Monday, October 12, 2020
Imported post: Facebook Post: 2020-10-12T01:19:23
Timeline of 17000+ Years of Unbroken Indian Civilization | Nilesh Nilkanth Oak
మహాభారతం క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల క్రితం జరిగిందా?
.
భారతదేశ చరిత్రకు సంబంధించిన కాలక్రమణికను నిర్ణయించటంలో మూడు స్రవంతులు కనిపిస్తాయి.
1. క్రీపూ 1500-2000 మధ్యజరిగిన ఆర్యుల ఆక్రమణ సిద్ధాంతం ఆ కాలంలోనే భారతదేశ ప్రాచీనచరిత్ర అంతా జరిగిందని ప్రతిపాదిస్తుంది. ఇటీవలి కాలంలో దొరుకుతున్న అనేక ఆధారాల కారణంగా ఈ దేశప్రాచీనత నాలుగువేల సంవత్సరాల కన్నా పురాతనమైనదని అందరూ అంగీకరించారు.
2. క్రీపూ. 800-6000 మధ్య కాలం భారతదేశ చరిత్ర నిర్మించబడిందని చాలామంది చరిత్రకారుల అభిప్రాయం. వేదాలు, రామాయణ, మహాభారతాలు, బుద్ధుడు, జైనులు, వివిధ ఆరాధనా కల్ట్ లు – అన్నీ ఈ కాలానికి చెందినవే అని బలంగా నమ్ముతారు.
3. పురాణాలలో చెప్పబడిన కల్పాలు, మన్వంతరాలు, యుగాలు వాటి లెక్కలతో చరిత్రకాలక్రమణికను నిర్మించాలని సనాతనులు భావిస్తారు. ఇది లక్షల సంవత్సరాలనుండి కోట్ల సంవత్సరాలకు విస్తరించి ఉండే వ్యవధిగా తేలటం, దీనికి సమాంతరమైన ఇతర ఆధారాలు లేకపోవటం, అంతేకాక యుగాన్ని నిర్ణయించటానికి దాదాపు 30 రకాల నిర్వచనాలు ఉండటం వల్ల దేన్ని ప్రమాణంగా తీసుకోవాలో తెలియని స్థితి ఉండటంతో చరిత్రకారులు ఈ యుగ సిద్ధాంతం పట్ల మౌనం వహించారు.
***
ప్రాచీన ఘటనలు జరిగిన కాలాన్ని నిర్ణయించటంలో ఖగోళశాస్త్రం యొక్క ప్రాధాన్యతను యూరోపియన్ చరిత్రకారులు కూడా గుర్తించారు. కానీ తొలత ఆర్యుల రాకవల్ల, రెండవసారి మా రాక వల్ల భారతదేశం అభివృద్దిచెందింది, అనే ఆలోచనా ధోరణి వల్ల మన ప్రాచీన చరిత్రను నాలుగువేల సంవత్సరాలకే పరిమితం చేసారు.
నేడు ఆర్కియాజికల్, పాలియంటలాజికల్, ఓషనోగ్రాఫికల్, సాటిలైట్ స్టడీస్, భూగర్భ, వాతావరణ అధ్యయనాలు, జన్యుపరిశోధనలు ఇంకా మరెన్నో ఇతర రంగాలనుంచి లభిస్తోన్న ఆధారాల సహాయంతో భారతదేశ చరిత్ర ప్రాచీనత నాలుగువేల సంవత్సరాలకు మాత్రమే పరిమితం కాదని అర్ధం చేసుకోగలుగుతున్నాం.
ఈ అన్ని శాస్త్రాల ఆధారాలకన్నా ఖగోళశాస్త్రం అందించే ఆధారాలు ఎంతో విలువైనవి. ఎందుకంటే గ్రహాలు, నక్షత్రాలు, తోకచుక్కలు లాంటివి అన్నీ ఒక నిర్ధిష్టమైన క్రమపద్దతిలో సంచరిస్తాయి. కొన్ని వేల సంవత్సరాల వెనుకకు వెళ్ళి ఏ రోజున ఎన్నిగంటల ఎన్ని నిముషాలకు ఒక గ్రహణం వచ్చింది అని క్షణాలపై లెక్కించటానికి (celestial movements) ఈ రోజు అనేక కంప్యూటర్ సాఫ్ట్ వేర్ లు అందుబాటులో ఉన్నాయి. భారతదేశం అనాదిగా Lunisolar కేలండరను (సూర్యచంద్రులను ప్రమాణంగా తీసుకోవటం) అనుసరించటం వల్ల, మన గ్రంధాలలో చెప్పిన పంచాంగవివరాల ఆధారంగా వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలకు ఖచ్చితమైన తేదీలను నిర్ణయించటానికి వీలవుతుంది. ఇది వేరే ఏ ఇతర ప్రపంచ సంస్కృతులలోను కనిపించని విషయం.
