Saturday, February 28, 2015

గాథాసప్తశతి

గాథాసప్తశతి

గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు (శాతవాహనుడు) ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. ఇది ప్రాకృత భాషలో రచింపబడింది.  
    
ఈ గ్రంధములో హాలుని విరచితములు అధికం.  పల్లెజీవనము, ఆనాటిప్రజల ప్రేమోదంతాలు, ఆచారాలు, అలవాట్లు, ప్రకృతి వర్ణణలు ఈ గాథలలో కనపడుతూంటాయి.  సప్తశతి గాధలలో చాలామట్టుకు శృంగార ప్రధానంగా ఉంటాయి. స్వేచ్చగా, అరమరికలు లేకుండా ఉండే పల్లెజీవుల ప్రణయకలాపాలు అవి.  గోదావరి, నర్మద నదీతీరాలలో వికసించిన కవిత్వం ఇది.  ఈ కావ్యం అమృతమధురం అని హాలుడే స్వయంగా చెప్పాడు.  ప్రతీగాథలో చిక్కని కవిత్వం పొటమరిస్తూంటుంది.  వాటిలో ఉన్న ఆ కవిత్వం వల్లే అవి రెండువేల సంవత్సరాలుగా నిలిచిఉన్నాయి అనిపించకమానదు. 

గాథాసప్తశతి ప్రభావం భారతీయసాహిత్యంపై ఎంతోఉంది. కాళిదాసు వర్ణణలపై, తమిళ సంగం సాహిత్యంపై, కబీర్, సూరదాస్ వంటి భక్తికవులపైనా గాధాసప్తశతి ప్రభావం ఉన్నట్లు నేడు గుర్తించ గలుగుతున్నారు.  

కావ్యాలంకార శాస్త్రాల్ని రచించిన  అనేక మీమాంసకులను గాథాసప్తశతి ప్రభావితం చేసింది.  ధ్వని సిద్దాంతాన్ని ప్రతిపాదించిన ఆనందవర్ధనుడు ఆ సిద్దాంతానికి మద్దతుగా గాథాసప్తశతి నుంచి అనేక ఉదాహరణలు తీసుకొని తన “ద్వన్యాలోకం” గ్రంధంలో ఉటంకించాడు.  

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గాథాసప్తశతికి అపూర్వమైన ఆదరణ లభీస్తుంది.  ఎందుకంటే ప్రపంచం అంతటా కవిత్వాన్ని మత, రాజకీయ భావజాలాలనుంచి విముక్తిచేయాలనే ప్రయత్నం జరుగుతున్నది.  ఈ ప్రయత్నంలో భాగంగానే,   సూఫీ సాహిత్యం, మధ్యయుగపు చైనీస్ కవిత్వం, గాథాసప్తశతి వంటి రచనలు గొప్ప గౌరవం పొందుతున్నాయి

గాథాసప్తశతిని తెలుగులో అనేకమంది అనువదించారు. శ్రీనాథుడు తన యౌవనారంభంలో గాథాసప్తశతిని అనువదించాను అని చెప్పుకొన్నాడు కానీ వాటిలో ఒక్క గాథ అనువాదం తప్పమరేవీ  లభ్యంలో లేవు.  
1930 నాటి శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ , తరువాత 1944 లో శ్రీ గట్టి లక్ష్మి నరశింహ శాస్త్రిగారు చేసిన అనువాదాలు అంతర్జాలంలో దొరుకుతాయి. 2012లో శ్రీ నరాల రామారెడ్డి, సంస్కృతమూలచ్ఛాయలను ఇస్తూ,  గాథాత్రిశతి పేరిట మూడు వందల గాథలను తెనిగించారు. 

ఇటీవలి కాలంలో శ్రీ దీవిసుబ్బారావు తెలుగులోకి గాథాసప్తశతిని అనువదించారు. ప్రముఖ కథకుడు శ్రీ తల్లావఝుల పతంజలిశాస్త్రి గారు కొన్ని గాథలను అనువదించారు.  శ్రీ కొలకలూరి ఇనాక్ గారు తమ ఒక రచనకు గాథలు అన్న పేరు పెట్టుకొన్నారు.  

