భారతదేశపు ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య శీతోష్ణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఉత్తరభారతదేశంలో శీతాకాలం సుదీర్ఘంగా ఉంటే దక్షిణభారతదేశంలో వేసవికాలం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ సంవత్సర కాలాన్ని ఆరు ఋతువులుగా వర్ణించటం, అటు ప్రాచీన సంస్కృత, ప్రాకృత ఇటు తమిళ సాహిత్యాలలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాచీన కవులు భిన్న ఋతువులను భిన్న ఉద్వేగాలను పలికించటం కొరకు నేపథ్యంగా వాడుకొన్నారు.
ఋతువర్ణన అనగానే కాళిదాసు ఋతుసంహారం వెంటనే స్ఫురిస్తుంది. సంస్కృతానికి సంబంధించి ఇదొక క్లాసిక్. అదే సమయంలో ప్రాచీన ప్రాకృత, తమిళ సాహిత్యాలలో కూడా అనేక విధాలుగా ఋతువుల వర్ణన కనిపిస్తుంది. ఇది ఆనాటి సమాజాన్ని, చరిత్రను ప్రతిబింబిస్తుంది. భిన్న ప్రాచీన కావ్యాలలో చెప్పిన ఋతువర్ణనలను తెలుగు చేయాలనే చిన్న ప్రయత్నం ఇది.
***
గ్రీష్మఋతువు
వేసవి కాలం అంటే తాళలేని వేడిమి, గాడ్పులు, ఎండి శుష్కించిన వృక్షజాలం, అడవులను దహించే కార్చిచ్చులతో పాటు ఆహ్లాదాన్నిచ్చే సాయింత్రాలు, వెన్నెల రాత్రులు, మరులు రేపే జాజుల పరిమళాలు లాంటివి కూడా ఉంటాయి. వీటన్నిటినీ ఆనాటి సాహిత్యం ప్రతిబింబించింది.
వేసవి వేడిని తట్టుకోలేక నీడలో సేదతీరే జీవుల వర్ణనలు (1, 5, 6, 17); సాయింత్రపు వేళ సహభోగితో సుఖించే సందర్భాలు (2,4,11), వేసవికాలానికి ప్రతీకగానిలిచే కార్చిచ్చు ప్రస్తావనలు ( 7, 14) కవితాత్మకంగా ఒదిగి పోయాయి.
5,8 లు ఒకే వస్తువును చెబుతున్నప్పటికీ- సప్తశతి గాథలో అది ఒక చిన్న పదునైన పదచిత్రంతో ధ్వన్యాత్మకంగా చెప్పగా, సారంగధరపద్దతి కావ్యంలోని వర్ణనలో నోరారా, ధారాళంగా వాచ్యంగా చెప్పటం ప్రాచీన భారతీయ సాహిత్యం ప్రయాణించిన రెండు భిన్న ప్రక్రియా మార్గాలను సూచిస్తాయి. 12 వ గాథ లోని ప్రశ్న, 15 వ గాథలోని ఇంటిబెంగా అనశ్వరమైనవి. 13 వగాథ ఎందుకో ప్రత్యేకంగా అనిపిస్తోన్నది.
.
1.
మధ్యాహ్నపు మార్తాండుడు నిప్పులు కురిపిస్తున్నాడు
ఆ వేడికి తాళలేక ఛాయాదేవి చెట్ల నీడకు చేరి
ఆ చల్లని తావులో తలదాచుకొంటోంది
(సారంగధరపద్ధతి – 3835-పద్నాలుగో శతాబ్దపు సంస్కృత కావ్యం)
2.
వేసవి రాత్రులలో ప్రేమికులు
పూల పరిమళాలు నిండిన మేడలపైకి చేరి
మధుపానం వల్ల మత్తెక్కిన ప్రియతముల పెదవులను గ్రోలుతూ
వీనుల విందైన వీణానాదాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తారు.
(ఋతుసంహారం 1.3 – 4 వశతాబ్దపు కాళిదాసు రచన)
3.
తెల్లని మేడలపై నిద్రించే తరుణీమణుల
మోములను చూసిన చంద్రుడు
అంతటి వర్ఛస్సు తనకు లేనందుకు వెలవెలబోయి
వేకువ వెలుగులో కరిగిపోయాడు.
(ఋతుసంహారం – కాళిదాసు 1.9)
4.
చందనము పూసిన వీవెనలనుండి వచ్చే పిల్లగాలులు
ముత్యాలను అలంకరించుకొన్న వక్షోజాల మెత్తని స్పర్శ
చెవులకు హాయిగొలిపే వల్లకీ రవములు
నిద్రిస్తోన్న మన్మధుడిని మేలుకొలుపుతున్నాయి.
(ఋతుసంహారం – కాళిదాసు 1.8 )
5.
మధ్యాహ్న సూర్యుడి ప్రతాపానికి భయపడి
నీ నీడకూడా నీ కాళ్ళక్రిందకు నక్కుతోంది
బాటసారీ!
కాసేపు ఇలా నీడలోకి రా!
(గాధాసప్తశతి 49 – ఒకటవ శతాబ్దపు హాల చక్రవర్తి సంకలనం)
6.
ఎండకు తాళలేక
జింక ఒకటి ఎండి మోడుబారిన చెట్టు క్రిందకు చేరింది
సంపదలు కోల్పోయిన సజ్జనుడు
నిస్సహాయతతో దుర్జనుని శరణుజొచ్చినట్లు
(Sarngadharapaddhati 3836)
7.
