ఒకప్పుడు
గోడలు, బేనర్లు, సైన్ బోర్డులు
కటౌట్లపై వాడి సంతకం
ఆకాశం అంచున వేలాడే సూర్యబింబంలా
వెలిగిపోతూండేది.
నీలిమందు నీళ్లల్లో ముంచిన పురికొస సాయంతో
వాడు గీసిన సరళ రేఖల మధ్య అక్షరాలు
గూటిలోని గువ్వల్లా ఒదిగిపోయేవి.
కుంచె లోని ఉడుత వెంట్రుకలమధ్య వర్ణాలు
సుశిక్షిత సైనిక కవాతులా కదిలేవి.
బేసిక్ కలర్స్ నుంచి డిరైవ్డ్ రంగుల్ని
సృష్టించటం వాడికి మాత్రమే తెలిసిన ఓ రసవిద్య.
అతను గీసిన చిత్రాల ముందు
ఎవరెవరో పారేసుకొన్న
ఓ పదిపన్నెండు కళ్లూ, రెండుమూడు హృదయాలూ,
ప్రతీ రోజూ తుడుపులో దొరుకుతూండేవి.
కొత్తవారికి వాడిరాతలు
నిశ్శబ్ధంగా, నిర్ధుష్టంగా దారిచూపేవి.
వాడి చెక్కపెట్టి నిండా రంగురంగుల డబ్బాలే!
ఇంద్ర ధనుస్సుని నిలువునా చీరి
ఒక్కోముక్కనీ ఒక్కో డబ్బాలో వేసుకున్నాడా అనిపించేది.
పెట్టిలో వివిధ సైజుల్లో బ్రష్ లుండేవి
సన్నని గీతనుండి, ఆకాశమంత పెద్ద రేఖ వరకూ
గీయటానికై.
వాని బట్టలపై, వంటిపై, హృదయంపై
చిలికిన రంగుల మరకలు
వాడికో గొప్ప దివ్యత్వాన్నిస్తున్నట్లు
మురిసిపోయేవి.
కానీ ఇప్పుడు
వినైల్ ప్రింట్లు, ఫ్లెక్స్ బేనర్లు
ఫొటోషాపులు, కోరల్ డ్రాలు
అన్నివైపుల్నుంచీ కమ్ముకొనే
శీతవేళలా వాడిని మింగేసాయ్.
వాడి ఉపాధి స్వప్నంలా జారిపోయింది.
వాని జీవితంలోకి
థిన్నర్ కలుపని చిక్కని నల్ల రంగు ఎగజిమ్మింది.
ఎప్పుడో ఎక్కడో వాడు
రోడ్డుపై క్రీస్తులానో, సాయిబాబాలానో
కళాత్మకంగా మన దారి కడ్డంపడతాడు.
ఇంకేం చేయాలో తెలీక!
బొల్లోజు బాబా
( పెయింటరు మిత్రుడు పట్నాల రమణ ప్రసాద్ కి)
Subscribe to:
Post Comments (Atom)
నిజమే! గత పది సంవత్సరాలలో ఏంతో మార్పు.కొన్ని జీవన విధానాలు, కొన్ని జీవనోపాధులూ ముగిసాయి అనిపిస్తుంది. కానీ, ఈ వేగవంతమైన మార్పుకు అనుగుణంగా మారగలిగిన వారికి, కేవలం రూపాంతరం చెందినట్ట్లు మాత్రమే అనిపించొచ్చు.
ReplyDeleteమీ కవిత ఒక దృశ్యాన్ని కళ్ళముందు నిలబెట్టడంలో ఖచ్చితంగా సఫలీకృతమయ్యింది. కొంత ఆలోచనకు స్ఫూర్తిదాయకమయ్యింది. నెనర్లు.
బాగుంది
ReplyDeleteబాగుంది.
ReplyDeleteవాడి చెక్కపెట్టి నిండా రంగురంగుల డబ్బాలే!
ReplyDeleteఇంద్ర ధనుస్సుని నిలువునా చీరి
ఒక్కోముక్కనీ ఒక్కో డబ్బాలో వేసుకున్నాడా అనిపించేది.
ఇదండి బాబా గారు మీనుంచి ఆశిస్తుంది.
చాలా బావుంది బాబా గారు, వంతెనల వల్ల శిధిలమై పోయిన పడవ నడిపే వాడి జీవితం గుర్తొచ్చింది. అభివృద్ది వెలుగులకి ఆహుతి అయ్యే సమిధలెన్నో....
ReplyDeleteకొన్ని అభివ్యక్తులు అద్భుతంగా ఉన్నాయి..
ReplyDeleteమహేష్ కుమార్ గారు,
ReplyDeleteమీరెప్పుడు కామెంట్ చేసినా అది పోష్టులోని సబ్టిలిటీస్ ని స్పష్టంగా ఎలివేట్ చేస్తూంటుంది. మీ వివరణతో నా చాలా కవితలకు కాంప్రహెన్సివ్ నెస్ వచ్చిచేరింది.. ఇందుకు మీకు సదా సదా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. మీ తర్క సామర్ధ్యానికి నా అనంతానంత అభినందనలు.