Hala’s Sattasai పేరుతో Peter Khoroche & Herman Tieken లు చేసిన గాథాసప్తశతి అనువాదం ప్రపంచవ్యాప్తంగా ఆదరణపొంది ప్రమాణికంగా పరిగణింపబడుతున్నది.   


ఈ గాథలన్నీ కొండవంటివి.  కొండను అద్దంలో చూపించటంలో ఎవరి అద్దం వారిదే ఎవరి అర్ధం వారిదే. ఈ క్రింది ఇవ్వబడిన గాథకు భార్యమొఖము మామూలుగానే ఒక చందమామ. మసి అంటుకొన్న తరువాత మచ్చలతోకూడిన చందమామలా అయ్యింది అని ఒక భాష్యము. దీనికి వివిధ కవులు చేసిన అనువాదాలు ఇలా ఉన్నాయి. 

The husband laughed at his wife’s face
Which, smudged with soot
That stuck to her hand from kitchen work,
Looked more than ever like the moon. [14] (Peter Khoroche & Herman Tieken)

వంట యింటి పనులనంటిన మసిచేయి
సోకియుండ జంద్ర సుందరముగ 
నింపుగొల్పుచున్న ఇల్లాలి మోమును
భర్త నవ్వుచున్నవాడు చూచి ---- రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ

పులుముకొని వంటపని మసి మలినమైన
చివురుచేత సంస్పృష్టము చెలువమోము
హరిణలాంఛనునునుగోము నాముకొనియె
ననుచు నుల్లసిల్లె బ్రియుండు హాసమొలుక – గట్టి లక్ష్మినరశింహ శాస్త్రి
(సంస్పృష్టము = తాకిన, హరిణ = తెల్లని, 


వంటవార్పుల మునిగిన వారిజాక్ష
కురులనెగద్రోయ మలినితకరముతోడ
ముఖముమసియంటి సకళంకపూర్ణచంద్రు
పగిదిభాసింప – నాథుడు పరిహసించె      ---- నరాల రామారెడ్డి

వంటింటి పనుల్లో
మసి అంటుకున్న చేయి తగిలి
చంద్రబింబంలా మెరిసిపోతున్న
ఇల్లాలిమోము చూసి
మొగుడు ముసిముసి నవ్వులు
నవ్వుతున్నాడు              ------ దీవి సుబ్బారావు

వంటింటి పనిలో చేతిమసి ముఖానికంటుకొని
మునుపటికంటె మరింత ఎక్కువగా చందమామను
పోలిన భార్య మోమును చూసి 
భర్త ముసిముసినవ్వులు నవ్వుతున్నాడు --- బొల్లోజు బాబా


అన్నింటిలోను శ్రీ గట్టి లక్ష్మినరశింహ శాస్త్రి గారి అనువాదం  గ్రాంధికంగా సాగుతుంది.  వారికంటే 14 ఏళ్ళ ముందు వ్రాసిన శ్రీ రాళ్ళపల్లి వారి అనువాదం కొంచెం సరళంగా ఉండటం గమనార్హం.  ఇటీవలికాలంలో వచ్చిన అనువాదాల్లో రామారెడ్డిగారి తెనిగింపు తేటగీతి పద్దతిలో, సుబ్బారావుగారి అనువాదం వచనకవిత్వరూపంలోను ఉన్నాయి.  

జాగ్రత్తగా పరిశీలించినట్లయితే రామారెడ్డిగారి గాథ లో “సకళంకపూర్ణచంద్రు” అన్న ప్రయోగం ద్వారా మచ్చలతో కూడిన చంద్రుడు అన్న అర్ధం వచ్చి, Peter Khoroche & Herman Tieken అనువాదానికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది.  

(కవిసంధ్య పత్రికలో ఇకపై ప్రతినెలా  గాథాసప్తశతి లో ఉన్న – దేవతల ప్రస్తావన, ప్రకృతి వర్ణణలు, అపురూప సౌందర్యవతులు, నారీమనోహరులు, ప్రేమగాథలు, అన్యోన్య దంపతులు, జీవితానుభవాలు అనే వివిధ అంశాలతో కూడిన గాథలకు నేను చేసిన,  వివరణలతో కూడిన అనువాదాల పరంపర ఉంటుంది. -- బొల్లోజు బాబా)  

No comments:

Post a Comment