Tuesday, June 17, 2008
కొంచెం ఇటు తిరిగి ఏడవండి
(కుటుంబ సభ్యుడు చనిపోగా ఆ షాక్ లో, దు:ఖంతో ఏడుస్తున్న ఒకరిని, " కొంచెం ఇటు తిరిగి ఏడవండి ప్లీజ్" అన్నాట్ట ఓ టీవీ చానెల్ రిపోర్టర్ )
గుండె నెత్తిన పడిన పిడుగు రేపిన
బూడిదను కళ్లు వర్షిస్తున్నాయి.
శోక తటాకానికి గండిపడి కన్నీటిమట్టం
ప్రమాద స్థాయిలను దాటిపోయింది.
విధి వెలిగించిన దు:ఖ జ్వాల
సర్వం దహించగా,
రోదన వాసన గుప్పుమంటుంది.
ఏడుపు భాష్ప వాయువై గదంతా పరచుకొంది.
ఇంతలో
"కొంచెం ఇటు తిరిగి ఏడవండి ప్లీజ్" అన్న నీ మాట,
మానవత్వపు చన్మొనపై కాల్చిన మేకులా దిగింది.
జీవితపు కనుపాపపై మందుపాతరలా పేలింది.
కెమేరా కన్ను విస్తుపోయి చూస్తూండిపోయింది.
నాకు తెలియకడుగుతాను తమ్ముడూ,
సెన్సేషన్ ని, సెక్సునీ, భక్తినీ, భయాల్నీ లాగే
ఏడుపుని కూడా ప్రేక్షకులకు
అందంగా అందించాలనుకున్నావా?
శోకం ఒక జ్వాలా ప్రవాహం,
శోకం ఒక నిప్పుల ఉప్పెన,
శోకం ఒక కుంభవృష్టి,
పట్టి ప్యాకింగు చేయబూనటం..............
శంఖు స్థాపనలు, బహుమతి ప్రధానాలు,
నంగి ముంగి కబుర్ల ఇంటర్య్వూలు,
కల్లబొల్లి మాటల ఉపన్యాసాలు తీసి తీసి
ఏడుపును కూడా
మంచి యాంగిల్లో తియ్యాలనిపించిందా?
దు:ఖానికి ఏంగిల్ ఉండదు తమ్ముడూ,
అదో మహా వలయం
సర్వ వ్యాపితం, సర్వ శక్తిమయం.
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
అతి హృదయవిదారకమైన దృశ్యాన్నీ, అతి జుగుప్స కలిగించే మానవ ప్రవృత్తినీ మీ కలంతో బలమైన పదచిత్రంగా మలిచారు
ReplyDeleteమీ కవిత చదివిన తర్వాత ఆ రిపోర్టర్గాడి చొక్కా పట్టుకుని రోడ్డుమీదకి లాగి...లాగి లెంపకాయ కొట్టాలన్నంత ఆవేశం వచ్చింది.
ReplyDeleteభావాల్ని ‘సౌండ్ బైట్’ లలో.హృదయ స్పందనను ‘యాంగిల్ షాట్’లలో కొలుస్తున్న ఈ మతీ,గతీ తప్పిన మీడియా నిర్లజ్జతనాన్ని ఎలా మార్చాలి దేవుడా!
ఎంత ధైర్యం! ఎక్కడ జరిగిందండి? ఇలా అడిగిన సంగతి ఏ మీడియా చెప్పింది?
ReplyDeleteనాకైతే మీరు ఆ విలేఖరిని కొట్టినట్లే అనిపించింది. చాలా వాడిగా వుంది.
ReplyDeleteనాభావాలను పంచుకొని స్పందించినందుకు కొత్తపాళీ గారికి్ మహేష్ కుమార్ గారికి కృతజ్ఞతలు.