ఈ రంగంలో Nilesh Nilkanth Oak లోతైన కృషి చేసి When Did the Mahabharata War happened, Historic Rama, Bhishma Nirvana లాంటి పరిశోధనాత్మక పుస్తకాలు వ్రాసారు.
.
మహాభారతం ఎప్పుడు జరిగింది?
“అరుంధతీ నక్షత్రం వసిష్ట నక్షత్రం ముందు నడుస్తున్న” సమయంలో మహాభారత యుద్ధం జరిగిందని మహాభారతంలో ఉన్నది. ఆధునిక ఖగోళ శాస్త్రజ్ఞులు వసిష్ట నక్షత్రాన్ని Mizar అని, అరుంధతిని Alcar అంటారు. కానీ ఈ నాటి ప్రమాణాలప్రకారం అరుంధతి నక్షత్రం వసిష్ట నక్షత్రం వెనుక నడుస్తుంది. ఈ నక్షత్రాల స్థానాలు శాశ్వతం కావు వేలసంవత్సరాల వ్యవధిలో నిర్ధిష్టమైన, లెక్కించగలిగిన మార్పులకు గురవుతూ వస్తాయి.
Astronemer predictions Voyager 4.5 సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి ఏ కాలంలో అరుంధతి నక్షత్రం, వసిష్ట నక్షత్రానికి ముందర నడిచిందో లెక్కించవచ్చు. ఆ ప్రకారం దాన్ని క్రీపూ. 11091 – 4508 మధ్యకాలంగా గుర్తించారు. దీని ఆధారంగా మహాభారత యుద్ధం ఈ రెండు సంవత్సరాల మధ్య జరిగి ఉండొచ్చని భావించటం శాస్త్రీయం.
Nilesh Nilkanth Oak దీన్ని సుమారు భారతంలోని సుమారు 200 ఇతర పంచాంగపరమైన అంశాలతో పోల్చి చూసి మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 5561 సంవత్సరంలో జరిగిందని ప్రతిపాదించాడు.
అదే విధంగా రామాయణం నుంచి సుమారు 500 వివిధ పంచాంగపరమైన వివరాలను విశ్లేషించి రామ రావణ యుద్ధం క్రీస్తుపూర్వం 12209 లో జరిగిందని ప్రతిపాదించాడు.
ఆర్యల రాక సిద్ధాంతాన్ని ఉగ్గుపాలతో చదువుకోవటం వల్ల క్రీపూ రెండువేల సంవత్సరాలకంటే ముందు జరిగిన భారతదేశ చరిత్రను ఊహించటమే సాహసంగా భావించే మనకు రామాయణం క్రీపూ పన్నెండువేల సంవత్సరాలు క్రితం జరిగింది అంటే నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ చరిత్రలో అంతకన్నా ప్రాచీనమైన - క్రీపూ ఇరవైవేల సంవత్సరాలనాటి చైనీస్ Oracle Bones, క్రీపూ పదివేల సంవత్సరాలకు చెందిన టర్కీలోని Göbekli Tepe నగరం, క్రీపూ మూడువేల సంవత్సరాలనాటి Sumerian Clay Cone రాజ్యాంగం లాంటి అంశాలెన్నో ఇటీవల బయటపడుతూ చరిత్రకారులు తమ టైమ్ లైన్స్ ను సరిచూసుకోవలసిన అవసరతను ఎత్తిచూపుతున్నాయి
***
Nilesh Nilkanth Oak వాదనను సమర్ధించే ఆధారాలు
.
A. ఖగోళశాస్త్ర పరిజ్ఞానం ప్రకారం క్రీస్తుపూర్వం 31 జనవరి 5560 న భీష్ముడు నిర్యాణం చెందాడని Nilesh ఈ క్రింది విధంగా ప్రతిపాదించాడు. ఈ అంశాలన్నీ వెరిఫైయబుల్ విషయాలంటాడు.
