Friday, November 4, 2022

శ్రీ అవధానుల మణిబాబు



కాకినాడసాహితీ మిత్రుల మధ్య చిరపరిచితమైన పేరు శ్రీ అవధానుల మణిబాబు. ఏదైనా అంశంపై ఎవరు మాట్లాడగలరు అని చర్చ వచ్చినప్పుడు శ్రీ మణిబాబు పేరు తప్పక వినిపిస్తుంది. వ్యక్తిగా మృధు స్వభావి. కవిగా స్వాప్నికుడు, సున్నిత భావుకుడు. అంశాన్ని తులనాత్మకంగా తూకం వేస్తూ లోతుగా మూల్యాంకనం చేయగల విమర్శకుడు. శ్రోతలను తనతో పాటూ అనుభూతి పడవలో ప్రయాణం చేయించగల చక్కని వక్త. అది ఆథ్యాత్మిక ప్రసంగమైనా, ఆధునిక కవిత్వంపై ఉపన్యాసమైనా.
శ్రీ అవధానుల మణిబాబు రాసిన పుస్తకాలు మొత్తం ఎనిమిది. వేటికవే ప్రత్యేకం. ఇతను విస్తృత అధ్యయన శీలి. ఎంత గొప్ప రచన చేసినా అంతకంత ఒదిగి ఉండటం మణిబాబు వినయం. ఇతను రచించిన అన్ని పుస్తకాలను నేడు ఆర్చైవ్. ఆర్గ్ లో అందరకూ అందుబాటులో ఉంచాడు. వాటిని అక్కడ నుంచి డౌన్ లోడ్ చేసుకొని చదువు కొనవచ్చును. క్రింద కామెంటులో లింక్ ఇచ్చాను చూడగలరు.
.
1. నాన్న...పాప...2018
.
శ్రీ మణిబాబుకు ఎక్కువ పేరు తీసుకొచ్చిన పుస్తకం. పిల్లలు ఎదుగుతూన్న దశలో మనం చూసిన ఎన్నో మధురమైన అనుభవాలను అనుభూతులుగా మలచుకొని దాచుకొంటాం వాటికి అక్షరరూపమిచ్చి గొప్ప కవితా వాక్యాలుగా సారస్వతంలో నిక్షిప్తం చేసారు శ్రీ మణిబాబు
.
పాప దీపం వెలిగించింది
ఒక దీపం మరో దీపాన్ని వెలిగించడమంటే
ఈ రోజు కొత్తగా అర్ధమైంది
.
పైకి సౌందర్యవంతంగా కనిపిస్తున్నా రేపు ఆ పాపే తల్లై మరో పాపను వెలిగించబోతోందన్న సృష్టి రహస్యం లేదూ పై మూడు వాక్యాలలో.
.
.
2. . స్ఫురణ... స్మరణ (ప్రసంగాలు, సమీక్షలు) - 2017
.
తెలుగు సాహిత్యలోకంలో ఒక విమర్శకునిగా శ్రీ మణిబాబు స్థానాన్ని పదిల పరచిన పుస్తకమిది.
ఈ పుస్తకానికి ముందుమాట రాసిన శ్రీ ఇంద్రగంటి వారు ".......పలురచనలు చదివి స్వతంత్రబుద్ధితో ఆలోచించి అంచనాలు వేయగల నైపుణ్యం ఉండటం వల్ల సాహిత్య విమర్శవైపు దృష్టి పెట్టారని- ఈ వ్యాసాలు చదవడం ద్వారా నాకు అర్ధమైంది" అంటారు. సాహిత్యకృషిలో మర్రిచెట్టులా విస్తరించిన ఒక వ్యక్తి, అప్పుడప్పుడే శాఖలూనుతున్న ఒక చిన్న వ్యక్తిపట్ల వేసిన అంచనా అది. పెద్దల అంచనాలు భవిష్యత్ దర్శనాలు.
ఈ పుస్తకంలో శ్రీ గోపి, శ్రీ భగ్వాన్, శ్రీ దాట్ల, శ్రీ శిఖామణి లాంటి లబ్దప్రతిష్టులపై వ్యాసాలు ఉన్నాయి. ఒక్కొక్కరిగురించి శ్రీ మణిబాబు చేసిన ప్రతిపాదనలు, పరిశీలనలు అపూర్వమైనవి.