ReplyDeleteరానారె గారికి,
ఆంధ్రజ్యోతి దినపత్రిక (5/16/2008) లో తెలుగు చానెళ్ల తెగులు అని ఒక కధనం ప్రచురించింది. దానిలో ఉటంకింపబడిన ఒక అంశానికి నాకు కలిగిన ఆవేశమే ఈ కవిత.
ఆకధనం యొక్క లింకు ఇక్కడ చూడవచ్చు.
http://bp0.blogger.com/_9akIrmZnbjI/SC0P8faI4mI/AAAAAAAAAl8/OsVSQAOs73c/s1600-h/tvc2.jpg
పైది డైరెక్టుగా పనిచేస్తాదో లేదో తెలియదు దీన్నికూడా పరిశీలించండి.
http://charchaavedika.blogspot.com/2008/05/blog-post_15.html
భవదీయుడు
బొల్లోజు బాబా
దిగజారుతోన్న మీడియా ప్రమాణాలను, చెప్పుతో కొట్టినట్లు, ఏకిపడేసారండీ...!
ReplyDeletekooturu kaadu tammudu chanipoyi edustunna akkanu
ReplyDeleteవార్త అందరిలా చదివి ఏదో కొద్దిసేపు ఆవేశపడి వదిలెయ్యకుండా మీరు స్పందించిన తీరు అధ్భుతంగా ఉంది ... అన్ని కోణాలనూ బహు చక్కగా స్పృశించారు ... శతకోటి అభినందనలు ...
ReplyDeleteఇంతటి చక్కటి, గొప్ప కవితకు మహేష్ గారి వ్యాఖ (భావాల్ని ‘సౌండ్ బైట్’ లలో.హృదయ స్పందనను ‘యాంగిల్ షాట్’లలో కొలుస్తున్న....) అంతే అధ్భుతంగా ఉంది ...
మీ కనిత నా హృదయాన్ని గాఢంగా హత్తుకు పోయింది.కరుణార్ద్రంగా,ఆవేశంగా సాగింది.మీకు శతకోటి వందనాలు.
ReplyDeleteఒక్క ముక్క.పానకంలో పుడకే.
రోదన,ఏడుపు-ఈ రెండూ శబ్ద ప్రధానమైనవి కదా.వీటికి వాసన,వాయువు ఎలా అతుకుతాయీ అని ఓ చిన్న సందేహం.అన్యధా భావించరని తలుస్తూ--
బాబా గారు,
ReplyDeleteమిమ్మల్ని పొగడాలా, ప్రశంసించాలా....లేక నమస్కరించాలా...లేక మిమ్మల్ని గౌరవించడానికి ఇంకేమైనా పదాలున్నాయా నాకు తెలియట్లేదు. మహేష్ కుమార్ గారి కంటే బలంగా అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి పదాలు సరిపోవట్లేదు. అద్భుతం!
రోదన వాసన
ఏడుపు బాష్ప వాయువై...
ఈ భావాలు మీకు మాత్రమే సొంతమనుకుంటా !
శివారెడ్డి, ఎండ్లూరి సుధాకర్ తరవాత మానవీయ కోణాన్ని స్పృశించే మీ కవితలు నాకు బాగా నచ్చుతున్నాయి.
బాబా గారు,
ReplyDeleteచాలా బాగా చెప్పారండి. ఆ అన్న ప్రబుద్దుడెవరో కాని మీ కవిత చదివి వుంటే బావుండు అనిపిస్తుంది.
నమస్కారము మాస్టారు. దు:ఖం సర్వ శక్తిమయం, నేను అర్థమ్ చేసుకోలేక పోతున్నాను సరియైన కోణంలో. ఇంకాస్త వివరిస్తారా. (మీరు వాడిన పరిస్తితిలో సూట్ కాలేదనిపిస్తుంద) (ఏదీ శాశ్వతంకాదుగా. ఆనందమే మన స్వరూపం కదా)సత్యానికి దు:ఖానికి ముడిపడి వుందంటారా.నాకు తెలియజేయండి మీ అమూల్యమైన సమయం కేటాయించి.కాని కవిత కళాత్మకంగా చాలా బావుంది.నిజం చెప్పారు. హితబోద చేసారు.
