోసం చాలా కష్టపడాల్సివచ్చింది? అలాగే, ఈ పుస్తకంలో ఏ అధ్యాయం మీకు అన్నిటికన్నా ఎక్కువగా నచ్చింది? ఎందుకు?

జ. రెండు ప్రశ్నలకూ సమాధానం పిఠాపురం. నిజానికి ఈ పట్టణానికి సంబంధించి విస్తారమైన సమాచారం అందుబాటులో ఉంది. కానీ దాన్ని ఎలా సమన్వయపరచాలో తెలిసేది కాదు. అంతటి డేటాని ఆర్గనైజ్ చేసి చదివించే వచనంగా మార్చే ఆ “దారం” ఎదో దొరక్క చాలా కాలం ఇబ్బందిపడ్డాను. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక అంటూ మూడు దశలుగా విభజించి చూడమని శ్రీ కామేశ్వరరావు గారు సూచించారు. దానితో రకరకాలుగా ఉన్న సమాచారం మూడు ముక్కలుగా విడిపోవటంతో వ్యాసానికి చక్కటి శిల్పం ఏర్పడింది.
 
పిఠాపురం వ్యాసంలో హుయాన్ త్సాంగ్ పిఠాపురాన్ని సందర్శించి ఉండవచ్చునని ప్రతిపాదించాను. అలా జరిగిఉండటానికి గల సంభావ్యతను తార్కికంగా చెప్పటానికి ప్రయత్నించాను.
 
బోధగయవద్ద ఉన్న కుక్కుటపాదగిరి, మానపుర అనేచోట ఉండిన పిష్టపురిక దేవి ఆలయం లాంటివి పిఠాపుర చరిత్రకు చక్కని జోడింపు అని భావిస్తాను.
 
ఇవేకాక ఈ పుస్తకంలో ప్రస్తావించిన గుణగవిజయాదిత్యుని చారిత్రిక స్థానం, బిక్కవోలు ఆలయ శిల్పసంపద, కోరంగి సాంస్కృతిక విషయాలు లాంటివి తూర్పుగోదావరి జిల్లా చరిత్రలో విశిష్టమైన అంశాలు అని తలుస్తాను.
.
7. తెలుగులో ఇటీవలి కాలంలో శిక్షణ పొందిన చరిత్ర పరిశోధకులకన్నా ఆసక్తితో చరిత్ర గురించి తెలుసుకుని రచనలు చేసేవారే అధికంగా కనిపిస్తున్నారు. ఇందుకు కారణం ఏమిటి? ఇలాంటి వారు చేసే విశ్లేషణలు, తీర్మానాలను ఎంతవరకు ప్రామాణికంగా పరిగనించవచ్చు?

జ. చరిత్ర అధ్యయనం ఉపాధిని ఇచ్చేదిగా లేకపోవటంవల్ల శిక్షణ పొందిన చరిత్ర పరిశోధకులుఉండటం లేదు నేడు. కళాశాల స్థాయిలో చరిత్రను ప్రధాన సబ్జెక్టుగా తీసుకొని చదివేవారే మృగ్యం. ఏదో పోటీ పరీక్షలకోసం కొన్ని తారీఖులు, దస్తావేజులు గుర్తుపెట్టుకొంటున్నారు. అంతవరకే చరిత్ర ప్రాసంగిత.
 
మీరన్నట్లు ఆసక్తితో చరిత్రగురించి తెలుసుకొని రచనలు చేసేవారే అధికం. చరిత్రరచనలను ప్రోత్సహించి అవార్డులను ప్రకటించే సంస్థలు కూడా తెలుగునాట లేవు.
 
ఏంతో కఠోరశ్రమ ఉంటే తప్ప ఒక చరిత్ర వ్యాసం రాయలేం. ఎన్నో పుస్తకాలు పరిశీలిస్తే తప్ప ఒక నూతన ప్రతిపాదన చేయలేం. అలాంటి వాటి ప్రామాణికత పక్కనపెడితే కనీసం పరామర్శ చేసేవాడే కరువయ్యారు.
 
విదేశాలలో అనేక యూనివర్సిటీలు చరిత్రకారులకు గ్రాంటులిచ్చి పుస్తకాలు రాయించుకొంటాయి. ఉదాహరణకు Wendy Doniger చికాగో యూనివెర్సిటీ, Sheldon Pollock కొలంబియా యూనివర్సిటీ, David Shulman, హెబ్రూ యూనివెర్సిటీ, Audrey Truschke, Rutgers University, Jennifer Howes, లండన్ యూనివెర్సిటీ, Cynthia Talbot, Oxford University – లాంటి సమకాలీన ఇండాలజిస్టులు ఆయా యూనివర్సిటీల ఆర్ధిక సహాయంతో భారతదేశ చరిత్రకు సంబంధించి ఎన్నో విలువైన పుస్తకాలు వెలువరించారు. చరిత్ర రచన అనేది వారికి ఒక జీవితకాల శ్రమ. ఒక మెరుగైన ఉద్యోగం. ఇక్కడ మాత్రం అదొక థాంక్ లెస్ జాబ్.
పాలకులు మాత్రం తమ రాజకీయావసరాలకు తగినట్లు చరిత్రను మార్చిరాసుకోవటం సమకాలీన విషాదం.
.
8. మీ భవిష్యత్తులో మీ రచనల ప్రణాళికలేమిటి?


జ. ప్రస్తుతం ప్రముఖ మళయాలీ కవి శ్రీ కె. సచ్చిదానందన్ కవిత్వానువాదాలను పుస్తకరూపంలో తెచ్చే ప్రయత్నంలో ఉన్నాను. డిటిపి లో ఉంది. ఇక చరిత్రకు సంబంధించి దశాబ్దకాలంగా భిన్న చారిత్రిక అంశాలపై రాసిన వ్యాసాలను సంపుటిగా తీసుకొని వద్దామనుకొంటున్నాను. అదికాక ప్రాకృత కవిత్వం లోని చారిత్రిక అంశాలను విశ్లేషిస్తూ వ్రాసిన వ్యాసాలను విస్తరించి పుస్తకంగా తీసుకురావాలని ఉంది.
 

(నా ముద్రిత, అముద్రిత పుస్తకాలనన్నింటి కామెంటులో ఇచ్చిన ఆర్చైవ్ ఆర్గ్ లింకు నుండి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును)




భవదీయుడు
బొల్లోజు బాబా



No comments:

Post a Comment