సమస్తప్రాణకోటిని బూడిద చేసిన కార్చిచ్చు
ఎండిన చెట్టుపైకెక్కి అడవిని పరికిస్తోంది
ఇంకా ఏమేం మిగిలాయా అని.
(వజ్జలగ్గ 644 – 8వ శతాబ్దానికి చెందిన జయవల్లభుడు రచించిన కావ్యం)
8.
వేసవి దినాలలో
సూర్యుని ప్రతాపం కఠినంగా ఉంటుంది
దారులను మూసేస్తుంది
మొక్కలను వాడిపోయేలా చేస్తుంది
జింకలపై కోపం చూపిస్తుంది
చెట్లను మాడ్చేస్తుంది
తుమ్మెదల వేగం మందగింపచేస్తుంది
వికసించడానికి తెగించిన మల్లెలను కసురుకొంటుంది
నదులను ఎండగడుతుంది
సముద్రాలను మరిగిస్తుంది
ఓ బాటసారీ
ఈ వేడిమిలో నువ్విలా తిరుగుతూ ఉంటే
ఎలా బ్రతగ్గలవూ?
Sarngadharapaddhati 3554
9.
మునుపెన్నడు చూడని చెరువు అడుగుభాగాన్ని
వేసవి బయలుపరచింది
పరిగె చేపలు, తాబేళ్లు ఏండకు మాడిపోతున్నాయి
అట్టకట్టిన చెరువు మట్టి రాతిఫలకలా మారింది (గాథాసప్తశతి 414)
10.
వేసవి మధ్యాహ్నం
తలుపుల కనురెప్పలు మూసుకొని
నిద్రిస్తూంది ఊరు.
ఎక్కడో తిరుగలి గరగర
ఇళ్ళు పెడుతోన్న గురకలాగ (గాథాసప్తశతి 671)
11.
తురుముకొన్న పూలు రాలుతూండగా
పన్నీటి స్నానంతో పరిమళిస్తూన్న తడిసిన ఒత్తైన కురులను
వేసవి మధ్యాహ్నపు శృంగారానంతరం అలసిన భర్త ఛాతీపై
చల్లదనం కొరకు కప్పుతోంది ఆమె (గాథాసప్తశతి – 244)
12.
నిర్జల ఎడారులకు అవతల ఉన్న దేశానికి
సంపదలకొరకు నడివేసవిలో బయలుదేరుతున్నావు
ఎత్తైన పర్వతదేశపు నా రాజా!
నిన్నుప్రేమించటానికే జీవించే స్త్రీ కి పుట్టిన
నీ మొదటి కొడుకు చిరునవ్వు కన్నా
నీవు గడించబోయే సంపదలు అంత గొప్పవా?
(Ainkurunuru 309 – నాలుగో శతాబ్దానికి చెందిన ప్రాచీన తమిళ కావ్యం)
13.
ఆమె పాలుతాగటం మానివేసింది
చెలికత్తెలతో ఆటలు కూడా.
ప్రియునితో లేచిపోయి తెలియనిదారులపై
నడవటం చాలా సులభం అని అనుకొంటూందా ఆమె?
ఆ మార్గం వెదురుపొదలతో నిండి ఉంది.
మదమెక్కిన ఏనుగు ఒకటి
గున్నంగి చెట్టును దంతాలతో పదే పదే కుమ్ముతూ
దాని ఎండిన కొమ్మలు చేసే గలగలలను
వేసవి గాడ్పులకు మాడిన కొండలపై పడుతోన్న వాన చప్పుళ్ళుగా
భ్రమపడుతోంది.
(Kuruntokai 396 - BCE రెండో శతాబ్దానికి చెందిన తమిళ కావ్యం)
14.
మొత్తం అడవిని దహించి దహించి
అలసిపోయిన కార్చిచ్చు
మైదానంలో ప్రవేశించి
గట్టునున్న రెల్లుగడ్డిని దాటుకొని
ఏట్లో దాహం తీర్చుకొంటోంది (గాథాసప్తశతి - 758)
15.
ఎన్నో పర్వతాలను, ఎన్నో భాషలను
ఎన్నో ఎండిపోయిన వేసవి దారులను
దాటుకొని ముందుకు సాగాను.
ఒకనాడు
గున్నంగి చెట్టు కొమ్మపై చెదిరిన ఈకలతో
ఉలిముక్కు కల ఒంటరి ఆడగెద్దను చూసినప్పటినుంచీ
నా ప్రియురాలు పదే పదే గుర్తుకు వస్తూన్నది
ఆమె సుగుణాలు, మెరిసే ఆమె చేతి గాజులను
ఎన్నటికీ మరచిపోలేను
(Ainkurunuru 321)
16.
నాలుక పిడుచకట్టుకుపోయిన దాహంతో
మండే సూర్యుని వేడిమిని తాళలేక
దూరంగా కనిపించే నీలిరంగు ఆకాశాన్ని నీళ్ళుగా
భ్రమపడిన జింకలు దారి తప్పి అడవికి దూరంగా సంచరిస్తున్నాయి
(ఋతుసంహార 1.11 - కాళిదాసు)
17.
సూర్యకిరణాల తాకిడికి వేడిగా మారిన ఇసుకపై
పాకలేక ఆ నాగుపాము శత్రువు అని కూడా ఎంచలేని స్థితిలో
నెమలిపింఛపు నీడలో ఏ చలనమూ లేక పడి ఉన్నది
(1.13 ఋతుసంహార – కాళిదాసు)
.
అనువాదం: బొల్లోజు బాబా
.
ఇంకా ఉంది.
No comments:
Post a Comment