ReplyDeleteమొదటి రెండు పాదాలతో ఇచ్చిన avalanche start ని చివరిదాకా కొనసాగించారు, భలే. మానవత్వపు చనుమొనపై, జీవితపు కనుపాపపై -- మానవత్వాన్నీ జీవితాన్నీ personify చెయ్యడం బాగుంది. శంఖుస్థపనలు, బహుమతి ప్రదానాలు -- దెప్పిపొడుపు కూడా బాగుంది.
ReplyDeleteఒక్క అనుమానం -- తటాకానికి గండి పడడం అంత పొసగలేదనిపించింది...
@అన్నమయ్య పలుకుబడులు:
రోదన, ఏడుపు శబ్దప్రధానమైనా, అవి గాలిలా సర్వత్రా వ్యాపించాయి అని చెప్పడానికి. ఇక్కడైతే ప్రత్యేకంగా దుఃఖమనే మంట మూలాన కాలే జీవితం నుండి వచ్చే ఏడుపు అనే కాల్తున్న వాసన!
చాలా బాగా చెప్పారండి. సూటిగా, స్పష్టంగా...
ReplyDeleteఈ కవితలో నే వెలిబుచ్చిన భావాలను అర్ధం చేసుకొని, స్పందించిన సహృదయులందరికీ, నా కృతజ్ఞతలు.
ReplyDeleteగిరీష్ గారికి: స్పందించినందుకు ధన్యవాదములు.
అనానిమస్ గారికి: గమనించాను. తెలిపినందుకు కృతజ్ఞతలు.
తెలుగు వాడిని గారికి: మీ అభిమానానికి ధన్యవాదములు.
నరసింహ గారికి: (అన్నమయ్య పలుకుబడులు బ్లాగరి): నాకవిత మీకు హత్తుకునేలా అవటం నా అదృష్టం.
" స్వాభావికంగా వేరైన వాటిని మెటఫరైజ్ చెయ్యటంలోనే కవిత్వం ఉంటుందని నాఉద్ద్దేశ్యం. నేను ప్రగాఢంగా నమ్మే విషయం కూడా" అని నా బ్లాగులోనే తెలుగుమోనాలిసా అనే కవితపై దీపుగారి ఆక్షేపణకు సమాధానంగా అన్నాను. మీకు ఆశక్తి కలిగితే ఈ లింకు చూడగలరు http://sahitheeyanam.blogspot.com/2008/05/blog-post_04.html.
ఈ అంశం పై నా పూర్తి అభిప్రాయాలను చూడవచ్చు.
ఈ విషయంలో నా అభిప్రాయాలు బలంగా ఉన్నప్పటికీ, వానిని నా కవితలలో స్పష్టం గా పలికించలేక పోతున్నానేమోనని ఒక అనుమానం మొదలవుతున్నది.
మీ స్పందనకు ధన్యవాదములు.
సుజాతగారు: వాత్సల్యపూరితమైన మీ కామెంటుకు సదా కృతజ్ఞుడను. మీ కామెంటులో చెప్పినంత స్థాయి కానీ, అర్హత కానీ నాకులేదని అంతరాత్మ సాక్షిగా విన్నవించు కొంటున్నాను.
వేణూ శ్రీకాంత్ గారు: మీరు ఆశించేదే నేనూ కోరుకుంటున్నాను.
పృధ్వీ గారు: మీరడిగిన సందేహం వచ్చే ఈ కవిత 20 రోజుల క్రితమే వ్రాసినా, పోష్టు చెయ్యలేదు.
నెను చెప్పదలచుకున్నది. ఇటువంటి పరిస్థితులలో వచ్చే దుఖం is so potent, so pure, hence dont try to meddle with it. అని అలా చెయ్యటం మానవతా విలువలను కించపరచటమే అని.
