Saturday, June 28, 2008
ఓ నా ప్రియ గృహమా!
(నేపుట్టి పెరిగిన ఇంటికి వెళ్లినపుడు)
ఓ నా ప్రియ గృహమా!
నీ జుట్టులోకి వేళ్లూన్చి నిమిరి
నాలుగేళ్లవుతుంది.
నిన్నెంత ఇష్టపడుతున్నానో
నీ వియోగంలోనే క్లారిటీ వచ్చింది.
నీలోకి నడవటం అంటే
నా ఆత్మలోకం లో సంచరించటమే!
"రేపు మీ రిజల్ట్స్ వస్తాయట" తెలిసిందా అంటూ
నాన్నింకా నా బాధ్యతల్ని
గుర్తుచేస్తున్నట్టే ఉంది.
"వంటయిపోయింది వడ్డించేయమంటావా" అంటూ
అమ్మింకా కడుపు తడుముతున్నట్లే ఉంది.
కట్టె కాలగా మిగిలిన బూడిద రూపంలా గతం.
గోడల నిండా జ్ఞాపకాలు,
గదులనిండా అనుభవాలు.
నిశ్శబ్ధంలోకి పురాస్మృతులు ప్రవహించాయి.
ఉద్విగ్నంతో గాలి వణికింది.
ఒక తరం వెళ్లిపోయింది.
క్యూ కొంచెం ముందుకు జరిగింది.
ఒక శకం ముగిసింది.
కాలం ఆకుల స్వప్నాలు రాల్చుకుంది.
హృదయానికి వేలాడే జ్ఞాపకాలు
మనసుని చీల్చుకొని వచ్చే పాత గురుతులు
చెట్లు పీల్చుకొన్న సూర్యరశ్మెక్కడికి పోగలదు?
ఇక్కడే కదా
నిస్సహాయతకు, ఉత్సుకతకూ మద్యెక్కడో
నా శైశవం పుష్పించింది.
ఇక్కడే కదా
భుజానికి తగిలించిన స్కూలు బేగ్ కి
భుజానికెత్తుకున్న బాధ్యతకూ మద్యెక్కడో
నా బాల్యం వలికిన అత్తరయ్యింది.
ఇక్కడే కదా
రసాయిన కల్లోల కడలికీ
నిశ్చల తటాకానికీ మద్యెక్కడో
నా యవ్వనం శలవుతీసుకుంది.
కాంక్షా తీరాలకై వెతుకులాటలో
నేపోగొట్టుకొన్న గుప్పెడు మట్టిలో
నిన్ను నేను కోల్పోయాను.
కానీ
నీ సాంగత్య జాలంలో నా అస్థిత్వ శకలాలు
ఇంకా చిక్కుకొనే ఉన్నాయ్.
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
బాబాగారూ....ఏమి చెప్పాలో తెలియట్లేదు.కవిత ముగిస్తుంటే ఏదో కోల్పోయిన బాధ.ఇంటికి దూరమయినప్పుడు బాధకంటే మీ కవితకి దూరమవుతున్నప్పుడు కలుగుతున్న బాధ ఎక్కువగా వుంది. మీలాంటి పరిణితి చెందిన కవికి నేను చెప్పాల్సిన మాట కాదు.కానీ.....కవిత అద్భుతం.అక్షరాలు,పదాలు,మాటలు అన్నీ కవితకోసమే ఒదిగి వచ్చి మీ మనసులో చేరాయనిపిస్తుంది.మంచి కవిత చదివించినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteబాబా గారు:
ReplyDeleteమీ కవిత చదువుతుంటే అమ్మ ఎప్పుడూ ఇంటిని ఎందుకు గౌరవించాలో (ఒక దేవతలా) చెప్తూ ఉంటుంది, అది గుర్తు వచ్చింది. ఇంటి నుండి ఎప్పుడూ దూరంగా లేని కాని ఉంటే పడే బాధ తెలుసు నాకు.
ఆ మధ్య కాలంలో ఒక స్వగతం రాయాలని అనుకున్నాను.. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. మీకు బోలెడన్ని నెనర్లు :-)
ఇళ్ళకూ ఒక వ్యక్తిత్వముంటుందని ఇలాంటి కవిత చదివితేనే తెలుస్తుంది.ఆ ఇంటి వ్యక్తిత్వం అక్కడ పెరిగిన పిల్లల అల్లరిలోంచీ, ఇంటిని తీర్చిదిద్దిన తల్లిలోంచీ,ఇంటి బాగోగులు చూసిన తండ్రిలోంచీ ఏర్పడతాయనుకుంటా...
ReplyDeleteఅందుకేనేమో కొన్ని ఇళ్ళు రమ్మని పిలుస్తాయి, కొన్ని పొమ్మని కాటేస్తాయి.మరికొన్ని తల్లిలా ఆదరిస్తాయి, కొన్నేమో ప్రియురాలిలా ప్రేమిస్తాయి.
