Sunday, June 21, 2026

కవిత్వ భాష – నిర్మాణ పద్దతులు

కవిత్వ భాష – నిర్మాణ పద్దతులు
(13, 14 జూన్ 2026 తారీఖులలో యానాంలో కవిసంధ్య ఆధ్వర్యంలో జరిగిన కవిత్వ శిక్షణాశిబిరంలో నేను చేసిన ప్రసంగ పాఠం)

కవిత్వం అంటే ఏమిటి?
ఒక ఆలోచననో, ఉద్వేగాన్నో, అనుభవాన్నో లేక ఈ మూడింటినీ కలగలిపో కళాత్మకంగా చెప్పిన భాషారూపమే కవిత్వం. అందుకనే కవిత్వాన్ని బహుముఖాలు కలిగిన భాషగా నిర్వచిస్తారు.
అభినవగుప్తుని దృష్టిలో “ఆనందోపదేశములు” కావ్య ప్రయోజనాలు. అంటేకవిత్వం ఆనందాన్ని ఉపదేశాన్ని ఇవ్వాలి అని. ఆధునిక కాలానికి వచ్చేసరికి సంఘశ్రేయస్సు, అభ్యుదయ భావనలు, సామాజిక స్పృహ, అస్థిత్వవాదం వంటి భావనలు కవిత్వానికి కొత్త దిశలను నిర్దేశించాయి. ఫలితంగా కవిత్వం కేవలం సౌందర్యానుభవం కాక, సామాజిక అనుభవాల వేదికగా విస్తరించింది. ఇది ఆధునిక కవిత్వం సాధించిన ముఖ్యమైన పరిణామం.

వచనానికి కవిత్వానికి తేడా ఏమిటి?
వచనాన్ని కవిత్వాన్ని వేరు చేసేది భాషే. వచనానికి చెప్పే విషయమే ప్రధానం కానీ చెప్పే పద్దతి కాదు. కవిత్వానికి వచ్చేసరికి విషయంతో పాటూ దానిని ఎంత ఉద్వేగభరితంగా చెపుతున్నామనేది కూడా ప్రధానమే. వచన భాషకు అర్ధస్ఫూర్తి నివ్వటం ఒక్కటే పని. అంటే తాను చెప్పదలచుకొన్న విషయాన్ని చెప్పటంతో దాని బాధ్యత తీరిపోతుంది. కవిత్వ భాష అర్ధాంతర స్ఫూర్తినిస్తుంది. అంటే చెపుతున్న విషయంతో పాటు చెప్పని విషయాన్ని కూడా ధ్వనింపచేయటం. దీన్నే ధ్వని, వక్రోక్తి, లేదా Latent Content అంటూ వివిధ పేర్లతో అలంకారికులు పిలిచారు.
వచనంలోని భాషకు, కవిత్వభాషకు ఉండే తేడాను తెలుసుకోవటానికి ఒక చిన్న ఉదాహరణ..

1. Alphabet
ABCDE
FGHIJ
KLMNO
PQRSTU
VWXYZ
2. Suicide
ABCDE
FGHIJ
KLMNO
PQRSTU
VWXYZ
మొదటి దాంట్లో ఎబిసిడి లను ఆల్ఫాబెట్స్ అని చెప్తున్నట్లు అర్ధమౌతుంది. అంతటితో ఆ వాక్యం పూర్తయింది ఇక దానినుంచి ఏ రకమైన అదనపు అర్ధాలు పొందలేము.

రెండవ దాంట్లో కవి ఒక కొత్త విషయాన్ని చెపుతున్నాడు. అక్షరమాలను ఆత్మహత్య అంటున్నాడు. (ఆ విషయం మనం ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు అది వేరే విషయం). వెంటనే మన ఆలోచనలు పరిపరివిధాలుగా విస్తరిస్తాయి. ఆల్ఫాబెట్స్ కు నాగరికత అని అర్ధం చెప్పుకొంటే నాగరికతను ఆత్మహత్యగా కవి చెప్తున్నట్లు భావించాలి. ఆత్మహత్య చేసుకొన్నది మనిషి కావచ్చు, మానవత్వం కావొచ్చు, అమాయకత్వం కావొచ్చు, స్వచ్చత కావొచ్చు, మన ఆలోచన పరిధిని బట్టి అనేక రకాలుగా విశ్లేషించుకోవచ్చు. కానీ ఇన్ని విషయాలనూ కవి నేరుగా చెప్పటం లేదు, ఇవన్నీ కవి చెప్పని విషయాలు. చెపుతున్న విషయాలే కాక చెప్పని విషయాలను కూడా ధ్వనింపచేయటం అంటే ఇదే. ఇక్కడ కవి తనకు కలిగిన భావాన్ని మనలోకి ప్రవేశపెట్టాడు. అది కూడా భిన్న కోణాలలో ఆవిష్కరింపబడేలా. పైది వచనమైతే క్రిందది కవిత్వం.
 
