కొండల్ని తవ్వేసారు
నదుల్ని అమ్మేశారు
అడవుల్ని నరికేశారు
సముద్రాల్ని కంచెలతో చుట్టేశారు.
భూమి ఇచ్చిన రైతు
కూలీగా చేరాడు
నదిని కోల్పోయిన జాలరి
సెక్యూరిటీ గార్డయ్యాడు
అడవిని కోల్పోయిన గిరిజనుడు
గేటు బయట నిలబడ్డాడు
రోజుకు పద్దెనిమిది గంటలు
తమ జీవితాల్ని డెలివరీ చేస్తూ.
లాభాలన్నీ
పై అంతస్తులకు లిఫ్టులో వెళ్లిపోయాయి.
ఈ శతాబ్దపు
అత్యంత అమానవీయమైన
వంచన ఏమిటంటే
వారి భూమిని
వారి నదిని
వారి అడవిని
వారి భవిష్యత్తుని వారినుండి తీసేసుకొని
"ఉపాధి కల్పించాం" అని చెప్పి
చప్పట్లు కొట్టించుకోవటం.
బొల్లోజు బాబా

No comments:
Post a Comment