కవిత చివరలో కెమేరా ఏంగిల్ కి, ఏ ఏంగిల్ లేని వలయంలా ఉండే దుఖానికి (ఒక పోలిక మాత్రమే) సారూప్యత తీసుకొని వచ్చి ఒక సార్కాష్టిక్ సెటైర్ తో కవితను ముగించదలిచాను.
మీ కామెంటు చదివిన తరువాత ఆలోచిస్తే ఆఖరు వాక్యాలైన "సర్వ వ్యాపితం, సర్వ శక్తిమయం" అనేవి అక్కడ లేకపోయినా అర్ధం చెడటం లేదనిపిస్తుంది. ఆలోచింపచేసినందుకు ధన్యవాదములు.
రాఘవగారికి: శతకోటి ధన్యవాదములు. తటాకానికి గండి పడటం పొసగలేదన్నారు. ఎందుకా అని ఆలోచిస్తే నాకు ఈ కారణాలు కనిపించినయ్
1. తటాకం సౌందర్యాత్మకమైన పదంగా తోస్తుంది. ఇక్కడి సందర్భానికి అనుచితమేమో.
2. శోక తటాకమంటే కన్ను, గండి పడటమంటే కన్నీరు ఏరై ప్రవహించటం, అన్న అర్ధం కొంచెం హార్డ్ గా అనిపిస్తుంది.
2. శోక తటాకానికి గండి పడటం అన్నప్పుడు - ఈ చావు వార్త తెలియటానికి ముందే శోకం ఉన్నట్లు సూచన కనిపిస్తుంది. ఇక్కడే పేచీ వస్తుంది.
మీరన్నా తరువాత నాకూ పొసగలేదనిపిస్తుంది. కానీ వ్రాసేసినతరువాత, నాచేతుల్లోంచి వెళ్లిపోయినతరువాత సమర్ధించుకోవాలి కనుక ఈ విధంగా సమర్ధించుకొంటున్నాను. ప్రతీ జీవిలోను చిన్నదో పెద్దదో శోకతటాకం ఉంటుంది. వేదనచెంది నీరు పొంగినపుడు కన్నీరుగా పొర్లుతుంది. చెరువుగట్టుకు గండే పడినప్పుడు, నీరింకిపోయేదాకా ఏడవవలసివస్తుంది. అలాంటి అర్ధం ఈ పదచిత్రం ఇస్తుందనే భావిస్తున్నాను.
మీ విశ్లేషణకు ధన్యవాదములు.
శ్రీవిధ్యగారికి: భావాలను పంచుకొని స్పందించినందుకు ధన్యవాదములు.
బొల్లోజు బాబా
చాలాబాగుంది .సంచలనాల పేరుతో సంకుచితంగా ఆలోచిస్తున్న మీడియా కి మీ కవిత చెంపపెట్టు వంటిది.
ReplyDelete@ బాబా గారు
ReplyDeleteకొన్ని సంధర్భాల్లో కొంత మందిని చూసి మాటల్లో ఎలా స్పందించాలో అర్ధం కాదు. నేను మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
hilarious....
ReplyDeleteఅసలు సంఘటనలోని tragicomedy ని చాలా బాగా పట్టారు కవితలోఁ...
ఆ తరువాత వచ్చని కోపాన్ని కూడా...
రాకేశ్వర రావు
Viluvalu leni media vikruta rupanni chuparu. http://muralidharnamala.wordpress.com/
ReplyDeleteచైతన్య గారికి స్పందించినందుకు ధన్యవాదములు.
ReplyDeleteదిలీపు గారు మీరు నన్ను పెద్దపెద్దమాటలతో చిత్రహింస పెట్టేస్తున్నారు, నాకంత అర్హత లేదని సవినయంగా విన్నవించుకొంటున్నాను. ధన్యుడను.
రాకేశ్వరరావు గారు tragicomedy అన్నమాటను నాకు పరిచయం చేసారు. కృతజ్ఞుడను. (అదీ నాకవితలో- ఇంతకు మించిన ఆనందమిక్కెక్కడ పొందగలను)
ధన్యవాదములు
మురళి గారికి కృతజ్ఞతలు..
