గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని. గాథాసప్తశతి అంటే హాలుడు అనే రాజు (శాతవాహనుడు) ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం అని. ఇది ప్రాకృత భాషలో రచింపబడింది.
ఈ గ్రంధములో హాలుని విరచితములు అధికం. పల్లెజీవనము, ఆనాటిప్రజల ప్రేమోదంతాలు, ఆచారాలు, అలవాట్లు ఈ గాధలలో కనపడుతూంటాయి. .
కొద్దిరోజుల క్రితం శ్రీ చినవీరభద్రుడు గారు మా కాకినాడ వచ్చినపుడు హాలుని గాథాసప్తశతిపై మాట్లాడతారని ఒక స్థానిక సాహితీసంస్థ ప్రకటించింది. కానీ వేరే కారణాల వల్ల ఆయన మరో అంశంపై మాట్లాడారు.
అప్పటినుంచి ఈ గాథా సప్తశతి గురించి వెతికితే, దీవిసుబ్బారావుగారి అనువాదం కినిగేలో దొరికింది. చాలాబాగుందనిపించింది. తరువాత 1944 లో శ్రీ గట్టి లక్ష్మి నరశింహ శాస్త్రిగారు, 1930 నాటి శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు, Peter Khoroche & Herman Tieken లు చేసిన అనువాదాలు లభించాయి.
సప్తశతి గాధలలో చాలామట్టుకు శృంగార ప్రధానంగా ఉంటాయి. స్వేచ్చగా, అరమరికలు లేకుండా ఉండే పల్లెజీవుల ప్రణయకలాపాలు. ప్రతీగాథలో చిక్కని కవిత్వం పొటమరిస్తూంటుంది. వాటిలో ఉన్న ఆ కవిత్వం వల్లే అవి రెండువేల సంవత్సరాలుగా నిలిచిఉన్నాయని అనిపించింది. నాకు నచ్చిన కొన్ని గాధల్ని అనువదిస్తున్నాను. త్వరలో పంచుకొంటాను. ప్రస్తుతానికి ఒక అనువాదం (మొత్తం అయిదు వెర్షన్లు ఇక్కడ సరదాగా......) ఈ క్రింది ఇవ్వబడిన గాథలో భార్యమొఖము మామూలుగానే ఒక చందమామ. మసి అంటుకొన్న తరువాత మచ్చలతోకూడిన చందమామ లా అయ్యింది అని ఒక భాష్యము. ఆ గాథలన్నీ కొండవంటివి. కొండను అద్దంలో చూపించటంలో ఎవరి అద్దం వారిదే ఎవరి అర్ధం వారిదే.
The husband laughed at his wife’s face
Which, smudged with soot
That stuck to her hand from kitchen work,
Looked more than ever like the moon. [14] (Peter Khoroche & Herman Tieken)
వంట యింటి పనులనంటిన మసిచేయి
సోకియుండ జంద్ర సుందరముగ
నింపుగొల్పుచున్న ఇల్లాలి మోమును
భర్త నవ్వుచున్నవాడు చూచి ---- రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ
పులుముకొని వంటపని మసి మలినమైన
చివురుచేత సంస్పృష్టము చెలువమోము
హరిణలాంఛనునునుగోము నాముకొనియె
ననుచు నుల్లసిల్లె బ్రియుండు హాసమొలుక – గట్టి లక్ష్మినరశింహ శాస్త్రి
వంటింటి పనుల్లో
మసి అంటుకున్న చేయి తగిలి
చంద్రబింబంలా మెరిసిపోతున్న
ఇల్లాలిమోము చూసి
మొగుడు ముసిముసి నవ్వులు
నవ్వుతున్నాడు ------ దీవి సుబ్బారావు
వంటింటి పనిలో చేతిమసి ముఖానికంటుకొని
మునుపటికంటె మరింత ఎక్కువగా చందమామను
పోలిన భార్య మోమును చూసి
భర్త ముసిముసినవ్వులు నవ్వుతున్నాడు --- బొల్లోజు బాబా
No comments:
Post a Comment