Saturday, June 20, 2009

పోలవరం నిర్వాసితుల కోసం....

నాకు పెద్దగా లెక్కలు రావు
ఎన్నివందల స్మశానాలో
ఎన్ని లక్షల శవాలో
ఎన్నికోట్ల వెలుతురు గింజలో
నే చెప్పలేను.


రెండు కొండల మధ్య సూర్యుని చూపి
అది ఏ సంధ్యంటే ఎవరుమాత్రం
ఏం చెప్పగలరు!


లక్షల సంవత్సరాల
కన్నీళ్లు, నెత్తురులు
ఇంకించుకొన్న ఈ నేల
ఇకపై తన పరిమళాల తూనీగల్ని
ఎగరేయదంటే, ఎందుకో
హృదయంలో ఇసుక నింపినట్టుంది.
ఇంకా తవ్వబడని ఓ నాగరికతను
జల సమాధి చేసేస్తుందీ నేల.


ఏడుతరాల అన్వేషణలో ఎవరో
ఓ మానవుడు ఇక్కడకు వస్తే
ఇక ఈ నేల ఏమిచూపగలదూ
నిలువెత్తు అంధకార జలస్థంభాన్ని తప్ప.

ఈ మట్టినే నమ్ముకొన్న
చెట్టు ఇకపై పాడదు.
పిట్ట ఇకపై పూయదు.

మనిషి మాత్రం
ఇక్కడ తన్ను తాను నరుక్కొని
మరెక్కడో పాతుకొంటున్నాడు.
ఆ రక్తరహిత జననం కోసం
తట్టా బుట్టా సర్ధుకొంటూ, ఈ నేలతో
తన అనుబంధాల్ని, అనుభవాల్ని
ఎలా తీసుకెళ్లాలో తెలీక
అలా వానలో తడుస్తున్నాడు.

సుళ్లుతిరిగే మౌనంపై
శూన్యంలోంచి కురిసే వాన
సూదులతో గుచ్చే ముళ్లవాన.


తడిచేవానికే తెలుస్తుంది
తడి పదునెలా ఉంటుందో.


బొల్లోజు బాబా

(పోలవరం ప్రోజెక్టు నిర్మాణంలో కనుమరుగయ్యే వందల ఊళ్లను, నిర్వాసితులయ్యే లక్షల స్థానికులను తలచుకొని)

13 comments:

 1. బాబా:
  చాలా లోతయిన కవిత రాసారు. వొక బయటి అనుభవాన్ని మీ అనుభవంగా మలుచుకొని, మీ అనుభూతి తీవ్రత అంతా అందులో ఇంకించారు. ఇలాంటివి ఇంకా మీ అక్షరాల నుంచి ఇంకా రావాలి. బాబా చెట్లూ పుట్టల కవి మాత్రమే కాదని ఇవి చెబ్తాయి.
  ప్రకృతిని ప్రకృతిగా మాత్రమే వుపాసించే కవులతో నాకు పేచీ వుంది. ప్రకృతిని నిర్మిస్తున్న/ధ్వంసం చేస్తున్న మనిషిని గురించి కూడా రాస్తేనే అది ఇప్పటి కవిత్వం అవుతుందని అనుకుంటున్నాను నేను.
  ఇవాళ అలాంటి ఈ కాలం గొంతు వొకటి విన్నాను.

  అఫ్సర్  --
  AFSAR
  University of Wisconsin- Madison (Until 10th August)
  contact skype: afsar2008