కవిత్వంలో ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అనేవి రెండు ముఖ్యమైన అంశాలు. ఏది చెప్పాలనేది కవి స్వేచ్ఛకు, జీవితంపై అతని అవగాహనకు సంబంధించింది. రోజూ చూసే అనేకాంశాలను, అనుభవాలను వాటిలోని వైరుధ్యాలను కవి వస్తువుగా తీసుకొంటాడు. వస్తువును చెప్పే విధానాన్ని శిల్పం అంటారు.
 
కవిత్వ భాష
ఒక దృశ్యమో, ఊహో నేరుగా కవిత్వంగా మారదు. దానిని కవిత్వభాషలోకి మార్చాలి. మామూలు భాషను కవిత్వభాషగా మార్చేందుకు, సిమిలీ, మెటఫర్, పెర్సొనిఫికేషన్, మెటనొమీ సినడ్కకీ, అల్లిగొరి, మెటాఫర్, పారడాక్స్, అల్యూజన్, ఐరనీ వంటి వివిధ కవిత్వనిర్మాణ పద్దతులు తోడ్పడతాయి. పైన చెప్పిన ఆల్ఫాబెట్స్ ఉదాహరణలో పారడాక్స్ ప్రక్రియ ఉంది. ఈ కవిత్వ భాషనే ప్రముఖ కవి సచ్చిదానందన్ “సమాంతర బాష” అన్నాడు.
కవిత్వభాష శిల్పాన్ని నిర్దేశిస్తుంది. “సాహిత్యానికి సాహిత్య లక్షణాన్ని ఇచ్చేది శిల్పమే తప్ప వస్తువు కాదు” అంటారు బాలగోపాల్.
మనం రోజూ చూసే దృశ్యాలు, ఎదుర్కొనే సంఘటనలు, చేసే ఊహలు కవిత్వంగా మారటానికి కవిత్వభాషగా మారాటానికి వివిధ కవిత్వనిర్మాణ పనిముట్లు ఎలాసహాయపడతాయో కొన్ని ఉదాహరణలు చూద్దాం.

1. సిమిలీ, మెటఫర్
సిమిలీ అంటే ఒక వస్తువును మరొక వస్తువుతో వలె/లాగ/పోలె/రీతిగా వంటి పదాలను ఉపయోగించి పోల్చుతాం. అలాకాక మొదటి వస్తువే రెండవ వస్తువు అని చెబితే దాన్ని మెటఫర్ అంటారు.
ఉదాహరణకు ఆమె ముఖం చంద్రబింబంలా ఉంది అంటే సిమిలీ. ఆమె ముఖం చంద్రబింబం అనటం మెటఫర్.
సిమిలీ: ఇంటిపనుల్లో అలసిపోయిన ఒక స్త్రీ ఆదమరచి నిదురపోయే దృశ్యం ఎంతో అపురూపంగా అనిపిస్తుంది. ఆమెకు నిద్రాభంగం కలగకూడదని ఇంట్లోవాళ్లు అనుకోవటం కూడా సహజమే. ఇది చాలా మామూలుగా ప్రతీ ఇంట్లో జరిగే విషయమే. దాన్ని కవితావస్తువుగా తీసుకొని శివారెడ్డి గారు వ్రాసిన “ఆమె ఎవరైతే మాత్రం” అన్న కవిత ఒక సాదాసీదా దృశ్యాన్ని గొప్ప కవిత్వంలా ఎలా మలచవచ్చో అనటానికి మంచి ఉదాహరణగా నిలుస్తుంది.

