Sunday, March 5, 2017

ఒక మంచి కవిత పోలికలు – విన్నకోట రవిశంకర్

ఒక మంచి కవిత
పోలికలు – విన్నకోట రవిశంకర్
తన అనుభవాలను తన ఆలోచనలను వాటి ద్వారా తాను గుర్తించిన విశ్వసత్యాలను కవిత్వంలో ఆవిష్కరించాలనే తపనేకాని కవిత్వం ద్వారా ఏదో ఒక లాభం పొందుదామనే ఆశ ఇతనిలో కనిపించదు. అందుకే ఈ నాటి కవిలోకంలో రవిశంకర్ అరుదైన కవి -- చేరా 
*****
పునరపి మరణం పునరపి జననం అనేది ఒక ఉదాత్తభావన. అలా అనుకోకపోతే గతించిపోయిన ప్రియమైన వారి వియోగాన్ని తట్టుకొని ఈ జీవనయానాన్ని కొనసాగించటం రసహీనంగా అనిపిస్తుంది. ఇంట్లో పసిపాదాలతో తారాడే పిల్లలు నిజానికి ఆ కుటుంబానికి సంబంధించిన పెద్దల జన్యువులకు కొనసాగింపు. వారిలో ఆ పెద్దలను చూసుకోవటం ఒక ముచ్చట. అలాంటి ఒక జీవనానుభవాన్ని కవిత్వం చేస్తుంది విన్నకోట రవిశంకర్ "పోలికలు" అన్న కవిత.
కవిత ఎత్తుగడే ఎంతో గొప్పగా ఉంటుంది. "దారితప్పిన ఒక జ్ఞాపకాన్ని ఈ పసిపిల్ల ఓపిగ్గా ఒడ్డుకు చేర్చింది" అంటూ మొదలవుతుంది కవిత. జ్ఞాపకాలు అనేవి ఒక ప్రవాహసదృశమని, అందులో మరుగున పడుతున్న కొన్నింటిని దారితప్పిన జ్ఞాపకాలుగా వర్ణించటం, అలాంటి ఒక జ్ఞాపకాన్ని ఈ పసిపిల్ల ఓపిగ్గా ఒడ్డుకు చేర్చిందనటం- ఈ పసిపిల్ల ఏం చేసిందో ఒక సంపూర్ణ చిత్రంగా మనకళ్లముందు నిలుపుతాడు కవి.
రెండవ ఖండికలో ఆ పసిపిల్ల ఎవరి స్మృతులను వెతికి తెచ్చిందో వర్ణిస్తారు రవిశంకర్
మూడవ ఖండికలో, ఈ పిల్లను ఆ గతించిన పెద్దలందరూ ప్రేమతో సంతకాలు చేసి పంపిన బుల్లి ఆటోగ్రాఫ్ బుక్ అనటం ఒక గొప్ప పోలిక.
"మూసిన ఆ పాప గుప్పెట్లో ఉన్నది ఆ పెద్దల సందేశం కావచ్చు" అంటూ కవిత ముగిసే సరికి.... మనం కూడా మన పిల్లలలో కనిపించే పెద్దల పోలికలను మానసికంగా వెతకటానికి ప్రయత్నిస్తాం.
ఒక కవిత ముగిసాకా కూడా కొనసాగటం అంటే ఇదే కదా!
పోలికలు
దారితప్పిన ఒక జ్ఞాపకాన్ని
ఈ పసిపిల్ల ఓపిగ్గా ఒడ్డుకు చేర్చింది
గతకాలపు చీకటిగదిలో పారేసుకొన్న ఒక విలువైన అనుభవాన్ని
అతి సహనంతో ఇది వెతికి తెచ్చింది.
ఎన్నాళ్లక్రితమో బూడిదగా మారి
నీళ్ళల్లో కలిసిపోయినవాళ్ళు
దీని పాలబుగ్గల్లోంచి మళ్ళీ పలకరించారు
పటాలుగామారి, కాలంలో
ఒకచోట నిలిచిపోయిన వాళ్ళు
దీని పసికళ్ళల్లో సజీవంగా కదిలారు.
ఎంతమంది గతించినవాళ్ళ ఆనవాళ్ళని
ఇంత చిన్ని శరీరంలో దొంతర్లు దొంతర్లుగా దాచిందో
ఇది వాళ్లందరూ ప్రేమతో సంతకాలుచేసి పంపిన
బుల్లి ఆటోగ్రాఫ్ బుక్ లాగ ఉంది.
వివరణకందని దీని చిన్ని పెదవులమీది చిరునవ్వు
తమకు లభించిన ఈ కొనసాగింపుకి
వాళ్ళు తెలిపే అంగీకారం కావచ్చు
మూసిన దీని గుప్పిట్లో దాచిఉంచింది
విప్పిచెప్పలేని వాళ్ళ సందేశం కావొచ్చు
----- విన్నకోట రవిశంకర్
.
బొల్లోజు బాబా

1 comment:



  1. కవిత బాగుంది

    భాష్యం కూడా బాగుంది

    మంచి కోట కట్టిన పదబంధం


    జిలేబి

    ReplyDelete