.
.
3. అన్నవి అనుకొన్నవి (ప్రసంగాలు, సమీక్షలు) 2015
.
ఈ పుస్తకానికి ముందుమాట రాసిన శ్రీ రెంటాల వారు ".... మీ పఠన వైవిధ్యం బావుంది, మీరు విశాలంగా చదువుతున్నట్టున్నారు, కేవలం చదవడం మాత్రమే కాక విలువైనవీ, అందమైనవీ ఎన్నో వాక్యాలను, పద్యాలను గుర్తుపెట్టుకుంటున్నారని గమనించాను. మీ రచనలో అవి జీడిపప్పుల్లా తగిలి రుచిని పెంచుతున్నాయి. వాల్మీకిని, రూమీని, ఫ్రాయిడ్ నీ డేల్ కార్నిగిని, టాగూర్ నీ ముకుందమాలాకారుణ్ణీ.... ఆయా సందర్భాలలో మీరు ఉటంకిస్తూ వచ్చిన పద్దతి బాగుంది" అనే గమనింపు శ్రీ మణిబాబు రచనావ్యాసంగంపై కాదు, అతని మొత్తం వ్యక్తిత్వంపైనే అని భావిస్తాను. శ్రీ మణిబాబు విశ్లేషణ బలం మొత్తం అతని తులనాత్మక అన్వయంలో దాగి ఉంటుందని నా అభిప్రాయం.
ఈ పుస్తకంలో శ్రీ ఓలేటి వారి ఉపాయనము, మునిమాణిక్యం కథలు, శ్రీ ఆవంత్స సోమసుందర్ తో ఇంటర్వ్యూ, కరుణశ్రీ సాహిత్యం, అద్దేపల్లి దీర్ఘకవిత తెరలు, ఆరుద్ర లేఖా సాహిత్యం లాంటి భిన్న సాహిత్య ప్రక్రియలపై అంతే వైవిద్యభరిత విశ్లేషణా వ్యాసాలు ఉన్నాయి.
.
.
4. నేనిలా... తానలా - 2019
.
శ్రీ మణిబాబు సముద్రంతో తనకున్నఅనుబంధాన్ని"నేనిలా...తానలా" పేరుతో ఒక దీర్ఘకవితగా మలచారు. ఈ శీర్షికలో నేను ఇలను, తాను అల అనే గడుసైన శ్లేష ఉంది.
ఈ దీర్ఘకవితను మూడు భాగాలుగా విభజించుకొంటే మొదటిభాగంలో తన బాల్యం నుండి సముద్రంతో తనకు ఉన్న జ్ఞాపకాలను తలపోసుకొంటాదు. రెండవ భాగంలో వర్తమానంలో సముద్రంతో చేసిన తాత్విక సంభాషణ ఉంటుంది. మూడవభాగంలో సముద్రం కవితో చేసిన సంభాషణలో పలికించిన పర్యావరణ స్పృహ చదువరిని ఆలోచింపచేస్తుంది.
.
.
5. అందినంత చందమామ - 2016
.
ఇది సారస్వత మేరువు శ్రీ ఆవంత్స సోమసుందర్ గారి రచనలపై చేసిన విపుల వ్యాఖ్యానం. శ్రీ సోమసుందర్ గారి వాక్యం క్లిష్టంగా ఉంటుందని విమర్శకుల అభిప్రాయం. అందినంత చందమామ అన్న పేరులోనే శ్రీ మణిబాబు ఆ విమర్శను సూచ్యప్రాయంగా చేసాడా అనిపిస్తుంది. సోముడికి పర్యాయపదం చందమామ. అలాగ, అందినంత సోమసుందర్ అని ఈ పుస్తకం పేరుని అర్ధం చేసుకోవచ్చు.
శతాధిక గ్రంధకర్త అయిన శ్రీ సోమసుందర్ ను నాకు అందినంతమేరకే నేను ఈ వ్యాసాలలో చూపించగలుగుతున్నాను అనే వినయం ఒక పక్క, ఆయన అందని చందమామ అనే శ్లేష మరో పక్కా ఇమడ్చటంగా నేను అనుకొంటాను.