ప్రతి ఇంటికీ ఒక కథ, ప్రతి గోడకూ ఒక జ్ఞాపకం. ప్రతిగదికీ ఒక అనుభవం,ప్రతి మూలకూ ఒక జీవితకోణం.ఎలా అనుభవించారో...అలాగే ఆవిష్కరించడం కొంతమందికే చెల్లు.
బాబాగారు, రాసి మీరు అనుభవించేసినా, చదివి నేను అనుభవిస్తూనే... ఉంటాను.
ఇంటికి దూరంగా ఉన్న ఈ టైమ్ లో ఈ కవిత చదివి చాలా బాధగా అనిపించింది... వెంటనే ఇండియా వెళ్ళిపోవాలనిపించింది...
ReplyDeleteబాబా గారు ఇంటికి దూరమై బ్రతుకుతున్న నా లాంటి వాళ్ళ మనసుల్లోకి తొంగి చూసి వ్రాసినట్లు అనిపిస్తుందండీ. చాలా బాగా వ్రాసారు. I miss my home అని మరో మారు అనుకోడం తప్ప ఏమీ చేయలేని అసహాయుడ్ని.
ReplyDelete@బాబా గారు
ReplyDeleteముగ్ధుడనయ్యాను. మీ తెలుగులో గాంభీర్యత ఉంటుంది. అది తెలియకుండానే చదివేవాడిని వశపరుచుకుంటుంది. ఆ పదాలు చదువుతుంటే శ్రద్ధగా చదవాలనిపిస్తుంది. అది చదివడం పూర్తయ్యే వరకు దృష్టి మరలదు. అమ్మమ్మ గారి పాత పెంకుటిల్లు కూల్చి డాబా కట్టినప్పుడు నేను ఇదే రకమైన భావావలోకనానికి గురయ్యాను. గతం అంతా ఉప్పెనల ఒకేసారి మీదపడ్డట్టై ఇబ్బందిపడ్డాను.
చాలా బాగుంది. 'హృదయానికి వేలాడే జ్ఞాపకాలు' చాలా బాగుంది మీ వర్ణన.
ReplyDeleteరాధిక గారికి,
ReplyDeleteస్పందించినందుకు శతకోటి ధన్యవాదములు.
ఈకవితలోని సందర్భం ఎప్పుడో ఒకప్పుడు మనందరకూ తారసపడే, విషయమే అనే ధైర్యంతోనే మరీ ఆత్మాశ్రయమైపోతున్నప్పటికీ, పోష్ట్ చేసా.
రీడబుల్ గానే ఉన్నట్టు మీ కామెంట్ల వల్ల తెలుస్తుంది. సదా ధన్యవాదములు.
తప్పులేమైనా ఉంటే చెప్పండి మేడమ్. సరిదిద్దుకుంటాను.
పూర్ణిమ గారికి,
మీ వాఖ్య నా కవితను సార్వజనీనం చేసినట్లు గా భావిస్తున్నాను. ధన్యవాదాలు.
మహేష్ గారు,
ఇళ్లకు వ్యక్తిత్వం ఉంటుందని, కవితలోని వస్తువుని మీ కామెంటు ద్వారా ఎలివేట్ చేసినందుకు శతకోటి కృతజ్ఞతలు.
మేధగారికి, శ్రీకాంత్ గారికి,
సారీ సార్.
నా రాతలకు స్పందించినందుకు, సదా కృతజ్ఞుడను.
దిలీప్ గారు,
థాంక్యూ at the same time sorry sir.
సాహితీ యానం
బాబా గారూ,
ReplyDeleteమీ కవిత చాలా బాగుంది. బహుసా ఒక ఉద్విగ్నతకు లోనై చాలా హడవుడి గా వ్రాసినట్లున్నారు. అందుకే కొన్నిచోట్ల..
1. నాలుగేళ్ళు ...అని కాలం
చెపితే..Doesn't it reduce the strength of the feel ? In such cases parting matters more than the time lapsed. doesn't it ? మరోలా..నాలుగేళ్ళ యినా..నాలుగు యుగాలయి నట్లుంది..అంటే బాగుండేదేమో..ఆలోచించండి.
2. ఇక sequency విషయంలో
శైశవం , బాల్యం , యవ్వనం ఇది క్రమం తప్పిందేమో...అనిపిస్తుంది
అంటే..రేపు results వచ్చాయి...
వంటయి పోయింది...ఒక శకం ముగిసింది...ఇవన్నీ తర్వాత వస్తే బాగుంటుందేమో..అనిపిస్తుంది.
3. ఇక్కడ (మధురమయిన) గతాన్ని బూడిదతో పోల్చటం..ఆలోచించండి.
మనసు పొరల్లోంచి ఒకటొకటిగా స్వాభావికంగా వచ్చిన భావం చాలా స్వచ్చంగా ఉంది. మనసుకి హత్తుకునేలా వ్రాసారు. మంచి కవిత చదివించినందుకు ధన్యవాదములు.
సాయి సాహితి గారికి,
ReplyDeleteచదివి సహేతుక విమర్శ చేసి స్పందించినందుకు చాలా చాలా ధన్య వాదములు.