1. భీష్ముడు ఉత్తరాయణం రావటానికి 92 రోజుల ముందు అంపశయ్యపై ఒరిగాడు – ఇది క్రీపూ 8000-3700 మధ్య కావొచ్చు.
2. భీష్ముడు యుద్ధంలో కూలిపోయిన రోజు మార్గశిర శుక్ల పక్ష 9 – ఇది క్రీపూ 7285-5125 మధ్య కావొచ్చు
3. పై రెండు అంశాలే కాక మరో రెండువందల ఇతర పంచాంగ విషయాలను కూడా పరిగణలోకి తీసుకొంటే భీష్మనిర్యాణం జరిగినది క్రీపూ 31 జనవరి 5560 గా లెక్కగట్టారు.
B. హైడ్రాలాజికల్ ఆధారాలు: మహాభారతంలో సరస్వతి నది గురించిన ప్రస్తావనలు వందకు పైగా ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రవహిస్తున్నట్లు, కొన్ని చోట్ల ఎండిపోయినట్లు (అంతర్ధీయతే) చెప్పబడింది.
రామాయణంలో సరస్వతీనది జీవనదిగా చెప్పబడింది. సట్లెజ్ నది పశ్చిమం వైపు ప్రవహిస్తున్నట్లు చెప్పబడింది.
అదే రుగ్వేదకాలంలో సరస్వతి చాలాగొప్ప మహానదిగా చెప్పబడింది (అంబితమే నదీతమే దేవితమే సరస్వతి).
సరస్వతి నదికి సట్లెజ్ నది ఒకప్పుడు నీటిని అందించేది. రుగ్వేదకాలానికి సరస్వతి ఒక మహానది. (రుగ్వేదకాలం క్రీపూ 17000+ గా నీలేష్ లెక్కించారు. రుగ్వేదంలోని 6,3,7 మండలాలు ప్రాచీనమైనవి కాగా, 5,8,9 మండలాలు రామాయణకాలానికి చెందినవని 10 వ మండలం మహాభారతకాలనికి చెందినదని రుగ్వేదంలోని మొదటి మండలం రకరకాలమార్పులు, చేర్పులు పొందుతూ వచ్చిందని అంటారు.)
హైడ్రలాజికల్ అధ్యయనాల ప్రకారం సట్లెజ్ నది క్రీపూ 13000 లో తన దిశ మార్చుకొని పశ్చిమం వైపుకు ప్రయాణించటం మొదలెట్టడంతో సరస్వతినదికి హిమాలయసానువులనుండి నీరు అందటం ఆగిపోయింది. అందుకనే క్రీస్తుపూర్వం పన్నెండువేలలో జరిగిన రామాయణకాలానికి సరస్వతి నది ఒక మహానదిగా చెప్పబడలేదు. నీటి సరఫరా లేక సరస్వతి నది క్రమేపీ క్షీణించటం మొదలై క్రీస్తుపూర్వం 3000 నాటికి పూర్తిగా ఎండిపోయింది. అందుకనే క్రీపూ 5500 నాటి భారతంలో సరస్వతి నది కొన్ని చోట్ల ప్రవహిస్తున్నట్లు కొన్నిచోట్ల ఎండిపోయినట్లు వర్ణనలు కనిపిస్తాయి. సరస్వతీ నది ప్రవాహ పరిణామం రుగ్వేద, రామాయణ, మహాభారత వర్ణనలతో సరిపోలుతుంది.
C. Oceonography ఆధారాలు
మహాభారతయుద్ధ కాలం క్రీపూ 5561 అనుకొంటే, శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఆ తరువాత 36 సంవత్సరాలకు అంటే క్రీపూ 5525 నాటికి ద్వారకానగరం సముద్రంలో మునిగిపోవాలి. అలా జరిగినట్లు నేటికి ద్వారక నగర శిథిలాలు గుజరాత్ వద్ద సముద్రంలో కనిపిస్తున్నాయి. దీనికి బలపరిచే ఆధారాలు ఓషనోగ్రపీ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.
ఐస్ ఏజ్ ముగిసాక ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాలు క్రమక్రమంగా పెరగటం మొదలైంది. మెక్సికో వద్ద క్రీపూ 5600 లో 6.5 మీటర్ల సముద్రమట్టం పెరిగింది. టర్కీ వద్ద క్రీపూ 5550 లో సముద్రమట్టాలు అనూహ్యంగా పెరిగి అప్పటివరకూ మంచినీటి సరస్సుగా ఉన్న బ్లాక్ సీని ఉప్పునీటితో నింపేసాయి.