బాబా గారికి
ReplyDeleteమీ స్పందనకు ధన్యవాదములు,
ఇస్లాం మతానుసారం ఎవరైనా పాపం చేసింట్లయితే వారు ప్రతిరోజు నిర్వహించే నమాజులలో వారి ఆత్మని అల్లాకి సమర్పించు కొని పరిసుద్ధతగావించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రచయిత రాసిన కధలో ఒక అబలకి మతాన్ని అడ్డుగా పెట్టి ఇష్టం లేని పెళ్ళి చేస్తారు. ఆమె ప్రియుడి పట్ల పవిత్ర ప్రేమని పాపంగా నిందించి ఆమెని బలవంతంగా ఆత్మసమర్పణ గావించ మంటారు. ఆ సమయం లో ఆమె లో జరిగిన ఆత్మ సంఘర్షణగా ఈ కవితను భావిస్తున్నాను. ఏ మతమూ ప్రేమ నేరమని అనలేదు. ఆమె ప్రేమని నేరమన్న మతం(మతాధికారులు)అస్థి త్వం కోల్పోతున్నట్లే కదా. ఈ కధనం వివరాలకోసం కవితలో ఇచ్చిన ఆంధ్రజ్యో తి దినపత్రిక చూడగలరు
బాబా గారికి,
ReplyDeleteఅద్భుతంగా ఉంది. ఈ మాట అన్న వాడిని నిలువునా నిప్పుల్లో కాల్చి నట్లుంది మీ కవిత. కాని..
ఒక చోట..
కెమేరా కన్ను..అని కెమేరాని personify చేసారు. బాగుంది. కాని ఇక్కడ కెమేరా కన్ను అంటే కన్ను కెమేరామేన్ దే కావచ్చు కదా..వివరణ ఇవ్వగలరు.
మరొక చోట,
శోకం......
పట్టి ప్యాకింగు చేయబూనటం.....
ఇక్కడ భావానికి ముగింపు ఇస్తే బావుంటుంది.
ఆలోచించండి..
సాయి సాహితి గారికి
ReplyDeleteమీ బ్లాగులో http://musingsuntold.blogspot.com/2008/05/blog-post_17.html నేనడిగిన సందేహాలకు సమాధానమిచ్చినందుకు ధన్యవాదములు.
నా కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదములు. అందులోని భావాలకు మద్దతుపలికినందుకు కృతజ్ఞతలు.
కెమేరా కన్ను అంటే నా ఉద్దేశ్యం కెమెరా లెన్సే నని. వాడన్న మాటకు, హృదయం ఉన్న వారే కాక, నిర్జీవ వస్తువులుకూడా విస్తుపోయాయని చెప్పప్రయత్నం. అంతే.
పట్టి ప్యాకింగు చేయబూనటం తరువాత, ఏ పదాన్ని వేసినా అల్పంగానే తోచింది. ( ఉదా: అన్యాయం, అమానుషం, దారుణం, పిచ్చితనం, కౄరత్వం, హాస్యాస్పదం etc.) అందుకే అక్కడ ఖాళీ వదిలేసి, ఎవరికి నచ్చిన పదాన్ని వారు నింపుకొంటారని భావించాను.
లెదా ఆ వ్యాక్యాన్ని ప్రశ్నతో ముగించినా బాగుంటుంది. ఇలా " పట్టి ప్యాకింగు చేయగలవా?" అని.
మీ పరిశీలనకు, సూచనకు ధన్యవాదములు.
బొల్లోజు బాబా
అద్భుతం! ఎంత బాగా రాశారండీ... మీ కవితలను లేటుగా చదువుతున్నందుకు విచారంగా అనిపిస్తోంది; ఆలస్యమైనా అసలు మిస్సవనందుకు సంతోషం కూడా!
ReplyDelete