  ReplyDelete
 2. * నాగార్జున సాగర్ డాం కట్టినపుడు ఇలాకే నాగార్జున కొండ, కొన్ని వందల పంట పొలాలు ముంపుకి గురయ్యాయట. మా నాన్నగారు ప్రాజెక్ట్ ఇంజినీరు, ఎంతమందికో compensation ఇప్పించారు[ట]. ఈ మధ్య వరకు కూడా వచ్చి కనిపించిపోతుండేవారు. ఆ డాం నిర్మాణంపై "సాగర సంగమం" అనే నృత్యనాటికలో నేను నాగార్జునాచార్యుడిని. "విధియే పడత్రోసి చనిన శిధిలాలను కదిలించి ఎవరో నను పిలిచినారు, ఏది నాగార్జున కొండ, ఏదీ బౌద్దారామం?" అని ప్రశ్నిస్తాడు. ఎందుకో అది గుర్తుకి వచ్చింది. కానీ నిరుపయోగమై సాగరాల పాలౌతున్నాను అన్న కృష్ణమ్మ మటుకు తనకి జన్మ సార్దకమైందని సంతోషిస్తుంది. మనం ఇదివరకు ఈ విషయమై http://sahitheeyanam.blogspot.com/2009/05/blog-post_10.html లో అభిప్రాయాలు పంచుకున్నామండి. తప్పదు ఇవి.

  ReplyDelete
 3. మనం, అంటే మనుషులం, ఎంతగా ప్రకృతిని నాశనం చేస్తున్నామో మీ మాటల గునపాలతో పొడిచి మరోసారి గుర్తుచేసారు. ఇతర జీవజాలంతో పోలిస్తే ఒక సగటు మనిషి వాడే ప్రకృతివనరులు కొన్ని వందల (బాహుశా వేల) రెట్లు ఎక్కువగా ఉందన్న విషయం గమనిస్తే మనం ఎంత దుర్మార్గులమో అర్థమవుతుంది. ఆఖరికి మనిషి అవసరాలు తీర్చకపోతే ప్రకృతివనరులు వృథా అనే స్థాయికి మన అహంకారం చేరుకుంది.
  ఇలాటప్పుడే ఏవీ చెయ్యలేని నిస్పృహతో మనిషిగా నా మీద నాకే అసహ్యం వేస్తుంది.

  ReplyDelete
 4. అఫ్సర్ గారికి
  మీనుంచి కామెంటు రావటమే మహాదృష్హ్టంగా భావిస్తున్నాను.
  మీసూచనలను పాటిస్తాను. అనంతానంత ధన్యవాదములతో

  ఉషగారికి,
  అవునండీ మీ నేపద్యంతో మీరు చేసే వ్యాఖ్యల వల్ల ఈ కవిత బరువు మరింత పెరుగుతున్నది.

  భైరవభట్లగారికి
  మానవుడు మొన్నమొన్నటివరకూ యుద్దాలతో గడిపేసాడు. ఈ శతాబ్ధం నుంచీ ప్రకృతిపై పడ్డాడు. లివ్ అండ్ లెట్ లివ్ అనే మార్గాన్నెప్పటికి ఎంచుకొంటాడో?
  బొల్లోజు బాబా

  ReplyDelete
 5. baba garu na kavitha chadivi mechchukunnanduku chaala thanks. mi blog and pathakula comments inthakumunde nenu chadavatam tathasthinchindi...chala bagunnayi. sare na kavitha ni link breaks lo immannaru.. adelago naku thelidu...previous poetryni telugu lipilo rayadam pedda prahasanam ayna prayathnisthanu... veelaythe na kavithalanni chadavandi milanti anubhavagnyula salahalu chala avasaram naku. thanku

  ReplyDelete
 6. చెట్టు ఇకపై పాడదు.
  పిట్ట ఇకపై పూయదు.

  ee vaakyAllO em cheppa daluchukunnarO ardam kaaledu lEka padAlu tArumarayyAyo teleedu.tappunte kshaminchandi.vErE edina ardamlo raasunTE vivarinchanDi.thanks

  ReplyDelete
 7. ఇంకా తవ్వబడని ఓ నాగరికతనుజల సమాధి చేసేస్తుందీ నేల

  ఇక్కడ 'నేల' కి బదులు ... అసలు ఈ దుస్తితికి కారకులని ప్రస్తావించి వుటే ?

  నేను మీకు చేపెతోన్ని కాదు, క్షమించండి ...

  Anyhow, kavita is so deeeeeep thru harts...

  ReplyDelete
 8. (నేను మీకు చేపెతోన్ని కాదు, క్షమించండి ...) PL. DO NOT SPEAK LIKE THAT. PL. KINDLY HERE AFTER

  ఈ కవితలో నేనెక్కడైతే చాలా కొట్టివేతలు, తిరగరాయటాలు చేసానో అదేపాయింటుని మీరు పట్టుకొన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేనెండుకు అలా వ్రాసానో చెప్పుకొనే అవకాశాన్ని మీరిచ్చినందుకు.

  1. ఈ కవిత ఉద్దేశ్యం డామ్ వలన ఏర్పడే వాక్యూం ని చెప్పాలనుకొన్నాను. ఆ వాక్యూం వలన కల్లోలంలో చిక్కుకుంటున్న మానవహృదయాన్ని ఆవిష్కరించాలనుకొన్నాను.

  2. ఆ నిర్మాణం వలన మేలా కీడా అనే చర్చ కూడా ఈ కవితలో చేయలేదు. అందుకే ఈ క్రింది వాక్యాలు
  రెండు కొండల మధ్య సూర్యుని చూపి
  అది ఏ సంధ్యంటే ఎవరుమాత్రం
  ఏం చెప్పగలరు!

  3.అందుకనే ఈకవితలో ముఖ్యంగా మునిగిపోయే ఊర్లు తద్వారా కనుమరుగవబోతున్న ఒక లోకం, నిర్వాసితులు తట్టాబుట్టా సర్ధుకొని వచ్చేయటంలో పడే ఆత్మక్షోభా ఇవే కనపడతాయి.

  4. ఇక మీరన్నట్లుగా ఈ దుస్తితికి కారకులు పలానా వారని ఎవరిని ముందుకు పెట్టగలము? వాళ్లు మానవులే కదా?

  ఈ కవితలో నేననుకొన్న అంశాన్ని సరిగ్గా చెప్పలేకపోయానన్న వెలితి నాకు ముందునించే ఉండింది. ఎందుకంటే ఈ కవితను నా మిత్రునికి చూపి, నేను వ్రాయదలచుకొన్న అంశం వాక్యూం, అది ఎంతవరకూ ఈ కవితలో ప్రతిబింబించిందో చెప్పు మిత్రమా అని అడిగితే, అతనన్నాడూ, వాక్యూం అంటే మాటలా? ఈ కవితలో వాక్యూం కన్నా మాటలు ఎక్కువ ఉన్నాయి అన్నాడు. :-)

  but still i love this poem. because afsar sir approved it. so it is my prized possesion now.

  thank you onceagain ramesh ji for giving me an opportunity for express myself.

  ReplyDelete
 9. క్రాంతి కుమార్ గారు

  చెట్టు ఇకపై పాడదు.
  పిట్ట ఇకపై పూయదు.

  అన్న వాక్యం అలా ఉద్దేశించి వ్రాబడినదే నండి. చెట్టు పూయదు, పిట్టపాడదు అంటే అందులో కవిత్వం ఏమి ఉంటుంది ఉత్త వచనం తప్ప.

  ఇక అన్వయం అంటారా?
  చెట్టు పాడటం అంటే పూత ధరించి పుప్పొడి రాగాలను వెదచల్లటం.
  పిట్ట పూయటమంటె గూడుకట్టుకొని పిల్లా పాపలతో కాపురం చేయటం.

  ఇలా చెప్పటాన్ని తద్గుణాలంకారం అంటారండీ. (ఒక వస్తువు
  స్వగుణమును విడిచి అన్యగుణమును పొందినట్లు వర్ణించినచో దానిని తద్గుణము అంటారు - రి.అలంకార సంగ్రహము - కందుకూరి వీరేశలింగం)

  అని అనుకొంటున్నాను ఏ భైరవభట్లగారో సవరిస్తే తప్ప. :-)

  బొల్లోజు బాబా

  ReplyDelete
 10. Baba garu,

  I know there is reason behind that... i trust you... :-) Thank you for your explanation.

  ReplyDelete
 11. assalamun alikum telugulo e sait baga undi me sait lo telugu lo hadith mariyou quran cherchithey inka baga untundi plese visit my blog www.iqbalmirzaee.blogspot.com

  ReplyDelete