ఇక ఇండియా వద్దకు వచ్చేసరికి క్రీపూ 6000 లో 15 మీటర్లు క్రీపూ 5000 లో 8 మీటర్లు సముద్రమట్టాలు పెరిగినట్లుగా ఓషనోగ్రపీ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. ఈ సమయం ద్వారక క్రీపూ 5525 సముద్రంలో మునిగిపోయిన సంఘటనతో సరిపోతుంది.
D. Seismological ఆధారాలు
క్రీపూ 5540 లో గుజరాత్ లో పెను భూకంపం వచ్చినట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఈ సమయంలో సముద్రమట్టం 15 మీటర్లు పెరగటం కూడా జరిగింది. ఇది భారతంలో చెప్పబడిన క్రీపూ 5525 తో సరిపోవటం గమనార్హం.
E Genetic ఆధారాలు
సుమారు లక్ష సంవత్సరాలక్రితం ఆఫ్రికానుండి మొదటి మానవుడు భారతఖండాన్ని చేరుకొన్నాడని అనుకొంటే - ఆ తరువాత ఇక్కడినుంచి బయటకు వలసలు ఎక్కువగా జరిగాయి తప్ప చాలాకారం వరకూ చెప్పుకోదగ్గ వలసల ద్వారా భారతదేశంలోకి ఇతరులు వచ్చారని Y క్రోమోజోముకి సంబంధించిన జన్యుపరమైన అధ్యయనాలలో ఏ విధమైన ఆధారాలు లభించలేదు. ఆ తరువాత రెండువేల సంవత్సరాల క్రితం వచ్చిన శకులు, హూణులు, వెయ్యేండ్లక్రితం వచ్చిన ముస్లిముల వలసలు ద్వారా కొత్తవ్యక్తుల జన్యువులు భారతీయ జన్యు అధ్యయనాల్లో రికార్డు అయ్యాయి. ఈ జన్యు అధ్యయన ఫలితాలు ఆర్యుల ముట్టడి సిద్ధాంతాన్ని తునియలు చేసింది.
***
.
భారత, రామాయణాలు మన సంస్కృతిలోనే కాదు చరిత్రలో కూడా భాగమని నమ్ముతాను. చరిత్రకానట్లయితే అన్ని డిటైల్స్, పాత్రలు, ప్రాంతాలు, వ్యక్తులను అంతగొప్పగా కల్పించటం అసంభవం అని అనుకొంటాను. అంతే కాదు…. నా దృష్టిలో తులసీరాముడు ప్రొజెక్ట్ చేసిన శ్రీరామ్ వేరు, చారిత్రిక రామాయణం వేరు.
మన సంస్కృతిని వేలసంవత్సరాల వెనక్కు పుష్ చేయటం మనకు గొప్పగా అనిపించవచ్చు. కానీ నీలేష్ చెప్పిన పద్దతి శాస్త్రీయంగా అనిపిస్తోంది. చక్కని ఉపన్యాసకుడు కావటం వల్ల చాలా గొప్పగా ప్రెసెంట్ చేసాడు. చాలా అంశాలను సహేతుకంగా చెప్పినట్లు అనిపించింది.
నిజానికి నిన్న జరిగిన విషయాలలోంచే నిర్ధిష్టమైన సత్యాలను ఆవిష్కరించలేం. అలాంటిది ఇన్ని వేల సంవత్సరాల తరువాత ఇలాగే జరిగింది అని చెప్పటం అరొగెన్స్ అవుతుంది. బహుశా అందుకనే Nilesh Nilkanth Oak తాను చెబుతున్న ఈ లెక్కలు ప్రతిపాదనలు మాత్రమే అని, అవి తప్పు అని నిరూపించినట్లయితే సంతోషించేవారిలో తాను ఒకడినని అని ప్రకటిస్తున్నాడు. ఆ మాటలు నచ్చాయి. వీలైతే ఈ లింకులో అతని ఉపన్యాసం వినండి. తరువాత ప్రశ్నోత్తరాల సెషన్ కూడా…
https://www.youtube.com/watch?v=3tsyzrDg2n4
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment