Sunday, April 23, 2023

ప్రాచీనసాహిత్యంలో ఋతువర్ణనలు - పార్ట్ 5

చలి కాలం/శిశిరఋతువు/ Winter 2
.
మాఘ, పాల్గుణ మాసములు శిశిర ఋతువు. ఇది జనవరి నుండి మార్చి మధ్యలో ఉంటుంది. చెట్లు ఆకులు రాల్చు కాలము. ఈ ఋతువులో చలి అధికంగా ఉంటుంది. ప్రాచీన సాహిత్యంలో పంటలు కోతకు వచ్చి కొత్తధాన్యంతో రైతుల గాదెలు నిండే కాలం ఇది. ఇండ్లలో స్త్రీలు ధాన్యం దంచటం కొన్ని గాథలలో కనిపిస్తుంది
నిరుపేదలు చలి ప్రతాపానికి బాధలు పడటం; భాగస్వాములకు దూరమై వియోగంతో ఉన్నవారు చలివల్ల కష్టపడటం; కొందరు ధనవంతులు పుణ్యం కొరకు ఊరిలో పదిమందికి ఉపయోగపడేలా పుణ్యాగ్ని ఏర్పాటుచేయటం చేయటం లాంటి అనేక జీవనానుభవాలు వివిధ గాథలలో కనిపిస్తాయి.
 
1.
కప్పుకునేందుకు వెచ్చని దుస్తులు
కాచుకొనేందుకు నిప్పుల కుంపటి
శీతగాలి చొరబడని ఇంటి గదులు
వేడెక్కించే జవరాండ్ర పయోధరాలు లాంటి హంగులతో
ధనవంతులు చలికాలాన్ని తరిమేయగలరు
అందుకే
అది పేదవారిపై తన ప్రతాపం చూపుతుంది
(Sarngadharapaddhathi 3937)

2
ఒకబాటసారి సాయింత్రపు వేళ
ఊరి చలిమంట వద్ద ఒళ్ళుకాచుకొని
గ్రామదేవత గుడిలో గడ్డిపరుచుకొని పడుకొన్నాడు
చలిగాలులకు అర్ధరాత్రి మెలుకువ వచ్చేసింది
ఒంటిపైని పలుచని దుస్తులు చల్లగా మారి
ఏమాత్రం వెచ్చదనం ఇవ్వటం లేదు
తెల్లవార్లూ అతను చలికి
ఆ గుడిలో అటూ ఇటూ పొర్లుతూనే ఉన్నాడు
(బాణుడు- సంస్కృత కవి)
ఊరి చలిమంట= పుణ్యాగ్ని. ఎవరో పుణ్యం కొరకు అభాగ్యులకై ఏర్పాటుచేసిన చలిమంట)
3
నేత్రాలు నా కన్నీరును దాచలేకపోతున్నాయి
ఈ దుఃఖాన్ని నేను తాళలేకున్నాను
ఈ ఒంటరితనం
ఈ శీతల రాత్రి
ఎముకలు కొరికే చలిగాలులు
భోరున కురిసే వాన
ఈగలను తరమటానికి ఆవు తలను ఆడించిన ప్రతిసారీ
దాని మెడలో గంట మోగుతోంది
ఈ ఊరిలో ఆ ధ్వనులను వింటున్నవారు
ఇంకా ఎవరైనా ఉన్నారా?”
kurunthokai 86
 
4.
మాఘమాసపు చలి సమయాలలో
పొగలేకుండా వెచ్చదనాన్ని ఇచ్చే
తన బార్య ఎత్తైన చన్నులను నమ్ముకొని
ఆ రైతు తన కంబళిని ఇచ్చేసి
ఎద్దును బదులుగా పుచ్చుకొన్నాడు
గాథాసప్తశతి – 218
 