రాధికగారికి, నరసింహ గారికి కృతజ్ఞతలు.
రాజేంద్ర గారికి,
ముందు కవితలో కొంచెం కోప్పడి, మరలా ఈ కవితలో మీరాశించినది కనిపించగానే పనిగట్టుకొని మెచ్చుకొనే మీ సహృదయతకు సదా ధన్యవాదములు చెప్పుకుంటాను.
వేణు గారికి,
మీ కామెంటు నాకు బాగా నచ్చింది. ధన్యవాదములు. అందులో పోలిక ఇంకా అందంగా ఉంది. థాంక్యూ.
మీరన్నట్లు నాగరికత వలన కొన్ని ఉపాధులు పోతున్నాయి. కరక్టే అలాగని సాంకేతాభివృద్దికి నేనేమీ వ్యతిరేకం కాదు.
గమనించండి - వాడి ఉపాధి పోవటానికి కారణం శీతవేళ అనే మాటను వాడాను. తప్ప ఎవరో వీడి నోట్లో మట్టికొట్టారన్న అర్ధంలో కాదు. కాల చక్రంలో శీతవేళ అనేది తప్పదు. అది ఎవరిచేతిలో లేనటువంటి ఒక మార్పు. దానికి తట్టుకొన్న జీవులే ప్రకృతిలో ముందుకు వెళ్ల గలవు.
అలాగని వీడి ముగింపు కూదా దరిద్రంతోనూ, దీనంగానూ ఏమీ లేదు..
కళాత్మకంగా దారికడ్డం పడతాడు అంటే అందులో కూడా ఒక సెల్ఫ్ రిలయన్స్, నిస్సహాయ స్థితిని కూడా ఎదుర్కోగలిగే ఆత్మవిశ్వాసం, పలికించాలనుకున్నాను.
కొత్తపాళీ గారికి
మీ పాళీ నుంది అద్భుతం అనే మాట రావటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్. ఇక చాలు పెన్ను మూసెద్దాం అన్నంత తృప్తిగా కూడా ఉంది.
థాంక్యూ వెరీ మచ్.
బొల్లోజు బాబా
బాబా గారు,
ReplyDeleteబాగు౦ది మీ పెయి౦టరు ఆవేదన నిన్ననే పూర్ణిమ గారు తన ఉత్తరమనే నేస్తమ్ గురి౦చి రాసారు.మీరు ము౦దుగానే పెయి౦టరు పరిస్థితి ని కళ్ళకు కట్టారు.ఇలా కొత్త వల్ల పాతకి జరుగుతున్న సమస్యలని అ౦దరూ ఆలోచి౦చ గలిగితే మళ్ళీ అవన్నీ మన ము౦గిట్లో కొస్తాయేమో.మీ పెయి౦టరు స౦తకాలుగానీ,ఆ ఉత్తరాలుగానీ.రావాలని ఆశిద్దా౦.
ఇంత మంచి కవితను నేను చదవకుండా ఎలా ఉన్నాను.. ప్చ్!! "బావుంది" అని చెప్పి వదిలేయను.. ఈ విషయం నాలో సృష్టించినంత అలజడి.. మిమల్ని పొగిడితే ఆగిపోదు. "I'm rich by the experiences of life" అని రానారె గారి "about me" లో ఉంటుంది. మీ అందరి జీవితానుభవసారం నుండి నేనూ ఎంతో కొంత నేర్చుకుని "rich" అవుతున్నాను. అంతే చెప్పగలను.
ReplyDeleteరోజూ బడికి వెళ్ళేటప్పుడు అలా ఆకాశంలో వేలాడుతూ అక్షరాలు రాసే వారిని తదేకంగా చూసేదాన్ని. ఒక్కోసారి అలా చూస్తూ దెబ్బలు తగిలించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడే ఏ ఆలోచనా లేకుండా జీవితం వెళ్ళిపోతుందల్లే ఉంది. "అలవాటు" పడిపోతున్నాను ఎమో.. మీరిలా రాస్తూ.. నన్ను నేను పరీక్షించుకునే అవకాశం ఉంటుంది.
నెనర్లు!!
బాబా గారు ... బాగుంది అండీ కవిత్వం ముఖ్యంగా ... కానీ ఇప్పుడు
ReplyDeleteవినైల్ ప్రింట్లు, ఫ్లెక్స్ బేనర్లు
ఫొటోషాపులు, కోరల్ డ్రాలు
అన్నివైపుల్నుంచీ కమ్ముకొనే
శీతవేళలా వాడిని మింగేసాయ్.
వాడి ఉపాధి స్వప్నంలా జారిపోయింది. ...అని చెప్పిన తీరు చాలా బాగుంది... ఆలోచింపజేసేలా వుంది.
బావుంది సార్. సాంకేతికాభివృద్ధికి నేను వ్యతిరేకిని కాను అన్న మీ వివరణ కూడా బాగుంది.
ReplyDeleteమీ వివరణ బాగుంది బాబా గారు.
ReplyDeleteచిన్నప్పటి జ్ఞాపకాలు కళ్ళముందు మెదిలించారు...
ReplyDelete