ఈ వ్యాసాలన్నీ శ్రీ సోమసుందర్ ను సుందరంగా, సరళంగా ఆవిష్కరిస్తాయి.
.
.
6. పరమం - 2020
.
సుమారు ఇరవై పుస్తకాలు, వాటిలో సగం స్వతంత్ర్యరచనలు, మిగిలినవి అనువాదములు. భాసుని నాటకములు, ఆదిశంకరుని ఆత్మబోధ, క్షేమేంద్రుని చారుచర్య, పూర్ణసోమసుందరం, తిరువల్లువరు, తులసీదాసు పార్వతీ కల్యాణం, కబీరు, నామదేవుడు ఇలా భిన్నకాలాలకు చెందిన భక్తిమార్గాల అంతస్సూత్రాన్ని గుర్తెరిగి రచనలు చేసారు పరమయోగి శ్రీ మధునాపంతుల వేంకట పరమయ్య గారు. వారి రచనలను సూత్రప్రాయంగా స్పృశిస్తూ, వారి కృషికి సందర్భం వచ్చినచోటల్లా ప్రణమిల్లుతూ రాసిన వ్యాస సంపుటి పరమం.
ఆధునిక కవిత్వంపై విమర్శనా వ్యాసాలు రాసే వారు అనేకమంది. కానీ పరమయ్యగారిలాంటి వేదాంతి, పద్యకవి రచించిన ఆథ్యాత్మిక కావ్యాలను సమీక్షించటం ఒక సవాలు. శ్రీ మణిబాబు సవ్యసాచిత్వం ఈ పుస్తకంలో కనిపిస్తుంది.
.
.
7. లోనారసి - 2022
.
ఇది తాజా ప్రచురణ. వివిధ విమర్శనా వ్యాసాల సంపుటి. ఈ పుస్తకంలో శ్రీ మణిబాబు వాక్యం పదునుదేరింది. చేస్తున్న వ్యాఖ్యానాన్ని సమర్ధించటం కొరకు భిన్న రచనలలోంచి ఉటంకింపులు అలవోకగా తీసుకురావటం గమనించవచ్చు. ఈ పుస్తకంలో డా. ఎన్ రామచంద్ర గారి కుముద్వతీ తీరకథలు, శిఖామణి యానాం కథలు, పైడిపాల నూటపదహార్లు, శ్రీ మధునా పంతుల నాన్న కుర్చీ, సంగివేని రవీంద్ర చౌరస్తాలో సముద్రం, శ్రీ చందుసుబ్బారావు చందన చర్చ, విధ్వాన్ విశ్వం పెన్నేటి పాట లాంటిరచనలపై వ్రాసిన విమర్శనా వ్యాసాలు ఉన్నాయి. అన్నీ చక్కని పఠానుభవాన్ని కలిగిస్తాయి.
***
.
శ్రీ అవధానుల మణిబాబు గొప్ప సహృదయుడు. విస్తృత అధ్యయన శీలి. తను రాయాల్సిన లేదా ప్రసంగించాల్సిన పుస్తకాన్ని చాలా లోతుగా అధ్యయనం చేస్తాడు. దాని సారాన్ని అప్పటికే వచ్చిన వివిధ అటు ప్రాచీన ఇటు ఆధునికరచనలతో తులనాత్మకంగా పోల్చి ఒక అంతస్సారాన్ని పాఠకునికి చూపే ప్రతిభకలిగిన విశ్లేషకుడు.
పైన చెప్పిన పుస్తకాలను అన్నింటిని ఆర్చైవ్. ఆర్గ్ లో డౌన్ లోడ్ కొరకు అందుబాటులో ఉంచారు శ్రీ మణిబాబు.
ఆసక్తి కలిగినవారు తప్పక డౌన్ లోడ్ చేసుకోగలరు. క్రింద కామెంటు రూపంలో లింకు కలదు.

 
భవదీయుడు
బొల్లోజు బాబా

No comments:

Post a Comment