“నా భార్యో, పక్కింటావిడో,
పిల్లలతల్లి, తెల్లని పిల్లో” ఎవరైనా కావొచ్చు
ఆమె అస్వప్నంగా,
ముకుళిత పుష్పంలా ముడుచుకు పడుకుంది//
కరుగుతున్న మంచుముక్కలా ఆమె పడుకుంటే
కదులుతున్న నీటిబొట్టులా ఆమె పడుకుంటే
కంట్లో బంధింపబడ్డ గొప్ప దృశ్యంలా ఆమె పడుకుంటే
రాత్రంతా ముకుళించి రేప్పొద్దున్న
వికసించే అద్భుత పుష్పంలా
ఆమె పడుకుంటే పడుకోనీ” (ఆమె ఎవరైతే మాత్రం -- శివారెడ్డి)

పై కవితా వాక్యాలలో నిదురించే ఆ స్త్రీ రూపాన్ని మంచుముక్క, నీటిబొట్టు, దృశ్యం, పుష్పం అనే వివిధ వర్ణణలతో పోలుస్తాడు కవి. ఇందులో కవి ఉపయోగించుకొన్న టెక్నిక్ ను Simily అంటారు.
 
మెటఫర్:
కవిత్వభాషలో మెటఫర్ అత్యంత ప్రధానమైన అంశం. =రెండు వస్తువుల (అవి భౌతికమైనవి లేదా మానసికమైనవి కావొచ్చు) మధ్య ఇతరులు ఊహించలేని పోలికను తీసుకువచ్చినపుడే అది మంచి మెటఫర్ అవుతుంది. మంచి మెటఫర్ ఉన్న కవిత్వాన్ని ఏ భాషలోకి అనువదించినా భావం చెడదు.
 
సాయింత్రపు ఎర్రటి గాయంలోకి
సాగిపోతోంది రైలు.
రైల్లో కూచుని
ఆలోచనల రక్తంలో తడుస్తున్నాను.
ప్రపంచమంతా పచ్చిపుండు.//
నాతో నేను ప్రయాణించక తప్పదని
ఇంతకాలానికి తెలుసుకొన్నాను. (సహప్రయాణికుడు - ఇస్మాయిల్)

మెటఫర్ ని ఉపయోగించుకొని ఒక మూడ్ ని కవితలోకి ప్రవేశపెట్టటాన్ని పై వాక్యాలలో చూడొచ్చు. రైలుప్రయాణం జీవితానికి ప్రతీకగా భావించాలి. ముసలితనం సమీపించే కొద్దీ స్నేహాలు, పరిచయాలు, సందోహాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఒంటరితనం జీవితంలోకి కొద్దికొద్దిగా ఎగబాకుతూంటుంది. అప్పుడు జ్ఞాపకాలలోనే భారంగా రోజులు వెళ్లదీయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇకపై మనతో మనమే ప్రయాణం చేయాల్సి ఉంటుందన్న భావన ఏర్పడుతుంది. అతి సున్నితమైన ఈ మానసికస్థితిని - సాయింత్రపు ఎర్రటిగాయం, ఆలోచనలరక్తం, ప్రపంచం ఒక పచ్చిపుండు అన్న మెటఫర్ ల ద్వారా కవి ఆవిష్కరించగలిగారు.
 
2. పెర్సొనిఫికేషన్

మానవలక్షణాలను వస్తువులకో, జీవులకో లేక ఒక ఊహకో ఆరోపించి కవిత్వం చెప్పే పద్దతిని పెర్సొనిఫికేషన్ అంటారు.
కవిత్వం రాసే పద్దతులలో ఇది ఒక ముఖ్యమైన టెక్నిక్. దీనివల్ల ఒక విషయం పాఠకుని మనస్సులో లోతుగా నాటుకొంటుంది

పెర్సొనిఫికేషన్ టెక్నిక్ దైనందిన సంభాషణలలో, కథలలో, వార్తాకథనాలలో కనిపిస్తూనే ఉంటుంది. “ఈ బండి పెట్రోలు పొదుపు చేస్తుంది” అంటాం. “సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు” అంటూ ఓ కథ మొదలవ్వొచ్చు. “ఆ పథకం అందరిజీవితాలలో వెలుగులు నింపింది” అన్న ఓ వార్తాంశం కావొచ్చు. అన్నీ పెర్సొనిఫికేషన్ కు చక్కని ఉదాహరణలే.
అందమైన అమ్మాయి చందమామ పోలికని పెర్సొనిఫికేషన్ టెక్నిక్ ద్వారా చెప్పాలనుకొంటే ఇలా చెప్పొచ్చు. “ఆమె వదనాన్ని చూసి చందమామ ఈర్ష్యతో మబ్బులచాటుకు వెళిపోయింది”

నీడని పరుచుకుని
ఎండని కప్పుకుని
పడుకుంది రాలిన ఆకు. --- ఇస్మాయిల్

ఇల్లుఖాళీ చేసిన సందర్భాన్ని కొండేపూడి నిర్మల ఒక కవితలో ఇలా వర్ణిస్తారు.
 
ఉనికి తాలూకు ఆనవాళ్ళన్నీ
చెరిగిపోతాయి
పెట్టేబేడా సర్దేయగానే
ఒకట్రొండు బాధగా వొంగిన
మేకులు మినహా
పెద్దగా మార్పేమీ ఉండదు.//
అద్దంలేని గోడ
తలమాసిందని చెప్పదు
సబ్బులేని స్నానాలగది కిటికీ
పరిమళాన్ని పావురంలా ఎగరేయదు (ఇల్లు ఖాళీ చేసినపుడు - కొండేపూడి నిర్మల)

పై వాక్యాలలో మేకులకు, అద్దానికి, స్నానాల గదికి మానవలక్షణాలు ఆరోపించటం ద్వారా మామూలు సందర్భంలోని ఉద్వేగం ఎన్నోరెట్లు హెచ్చింపబడింది. మేకులే బాధతో వొంగాయంటే ఇక మానవహృదయం ఎంత? అనే భావన కలిగిస్తారు కవయిత్రి. దీనంతటికీ కారణం సమర్ధవంతంగా వాడబడిన పెర్సొనిఫికేషన్ (Personification) టెక్నిక్.
 
3. పారడాక్స్, ఆక్సిమొరాన్ లు
పరస్పరవ్యతిరేక అర్ధాలు కలిగిన రెండు భావాల్ని కలిపి చెప్పటాన్ని పారడాక్స్ అంటారు. భయం తెలిసినవాడే నిజమైన వీరుడు, చనిపోవటం కొరకు బ్రతకితీరాలి, కనిపించనివాటిని చూసే కళే దృష్టి, విడిపోయి కలిసిఉందాం, భిన్నత్వంలో ఏకత్వం- వంటి వాక్యాలు పారడాక్స్ కు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

పరస్పర వ్యతిరేక అర్ధాలు కలిగిన రెండు పదాల్ని కలిపి చెప్పటాన్ని ఆక్సి మొరాన్ అంటారు. తెలివైన మూర్ఖుడు, బహిరంగ రహస్యం, ఒరిజినల్ కాపీ, శాంతి దళం, మొదలైనవి కొన్ని ఉదాహరణలు. ఆక్సిమొరాన్ కూడా ఒకరకమైన పారడాక్సే. అందుకే దీనిని సంక్షిప్త పారడాక్స్ (compact Paradox) అనికూడా అంటారు.

"చల్లని చంద్రబింబం లాంటి ఆమె ముఖం... నా మనసులో విరహపు మంటల్ని రగిలిస్తోంది." పారడాక్స్ కి ఉదాహరణగా చెప్పొచ్చు.
 
త్రిశ్రీ కవిత్వంలో కనిపించే కొన్ని పారడాక్స్ అభివ్యక్తిలు .....

• మృత్యువును కౌగిలించుకునైనా మాట నిలబెట్టాలి//
• ఉరికంబాన్ని ఉర్రూతలూగించి అయినా ప్రాణశక్తిని తేజోమయం చేయాలి (ఎన్ కౌంటర్)
• భయం ముందు నిర్భయంగా చెలరేగిపోతాను. (రహస్యోద్యమం)
• హతుడే హంతకుడైన చోట హత్య నేరం కాలేదు (ఆత్మహత్యలన్నీ హత్యలే)
• కొన్ని ఎండలు వానలకు తడిశాయి (సంధ్యార్ణవం)
కవిత్వం ఎక్కువగా పోలికలపై ఆధారపడి నడుస్తుంది. పారడాక్స్ మాత్రం వైరుధ్యాలను ఎంచుకొంటుంది. అందుకే పారడాక్స్ ఒక మేధాపరమైన విలక్షణ ప్రక్రియ. గొప్ప పారడాక్స్ ను సృష్టించగలిగే కవి మేధాకవిగా గుర్తింపు పొందగలడు.
 
4. మెటానమి, సినక్డకి

కవిత్వంలో రెండువస్తువులను పోల్చుతున్నప్పుడు, ఒక వస్తువు బదులుగా దానికి సంబంధం ఉన్న మరొక వస్తువును పెట్టటాన్నే మెటానమి (Metonymy) అంటారు.
 
మెటఫర్ లో కూడా రెండు వస్తువులను పోల్చటం జరుగుతుంది. కానీ దానిలో రెండు వస్తువులు స్పష్టంగా తెలుస్తూంటాయి. మెటానొమిలో ఒక వస్తువే చెప్పబడుతుంది రెండవ దానిని ఊహించుకోవాలి. దీనివల్ల మెటానొమీ కలిగిన వాక్యాలను అర్ధం చేసుకోవటానికి పాఠకుడు కొంత పరిశ్రమ చేయవలసి ఉంటుంది.
 
“మా ఆఫీసరు ఒక పెద్దపులి” -- అనే వాక్యం మెటాఫర్ కు ఉదాహరణ. దీనిలో పోల్చబడిన రెండు వస్తువులు స్పష్టంగా ఉన్నాయి. వాటిలో పెద్దపులి లక్షణాలైన నిర్దయ, క్రౌర్యం, బలం లాంటివి ఆఫీసరు అనే వ్యక్తికి చేరి అతని స్వభావాన్ని అర్ధం చేసుకోవటానికి దోహదపడతాయి.
 
“పెద్దపులి రివ్యూ మీటింగ్ పెట్టింది” - అనే అన్న వాక్యం మెటానమికి ఉదాహరణ. ఇక్కడ ఆఫీసరు, పెద్దపులి అన్న రెండు వస్తువులలో ఒకటే ప్రస్తావించబడింది. రివ్యూ మీటింగులు ఆఫీసరులే పెడతారుకనుక పెద్దపులి అన్న పదం ఆఫీసరుకి ప్రాతినిధ్యపదం అవుతుంది. ఆ ఆఫీసరు పెద్దపులిలా నిర్దయుడని, క్రూరుడని, బలవంతుడని అర్ధం చేసుకోవాలి.

సినక్డకి (Synecdoche) కూడా మెటానమీ లాంటిదే కానీ ఇక్కడ ఒక వస్తువు బదులుగా దానికి సంబంధం ఉన్న మరొక వస్తువులోని “భాగం” తో (part) పోల్చటం జరుగుతుంది.
ఆయన “పంజా” విసిరి పదిమంది “పొట్ట” కొట్టాడు. -- ఈ వాక్యంలో పంజా, పొట్ట అన్న పదాలు “సినక్డకి” లకు ఉదాహరణలు. పంజా అన్న పదం మనకు పులిని గుర్తుకు తెస్తుంది. పంజా పులికి, పొట్ట మనిషికి చెందిన “భాగాలు” మాత్రమే, సంపూర్ణార్ధాన్ని పాఠకుడు పూరించుకోవాలి. ఒక మనిషి తన పొట్ట నింపుకోవటానికి ఏదో ఉద్యోగం చేస్తాడు.
 
పైవాక్యంలో ఉన్న సినక్డకి టెక్నిక్ వల్ల – పెద్దపులి లాంటి ఒక దయలేని ఆఫీసరు పదిమందిని ఉద్యోగంలోంచి తీసేసాడు అన్న విస్త్రుతార్ధం సిద్ధించింది.

చంద్రబింబం నడుచుకొంటూ వస్తున్నది అంటే మెటానమీ.

ఆమె రాకతో గదంతా వెన్నెలతో నిండిపోయింది అంటే సినక్డకి.

పైట కొంగును చూస్తే
నా కెందుకో
పాతివ్రత్యం గుర్తొస్తుంది !
భుజాలనించి కిందికి వేలాడే
గుదిబండలా
అదెప్పుడూ నా స్వేచ్ఛని హరిస్తూనే ఉంటుంది !//
నేను నడిచే శవాన్ని కాకుండా ఉండాలంటే
ముందుగా పైటని తగలెయ్యాలి
పైటని తగలెయ్యాలి. (పైటను తగలెయ్యాలి -- జయప్రభ)

స్త్రీ స్వేచ్ఛ, హక్కులను తరతరాలుగా హరిస్తున్న ఆచారాలు, వివక్షను "పైట" అనే పదంతో మెటానోమికాభివ్యక్తి చేసారు కవయిత్రి. స్త్రీల పట్ల కొనసాగుతున్న వివక్షను తగలెయ్యాలి అన్న అర్ధంలో పైటను తగలెయ్యాలి అన్న ప్రయోగం చేసారు.
 
చాలామంది కవుల ఐకానిక్ కవితలన్నీ మెటానొమికాభివ్యక్తి కలిగిన కవితలే కావటం గమనార్హం. ఇస్మాయిల్ - చిలకలువాలిన చెట్టు, ఖాదర్ మొహిద్దిన్-పుట్టుమచ్చ, శిఖామణి-కొయ్యకాలు, సతీష్ చందర్-కలవని కనుపాపలు, తిలక్-నీవులేవు నీ పాట ఉంది, జయప్రభ-పైటను తగలెయ్యాలి, కొండేపూడి నిర్మల-నడిచేగాయాలు, మెర్సి మార్గరెట్-ప్రశ్నలగది మొదలైనవి కొన్ని ఉదాహరణలు.
"కవిత్వం మెటాఫర్ నుండి మెటానమీకి... ప్రయాణించాలి" అన్న వేగుంట మోహన్ ప్రసాద్ మాటలు కవిత్వంలో మెటానొమీకి కల స్థానాన్ని, స్థాయిని చెపుతాయి. మెటానొమీ పై పట్టుసాధించిన కవులు గొప్పకవులుగా నిలిచిపోతారు.
 
5. అల్లిగొరి
బయటకు ఒక అర్థం లోపల మరొక అర్థం ధ్వనింపచేసే టెక్నిక్ ను అల్లిగొరి అంటారు. దానికి శిఖామణి గారి నల్లని దానను అనే పేరుతొ రాసిన కవిత గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. ఆ కవిత మొత్తం మినువులపై రాసిన కవితగా అనిపించినా అంతర్లీనంగా దళితతాత్విక చింతనతో నడుస్తుంది.
 
నేను నల్లని దానను
నవ ధాన్యాల్లో నాలుగో దానను
నా పేరు మినుము
శక్తికి నేను ఇనుము//
గుండె కింది తడిలాంటి
ఇంతచెమ్మ నన్ను సోకితే చాలు
వొళ్లంతా కింజల్కపు పులకింతలతో
ఉబ్బితబ్బిబైపోతాను
ఆపై నన్ను స్పృశిస్తే
శ్వేత ప్రపంచాన్ని తెల్ల మొగం వేయించి
ఉర్రూతలూగించిన
ఆటపాటల నెలరేడు
మైఖేల్ జాక్సన్ లా
తెల్లగా మిలమిలా మెరిపోతాను.
నేను నల్లనిదానను
చరిత్రగర్భాన్ని చీల్చుకొచ్చిన
వేయి రేకుల బాకుల నల్ల కలువను
వర్తమాన దళిత రణక్షేత్రంలో
సమతారథం శిఖరాగ్రంపై
రెపరెపలాడే గబ్బిలపు ధ్వజాన్ని (నల్లని దానను - శిఖామణి)

సమకాలీన తెలుగు సాహిత్యంలో అల్లిగొరికి ఇంతకు మించి శక్తివంతమైన ఉదాహరణ దొరకదు.
 
6. హైపర్ బొలి
హైపర్ బొలి అంటే అతిశయోక్తీకరించటం. ఆలూరి బైరాగి నాక్కొంచెం నమ్మకమివ్వు కవితలో నాక్కొంచెం నమ్మకమిస్తే
కొండలు పిండి కొట్టేస్తాను
చితికిన టమాటోలాంటి సూర్యుడ్ని
ఆరిన అప్పడంలాంటి చంద్రుడ్ని
ఆకాశపు ఎంగిలి పళ్ళెంలోంచి నెట్టేస్తాను
నాదగు బాహుబంధనంలో
ఈ విశాల బ్రహ్మండాన్ని చాపలా చుట్టేస్తాను…. అంటాడు ఇవన్నీ హైపర్ బొలి టెక్నిక్ కు చక్కని ఉదాహరణ.
 
7. అల్యూజన్ (Allusion)
చరిత్రనుంచో, పూర్వసాహిత్యం నుంచో ఏదైనా ఒక ఉదంతాన్ని సూచించే పదాన్నొ, వాక్యాన్నొ కవితలో ఉదహరించటాన్ని అల్యూజన్ అంటారు.

శంబూకుడు పెదాలమీద చిరునవ్వుతో
రాముణ్ణి వధిస్తున్నాడు
ఏకలవ్యుడు ద్రోణుని బొటనవేలును
గొడ్డలితో నరుకుతున్నాడు
బలి తన చిరుపాదాలతో వామనుణ్ణి
పాతాళానికి తొక్కేస్తున్నాడు/
కాలం కసాయి కత్తిమీద నిలబడి
గర్జిస్తున్న చండాలుడు
ఆదిశంకరునిపై నాలుగు వేటకుక్కల్ని
ఉసిగొల్పుతున్నాడు (నడుస్తున్న చరిత్ర - శివసాగర్)

పై కవితలో శివసాగర్ దళిత పురాణపాత్రలచే తమకు అన్యాయం చేసినవారిపై తిరుగుబాటు చేయిస్తాడు. ఇది ఒక కొత్త ఉదయానికి సూచనగా చెపుతాడు. దీన్ని తమ చరిత్రను తామే లిఖించుకోవటానికి చేసిన ప్రయత్నంగా భావించాలి.
అల్యూజన్ వల్ల, కవిత పరిధి పెరిగి అర్ధం విస్త్రుతమౌతుంది. కవి ఉటంకించిన ఉదంతం పట్ల చదువరికి పూర్వజ్ఞానం లేకపోతే అల్ల్యూజన్ అర్ధం కాదు.

8. ఐరనీ (Irony)

పైకి ఒక అర్ధాన్ని అంతర్లీనంగా దానికి "వ్యతిరేక అర్ధాన్ని" కలిగి ఉండేలా చెప్పటాన్ని ఐరనీ అంటారు. వెటకారం, సార్కాజం లకు దగ్గర ఐరనీ
కవిత్వంలో ఐరనీని ఉపయోగించి గొప్ప ధిక్కారాన్ని పలికించవచ్చు. చుట్టూ జరుగుతున్న అన్యాయాలకు, అవకతవకలకు కలిగే కోపంలోంచి ఐరనీ పుడుతుంది. మార్చలేని నిస్సహాయ స్థితిని ఐరనీ ద్వారా చాలా శక్తివంతంగా వ్యక్తీకరించవచ్చు.
 
//నువ్వొకప్పుడు ఇంగ్లాండవతారంలో మమ్మల్ని
కరుణించావ్
మూర్ఖులం నీ లీల గ్రహించలేక నిన్ను ద్వేషించాం
అయితే నేం
పాపుల్ని కరుణించే వరకూ నువ్ నిద్రపోవ్ కదా
నివ్విప్పుడు అమెరికావతారంలో సాక్షాత్కరించి
మా ద్వారాలు తెరిపించావ్
ఇప్పుడు మా మెదడూ – హృదయంలోనూ నీ
నామ స్మరణమే// - (ప్రపంచీకరణ)

ఇరవై ఏళ్ల క్రితం అద్దేపల్లి ప్రభు వ్రాసిన ఈ కవితలో వస్తువు ప్రపంచీకరణ. ప్రపంచీకరణ దుష్ప్రభావాలను ఇంకా పూర్తిగా అవగాహనకు రాని సమయంలోనే వ్రాసిన కవిత ఇది. ఇందులో ప్రపంచీకరణను దేవుని అవతారంగా చెపుతాడు కవి. ఒకప్పుడు ఇంగ్లాడు రూపంలో వచ్చింది, ఇప్పుడు అమెరికా రూపంలో వస్తోంది అంటాడు. కరుణించటం, లీలగ్రహించటం, సాక్షాత్కరించటం, నామ స్మరణ వంటి ప్రయోగాలు మతపరిభాషగా అనిపించినా వాటి వాచ్యార్ధాలకు వ్యతిరేకార్ధలను ఇస్తాయి కవితలో. ఇది ఐరనీగా చెప్పుకోవచ్చు. ప్రపంచీకరణకు లొంగిపోవటం వల్ల విచ్చిన్నమౌతున్న మానవవిలువలు, పరాయీకరణల పట్ల కవికి కలిగిన కోపంలోంచి పుట్టుకొచ్చిన ఐరనీ ఇది. సమకాలీన సామాజపోకడపై సంధించిన గొప్ప వక్రోక్తి.
 
9. నిరలంకారత
ఒక కొత్త ఆలోచననో, బరువైన సంఘటననో, బలమైన ఉద్వేగాన్నో చెప్పదలచుకొన్నప్పుడు నిరలంకారంగా చెప్పటం కూడా ఒక మంచి కవిత్వ నిర్మాణ టెక్నిక్.

దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తం
దోస్తుగ ఉండే వారితొ మేమును
దోస్తే చేస్తం – ప్రాణమిస్తం// (కాళోజి)

మహాకవి కాళోజీ వ్రాసిన పై వాక్యాలలో ఏరకమైన అలంకారాలు కనిపించపోయిన ఒక జాతి అంతరంగం ఆవిష్కృతమైంది. భావోద్వేగాలను, మానవ సంవేదనను వ్యక్తీకరించే కవిత్వానికి కొన్నిసార్లు అలంకారాలు అవసరం లేదనటానికి మహాకవి కాళోజీ కవిత్వమే నిదర్శనంగా నిలుస్తుంది.
 
అలంకారాలు లేకుండా కూడా మంచి కవిత్వం చెప్పగలుగుతున్నప్పుడు ఇక అలంకారాల ఉపయోగం ఏమిటి అన్న ప్రశ్న ఉదయించక మానదు. ఎంతో శక్తివంతమైన కవితా వస్తువు, లోతైన కొత్త ఊహ లేదా గుండెలను బలంగా మోదగలిగేటంతటి సత్తువ కలిగిన ఉద్వేగమూ లేక పోతే నిరలంకార కవిత్వం ఉత్త వచనంగా మిగిలిపోతుంది.
 
త్రిపురనేని శ్రీనివాస్ “వచనమై తేలిపోతావ్” అని హెచ్చరించింది అలాంటి కవిత్వం గురించే.
 
ముగింపు

కవిత్వభాషలో మరొక ముఖ్యమైన అంశం లయ. యతి, ప్రాశలు ఆధునిక కవిత్వానికి వర్తించకపోయినప్పటికి పదాల మధ్య అనుప్రాస కవిత్వానికి అందాన్నిస్తుంది. పాదవిభజన కూడా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. దీనివల్ల ఆ వాక్యాలలో ఒక అంతర్లయ అనుభవానికి వచ్చి చదువుతున్నప్పుడు హాయినికలిగిస్తుంది.
 
కవి తనకు కలిగిన అనుభవాన్ని పదాల సహాయంతో భాషలోకి తీసుకొస్తాడు. వివిధ కవిత్వనిర్మాణ టెక్నిక్ లైన సిమిలీ, మెటఫర్, పారడాక్స్, పెర్సొనిఫికేషన్, మెటనిమి, సినక్డకి, అల్లిగొరి, అల్యూజన్, పారడాక్స్, ఐరనీ, హైపర్ బొలి వంటి వివిధ నిర్మాణపద్దతులు మామూలు భాషను కవిత్వభాషగా మారుస్తాయి.
 
ప్రతిభ కలిగిన కవి తాను చెప్పదలచుకొన్న అంశానికి తగిన టెక్నిక్ లను వాడుకొని తన ఉద్వేగాన్ని యధాతధంగా చదువరిలో ప్రవేశ పెట్టగలుగుతాడు. అప్పుడు మాత్రమే అతని వ్రాసింది కవిత్వమౌతుంది. లేకపోతే పేలవమైన వచనంగా మిగిలిపోతుంది.
 
ఈ కవిత్వ నిర్మాణ మెళకువలన్నీ తెలుసుకున్నంత మాత్రాన కవిత్వం వచ్చేస్తుందా? అంటే—ఇవి కవిత్వాన్ని ఎలా రాయాలో’ మార్గం చూపుతాయి తప్ప, కవిత్వాన్ని సృష్టించలేవు. కవిత్వాన్ని కవే స్వయంగా సృష్టించాలి. దానికి నిశిత పరిశీలన, ప్రతిభ, అభ్యాసం అత్యంత ఆవశ్యకం.
సాహిత్యం ఒక అనంతమైన నదీ ప్రవాహం. ఆ నదిలో కవి ఒంటరిగా ప్రయాణం చేస్తూ మానవజాతి భౌతిక మానసిక ప్రపంచాలను అన్వేషిస్తూ తన స్థలకాలాదులను, విశేషాలను లిఖించుకొంటూ సాగిపోతాడు. ప్రతీతరపు రచనలూ కాలక్రమేణా ఈ ప్రవాహంలో కలిసిపోయి ఆ తరం జీవించిన జీవితాలను భవిష్యతరాలకు అందిస్తాయి. మానవజీవితాలను, ఉద్వేగాలను అక్షరబద్దం చేసేది సాహిత్యం మాత్రమే. చదివితే వచ్చే రాంకుల్లాగ, మార్కుల్లాగా సాహిత్యం చేసే పని పైకి కనిపించదు. మరీ ముఖ్యంగా కవిత్వం చేసే పని.
 
బొల్లోజు బాబా

పై అంశాలు ఇదివరలో నేను రాసిన "కవిత్వ భాష" అనే పుస్తకంలోనివి లింకు మొదటి కామెంటులో కలదు


https://archive.org/details/kavithva-bhasha-by-bolloju-baba


No comments:

Post a Comment