5
చలికి అతని పళ్ళు పటపట చప్పుడు చేస్తూ
ఒణుకుతున్నాయి
చలిమంటకి దగ్గరగా ముఖాన్ని చేర్చాడు
పొగకి కన్నీరు వస్తోందని కళ్ళు గట్టిగా మూసుకొన్నాడు
చేతులు రుద్దుకొంటు ముందుకు చాచాడు
కమిలిన ఆ బాటసారి గడ్డాన్ని చూస్తే
ఊరి చలిమంటను రెండుచేతులతో
తీసుకొని తాగుతున్నాడా అనిపిస్తుంది
(sarngadharapaddhati 3934)
 
6
శీతాకాలం వస్తే ధనవంతులకు ఉత్సాహం
తమలపాకులు నములుతూ
తమ రహస్య ప్రియురాళ్లను నిమురుతూ
అంతులేని భోగాలను అనుభవిస్తారు
పేదలమైన మాకు
కప్పుకోవటానికి సరైన దుస్తులు ఉండవు
చలికి గజగజలాడుతూ మోకాళ్ళ వణుకు తప్ప
శీతాకాలం మాకు పండగ కాదు.
(అజ్ఞాత సంస్కృత కవి- Erotic poems from Sanskrit an Anthology, by Parthasarathy)
 
7
పండగ కొరకు దంచుతున్న పిండి ఎగిరిపడి
తెల్లగా మారిన ఆమె చన్నులు రెండూ
కలువపూవు లాంటి ఆమె మొఖం నీడలో
ముడుచుకు కుర్చున్న హంసల్లా ఉన్నాయి
(గాథాసప్తశతి 626)

8.
చలిగాలులకు కోతులు వణుకుతున్నాయి
గొర్రెలు, మేకలు, పశువులు చిక్కిశల్యమైపోయాయి
తరిమివేసిన కుక్క మరలా పొయ్యివద్దకు వచ్చి
మునగదీసుకొని కూర్చుంది
ఎముకలు కొరికే చలికి ఆ పేదవాడు
కాళ్ళూ చేతులూ దేహంలోపలకు లాక్కొన్న
తాబేలులా కనిపిస్తున్నాడు
(విద్యాకరుని సుభాషిత రత్నకోశ -313)

9.
తొలకరి పంట చేతికొచ్చాకా
గాదులలో నిల్వ చేసిన ధాన్యం సువాసనలతో
ఇంటి పడుచులు రోకళ్లతో కొత్త వడ్లను దంచుతున్నపుడు
వారి చేతులు పైకి కిందకూ ఆడేవేళ వారి గాజులు చేసే చప్పుళ్ళతో
రైతుల ఇళ్ళు ఎంత సందడిగా ఉంటాయో కదా?
(యోగేశ్వర, విద్యాకరుని సుభాషిత రత్నకోశ -314)

10.
ప్రేమ వల్ల ఏదైతే వస్తుందో
దాన్ని చలికాలం తీసుకొచ్చింది
చర్మం పాలిపోవటం, వణికే పెదవులు
నత్తిగా మాట్లాడటం
(అలంకార రత్నాకర)

11.
ఏనుగుల గుంపులు సంచరించే అరణ్యాలలో
మంచుకురిసే పర్వతాలపై నివసించే
ఓటమి ఎరుగని బలమైన ఈటెను కలిగిన వీరునితో
లేచిపోవటం
బంధుమిత్రుల మధ్య ఎంతో సందడితో
పెళ్ళిచేసుకోవటం కన్నా గొప్పదని
భావించిందా నా కూతురు?
Ainkurunūru 379
(లేచిపోయిన కూతురుపై తల్లి చేసిన వ్యాఖ్య)

12.
నువ్వు చెలకలు పండాయి
పిట్టలు సందడి మొదలైంది
ఆవపంట ముదురు గోధుమ రంగుతేరింది
పూలు గింజలుగా మారుతున్నాయి
ఎండిన పైరు గాలికి ఊగుతుంటే
మంచు బిందువులు రాలి చెదురుతున్నాయి
బాటసారులు ఊరి మంట వద్ద చేరి
పనిలేని ముచ్చట్లు చెప్పుకొంటున్నారు
(యోగేశ్వర, విద్యాకరుని సుభాషిత రత్నకోశ -315)

13.
చందమామ భీతిల్లిన తరుణిమోము వలె ఉంది
బలహీనంగా ప్రకాశించే సూర్యుడు
వ్యాపారంలో నష్టపోయిన వ్యక్తి వలె ఉన్నాడు
పిడకల పొగ కొత్తపెళ్ళికూతురి మెత్తని అలకలా ఉంది
శీతకాలపు చలిగాలి
జిత్తులమారి ఆత్మీయాలింగనం వలె ఉంది
(అభినంద, విద్యాకరుని సుభాషిత రత్నకోశ -317)

14.
ఆ రైతుల వెచ్చదనం చలిగాలులకు కరిగిపోతోంది
గడ్డిమంటను కర్రలతో కెలుకుతూ పదే పదే రగిలిస్తున్నారు
మంటలు రేగినట్లే రేగి ఆరిపోతున్నాయి
ఆవపంట గడ్డిని మండించే కొద్దీ దట్టమైన గొట్రు
కుప్పనూర్పిడి నేల నలుమూలలకూ వ్యాపిస్తోంది
(యోగేశ్వర, విద్యాకరుని సుభాషిత రత్నకోశ -318)

15.
చలికాలంలో ఒడ్లు దంచుతూ ఆడువారు పాడుకొనే
దంపుడు పాటలు ఎంత మనోహరంగా ఉంటాయి!
పైకి క్రిందకూ కదిలే వారి చేతి గాజులు చేసే
గలగలల శబ్దాల మధ్య సాగే పాటలు
పైకి క్రిందకూ ఊగే వారి చన్నుల లయను అనుసరిస్తూ
ఆ హుం, ఆహుం అంటూ చేసే ఊర్పులతో సాగే పాటలు
(యోగేశ్వర, విద్యాకరుని సుభాషిత రత్నకోశ -1178)

16.
వర్షాలకు, చలికి, వేడికి అతీతంగా
రోజులు వచ్చిపోతూంటాయి
కానీ అవి ఎవరికి ఏం చేయటం కొరకు వచ్చిపోతున్నాయో
మనకెవరికీ తెలియదు.
(విద్యాకరుని సుభాషిత రత్నకోశ -1067)

17
చలికాలపు రాత్రులు ఎంతకీ తరగవు దీర్ఘమైనవి
చాన్నాళ్లుగా భర్త ఊళ్ళోనే లేడు
రాత్రుళ్ళు చక్కగా నిద్రపోవచ్చు కదా!
పగలు నిద్రపోతున్నావు; ఏమిటి సంగతీ?
గాథాసప్తశతి 66

18.
ఓ చల్లని ఉత్తరగాలులారా
మీకు శుభం కలుగుగాక!
పాము కుబుసాలను తలపించే
స్వచ్ఛమైన జలపాతాలతో
అలంకరించబడిన కొండకి సమీపంలో
గడ్డితో అల్లిన ఇళ్ళ ముందు ఉన్న
ఇప్ప చెట్లనుండి రాలిపడే పూలను
అడవి జింకల మందలు తింటూఉంటాయి
అదే నాప్రియురాలి ఊరు
ఆమెను చల్లగా చూడండి
Kurunthokai 235
 
19.
ఈ హోలీ పండుగ రోజున
రంగులు అద్దిన చన్నులతో
మద్యం ఎక్కువై ఎరుపెక్కిన కళ్ళతో
కలువపూవులు తురుముకొన్న జడతో
మామిడి చివురు దోపుకొన్న కొప్పుతో
ఓ యువతీ!
నువ్వీ గ్రామానికే ఒక శోభ.
గాథాసప్తశతి -826


(ఇంకా ఉంది)


అనువాదం
బొల్లోజు బాబా

1 comment:


  1. గాథాసప్తశతి నాటికే హోలీ పండుగ వుండేదన్న మాట !

    ReplyDelete