Sunday, May 24, 2026

రిజర్వేషన్లపై....


( "ఎన్నాళ్ళిస్తారు ఈ రిజర్వేషన్లు" అంటూ మాజీ లోక్ సభ స్పీకర్ పేరుతో వైరల్ అవుతున్న కామెంటుకు నా స్పందన)
.
రిజర్వేషన్లు అనేవి ఎవరి రొట్టెముక్క వాళ్లకు దక్కే మెకానిజం. నా ముక్కా తినేస్తాను, ఎదుటివాని ముక్కా నేనే తినేస్తాననడం మోసం, అన్యాయం.
ఈ రోజు EWS రూపంలో దాదాపు అన్ని సామాజిక వర్గాలకూ ఏదో ఒక రూపంలో రిజర్వేషన్లు ఉన్నాయి. పైగా 50% “మెరిట్ కోటా” ఉండనే ఉంది. అయినప్పటికీ “మెరిట్” పేరుతో రిజర్వేషన్లపై చేసే వాదన చాలాసార్లు ఇతరుల వాటాను కూడా ఆక్రమించుకోవాలనుకొనే మెరిట్ లేనివాళ్ళు చేసే వాదన.
అసలు ఈ గోల అంతా ఎందుకు?
అన్నీ జనాభా ప్రాతిపదికన పంచితే సరిపోదా?
అప్పుడు సుమారు 56% జనాభా ఉన్న BCలకు 27% కాకుండా 56% రిజర్వేషన్లు వస్తాయి. అలాగే సుమారు 5% జనాభా ఉన్న పేద OCలకు 10% EWS కాకుండా 5% వాటా మాత్రమే వస్తుంది.
నిజమైన న్యాయం అంటే — ప్రతి వర్గానికి వారి జనాభా, వారి ప్రాతినిధ్యం మేరకు వాటా దక్కడం. నిజానికి విద్య, భూమి, ఆర్థిక వనరులు, సామాజిక గౌరవం, నెట్‌వర్కులు ఇవన్నీ తరతరాలుగా అసమానంగా పంచబడ్డాయి. వాటిని ఎలాగా ఇప్పుడు మార్చలేం. ఆ అసమానతల్ని సరిచేయడానికే రిజర్వేషన్లు కల్పించారు. రిజర్వేషన్లు భారతదేశానికే పరిమితమైన అంశం కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఉన్న విధానమే.
అసమానతల కులాన్ని నిర్మూలించనంతవరకూ రిజర్వేషన్లు ఉండాల్సిందే. అంతే కాదు రిజర్వేషన్లు ప్రైవేట్ రంగానికి కూడా విస్తరించాలి. ప్రజల సొత్తైన భూముల్ని, అడవుల్ని, గనుల్ని ఉచితంగా, ఏటా లక్షల కోట్ల రుణమాఫీలు, టాక్స్ మినహాయింపులు పొందుతున్న ప్రైవేట్ రంగం ఆ మాత్రం సామాజిక బాధ్యత ఎందుకు వహించదు? మంది సొమ్ముతో వారి సామాజిక వర్గాలే వృద్ధి చెందాలా?
బొల్లోజు బాబా

No comments:

Post a Comment