Monday, June 2, 2008

వైచిత్రి

వైచిత్రి

రాష్ట్రాన్ని కుదిపేసిన
పైశాచిక హత్యోదంత నిందితుల్ని
శిక్షించాలని కోరుతూ
ఒక సమూహం రోడ్డుపై ప్రవహిస్తూవుంది

'శిక్షించాలి శిక్షించాలి
నిందితుల్ని శిక్షించాలి'
ఆక్రోశిత హృదయాల వేదన
రోడ్డుపై నల్ల కెరటమై ఘోషిస్తూవుంది.


ఎర్ర సముద్రం నిలువునా చీలి
మోజెస్ కి దారిచ్చినట్లుగా
ఉరుకుల పరుగుల నగర జీవనం
ఆ సమూహానికి దారి ఇస్తూంది.

ఆ సమూహం ప్రచండ భానుడిలా జ్వలిస్తూ

రోడ్డుపై నల్ల కాంతై ప్రకాశిస్తూవుంది.

సహృదయులు కొంతమంది
ప్లకార్డులు అందిపుచ్చుకున్నారు.


కొంతమంది తమ బిడ్డల్ని
ఒళ్లోకి లాక్కుంటున్నారు.

మరికొందరు అంతా ఈశ్వరేచ్ఛ
అనుకుంటూ సాగిపోయారు.

నిరసన జ్వాలలు
డ్రాయింగు రూములోకి ప్రత్యక్షప్రసారమవగా,
చానెల్ మార్చేసి నేరాలు - పాపాలు సీరియల్
ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది.

శాలువాలకై ప్రాకులాడే ఔత్సాహికుడు
సమూహపు ముందువరసకై
తెగ ఆరాట పడిపోతున్నాడు.

"అబ్బో ఎన్నిఓట్లో" అనుకున్న నాయకుడు
తన రంగు విప్పేసి, నల్లరంగు తొడుక్కుని
కొత్తరాగం అందుకొన్నాడు.

కొంతమంది నవ్వుకుంటున్నారు.

బొల్లోజు బాబా

10 comments:

 1. nice one. but could not comprehned fully coz of my poor telegu.
  thanks for the comment.

  ReplyDelete
 2. i got it now (wit de help of mom)


  nice one really nice one

  ReplyDelete
 3. i have changed the pic
  tell me now.
  btw are you sure you serious abt translation of ur poem

  ReplyDelete
 4. అందరి స్వార్ధాన్ని ఒక్క కవితలో ఎండగట్టేసారు.
  నిరసనలు, విరసనలు ఎవ్వరిని కదిలించలేవు.
  ఈ ప్రపంచం ఏమయిపోతోంది అనుకునే వారిని కాస్సేపు మాత్రం కదిలించగలవు.
  తర్వాత, కాలం సాగిపోతుంది. తపన అవిరైపోతుంది. ఒక్క కన్నవారి కడుపుకోత తప్ప, అందరం, మనమందరం మర్చిపోతాం..
  నాచేత అశ్రువులు రాలిపించారు. చాలా కాలం తర్వాత కదిలించిన కవిత ఇది.

  ReplyDelete
 5. మీ కవిత కాస్త గుచ్చుకుంది.కానీ మీ నిజంలో నేనూ ఒక భాగస్వామినే కాబట్టి స్పందించిన తరువాత ఏంచెయ్యాలో తెలీక, ఇక్కడ చానల్ మార్చడం కుదరదు గనక ‘కూడలి’లో మరో బ్లాగు వెతుకుతున్నా!

  ఇదీ నిజం,బహుశా ఇదే నిజం. మన జీవితాల అద్దం లో స్పందనలూ,జ్ఞాపకాలూ,ఉక్రోషాలూ,ఆవేశాలూ ఆన్నీ నీడలా లేక నీటిలో జాడలా? ఏమో!!!

  ReplyDelete
 6. బాగుంది. కానీ ఓ సందేహం. నల్లని ప్రవాహం అనటంలో మీ ఉద్దేశ్యం? నిరశన తాలూకు (నల్ల బ్యాడ్జీలు గట్రా) నలుపేనా మరింకేమైనానా?

  ReplyDelete
 7. Just too good.. chaala rojula tarvata ilanti kavita okati chadivaanu!!

  ReplyDelete
 8. బాబీ థాంక్యూ వెరీ మచ్.

  ప్రతాప్ గారూ,
  ఒక్క కన్నవారి కడుపుకోత తప్ప అన్నీ మరచి పోతాం. అనే వాస్తవాన్ని చాలా బాగా చెప్పారు. ఒకానొక సందర్భానికి, ఆ సమయంలో నాలో కలిగిన స్పందనలను, ఆ వేదనను అక్షరీకరించాను. నా భావాలు, స్పందించేహృదయమున్న మీలాంటి వారిలోకి బట్వాడా కావటం నా అదృష్టం.

  మహేష్ గారు
  మన జీవితాల అద్దం లో స్పందనలూ, జ్ఞాపకాలూ, ఉక్రోషాలూ,ఆవేశాలూ ఆన్నీ నీడలా లేక నీటిలో జాడలా? ఏమో!!! ఎంత బాగా అన్నారండి.
  అలాంటి డౌటు ఉండబట్టే మనబోటి వాళ్లం వాటిని పట్టుకొని భందించి, తరువాత చదువుకుంటూ తిరిగి అనుభవిస్తూ, పలవరిస్తూ, పంచుకుంటూ, ప్రయాణిస్తుంటాం. కాదూ?

  నిషిగంధ గారికి మీ కు నచ్చినందుకు ధన్యవాదములు.

  వికటకవిగారికి,
  థాంక్యూ సర్,
  ఆయేషా హత్యను ఖండిస్తూ అనేక నిరసన ప్రదర్శనలు జరిగాయి సర్. ఈ కవిత అటువంటి ఒకానొక నిరసన ప్రదర్శన ను చూసి చలించి వ్రాసినది.

  ఈ రోజుల్లో నిరసన ప్రదర్శన అనేదాని వెనుక ఎంత బలమైన కారణమున్నప్పటికీ ప్రజలు స్పందించటంలేదు. అలా చెయ్యకపోగా కొండొకచో హేళనలు కూడా వినిపిస్తున్నాయి.

  ఇక పోతే మీరు అడిగిన నల్లని ప్రవాహం అనటానికి కారణం
  1. నిరసన లో పాల్గొన్న వారిలో ఎక్కువగా ముస్లిములు. నల్లని బురఖాలు ధరించిన ఒక సమూహం రోడుపై నడుస్తూంటే, దూరంనుంచి నల్లని ప్రవాహం వలే కనిపించింది అని చెప్పాను.
  ఇదే భావాన్ని నల్ల కాంతై ప్రకాశిస్తుంది అని కూడా చెప్పటం జరిగింది.
  2.మీరన్నట్లు నలుపు విషాదానికి, నిరసనకు సంకేతం.

  నా భావాలను మీకు బట్వాడా చేయటంలో ఏ మైనా లోపాలుంటే మీ వంటి విజ్ఞులు తెలియ చేసినట్లయితే సదా కృతజ్ఞుడనై ఉండెదను.

  పూర్ణిమ గారు
  మీకు నా కవిత నచ్చినందుకు కృతజ్ఞతలు. స్పందించినందుకు ధన్యవాదములు.

  బొల్లోజు బాబా

  ReplyDelete