1. నాలుగేళ్లు అంటే, ఇంటినుండి విడిపోయి ఓ నాలుగేళ్ల తరువాత వెళ్లటం అన్న మాట. అంతకు మించి మరొక ఉద్దేశ్యాన్ని ఆ పారాగ్రాఫులో నేనాశించ లేదు. మీరన్న భావన కూడా బాగుంది.
2. శైశవం అంటే, పుట్టిన వెంటనే ప్రతీ శిశువూ చాలా నిస్సహాయ స్థితిలో ఉంటాడు, నెమ్మది నెమ్మదిగా వయసు పెరిగే కొద్దీ పరిసరాల పట్ల వానిలోని ఉత్సుకత పరాకాష్టకు చేరుకుంటుంది. ఈ రెండిటి మద్యా ఎక్కడో నా శైశవం జరిగిపోయింది అని నా ఉద్దేశ్యం.
శైశవం తరువాత బాల్యం, తరువాత యవ్వనం అనె ఆర్డరులోనే ఉన్నాయని భావిస్తాను.
బహుసా ఇక్కడ బాల్యం గురించి చెప్పేటప్పుడు భుజానికెత్తుకున్న భాధ్యత అన్న పదబంధం వలన మీకు కొంత గందర గోళం కనిపించింది అనుకుంటున్నాను.
సాధారణం గా పిల్లలకు , బాల్యంలో ఉండగానే ఇంటికి సంబంధించిన, కొన్ని కొన్ని భాధ్యతలను ఒప్పచెప్పటం జరుగుతుంది. (అక్కకు తోడు వెళ్లమని, పాలపేకట్లు తెమ్మని, పిండి ఆడించుకు రమ్మని వంటివి). ఆ ఉద్దేశ్యం తోనే ఈ పదబంధం వ్రాయబడింది.
3. మధురమైన గతం బూడిద పోలిక. మీ ప్రశ్న బాగుంది. కానీ గతాన్ని ఒక ఎంటైటీ గాతీసుకుంటే అది కాలగా మిగిలిన బూడిద లాంటిదేగా?
మీ రెప్పుడైనా గమనించారా, కట్టె కాలిన తరువాత ఆ బూడిద కట్టె ఆకారంలోనే ఉంటుంది, కానీ ముట్టుకుంటే చేతికి తగలదు. గతం కూడా అలానే, అంతే సున్నితంగా, చేతికేమీ చిక్కని రీతిలో ఉంది అని నా భావన.
మీరిలా దయచేసి నా కవితలలోని తప్పొప్పులను ఎంచిచూపి, నన్ను నేను రిఫైన్ చేసుకోవటంలో సహాయపడతారని భావిస్తున్నాను.
ధన్యవాదములతో
బొల్లోజు బాబా
chaalaa baavundanDee! keep writing!
ReplyDeleteబాబా గారూ ఎంత బాగా రాశారండి.ఉండ్రాజవరంలో వున్న నేను పుట్టి పెరిగిన ఇంటి కెళ్ళిన ప్రతిసారీ ఇలాగే అన్పిస్తుంది.మన అందరి మనస్సుల్లోనూ సుళ్ళుతిరిగే భావాలకు ఒక కవిగా అందమైన అక్షరరూపం ఇవ్వటం మీకే చాతవును.హృదయపూర్వక ధన్యవాదాలు.ఇటువంటి కవితలు మరిన్ని మీనుండి ఆశిస్తూ--"కాలం ఆకుల స్వప్నాలను రాల్చుకోవటం,బాల్యం వలికిన అత్తరవ్వటం"--ఎంతెంత బాగున్నాయో--
ReplyDeleteబాబా గారు,
ReplyDeleteఊరికి వెళ్ళిన ప్రతిసారి నేనూ ఇలానే భావోద్రేకానికి గురి అవుతూ ఉంటాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఐతే నేనూ గోడకుర్చీ వేసిన ఆ గోడలని, నేనూ నడిచిన నేలని, ఆడుకుంటూ పడ్డప్పుడు నను ఓదార్చే నా నేస్తాన్ని, స్నేహితులతో గడిపిన సమయాన్ని అద్భుతంగా నాకు జ్ఞప్తికి తెచ్చే మా ఇంట్లోని అణువణువుని చూపులతో స్పర్శిస్తూ, మాటల్లో చెప్పలేని మధురానుభూతుల్ని పొందుతూ ఉంటాను.
కాని ఇంటికి వెళ్ళిన ప్రతిసారి కలిగే ఆనందం వచ్చేటప్పుడు ఉండదు. ఏదో భాధ గుండెల్లో నుంచి ప్రాణాన్ని ఎవరో పట్టుకొని లాగుతున్నట్లు ఉంటుంది. కాని అది కొద్దిరోజులే. తర్వాత పనిలో పడి అంతా మర్చిపోతాను. మళ్లీ మీ కవిత చదివిన తర్వాత అటువంటి బాధ కలుగుతూ ఉంది. కన్నీరు తెప్పించేస్తున్నారు.
కాకపొతే నాకో సందేహం "పురాస్మృతులు" అన్న పదం ఉందా? లేక మీరే ఏమన్నా పదప్రయోగం చేసారా?